అందరి దృష్టి రేపటిపైనే! | every body are waiting for elections results | Sakshi
Sakshi News home page

అందరి దృష్టి రేపటిపైనే!

Published Thu, May 15 2014 2:01 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

every body are waiting for elections results

సాక్షి, కడప: ఎన్నికల సమరంలో ఫలితాల ప్రకటనకు రేపే ఆఖరు. కడప, రాజంపేట పార్లమెంట్‌తో పాటు జిల్లాలోని పది అసెంబ్లీస్థానాల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. మునిసిపల్, స్థానిక ఎన్నికల్లో ఊహించిన దానికంటే కాస్త భిన్నంగా ఫలితాలు రావడంతో ‘సార్వత్రిక’ ఫలితాలపై అన్ని రాజకీయపార్టీలతో పాటు సాధారణ ప్రజల్లో కూడా ఉత్కంఠ రేగుతోంది.
 
 ‘పుర’పోరులో కడప కార్పొరేషన్‌తో పాటు పులివెందుల, రాయచోటి, ఎర్రగుంట్ల మునిసిపాలిటీలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. ‘స్థానికపోరు’లోనూ కడప జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవడంతో పాటు సింహభాగం మండలాధ్యక్షపీఠాలను దక్కించుకుంది. రేపు వెలువడబోయే ఫలితాలలో ఇంతకంటే మెరుగైన ఫలితాలు తమపార్టీకి వస్తాయని ఆపార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి.
 
 పుర, స్థానిక ఫలితాల మేరకైనా 10 క్లీన్‌స్వీప్:
 పుర, స్థానిక ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీకి పోలైన ఓట్లు, సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యం పరిశీలిస్తే జిల్లాలోని పదిస్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి చేరడం ఖాయమని స్పష్టమవుతోంది.
 
 ట మైదుకూరు మునిసిపాలిటీని 2188 ఓట్లతో టీడీపీ దక్కించుకుంది. స్థానికపోరులో నియోజకవర్గంలోని 5మండలాల్లో ఖాజీపేట మినహా తక్కిన నాలుగు జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. నియోజకవర్గంలో టీడీపీ కంటే 15,851 ఓట్ల మెజార్టీని సాధించింది. మునిసిపాలిటీ మెజార్టీని తీసేసినా వైఎస్సార్‌సీపీకి 13066 ఓట్ల మెజార్టీ దక్కుతుంది.
 
  రైల్వేకోడూరులోని ఐదు మండలాల్లో చిట్వేలి, ఓబులవారిపల్లి మినహా తక్కిన మూడు జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది. నియోజకవర్గంలో టీడీపీ కంటే 5356 ఓట్ల మెజార్టీని సాధించింది.
 
  బద్వేలు మునిసిపాలిటీని టీడీపీ 5196 ఓట్లతో దక్కించుకుంది. స్థానికపోరులో నియోజకర్గంలోని 7మండలాల్లో బద్వేలు, గోపవరం మినహా తక్కిన 5జెడ్పీటీసీలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. నియోజకవర్గంలో 6366 ఓట్ల మెజార్టీని సాధించింది. మునిసిపల్ మెజార్టీతో పోల్చితే 1170 ఓట్లతో వైఎస్సార్‌సీపీనే ఆధిక్యంలో ఉంది. అయితే టీడీ పీకి బీజేపీతో పొత్తు తదితర కారణాల వల్ల ఇక్కడ వైఎస్సార్‌సీపీకి భారీ మెజార్టీ దక్కే అవకాశం ఉంది.
 
 రాయచోటి మునిసిపాలిటీలతో పాటు నియోజకవర్గంలోని ఆరు మండలాల జెడ్పీటీసీలను వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీతో పోల్చితే 13673 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
 
  జమ్మలమడుగు మునిసిపాలిటీని టీడీపీ దక్కించుకున్నా టీడీపీ కంటే వైఎస్సార్‌సీపీకే 219 ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. స్థానికపోరులో ఆరు మండలాల జెడ్పీటీసీలను వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్ చేసి నియోజకవర్గంలో టీడీపీ కంటే 13,546 ఓట్ల మెజార్టీని సాధించింది.
 
  ప్రొద్దుటూరు మునిసిపాలిటీని 2947ఓట్లతో టీడీపీ గెలుచుకుంది. స్థానికపోరులో ప్రొద్దుటూరు జెడ్పీటీసీని వైఎస్సార్‌సీపీ, రాజుపాళెంను టీడీపీ దక్కించుకుంది. అయితే ఇక్కడ రెండు పార్టీల ఓట్లను పోల్చితే 962 ఓట్లతో టీడీపీనే ఆధిక్యంలో ఉంది. అయితే ముస్లింలు భారీగా ఉన్న ప్రొద్దుటూరులో బీజేపీతో పొత్తు, ఎమ్మెల్యే ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీకి మంచి మెజార్టీ దక్కే అవకాశం ఉంది.
 పులివెందుల మునిసిపాలిటీతో పాటు 7మండలాల్లోని జెడ్పీటీసీ స్థానాలను  వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఇక్కడ మునిసిపాలిటీ, స్థానికపోరులో టీడీపీ కంటే 43094 ఓట్లతో ముందుంది.
 
 రాజంపేట మునిసిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. ఈ పరిధిలోని ఆరు మండలాల్లో 2 వైఎస్సార్‌సీపీ, 4టీడీపీ గెలిచి 2,171 ఓట్ల మెజార్టీని సాధించింది. అయితే రాజంపేట మునిసిపాలిటీ ఓట్లతో పాటు బీజేపీతో పొత్తు తర్వాత పరిస్థితిని బేరీజు వేస్తే వైఎస్సార్‌సీపీకి మంచి మెజార్టీ దక్కే అవకాశం ఉంది.
 
  కడప కార్పొరేషన్‌ను 29,389 ఓట్లతో వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. బీజేపీతో పొత్తు తర్వాత ముస్లిం ఓట్లు ఇక్కడ మరింత ప్రభావం చూపనున్నాయి. ఇక్కడ 40వేలపైచిలుకు మెజార్టీ వైఎస్సార్‌సీపీ దక్కనుంది.
 
 కమలాపురంలోని ఆరు మండలాల్లో సీకే దిన్నె మినహా తక్కిన ఐదు జెడ్పీటీసీలను వైఎస్సార్‌దక్కించుకుని 4,373 ఓట్ల మెజార్టీని సాధించింది.
 
 అందరిలోనూ ఈ అంశాలపైనే చర్చ
 వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భవించి నాలుగేళ్లు అయింది. ఈక్రమంలో పార్టీ సంస్థాగతం, నిర్మాణాత్మకంగా ఇంకా పూర్తిస్థాయిలో బలపడలేదు. పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్లను నియమించినప్పటికీ పూర్తి బాధ్యులు లేరు. దీంతో ఊహించినదానికంటే కాస్త భిన్నంగా ఫలితాలు వచ్చాయి. అయితే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా ఓటర్లు వైఎస్సార్‌సీపీ వైపు ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను ఉదహరిస్తున్నారు. స్థానికపోరులో స్థానికంగా వర్గాలు, బంధుత్వాలు తదితర సమస్యలతో ఒకరకమైన ఫలితాలు వస్తాయని, సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు జగన్ సీఎం కావాలనే ఆకాంక్షతో ఓటేస్తారని చెబుతున్నారు. స్థానిక అభ్యర్థికి ఓటేయడం, జగన్ సీఎం కావాలని కోరికతో ఓటేయడం వల్ల ఓటింగ్‌శాతంలో చాలా వ్యత్యాసం ఉంటుందంటున్నారు.
 
 అలాగే మునిసిపల్, స్థానికపోరు ఎన్నికలు జరిగే నాటికి టీడీపీలోని సిట్టింగ్‌ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, టీడీపీలో వెళ్లేందుకు కర్చీప్ వేసుకున్నవాళ్లంతా ‘స్థానిక’పోరులో ఆధిపత్యం కోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశారు. అయితే నెలరోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన జిల్లాలోని ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, కడపతో పాటు సీమాంధ్రలోని 175 నియోజకవర్గాల్లో 63చోట్ల సిట్టింగ్‌ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కాదని కాంగ్రెస్ నుంచి అరువుతెచ్చుకున్న నేతలకు చంద్రబాబు టిక్కెట్లు ఇచ్చారు.
 
 దీంతో ‘తమ్ముళ్లు’ వారిని ఓడించడమే లక్ష్యంగా సార్వత్రిక ఎన్నికల్లో పావులు కదిపారు. దీనికితోడు బీజేపీతో పొత్తు వల్ల అధికశాతం ముస్లిం ఓటర్లతో పాటు సెక్యులర్‌గా ఆలోచించేవారంతా టీడీపీకి వ్యతిరేకంగానే ఓటేశారు. ఈ పరిణామాలన్నీ వైఎస్సార్‌సీపీకి అనుకూల ఫలితాలను స్పష్టీకరిస్తున్నాయి. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీకి 3.99 శాతం ఓట్లు, స్థానికపోరులో 2.9శాతం ఓట్లు మాత్రమే తేడా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ఓటర్లు జగన్ నాయకత్వానికి ఓటేసి ఉంటారని అంతా భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement