ఆబ్సెంట్.. ప్లీజ్ ! | Congress in hunt for Hung ZPs | Sakshi
Sakshi News home page

ఆబ్సెంట్.. ప్లీజ్ !

Published Thu, May 15 2014 1:20 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఆబ్సెంట్.. ప్లీజ్ ! - Sakshi

  • అత్యధిక జెడ్పీల కోసం టీ కాంగ్రెస్ ఎత్తులు
  •  టీడీపీ సహకారం కోసం తెరవెనుక యత్నాలు
  •   చైర్మన్ ఎన్నిక రోజున గైర్హాజరయ్యేలా మంతనాలు
  •   ‘హంగ్’లో బద్ధ శత్రువుతోనూ జట్టుకట్టేందుకు సిద్ధం
  •   పదవులు, ఆర్థిక ప్రయోజనాలతో ప్రలోభాలు
  •   మెదక్, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పావులు.. 
  •  టీఆర్‌ఎస్‌ను వెనక్కి నెట్టడమే లక్ష్యం
  •  
     సాక్షి, హైదరాబాద్: స్థానిక ఫలితాల్లో ‘హంగ్’ ఏర్పడిన చోట్ల అధికారమే పరమావధిగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. తెలంగాణలో అధికారంపై గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్ పెద్దలు జెడ్పీల్లో ఎలాగైనా పైచేయి సాధించాలని పట్టుదలగా ఉన్నారు. తమకు గట్టి పోటీనిచ్చిన టీఆర్‌ఎస్‌ను కట్టడి చేసే వ్యూహాల్లో మునిగిపోయారు. ఇందుకు బద్ధశత్రువుకు సైతం దగ్గరవడానికి సిద్ధమయ్యారు. పలుచోట్ల టీడీపీ మద్దతు కీలకంగా మారడంతో ఆ పార్టీ సహకారం తీసుకునే ఎత్తుగడకు టీ-కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలు జరిగిన తొమ్మిది జెడ్పీలలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లను టీఆర్‌ఎస్ ఇప్పటికే కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నల్లగొండలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ లభించింది. ఖమ్మంలో టీడీపీకి  సగం జెడ్పీటీసీలు దక్కాయి. మిగతా నాలుగింటిలో హంగ్ ఏర్పడింది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు.
     
    అయితే వాటిలో ఎన్నోకొన్ని సీట్లు పొందిన టీడీపీ కీలకంగా మారింది. దీంతో తెలంగాణలో అత్యధిక జెడ్పీలను సాధించుకున్న ఘనత పొందాలంటే ఆగర్భ శత్రువునైనా ముద్దాడక తప్పదని టీ-కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, వరంగల్ జెడ్పీలపై గురిపెట్టింది. ఇందుకోసం తెరవెనుక యత్నాలు ముమ్మరం చేసింది. టీడీపీ సభ్యులు గైర్హాజరయ్యేలా చేసుకుంటున్న లోపాయికారీ ఒప్పందాలతో  అత్యధిక జెడ్పీలు గెలుచుకోవడంపై కాంగ్రెస్ నేతల్లో ధీమా వ్యక్తమవుతోందన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. అదే సమయంలో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీని బట్టి కూడా ఒకటి రెండు చోట్ల సమీకరణాలు మారే అవకాశం ఉందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతానికి మాత్రం హంగ్ పరిస్థితి నెలకొన్న జెడ్పీల్లో కాంగ్రెస్ వ్యూహం రసవత్తరంగా మారింది. 
     
      మెదక్‌లో మొత్తం 46 స్థానాలుంటే.. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు 21 సీట్ల చొప్పున వచ్చాయి. తెలుగుదేశం నాలుగు స్థానాల్లో గెలుపొందింది. ఈ నలుగురు జెడ్పీటీసీ సభ్యుల్లో ఇద్దరి మద్దతుతో గట్టెక్కాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇద్దరిని తమవైపు తిప్పుకొంటే మిగతా ఇద్దరు సభ్యులకు ఆ పార్టీ విప్ జారీ చేసే అవకాశం ఉండదని కాంగ్రెస్ భావిస్తోంది. టీడీపీ నుంచి వచ్చే ఇద్దరిలో ఒకరికి వైస్-చైర్మన్ పదవిని, మరొకరికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చే దిశగా కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. టీడీపీకి చెందిన నలుగురు సభ్యులతోనూ ఆ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
     
      మహబూబ్‌నగర్ జెడ్పీలోనూ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో టీడీపీ కీలకపాత్ర పోషించే పరిస్థితి ఉంది. మొత్తం 64 జెడ్పీటీసీల్లో కాంగ్రెస్‌కు 28, టీఆర్‌ఎస్‌కు 24 స్థానాలు వచ్చాయి. ఇక టీడీపీకి తొమ్మిది, బీజేపీకి రెండు సీట్లు దక్కాయి. జెడ్పీని కైవసం చేసుకోవాలంటే కనీసం 33 స్థానాలు కావాలి. ఇక్కడ కూడా స్వతంత్ర అభ్యర్థులు లేకపోవడంతో విధిగా తెలుగుదేశం మద్దతు తీసుకోవాల్సి ఉంది. దీంతో ఆ పార్టీతో దోస్తీకి కాంగ్రెస్ తెరవెనుక యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
     
    టీడీపీతో చర్చిస్తున్నామని  కాంగ్రెస్ వర్గాలే అంగీకరిస్తున్నాయి. జడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలో ఆ పార్టీకి చెందిన తొమ్మిది మంది జెడ్పీటీసీల్లో కొందరిని హాజరుకాకుండా చూసేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వరాదని టీడీపీ పెద్దల నుంచి ఆ పార్టీ సభ్యులకు స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లు తెలిసింది. ఎన్నిక రోజు గైర్హాజరీ మంత్రం పఠిస్తే చాలని కూడా సూచించినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్‌తో జరుగుతున్న మంతనాల్లో భాగంగానే ఇలాంటి సంకేతాలు ఇచ్చినట్లు భోగట్టా.
     
     - రంగారెడ్డి జిల్లాలోనూ జడ్పీని దక్కించుకోవాలంటే కాంగ్రెస్‌కు అదనంగా మూడు స్థానాలు కావాల్సి ఉంది. అదే టీఆర్‌ఎస్‌కు ఐదు స్థానాలు అవసరం. ఇక్కడి 33 స్థానాల్లో కాంగ్రెస్‌కు 14, టీఆర్‌ఎస్‌కు 12 సీట్లు రాగా.. టీడీపీ 7 జడ్పీటీసీలను గెలుచుకుంది. ఇక్కడ కూడా టీడీపీ మద్దతు లేనిదే ఏ పార్టీ గట్టెక్కదు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచీ కాంగ్రెస్‌ను శత్రువుగా చూస్తూ.. ఇప్పుడు ఆ పార్టీకే మద్దతివ్వమంటే ఎలా అని కొందరు టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు కూడా ఈ జెడ్పీపై ప్రభావం చూపించనున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీకే రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ దక్కవచ్చునని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లోని కొందరు సీనియుర్లే టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు.
     
     - వరంగల్ జడ్పీలో పూర్తి మెజారిటీకి కాంగ్రెస్ రెండు స్థానాల దూరంలో ఉంది. ఇక్కడ మొత్తం 50 జడ్పీటీసీల్లో ఆ పార్టీకి 24, గులాబీ దళానికి 18, టీడీపీకి ఆరు, బీజేపీకి ఒక స్థానం వచ్చాయి. ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. స్వతంత్ర సభ్యుని మద్దతు తీసుకుని.. చైర్మన్ ఎన్నిక సమయంలో..టీడీపీలో కొందరు సభ్యులు గైర్హాజరయ్యేలా కాంగ్రెస్ ముఖ్యులు పావులు కదుపుతున్నారు. టీఆర్‌ఎస్ ఈ జడ్పీని దక్కించుకోవాలంటే టీడీపీతోపాటు, స్వతంత్ర అభ్యర్థి మద్దతు కూడా దానికి తప్పనిసరి. ఈ నేపథ్యంలో తనదే పైచేయి కావాలని కాంగ్రెస్ దూసుకెళుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement