
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుల శిరోముండనం కేసులో ఉమ్మడి హైకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ కుల ధ్రువీకరణ పత్రాలను సాక్ష్యంగా కోర్టు ముందుంచలేదంటూ బాధిత యువకులు చేసిన ఆరోపణలపై హైకోర్టు స్పందించింది. ఈ కేసులో గురువారం కింది కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు తీర్పును వెలువరించవద్దని కింది కోర్డును హైకోర్టు ఆదేశించింది. బాధిత యువకులు లేవనెత్తిన అంశాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌లతోపాటు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.సుజాతకు స్పష్టం చేసింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 1997లో ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ముగ్గురు దళిత యువకులకు శిరోముండనం చేయించారు. బాధిత యువకులు కోటి చినరాజు, మరో ఇద్దరు ద్రాక్షారామం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 1997 జనవరిలో తోట త్రిమూర్తులుతోపాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. 2008లో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుపై విశాఖపట్నం 11వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment