సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ ఘటనపై న్యాయమూర్తితో విచారణ చేయించకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పోలీసు కస్టడీలో మహిళ చనిపోతే నేర విచారణచట్టం (సీఆర్‌పీసీ)సెక్షన్ 176(1)(ఎ) ప్రకారం స్థానిక న్యాయమూర్తితో విచారణ జరిపించాలని స్పష్టంగా ఉన్నా.. ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నిబంధన గురించి సంబంధిత అధికారులకు తెలియదా అంటూ నిలదీసింది. ఈ ఘటనపై ఆలేరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ను విచారణ జరపాలని ఆదేశించింది. ఈ నివేదికను నెల రోజుల్లోపు సీల్డ్ కవర్‌లో సమర్పించాలని పేర్కొంది. అవసరమైతే మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని కూడా మేజిస్ట్రేట్ ఆదేశించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
లాకప్‌డెత్ ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలంటూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ రాష్ట్ర కార్యదర్శి జయ వింధ్యాల దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. మరియమ్మ, ఆమె కుమారున్ని ఈ నెల 15న పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని పిటిషనర్ తరఫున న్యాయవాది పి.శశికిరణ్ వాదనలు వినిపించారు. పోలీసుల చిత్రహింసలు భరించలేక ఈనెల 18న మరియమ్మ చనిపోయిందని తెలిపారు. ఈ వ్యవహారంపై స్థానిక న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, బాధిత కుటుంబానికి రూ.5 కోట్లు పరిహారం ఇప్పించాలని, ఈ మొత్తాన్ని మరియమ్మ మృతికి కారణమైన పోలీసు అధికారుల జీతాల నుంచి వసూలు చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. లాకప్‌డెత్ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశిం చామని, ఘటన జరిగిన సమయంలో ఉన్న కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నిబంధనల మేరకు ఈ వ్యవహారంపై ఆర్‌డీవో విచారణ చేస్తున్నారని, పోస్టుమార్టంను వీడియో తీశామని తెలిపారు. మరియమ్మ మృతదేహాన్ని కుమార్తెకు అప్పగించామని, వారు ఖననం కూడా చేశారని వివరించారు. సీఆర్‌పీసీలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తో మాత్రమే విచారణ చేయించాలని స్పష్టంగా ఉన్నా... ఎన్‌హెచ్‌ఆర్ నిబంధనల మేరకు ఆర్‌డీవో ఎలా విచారణ చేయిస్తారని ధర్మాసనం ప్రశ్నిం చింది. లాకప్‌డెత్ ఘటనపై ఆలేరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ను విచారణ జరిపి సీల్డ్‌కవర్‌లో నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. మృతురాలి బంధువులకు నోటీసులు జారీ చేసి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఆదేశించింది.
పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు?
లాకప్‌డెత్ జరిగిన రోజుకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరా రికార్డులను పెన్‌డ్రైవ్‌లో వేసి సీల్డ్‌కవర్‌లో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సమర్పించాలని ధర్మాసనం ఏజీకి సూచించగా... పోలీస్‌స్టేషన్ ఓ ప్రైవేట్ భవనంలో ఉందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని నివేదించారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినా ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం కోర్టుధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేసింది. సీసీ కెమెరాలు ఉంటే సదరు మహిళది సహజ మరణమా.. చిత్రసింహల వల్లే చనిపోయిందా.. అన్నది నిర్ధారణ అయ్యేదని ధర్మాసనం పేర్కొంది. పోలీస్ స్టేషన్‌లో సాధారణంగా ఎవరైనా చనిపోయినా ఎవరూ విశ్వసించరని, అలాంటప్పుడు సీసీ కెమెరా రికార్డు ఆధారంగా ఉంటుందని పేర్కొంది. నిజాయితీపరులైన పోలీస్ అధికారులు ఇబ్బందులు పడకూడదనే, వారి రక్షణ కోసమే పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ధర్మాసనం గుర్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment