lockup death case
-
మిస్టరీగా మారిన 'కాంగో జాతీయుడి లాకప్ డెత్!' ఆరోజు ఏం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్–నాబ్), హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్, రాచకొండలకు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్‌లతో (ఎస్ఓటీ) పాటు స్థానిక పోలీసులకు చిక్కిన ప్రతి నాలుగు డ్రగ్ ముఠాల్లో మూడింటి లింకులు బెంగళూరులో ఉంటున్నాయి. ఆ నగరం డ్రగ్ పెడ్లర్స్, సప్లయర్లకు అడ్డాగా మారడానికి దాదాపు రెండున్నరేళ్ళ క్రితం చోటు చేసుకున్న ఓ లాకప్ డెత్ కారణమైంది. దీనిని గమనించిన రాష్ట్ర పోలీసు విభాగం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. ఒకప్పుడు గోవా.. ఇప్పుడు బెంగళూరు.. నగరంలో ఎక్కువగా లభించే మాదకద్రవ్యాల్లో గంజాయి సంబంధితమైన వాటి తర్వాతి స్థానంలో సింథటిక్ డ్రగ్స్ ఉంటున్నాయి. గంజాయి, చెరస్, హష్ ఆయిల్ తదితరాలు ఏజెన్సీ ప్రాంతాల నుంచి సిటీకి వస్తున్నాయి. కోకై న్, బ్రౌన్‌షుగర్, హెరాయిన్ తదితర సింథటిక్ డ్రగ్స్ మూలాలు మాత్రం విదేశాల్లో ఉంటున్నప్పటికీ ఇక్కడకు సరఫరా మాత్రం ఉత్తరాదితో పాటు బెంగళూరు నుంచి జరుగుతోంది. ఒకప్పుడు ఈ డ్రగ్ డాన్స్ అంతా గోవా కేంద్రంగా కథ నడిపే వారు. హైదరాబాద్ పోలీసులు వరుస దాడులు చేసి ఎడ్విన్, స్టీవ్ సహా బడా డ్రగ్ డాన్స్‌కు చెక్ చెప్పారు. దీంతో ఇక్కడి వారికి గోవా నుంచి డ్రగ్స్ సరఫరా దాదాపు ఆగిపోయింది. దీంతో బెంగళూరు కేంద్రంగా సరఫరా మొదలైంది. ఆ నగరమూ విదేశీయుల అడ్డా.. బెంగళూరుతో పాటు ఉత్తరాదిలోని అనేక నగరాల్లో తిష్ట వేసి, డ్రగ్స్ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్న వారిలో నల్లజాతీయులే ఎక్కువగా ఉంటున్నారు. స్టడీ, బిజినెస్, విజిట్ సహా వివిధ రకాలైన వీసాలపై వస్తున్న నైజీరియా, సూడాన్, సోమాలియా, కాంగో జాతీయులు డ్రగ్ పెడ్లర్స్, సప్లయర్స్‌గా మారుతున్నారు. ఇలాంటి వాళ్లు ఇతర నగరాలతో పాటు బెంగళూరులోనూ పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. 2021 ప్రథమార్ధం వరకు ఆ నగరంలో నేరాలు చేస్తున్న, అక్రమంగా నివసిస్తున్న ఇలాంటి వారిపై ఉక్కుపాదం మొపేవారు. వీళ్ళు సాధారణంగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే పెద్ద సంఖ్యలో నివసిస్తుంటారు. బెంగళూరులోని అలాంటి ప్రాంతాల్లో తరచూ తనిఖీలు చేసే అక్కడి పోలీసులు అక్రమంగా నివసిస్తున్న, దందాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఒక్క ఉదంతంలో అడ్డం తిరిగిన కథ.. ఆ నగరంలో 2021 ఆగస్టులో చోటు చేసుకున్న ఓ ఉదంతంతో కథ అడ్డం తిరిగింది. కాంగోకు చెందిన జోయల్ షిండానీ ములు (27) స్టడీ వీసాపై బెంగళూరుకు వచ్చాడు. డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా ముప్పతిప్పలు పెట్టిన ఇతడిని 2021 ఆగస్టులో జేసీ నగర్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలో ఠాణాలోనే అతడు చనిపోయాడు. కార్డియాక్ అరెస్టు వల్ల మరణం సంభవించిందని పోలీసులు చెప్పగా, పోలీసులే కొట్టి చంపారని నల్లజాతీయులు ఆరోపించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఆ ఠాణా వద్దకు చేరుకున్న నల్లజాతీయులు రాళ్లు రువ్వడంతో పాటు నిరసన చేపట్టారు. దాదాపు రెండు రోజుల పాటు ఈ ఘర్షణలు అక్కడి పోలీసులు ఉలిక్కిపడేలా చేశాయి. ఈ పరిణామం తర్వాత ఆ నగర అధికారులు నల్లజాతీయుల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పరిస్థితులు చేయి దాటుతుండటంతో.. దీనిని అలుసుగా చేసుకున్న అనేక మంది డ్రగ్ పెడ్లర్స్, సప్లయర్స్ బెంగళూరును అడ్డాగా మార్చుకున్నారు. ఇతర మెట్రోల్లో నివసించే నల్లజాతీయులు సైతం ఆ నగరానికి వచ్చివెళ్తూ డ్రగ్స్ దందా చేస్తున్నారు. కొన్ని రకాలైన డ్రగ్స్ విదేశాల నుంచి నేరుగా కర్ణాటకలోని వివిధ నగరాలకు వచ్చి బెంగళూరు చేరుతున్నాయి. అక్కడ నుంచే హైదరాబాద్ సహా వివిధ నగరాలకు సరఫరా అవుతున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన కేసులను అధ్యయనం చేసిన అధికారులు ఈ విషయం గుర్తించారు. దీంతో అక్కడ ఉన్న డ్రగ్ పెడ్లర్స్‌కు చెక్ చెప్పడానికి, మాదకద్రవ్యాల దందాను కట్టడి చేయడానికి అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. అవసరమైతే దీనిపై కేంద్ర ఏజెన్సీల సహకారం కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక్కడ నుంచి సూత్రధారులను పట్టుకోవడానికి వెళ్లినా సరైన సహకారం లభించకపోవడాన్నీ ప్రస్తావించనున్నారు. ఇవి కూడా చదవండి: అగ్నిసాక్షిగా ఏడడుగులు.. అంతలోనే అంతర్వేది బీచ్‌లో విషాదం! -
కోలారు జిల్లాలో లాకప్‌డెత్?
కోలారు: బైక్ చోరీ కేసులో పోలీసులు విచారణకు తీసుకొచ్చిన యువకుడు అనుమానాస్పదరీతిలో మరణించాడు. ఈ సంఘటన కోలారు జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ నల్లరాజుగానిపల్లికి చెందిన ఎరికల మునిరాజు (28) అనే వ్యక్తిని ముళబాగిలు తాలూకా నంగలి పోలీసులు బైక్, మొబైల్ చోరీ కేసులో గత నెల 31న విచారణ కోసం తీసుకొచ్చారు. అతడు పలు దొంగతనాల కేసుల్లో నిందితుడని తెలిసింది. కోలారు జిల్లాలో చోరీపై కేసు నమోదు కావడంతో విచారణ కోసం అరెస్టు చేసి తీసుకొచ్చారు. అతనికి కిడ్నీ సమస్య ఉందని తెలిసి కోలారులోని ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మునిరాజు మరణించాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసులే చంపారని ఆరోపణ అయితే మునిరాజును గత నెల 21నే తమ గ్రామం నుంచి పోలీసులు తీసుకు వెళ్లారని, స్టేషన్లోనే ఉంచి తీవ్రంగా కొట్టడంతో వల్లనే చనిపోయాడని మునిరాజు తల్లి మునిరత్నమ్మ ఆరోపిస్తోంది. అది కప్పిపుచ్చుకోవడానికి పోలీసులు ఆస్పత్రి డ్రామా ఆడుతున్నారని బంధువులు మండిపడ్డారు. మృతదేహం మీద గాయాలు ఉన్నాయని, బట్టలు లేవని,ఎడమ కాలికి పెద్ద కట్టు కట్టి ఉందని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన దాఖలాలే లేవని వారు ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని కోలారులోని గల్పేటె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. -
TS: లాకప్ డెత్‌పై డీజీపీ సీరియస్.. సీఐ, ఎస్ఐపై చర్యలు!
సాక్షి, హైదరాబాద్: మెదక్ లాకప్‌డెత్ ఘటనపై తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తునకు డీజీపీ ఆదేశించారు. ఈ క్రమంలోనే ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో సీఐ, ఎస్ఐపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. కాగా, పోలీసుల చిత్రహింసలతో ఖాదర్ చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులే కారణం.. మెదక్‌కు చెందిన ఖదీర్‌ఖాన్.. గాంధీ ఆసుపత్రిలో చిక్సిత పొందతూ ఫిబ్రవరి 12వ తేదీన మృతిచెందాడు. అయితే, దొంగతనం కేసులో ఖదీర్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే ఆయన చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగింది ఇది.. అయితే, జనవరి 27వ తేదీన మెదక్‌లోని అరబ్ గల్లీలో బంగారం గొలుసు దొంగతనం జరిగిందని ఓ మహిళ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, ఘటనాస్థలంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఖదీర్‌ఖాన్‌ను జనవరి 29వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఖదీర్‌ను ఫిబ్రవరి 2వ తేదీ వరకు స్టేషన్లోనే ఉంచి.. తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా.. ఖదీర్ ఇంటికి వెళ్లిన మరుసటి రోజే.. అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో, అతడికి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించి అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఖదీర్ మృతిచెందాడు. అయితే, పోలీసులే కారణంగా ఖదీర్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
ఏడు లక్షలిస్తాం... ఏం మాట్లాడొద్దు
తిరువణ్నామలై: తమిళనాడులో మరో లాకప్ డెత్ చోటుచేసుకుంది. దాన్ని కప్పిపుచ్చడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని, తమకు రూ.7 లక్షలు ఆఫర్ చేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఒప్పుకోవాలంటూ దాదాపు రోజంతా వెంట పడ్డారని చెప్పింది. తిరువణ్నామలై జిల్లాకు చెందిన తంగమణి (47)ని కల్తీ మద్యం అమ్ముతున్నాడంటూ ఏప్రిల్ 26న పోలీసులు అరెస్టు చేశారు. మర్నాడు అతను ఆస్పత్రిలో మరణించాడు. లాకప్‌లో పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం వల్లే చనిపోయాడని కుమారుడు దినకరన్ ఆరోపించాడు. ‘‘దీనిపై అల్లరి చేయొద్దని పోలీసులు బెదిరించారు. తక్షణం అంత్యక్రియలు పూర్తి చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం తెల్లవారుజాము దాకా మాతో బేరమాడారు. చివరికి రూ.7 లక్షలు ఇవ్వజూపారు’’ అని ఆరోపించాడు. తమకు డబ్బులొద్దని, తండ్రి మరణానికి కారకులైన పోలీసులపై కేసు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశాడు. దీనిపై విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే చెన్నైలో లాకప్ డెత్ జరగ్గా బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు పరిహారమిచ్చింది. -
మరియమ్మ లాకప్ డెత్‌పై తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు
Mariyamma Lockup Death Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మరియమ్మ లాక్ అప్ డెత్ అంశంపై తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. మరియమ్మ కేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఇప్పటికే ఇచ్చిన రిపోర్టు ఆధారంగా దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు పోలీసు స్టేషన్ పరిధిలో జూన్ నెలలో మృతి చెందిన మరియమ్మ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దొంగతనం కేసులో ఇంటరాగేషన్ పేరుతో మరియమ్మపై స్టేషన్లో థర్ఢ్ డిగ్రీ ప్రయోగించారు. మరియమ్మ దెబ్బలకు తాళలేక స్పృహ కోల్పోయింది. దీంతో పోలీసులు స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. నాడి పరిశీలించిన వైద్యుడు పరిస్థితి విషమంగా ఉందని, పల్స్ దొరకడం లేదని చెప్పడంతో హుటాహుటిన భువనగిరి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు చనిపోయినట్లు చెప్పారు. చదవండి: మరియమ్మ లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తు వద్దు.. ‘ఆదేశిస్తే మేము సిద్ధం' దీనిపై వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో బాధితురాలుకు న్యాయం చేకురుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే మరియమ్మ లాకప్ డెత్ కేసులో ముగ్గురు పోలీసు అధికారులను తెలంగాణ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఎస్సై మహేశ్వర్, కానిస్టేబుల్స్ రషీద్, జానయ్యలను శాశ్వతంగా వీధుల నుండి బహిష్కరించింది. తొలగించిన పోలీసుల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు గతంలో ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తే ప్రజలకు పోలీసులపై నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని డ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్టల చేత విచారణ జరిపించేలా చూడాలని కోరారు. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించే విషయంపై తీర్పు వెలువరించింది. -
మరియమ్మ కేసు: బాధ్యులపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోలేదు?
సాక్షి, హైదరాబాద్: మరియమ్మ లాకప్‌డెత్‌పై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్‌గా స్పందించింది. బాధితులకు పరిహారం ఇస్తే పోయిన ప్రాణం తిరిగొస్తుందా? అని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాకప్ డెత్ బాధ్యులపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని అధికారులను ప్రశ్నించింది. బాధ్యులైన పోలీసులను.. విధులు నుంచి తొలగిస్తే న్యాయం చేసినట్టేనా? అని.. తీవ్రంగా స్పందించింది. ఈ ఏడాది జూన్‌లో చర్చిపాస్టర్ బాలశౌరి ఇంట్లో దొంగతనం ఆరోపణలతో మరియమ్మను, ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్‌ను అడ్డగూడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము.. దొంగతనం చేయలేదని చెప్పిన అధికారులు పట్టించుకోలేదు. ఆ తర్వాత వారిని తీవ్రంగా కొట్టారు. కాగా, ఎస్సై మహేష్, కానిస్టేబుల్ దెబ్బలకు తాళలేక మరియమ్మ జైలులోనే మృతి చెందింది. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఈ క్రమంలో.. సీఎం కేసీఆర్ ప్రత్యేక విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. ఇప్పటికే ఎస్సై మహేష్‌తోపాటు, ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు విధుల నుంచి తొలగించారు. తాజాగా పౌరహక్కులు ఈ ఘటనపై హైకోర్టుకు వెళ్లాయి. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు తాజాగా, సీబీఐ విచారణకు ఆదేశించింది. -
లాకప్ డెత్ మరియమ్మ కేసు సిబిఐకి
-
మరియమ్మ లాకప్‌డెత్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్ : మరియమ్మ లాకప్‌డెత్ కేసుపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. మరియమ్మ మృతదేహానికి గత నెలలో రీపోస్ట్‌మార్టమ్ పూర్తైందని ఏజీ తెలిపారు. కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం, ఉద్యోగం ఇచ్చినట్లు తెలియజేశారు. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోయిన ప్రాణాలు పరిహారంతో తిరిగి వస్తాయా అని ప్రశ్నించింది. ఆలేరు మేజిస్ట్రేట్ నివేదిక అందిన తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది. నివేదిక అందిన 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. మరియమ్మ లాకప్ డెత్‌పై విచారణ సెప్టెంబర్ 15కి వాయిదా వేసింది. -
మరియమ్మ లాకప్ డెత్ కేసులో కీలక మలుపు
-
పోలీసులు కొట్టడం వల్లే అమ్మ చనిపోయింది.. నా కళ్లారా చూశా
అడ్డగూడూరు/చింతకాని: ‘పోలీసులు కొట్టడంవల్లే మా అమ్మ చనిపోయింది. నేను కళ్లారా చూశా. గతనెల 27న డీజీపీ వచ్చి నన్ను, తమ్ముడిని విచారించినప్పుడు కూడా ఇదే విషయం చెప్పాను’అని అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు గురైన మరియమ్మ చిన్నకూతురు స్వప్న పేర్కొంది. సోమవారం తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్ ఇన్చార్జ్ ఎస్ఐ ఉదయ్‌కిరణ్‌కు స్వప్న ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, అమ్మచావుకు కారణమైన ఎస్ఐ మహేష్, కానిస్టేబుళ్లను హత్యానేరం కింద అరెస్ట్ చేస్తారని ఆశించాను కానీ ఇంతవరకు ఎలాంటి కేసు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్ఐ మహేష్, కానిస్టేబుళ్లు, ఫాదర్ బాలశౌరిల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వారికి శిక్షపడేలా చేసి మాకు న్యాయం చేయాలని కోరింది. వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. తమ కుటుంబానికి ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. ఏపీ విద్యాశాఖ ముఖ్యసలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ, మరియమ్మ లాకప్ డెత్‌కు కారణం అయిన ఎస్ఐ, కానిస్టేబుళ్లను అరెస్ట్ చేయకుండా కేవలం సస్పెండ్ చేసి పోలీస్‌శాఖ చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. ఎఫ్ఐఆర్లో మరియమ్మ డబ్బులు దొం గతనం చేసినట్లు నమోదు చేశారని, కానీ లాకప్ డెత్‌కు సంబంధించిన సమాచారం లేదన్నారు. ఒక ఎస్సీ మహిళను లాకప్‌డెత్ చేసిన పోలీసులను అరెస్ట్ చేయకుండా వదిలేయడం, వారు బయట తిరగడం సరికాదన్నారు. స్వప్నతోపాటు దళిత్ స్త్రీ శక్తి తెలంగాణ రాష్ట్ర కనీ్వనర్, హైకోర్టు అడ్వొకేట్ జాన్సీ గడ్డం, దళిత్ శక్తి కోఆర్డినేటర్ భాగ్యలక్షమ్మ, మరియమ్మ కుటుంబ సభ్యులు ఉన్నారు. -
మరియమ్మ మృతదేహానికి రీ పోస్టుమార్టం
చింతకాని: హైకోర్టు ఆదేశాల మేరకు అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో మృతిచెందిన మరియమ్మ మృతదేహానికి రీపోస్టుమార్టం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంలో, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు జ్యుడీషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ సమక్షంలో వరంగల్ రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందం, కాకతీయ మెడికల్ కళాశాల వైద్య బృందం శుక్రవారం రీ పోస్టుమార్టం నిర్వహించింది. దొంగతనం కేసులో జూన్ 17వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసులు మరియమ్మతోపాటు ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్, అతని స్నేహితుడు వేముల శంకర్లను విచారణ పేరుతో గ్రామం నుంచి తీసుకెళ్లి కొట్టడంతో అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో మరియమ్మ మృతిచెందిన విషయం విదితమే. దీంతో మరియమ్మ మృతిపై న్యాయ విచారణ చేపట్టాలని పౌరహక్కుల సంఘం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. మరియమ్మ లాకప్ డెత్ ఘటనపై న్యాయ విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆలేరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. జూన్ 18న మృతి చెందిన మరియమ్మ మృతదేహానికి అడ్డగూడూరు పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో మృతురాలి స్వగ్రామమైన కోమట్లగూ డెంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే న్యాయ విచారణలో భాగంగా గ్రామంలో పూడ్చిపెట్టిన మరియ మ్మ మృతదేహాన్ని 14 రోజుల తర్వాత వెలికితీసి ఆలేరు మేజిస్ట్రేట్ సమక్షంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మెజిస్ట్రేట్ మరియమ్మ ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లను విచారించి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. -
మరియమ్మ లాకప్ డెత్ కేసు: మరో పోలీస్ అధికారిపై వేటు
సాక్షి, ఖమ్మం: దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ ఘటనలో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. చింతకాని ఎస్ఐ రెడ్డబోయిన ఉమను ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కు ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు రోజుల క్రితం ఖమ్మం లో పర్యటించి మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌ను పరామర్శించిన డీజీపీ మహేందర్ రెడ్డి.. చింతకాని పీఏస్‌లో ఏమి జరిగిందన్న దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీజీపీ పర్యటన అనంతరం చింతకాని ఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో మరి కొంతమంది పోలీస్ అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అడ్డగూడురు పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. మరియమ్మ లాకప్ డెత్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. మరియమ్మ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది. చదవండి: నేరేడ్మెట్: చదువు కోసం వచ్చి.. వ్యభిచారం ఖమ్మం: భర్త చేత బలవంతంగా భార్య పన్ను పీకించి దారుణం -
‘మా కళ్లముందే అమ్మను చిత్రహింసలు పెట్టారు.. క్రూరంగా ప్రవర్తించారు’
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: ‘‘మా కళ్లముందే అమ్మను విచక్షణారహితంగా చితకబాదారు. పోలీసుల దెబ్బలు తట్టుకోలేకే అమ్మ చనిపోయింది. ఇలాంటి అన్యాయం ఏ కుటుంబానికి జరగొద్దు’’ అంటూ మరియమ్మ కూతుళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అని కూడా చూడకుండా తమ తల్లిని ఇష్టారీతిన చిత్రహింసలకు గురిచేసి చంపేశారని కన్నీళ్లుపెట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ముకుందాపురం గ్రామానికి చెందిన మరియమ్మ (40) యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో దెబ్బలు తాళలేక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం విదితమే. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ లాకప్‌డెత్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలో శుక్రవారం ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. మరియమ్మ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహం, 15 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇద్దరు కూతుళ్లకు పది లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాక్షితో టీవీతో మాట్లాడిన మరియమ్మ కూతుళ్లు తమ తల్లి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘వంట మనిషిగా పనిచేసేందుకు అమ్మ వెళ్లింది. రెండు నెలల పాటు అంతా బాగానే ఉంది. తమ్ముడు నా దగ్గరే ఉండేవాడు. ఒకసారి.. అమ్మను చూడబుద్ధి అవుతోందని.. అమ్మకాడికి పోయి చూసి వచ్చిండు. రెండోసారి.. వెంబడి తన ఫ్రెండును పట్టుకుని పోయిండు. అప్పుడు.. యజమాని.. ఇంట్లో బీరువా గెలికినట్లు ఉందని అడిగారట. ఆ తర్వాత ఫాదర్ మాకు ఫోన్ చేసి.. రెండు లక్షలు పోయాయి. మీ అమ్మవాళ్లు ఇట్లా చేశారని చెప్పారు. అమ్మా వాళ్లు అట్లా చేయరని ఫాదర్ అని చెప్పాను. సర్లే అన్నారు. ఆయన కూడా బాగానే ఉన్నారు. అమ్మ మీద బాగా నమ్మకం. వారం టైం కూడా ఇచ్చారు. ఆ తర్వాత కేసు బెట్టంగనే పోలీసులు.. తమ్ముడిని, తన ఫ్రెండ్‌ను తీసుకునిపోయి ఘోరంగా కొట్టారంట. తమ్ముడి దగ్గర అసలేమీ లేవు. రెండోరోజు దెబ్బలు తట్టుకోలేక.. ఒకవేళ ఆడామె పేరు చెప్పినా వదిలిపెడతారేమో అనే ఆలోచనతోని, నా తల్లి మీద నెట్టారండి. ఏ పాపమైనా ఆమెకే తెలుసని అమ్మ మీదకు నెట్టేశారు. వాళ్లను అలా కొడుతుంటే అమ్మ ఏం మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత నన్ను అడిగారు. ఏదైనా తెలిస్తే చెప్పమన్నారు. నాకేమీ తెలియదన్నాను. నేనే తప్పు చేయనపుడు ఎవరికీ భయపడను అని చెప్పాను. మీరెక్కడికి తీసుకెళ్లినా వస్తాను. నా దగ్గరైతే డబ్బు లేదని అమ్మ కూడా చెప్పింది. దీంతో.. వీళ్లంతా డ్రామాలు చేస్తున్నారని చెప్పి నన్ను కూడా వ్యాన్ ఎక్కించి చింతకాని తీసుకువెళ్లారు. బాగా కొట్టారు సార్. ఎంత క్రూరంగా అంటే అంత క్రూరంగా హింస పెట్టారు సార్ అమ్మను. అమ్మ ఒళ్లైతే ఇంత ఎత్తున వాచిపోయింది. నా కళ్లముందే నా తల్లిని చిత్రహింసలు పెడుతుంటే తట్టుకోలేకపోయానండి. నా పసిపిల్లను ఎత్తుకుని పోయిన. వాళ్లకు కొంచెం కూడా జాలిలేదు. మా ముందే అమ్మను ఘోరంగా కొట్టారు’’ అంటూ మరియమ్మ చిన్నకూతురు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక పెద్దకూతురు మాట్లాడుతూ.. ‘‘మా అమ్మను మీకు అప్పజెప్పాం. అట్లనే తెచ్చియండి అని బాగా ఏడ్చినం. మీ వాళ్లను రప్పించుకోమని చెప్పారు. హార్ట్ ఎటాక్‌లాగా వచ్చింది ఆస్పత్రికి తీసుకెళ్లాం అన్నారు. భువనగిరి వెళ్లేసరికి డెడ్‌బాడీ చూపించారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: Addagudur Lockup Death: సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు -
అడ్డగూడూరు లాకప్‌డెత్ కేసు: సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మరియమ్మ లాకప్‌డెత్‌పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అవసరమైతే ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా... మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు.. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో 10 లక్షల రూపాయల ఆర్థికసాయం అందించాలని ఆదేశించారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో దెబ్బలు తాళలేక మరియమ్మ అనే మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం విదితమే. ఖమ్మం జిల్లా ముకుందాపురం గ్రామానికి చెందిన మరియ (40) తన కుమారుడు ఉదయ్‌తో కలసి రెండు నెలల నుంచి వంట మనిషిగా పని చేసేవారు. ఈ క్రమంలో ఈ నెల 15న ఆమె పనిచేస్తున్న యజమాని ఇంట్లో సుమారు రూ.2 లక్షలు చోరీకి గురికాగా.. ఆయన అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా తల్లి, కుమారుడిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టగా, దెబ్బలకు తాళలేక మరియమ్మ స్పృహ తప్పి పడిపోయారు. చికిత్స నిమిత్తం మండలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోవడంతో, అక్కడి నుంచి వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి ఆమె మృతి చెందారు. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. చదవండి: ‘మరియమ్మ కుటుంబానికి రూ.5కోట్ల పరిహారం ఇవ్వాలి’ -
పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు?
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ ఘటనపై న్యాయమూర్తితో విచారణ చేయించకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పోలీసు కస్టడీలో మహిళ చనిపోతే నేర విచారణచట్టం (సీఆర్పీసీ)సెక్షన్ 176(1)(ఎ) ప్రకారం స్థానిక న్యాయమూర్తితో విచారణ జరిపించాలని స్పష్టంగా ఉన్నా.. ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నిబంధన గురించి సంబంధిత అధికారులకు తెలియదా అంటూ నిలదీసింది. ఈ ఘటనపై ఆలేరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ను విచారణ జరపాలని ఆదేశించింది. ఈ నివేదికను నెల రోజుల్లోపు సీల్డ్ కవర్లో సమర్పించాలని పేర్కొంది. అవసరమైతే మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని కూడా మేజిస్ట్రేట్ ఆదేశించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. లాకప్‌డెత్ ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలంటూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ రాష్ట్ర కార్యదర్శి జయ వింధ్యాల దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. మరియమ్మ, ఆమె కుమారున్ని ఈ నెల 15న పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని పిటిషనర్ తరఫున న్యాయవాది పి.శశికిరణ్ వాదనలు వినిపించారు. పోలీసుల చిత్రహింసలు భరించలేక ఈనెల 18న మరియమ్మ చనిపోయిందని తెలిపారు. ఈ వ్యవహారంపై స్థానిక న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, బాధిత కుటుంబానికి రూ.5 కోట్లు పరిహారం ఇప్పించాలని, ఈ మొత్తాన్ని మరియమ్మ మృతికి కారణమైన పోలీసు అధికారుల జీతాల నుంచి వసూలు చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. లాకప్‌డెత్ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశిం చామని, ఘటన జరిగిన సమయంలో ఉన్న కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నిబంధనల మేరకు ఈ వ్యవహారంపై ఆర్డీవో విచారణ చేస్తున్నారని, పోస్టుమార్టంను వీడియో తీశామని తెలిపారు. మరియమ్మ మృతదేహాన్ని కుమార్తెకు అప్పగించామని, వారు ఖననం కూడా చేశారని వివరించారు. సీఆర్పీసీలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తో మాత్రమే విచారణ చేయించాలని స్పష్టంగా ఉన్నా... ఎన్హెచ్ఆర్ నిబంధనల మేరకు ఆర్డీవో ఎలా విచారణ చేయిస్తారని ధర్మాసనం ప్రశ్నిం చింది. లాకప్‌డెత్ ఘటనపై ఆలేరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ను విచారణ జరిపి సీల్డ్కవర్లో నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. మృతురాలి బంధువులకు నోటీసులు జారీ చేసి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఆదేశించింది. పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు? లాకప్‌డెత్ జరిగిన రోజుకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరా రికార్డులను పెన్‌డ్రైవ్‌లో వేసి సీల్డ్కవర్లో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సమర్పించాలని ధర్మాసనం ఏజీకి సూచించగా... పోలీస్‌స్టేషన్ ఓ ప్రైవేట్ భవనంలో ఉందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని నివేదించారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినా ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం కోర్టుధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేసింది. సీసీ కెమెరాలు ఉంటే సదరు మహిళది సహజ మరణమా.. చిత్రసింహల వల్లే చనిపోయిందా.. అన్నది నిర్ధారణ అయ్యేదని ధర్మాసనం పేర్కొంది. పోలీస్ స్టేషన్లో సాధారణంగా ఎవరైనా చనిపోయినా ఎవరూ విశ్వసించరని, అలాంటప్పుడు సీసీ కెమెరా రికార్డు ఆధారంగా ఉంటుందని పేర్కొంది. నిజాయితీపరులైన పోలీస్ అధికారులు ఇబ్బందులు పడకూడదనే, వారి రక్షణ కోసమే పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ధర్మాసనం గుర్తు చేసింది. -
లాకప్ డెత్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: మంథిని శీలం రంగయ్య లాకప్ డెత్ అంటూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారించింది. గతంలో ఈ కేసులో స్పెషల్ అధికారిగా హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ను నియమించిన సంగతి తెలిసిందే. శీలం రంగయ్య డెత్‌కు సంబంధించిన రిపోర్ట్‌ను సీపీ అంజనీకుమార్ కోర్టుకు సమర్పించారు. రామగుండం సీపీ కాల్ డేటా హైకోర్టుకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. సీపీ సమర్పించిన అఫిడవిట్‌పై కౌంటర్ దాఖలు చేస్తామని పిటిషనర్ నాగమణి పేర్కొన్నారు. తదుపరి విచారణ ఆరు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది. -
కస్టడీ డెత్: పోలీసులు చెప్పినవి అబద్ధాలే
చెన్నై: తమిళనాడులో తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కీలక వీడియో వెలుగు చూసింది. దీని ప్రకారం పోలీసులు చెప్పిన ఎన్నో విషయాలు అబద్ధమని రుజువవుతోంది. ట్యుటికోరన్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో జూన్ 19న వారు నిర్వహించే మొబైల్ దుకాణం ముందు రద్దీ ఉందని, దీంతో వారిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయగా తండ్రీకొడుకులు ఎదురు తిరిగినట్లు పేర్కొన్నారు. కానీ తాజాగా బయటపడ్డ సీసీటీవీ ఫుటేజీలో దుకాణం ముందు ఎలాంటి రద్దీ లేదు. సాధారణంగా ఫోన్లో మాట్లాడుతున్న జయరాజ్ పోలీసులు పిలవడంతో వారి దగ్గరకు వెళ్లాడు. అతని వెనకాలే కొడుకు కూడా వెళ్లాడు. పైగా పోలీసులు అహంకారంతో దురుసుగా మాట్లాడినట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ వాళ్లు పోలీసులకు సహకరించారే తప్ప ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని సీసీటీవీలో స్పష్టమవుతోంది. అక్కడ ఘర్షణ జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. (వివాదాస్పదమైన తండ్రీ కొడుకుల మృతి) పోలీసులు బెనిక్స్ తండ్రిని వాహనంలో తీసుకు వెళుతుంటే అతడి కుమారుడు ఆ వాహనాన్ని అనుసరించాడు. సీసీటీవీలో వారు స్వంతంగా గాయపర్చుకున్నట్లు ఎక్కడా కనిపించకపోవడంతో వారికి వారే స్వతాహాగా గాయాలు చేసుకున్నారన్న వాదనలోనూ నిజం లేదని తేలింది. ఇక పోలీస్ స్టేషన్‌కు చేరుకునేసరికి పోలీసులు తన తండ్రిని దారుణంగా కొట్టడాన్ని బెనిక్స్ గమనించాడు. దీంతో అడ్డుకోబోయిన బెనిక్స్ను సైతం అదుపులోకి తీసుకుని దారుణంగా హింసించారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలోనే తండ్రీకొడుకులిద్దరూ ఒకరి తర్వాత మరొకరు మరణించారు. ఈ ఘటనపై ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా మరో 15 మందిని బదిలీ చేశారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. (ఇండియా ‘జార్జి ఫ్లాయిడ్’లు) -
లాకప్ డెత్ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
హైదరాబాద్: ఆసిఫ్ నగర్ లో చోటు చేసుకున్న నక్కల పద్మ లాకప్ డెత్ కేసును మానవహక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. లాకప్ డెత్ ఘటనపై సెప్టెంబర్ 11లోగా నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సీపీని ఆదేశించింది. దీంతో పాటు ఉస్మానియా సూపరింటెండెంట్, కలెక్టర్లకు హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. ఓ కేసుకు సంబంధించి నక్కల పద్మను ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. ఎక్కువ సమయం పోలీసు స్టేషన్లో పెట్టడం వల్ల అస్వస్థతకు గురవడంతో శనివారం రాత్రి 11.30 గంటలకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె తెల్లవారుజామున 4 గంటలకే మృతి చెందిందని తెలుస్తోంది. అయితే 6.30 గంటలకు చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు. షుగర్ లెవల్స్, పల్స్ రేట్ పడిపోవడంతో కోమాలోకి వెళ్లి మరణించిందని అంటున్నారు. కాగా మృతురాలి శరీరంపై గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సీఐ, ఎస్సై, ఏఎస్సై తో సహా ఏడుగుర్ని నగర సీపీ మహేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. -
సీఐతో సహా ఆరుగురి సస్పెన్షన్
హైదరాబాద్: నగరంలో కలకలం రేపిన పద్మ అనే మహిళ లాకప్ డెత్ కేసుకు సంబంధించి సీఐతో సహా ఆరుగురు పోలీసులను సీపీ మహేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు ప్రధాన కారణమైన సీఐ శ్రీకాంత్ , ఎస్సై రుషికేశ్, ఏఎస్సై చాంద్ పాషాలతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు ఖాజా, ప్రతాప్ , మంజూర్ ఆలీలను సీపీ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ఆదివారం పూర్తి విచారణ జరిపిన తరువాత వారిపై చర్యలు తీసుకున్నారు. ఆసిఫ్ నగర్ కు చెందిన పద్మ అనే మహిళను విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. అయితే పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా బాధిత మహిళను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. పోలీసుల విచారణలోనే పోలీస్ స్టేషన్లో పద్మ మృతి చెందిందని.. అనంతరం ఉస్మానియాకు తరలించారని తెలుస్తోంది. అయితే.. పద్మది లాకప్ డెత్ కాదని, సహజ మరణమేనని పోలీసులు వాదించారు. కాగా, ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా విచారణ చేపట్టిన సీపీ.. దీనికి కారణమైన ఆసిఫ్ నగర్ పోలీసులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.