గోడు వెళ్లబోసుకుంటున్న మృతుని తల్లి మునిరత్నమ్మ
కోలారు: బైక్ చోరీ కేసులో పోలీసులు విచారణకు తీసుకొచ్చిన యువకుడు అనుమానాస్పదరీతిలో మరణించాడు. ఈ సంఘటన కోలారు జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ నల్లరాజుగానిపల్లికి చెందిన ఎరికల మునిరాజు (28) అనే వ్యక్తిని ముళబాగిలు తాలూకా నంగలి పోలీసులు బైక్, మొబైల్ చోరీ కేసులో గత నెల 31న విచారణ కోసం తీసుకొచ్చారు.
అతడు పలు దొంగతనాల కేసుల్లో నిందితుడని తెలిసింది. కోలారు జిల్లాలో చోరీపై కేసు నమోదు కావడంతో విచారణ కోసం అరెస్టు చేసి తీసుకొచ్చారు. అతనికి కిడ్నీ సమస్య ఉందని తెలిసి కోలారులోని ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మునిరాజు మరణించాడని పోలీసులు చెబుతున్నారు.
పోలీసులే చంపారని ఆరోపణ
అయితే మునిరాజును గత నెల 21నే తమ గ్రామం నుంచి పోలీసులు తీసుకు వెళ్లారని, స్టేషన్‌లోనే ఉంచి తీవ్రంగా కొట్టడంతో వల్లనే చనిపోయాడని మునిరాజు తల్లి మునిరత్నమ్మ ఆరోపిస్తోంది. అది కప్పిపుచ్చుకోవడానికి పోలీసులు ఆస్పత్రి డ్రామా ఆడుతున్నారని బంధువులు మండిపడ్డారు. మృతదేహం మీద గాయాలు ఉన్నాయని, బట్టలు లేవని,ఎడమ కాలికి పెద్ద కట్టు కట్టి ఉందని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన దాఖలాలే లేవని వారు ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని కోలారులోని గల్‌పేటె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment