
అడ్డగూడూరు/చింతకాని: ‘పోలీసులు కొట్టడంవల్లే మా అమ్మ చనిపోయింది. నేను కళ్లారా చూశా. గతనెల 27న డీజీపీ వచ్చి నన్ను, తమ్ముడిని విచారించినప్పుడు కూడా ఇదే విషయం చెప్పాను’అని అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు గురైన మరియమ్మ చిన్నకూతురు స్వప్న పేర్కొంది. సోమవారం తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌కు స్వప్న ఫిర్యాదు చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, అమ్మచావుకు కారణమైన ఎస్‌ఐ మహేష్, కానిస్టేబుళ్లను హత్యానేరం కింద అరెస్ట్ చేస్తారని ఆశించాను కానీ ఇంతవరకు ఎలాంటి కేసు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్‌ఐ మహేష్, కానిస్టేబుళ్లు, ఫాదర్ బాలశౌరిల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వారికి శిక్షపడేలా చేసి మాకు న్యాయం చేయాలని కోరింది. వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. తమ కుటుంబానికి ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది.
ఏపీ విద్యాశాఖ ముఖ్యసలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ, మరియమ్మ లాకప్ డెత్‌కు కారణం అయిన ఎస్‌ఐ, కానిస్టేబుళ్లను అరెస్ట్ చేయకుండా కేవలం సస్పెండ్ చేసి పోలీస్‌శాఖ చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో మరియమ్మ డబ్బులు దొం గతనం చేసినట్లు నమోదు చేశారని, కానీ లాకప్ డెత్‌కు సంబంధించిన సమాచారం లేదన్నారు. ఒక ఎస్సీ మహిళను లాకప్‌డెత్ చేసిన పోలీసులను అరెస్ట్ చేయకుండా వదిలేయడం, వారు బయట తిరగడం సరికాదన్నారు. స్వప్నతోపాటు దళిత్ స్త్రీ శక్తి తెలంగాణ రాష్ట్ర కనీ్వనర్, హైకోర్టు అడ్వొకేట్ జాన్సీ గడ్డం, దళిత్ శక్తి కోఆర్డినేటర్ భాగ్యలక్షమ్మ, మరియమ్మ కుటుంబ సభ్యులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment