addagudur
-
మరియమ్మ కేసు: బాధ్యులపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోలేదు?
సాక్షి, హైదరాబాద్: మరియమ్మ లాకప్‌డెత్‌పై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్‌గా స్పందించింది. బాధితులకు పరిహారం ఇస్తే పోయిన ప్రాణం తిరిగొస్తుందా? అని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాకప్ డెత్ బాధ్యులపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని అధికారులను ప్రశ్నించింది. బాధ్యులైన పోలీసులను.. విధులు నుంచి తొలగిస్తే న్యాయం చేసినట్టేనా? అని.. తీవ్రంగా స్పందించింది. ఈ ఏడాది జూన్‌లో చర్చిపాస్టర్ బాలశౌరి ఇంట్లో దొంగతనం ఆరోపణలతో మరియమ్మను, ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్‌ను అడ్డగూడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము.. దొంగతనం చేయలేదని చెప్పిన అధికారులు పట్టించుకోలేదు. ఆ తర్వాత వారిని తీవ్రంగా కొట్టారు. కాగా, ఎస్సై మహేష్, కానిస్టేబుల్ దెబ్బలకు తాళలేక మరియమ్మ జైలులోనే మృతి చెందింది. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఈ క్రమంలో.. సీఎం కేసీఆర్ ప్రత్యేక విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. ఇప్పటికే ఎస్సై మహేష్‌తోపాటు, ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు విధుల నుంచి తొలగించారు. తాజాగా పౌరహక్కులు ఈ ఘటనపై హైకోర్టుకు వెళ్లాయి. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు తాజాగా, సీబీఐ విచారణకు ఆదేశించింది. -
పోలీసులు కొట్టడం వల్లే అమ్మ చనిపోయింది.. నా కళ్లారా చూశా
అడ్డగూడూరు/చింతకాని: ‘పోలీసులు కొట్టడంవల్లే మా అమ్మ చనిపోయింది. నేను కళ్లారా చూశా. గతనెల 27న డీజీపీ వచ్చి నన్ను, తమ్ముడిని విచారించినప్పుడు కూడా ఇదే విషయం చెప్పాను’అని అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు గురైన మరియమ్మ చిన్నకూతురు స్వప్న పేర్కొంది. సోమవారం తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్ ఇన్చార్జ్ ఎస్ఐ ఉదయ్‌కిరణ్‌కు స్వప్న ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, అమ్మచావుకు కారణమైన ఎస్ఐ మహేష్, కానిస్టేబుళ్లను హత్యానేరం కింద అరెస్ట్ చేస్తారని ఆశించాను కానీ ఇంతవరకు ఎలాంటి కేసు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్ఐ మహేష్, కానిస్టేబుళ్లు, ఫాదర్ బాలశౌరిల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వారికి శిక్షపడేలా చేసి మాకు న్యాయం చేయాలని కోరింది. వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. తమ కుటుంబానికి ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. ఏపీ విద్యాశాఖ ముఖ్యసలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ, మరియమ్మ లాకప్ డెత్‌కు కారణం అయిన ఎస్ఐ, కానిస్టేబుళ్లను అరెస్ట్ చేయకుండా కేవలం సస్పెండ్ చేసి పోలీస్‌శాఖ చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. ఎఫ్ఐఆర్లో మరియమ్మ డబ్బులు దొం గతనం చేసినట్లు నమోదు చేశారని, కానీ లాకప్ డెత్‌కు సంబంధించిన సమాచారం లేదన్నారు. ఒక ఎస్సీ మహిళను లాకప్‌డెత్ చేసిన పోలీసులను అరెస్ట్ చేయకుండా వదిలేయడం, వారు బయట తిరగడం సరికాదన్నారు. స్వప్నతోపాటు దళిత్ స్త్రీ శక్తి తెలంగాణ రాష్ట్ర కనీ్వనర్, హైకోర్టు అడ్వొకేట్ జాన్సీ గడ్డం, దళిత్ శక్తి కోఆర్డినేటర్ భాగ్యలక్షమ్మ, మరియమ్మ కుటుంబ సభ్యులు ఉన్నారు. -
మరియమ్మ మృతదేహానికి రీ పోస్టుమార్టం
చింతకాని: హైకోర్టు ఆదేశాల మేరకు అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో మృతిచెందిన మరియమ్మ మృతదేహానికి రీపోస్టుమార్టం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంలో, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు జ్యుడీషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ సమక్షంలో వరంగల్ రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందం, కాకతీయ మెడికల్ కళాశాల వైద్య బృందం శుక్రవారం రీ పోస్టుమార్టం నిర్వహించింది. దొంగతనం కేసులో జూన్ 17వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసులు మరియమ్మతోపాటు ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్, అతని స్నేహితుడు వేముల శంకర్లను విచారణ పేరుతో గ్రామం నుంచి తీసుకెళ్లి కొట్టడంతో అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో మరియమ్మ మృతిచెందిన విషయం విదితమే. దీంతో మరియమ్మ మృతిపై న్యాయ విచారణ చేపట్టాలని పౌరహక్కుల సంఘం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. మరియమ్మ లాకప్ డెత్ ఘటనపై న్యాయ విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆలేరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. జూన్ 18న మృతి చెందిన మరియమ్మ మృతదేహానికి అడ్డగూడూరు పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో మృతురాలి స్వగ్రామమైన కోమట్లగూ డెంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే న్యాయ విచారణలో భాగంగా గ్రామంలో పూడ్చిపెట్టిన మరియ మ్మ మృతదేహాన్ని 14 రోజుల తర్వాత వెలికితీసి ఆలేరు మేజిస్ట్రేట్ సమక్షంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మెజిస్ట్రేట్ మరియమ్మ ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లను విచారించి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. -
మరియమ్మ కుమారుడికి ఉద్యోగం, రూ.35 లక్షల చెక్కు
చింతకాని/సాక్షి, హైదరాబాద్: మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంలోని మరియమ్మ ఇంటికి సోమవారం మంత్రి పువ్వాడతో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, సీపీ విష్ణు ఎస్. వారియర్ వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరియమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు మరియమ్మ కుమార్తెలు స్వప్న, సుజాతకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చెక్కులు, కుమారుడు ఉదయ్‌కిరణ్‌కు రూ.15 లక్షల చెక్కుతో పాటు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఖమ్మం ప్రధాన కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగ నియామక పత్రాన్ని మంత్రి పువ్వాడ, భట్టి తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ మరియమ్మ ఘటన సీఎం కేసీఆర్ దృష్టికి రాగానే, ఆయన స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 35 లక్షల ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. అఫిడవిట్ వేయండి: హైకోర్టు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్ లాకప్‌డెత్ ఘటనలో మృతి చెందిన మరియమ్మ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. అలాగే ఆమె కుమారుడు, కుమార్తెలకు ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. లాకప్‌డెత్ ఘటనపై న్యాయ విచారణ చేయించాలని, మృతురాలి కుటుంబానికి రూ.5 కోట్లు ఆర్థికసాయం అందించేలా ఆదేశించాలంటూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. లాకప్‌డెత్ ఘటనపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ధర్మాసనం ఆగస్టు 2కు వాయిదా వేసింది. చదవండి: ‘మా కళ్లముందే అమ్మను చిత్రహింసలు పెట్టారు.. క్రూరంగా ప్రవర్తించారు’ -
Mariyamma Lockup Death : సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక
అడ్డగూడూరు/చౌటుప్పల్: మరియమ్మ లాకప్‌డెత్ కేసుపై ఏసీపీ శ్యామ్‌ప్రసాద్ దర్యాప్తులో భాగంగా ఓఎస్డీ మల్లారెడ్డి శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరిపారు. స్టేషన్లో ఉన్న లాకప్ గదులు, సీసీ కెమెరాలను పరిశీలించారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రెండింటిని మరమ్మతు చేయించినా ఒకటే పనిచేస్తున్నట్లు ఇన్చార్జ్ ఎస్ఐ ఉదయ్‌కిరణ్ తెలిపారు. అలాగే.. హైకోర్టు ఆదేశాల మేరకు ఆలేరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎం.మణికంఠ శనివారం రాత్రి అడ్డగూడూర్ పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరిపారు. సీల్డ్ కవర్లో తన నివేదికను హైకోర్టుకు అందజేయనున్నారు. మరోవైపు.. చౌటుప్పల్ పోలీస్ సబ్ డివిజన్ ఏసీపీ సత్తయ్యను రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ కమిషనర్ మహేశ్ భగవత్ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపాలు -
అమ్మను చిత్రహింసలు పెట్టారు.. ఒళ్లంతా వాచిపోయింది’
-
‘మా కళ్లముందే అమ్మను చిత్రహింసలు పెట్టారు.. క్రూరంగా ప్రవర్తించారు’
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: ‘‘మా కళ్లముందే అమ్మను విచక్షణారహితంగా చితకబాదారు. పోలీసుల దెబ్బలు తట్టుకోలేకే అమ్మ చనిపోయింది. ఇలాంటి అన్యాయం ఏ కుటుంబానికి జరగొద్దు’’ అంటూ మరియమ్మ కూతుళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అని కూడా చూడకుండా తమ తల్లిని ఇష్టారీతిన చిత్రహింసలకు గురిచేసి చంపేశారని కన్నీళ్లుపెట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ముకుందాపురం గ్రామానికి చెందిన మరియమ్మ (40) యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో దెబ్బలు తాళలేక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం విదితమే. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ లాకప్‌డెత్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలో శుక్రవారం ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. మరియమ్మ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహం, 15 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇద్దరు కూతుళ్లకు పది లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాక్షితో టీవీతో మాట్లాడిన మరియమ్మ కూతుళ్లు తమ తల్లి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘వంట మనిషిగా పనిచేసేందుకు అమ్మ వెళ్లింది. రెండు నెలల పాటు అంతా బాగానే ఉంది. తమ్ముడు నా దగ్గరే ఉండేవాడు. ఒకసారి.. అమ్మను చూడబుద్ధి అవుతోందని.. అమ్మకాడికి పోయి చూసి వచ్చిండు. రెండోసారి.. వెంబడి తన ఫ్రెండును పట్టుకుని పోయిండు. అప్పుడు.. యజమాని.. ఇంట్లో బీరువా గెలికినట్లు ఉందని అడిగారట. ఆ తర్వాత ఫాదర్ మాకు ఫోన్ చేసి.. రెండు లక్షలు పోయాయి. మీ అమ్మవాళ్లు ఇట్లా చేశారని చెప్పారు. అమ్మా వాళ్లు అట్లా చేయరని ఫాదర్ అని చెప్పాను. సర్లే అన్నారు. ఆయన కూడా బాగానే ఉన్నారు. అమ్మ మీద బాగా నమ్మకం. వారం టైం కూడా ఇచ్చారు. ఆ తర్వాత కేసు బెట్టంగనే పోలీసులు.. తమ్ముడిని, తన ఫ్రెండ్‌ను తీసుకునిపోయి ఘోరంగా కొట్టారంట. తమ్ముడి దగ్గర అసలేమీ లేవు. రెండోరోజు దెబ్బలు తట్టుకోలేక.. ఒకవేళ ఆడామె పేరు చెప్పినా వదిలిపెడతారేమో అనే ఆలోచనతోని, నా తల్లి మీద నెట్టారండి. ఏ పాపమైనా ఆమెకే తెలుసని అమ్మ మీదకు నెట్టేశారు. వాళ్లను అలా కొడుతుంటే అమ్మ ఏం మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత నన్ను అడిగారు. ఏదైనా తెలిస్తే చెప్పమన్నారు. నాకేమీ తెలియదన్నాను. నేనే తప్పు చేయనపుడు ఎవరికీ భయపడను అని చెప్పాను. మీరెక్కడికి తీసుకెళ్లినా వస్తాను. నా దగ్గరైతే డబ్బు లేదని అమ్మ కూడా చెప్పింది. దీంతో.. వీళ్లంతా డ్రామాలు చేస్తున్నారని చెప్పి నన్ను కూడా వ్యాన్ ఎక్కించి చింతకాని తీసుకువెళ్లారు. బాగా కొట్టారు సార్. ఎంత క్రూరంగా అంటే అంత క్రూరంగా హింస పెట్టారు సార్ అమ్మను. అమ్మ ఒళ్లైతే ఇంత ఎత్తున వాచిపోయింది. నా కళ్లముందే నా తల్లిని చిత్రహింసలు పెడుతుంటే తట్టుకోలేకపోయానండి. నా పసిపిల్లను ఎత్తుకుని పోయిన. వాళ్లకు కొంచెం కూడా జాలిలేదు. మా ముందే అమ్మను ఘోరంగా కొట్టారు’’ అంటూ మరియమ్మ చిన్నకూతురు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక పెద్దకూతురు మాట్లాడుతూ.. ‘‘మా అమ్మను మీకు అప్పజెప్పాం. అట్లనే తెచ్చియండి అని బాగా ఏడ్చినం. మీ వాళ్లను రప్పించుకోమని చెప్పారు. హార్ట్ ఎటాక్‌లాగా వచ్చింది ఆస్పత్రికి తీసుకెళ్లాం అన్నారు. భువనగిరి వెళ్లేసరికి డెడ్‌బాడీ చూపించారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: Addagudur Lockup Death: సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు -
అడ్డగూడూరు లాకప్‌డెత్ కేసు: సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మరియమ్మ లాకప్‌డెత్‌పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అవసరమైతే ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా... మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు.. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో 10 లక్షల రూపాయల ఆర్థికసాయం అందించాలని ఆదేశించారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో దెబ్బలు తాళలేక మరియమ్మ అనే మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం విదితమే. ఖమ్మం జిల్లా ముకుందాపురం గ్రామానికి చెందిన మరియ (40) తన కుమారుడు ఉదయ్‌తో కలసి రెండు నెలల నుంచి వంట మనిషిగా పని చేసేవారు. ఈ క్రమంలో ఈ నెల 15న ఆమె పనిచేస్తున్న యజమాని ఇంట్లో సుమారు రూ.2 లక్షలు చోరీకి గురికాగా.. ఆయన అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా తల్లి, కుమారుడిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టగా, దెబ్బలకు తాళలేక మరియమ్మ స్పృహ తప్పి పడిపోయారు. చికిత్స నిమిత్తం మండలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోవడంతో, అక్కడి నుంచి వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి ఆమె మృతి చెందారు. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. చదవండి: ‘మరియమ్మ కుటుంబానికి రూ.5కోట్ల పరిహారం ఇవ్వాలి’ -
లాకప్‌డెత్ కేసు: అవసరమైతే రీపోస్ట్‌మార్టం చేయండి:హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అడ్డగూడురు లాకప్‌డెత్‌పై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. మరియమ్మ మృతిపై జ్యుడీషియల్ విచారణ జరపాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు. పోలీసుల వేధింపుల వల్లే మరియమ్మ మరణించారని పిటిషనర్ ఆరోపించారు. మరియమ్మ కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. పిటీషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా, అడ్డగూడురు లాకప్‌డెత్‌పై రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులను ఆయన సస్పెండ్ చేశారు.అడ్డగూడురు ఎస్సై మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యలపై వేటు వేశారు. లాకప్‌డెత్‌పై మల్కాజిగిరి ఏసీపీ విచారణ విచారణ చేస్తారని ఆయన ఆదేశాల్లో తెలిపారు. అడ్డగూడురు పోలీస్‌స్టేషన్‌లో 3 రోజుల క్రితం మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. మరియమ్మ మృతిపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. అవసరమైతే రీపోస్ట్‌మార్టం చేయండి: హైకోర్టు అడ్డగూడూరు లాకప్‌డెత్‌పై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారించింది. ఈ కేసులో న్యాయ విచారణకు ఆదేశించింది. లాకప్‌డెత్‌పై విచారణ జరపాలని ఆలేరు మేజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే రీపోస్ట్‌మార్టం జరపాలని హైకోర్టు సూచించింది. పీఎస్‌లో సీసీ కెమెరాలు లేకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. చదవండి: అడ్డగూడూరు ఠాణాలో మహిళ లాకప్‌డెత్? -
అడ్డగూడూరు ఠాణాలో మహిళ లాకప్‌డెత్?
అడ్డగూడూరు: పోలీసు దెబ్బలు తాళలేక ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. పోలీసులు అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది ముమ్మాటికి లాకప్‌డెత్ అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని గోవిందాపురం గ్రామానికి చెందిన చర్చి ఫాదర్ బాలస్వామి ఇంట్లో ఖమ్మం జిల్లా ముకుందాపురం గ్రామానికి చెందిన మరియ (40) తన కుమారుడు ఉదయ్‌తో కలసి రెండు నెలల నుంచి వంట మనిషిగా పని చేస్తోంది. ఈ నెల 15న బాలస్వామి ఇంట్లో సుమారు రూ.2 లక్షలు చోరీకి గురయ్యాయి. దీంతో ఆయన అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటికే స్వగ్రామానికి వెళ్లిపోయిన మరియ, ఉదయ్‌ను పోలీసులు విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారితో పాటు ఉదయ్ స్నేహితుడు శంకర్ వచ్చాడు. విచారణలో భాగంగా తల్లి, కుమారుడిని పోలీసులు విచక్షణారహితంగా కొడుతుండగా శంకర్ అడ్డుకునేందుకు యత్నించారు. అయితే.. అతన్ని కూడా వదలలేదు. దెబ్బలు తాళలేక మరియ స్పృహ తప్పి పడిపోవడంతో చికిత్స నిమిత్తం ఆమెను మండలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో పోలీసులు ఆమెను వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. తీవ్రంగా గాయపడిన ఉదయ్, శంకర్ భువనగిరి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.కాగా, కేసును నీరుగార్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: మంచిర్యాలలో తల్లీకూతుళ్ల హత్య -
బైక్ కోసం టవరెక్కాడు..
సాక్షి,అడ్డగూడూరు : తల్లిదండ్రి తనకు వెంటనే బైక్ కొనివ్వాలని ఓ యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ సృష్టించాడు. ఈ ఘటన మండల పరిధిలోని మానాయికుంటలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సయ్య కుమారుడు బోడ నరేష్ వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. బైక్ కొనివ్వాలని కొంతకాలంగా తల్లిదండ్రిని వేధిస్తున్నాడు. వారు అందుకు ఒప్పుకోకపోవడంతో మన్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే గ్రామ పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. తనకు బైక్ కొనివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిం చాడు. గమనించిన సమీప రైతులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు అక్కడికి చేరుకుని నరేష్‌ను నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు. దీంతో తండ్రి నర్సయ్య కలుగజేసుకుని బైక్ కొనిస్తామని హామీ ఇవ్వడంతో కిందికి దిగివచ్చాడు. -
‘పల్లె వెలుగులు’ ఏవీ?
సాక్షి, అడ్డగూడూరు : మండల కేంద్రంతో పాటుగా మండల పరిధిలోని వివిధ గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పల్లెవెలుగు బస్సులు పల్లెలకు కాకుండా పట్టణాలకే పరిమితమవుతున్నాయి. దీంతో పల్లె ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యంలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకు తప్పని తిప్పలు మండలం నుంచి ప్రజలు, విద్యార్థులు మోత్కూర్, నల్లగొండ, భువనగిరి, హైదరాబాద్, తిరుమలగిరి, సూర్యాపేట, జనగాం, తొర్రూరు, వరంగల్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే సరియైన బస్సు సౌకర్యం లేకపోవడంతో వారు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. పల్లెలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఆటోల కోసం పడిగాపులు కాస్తుంటారు. లేదంటే కాలినడకనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక వర్షాకాలంలో ప్రయాణికుల బాధలు వర్ణణాతీతం. గ్రామాల స్టేజీల నుంచి గ్రామంలోకి వర్షంలోనే నడుచుకుంటూ రావాల్సి వస్తోంది. ఆటోలే శరణ్యం.. గ్రామాలు బాగుపడాలంటే ఆ గ్రామాల్లో ప్రధానంగా రోడ్డు, రవాణా సౌకర్యం ఉండాలి. ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి మధ్య అనుసంధానం చేసేది రవాణా వ్యవస్థనే. కానీ పాలకుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం వల్ల మండలంలోని చాలా గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేదు. బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఆటోలను నమ్ముకుని ప్రయాణించాల్సి వస్తోంది. బస్సు సౌకర్యం లేని గ్రామాలు మండలంలోని మొత్తం 17 గ్రామపంచాయతీలు ఉండగా కేవలం నాలుగు గ్రామాలకే బస్సు సౌకర్యం ఉంది. చౌళ్లరామారం, అడ్డగూడూరు, ధర్మారం, చిర్రగూడూర్, కంచనపల్లి, బొడ్డుగూడెం, కోటమర్తి, డి.రేపాక మంగమ్మగూడెం, గ్రామాలకు బస్సు సౌకర్యంలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గ్రామాలకు ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం కల్పించాలని పాలకులను వేడుకున్నా పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. అదేవిధంగా మండలంలోని ప్రతి గ్రామాల స్టేజీలవద్ద గ్రామం పేరు తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలి బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో వృద్ధులు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీవారు స్పందించి గ్రామాల్లో బస్సు సౌకర్యం కల్పించాలి. – తుప్పతి మధు, అడ్డగూడూరు -
విద్యార్థినులకు వైద్యపరీక్షలు
మోత్కూరు : రాష్ట్రీయబాల స్వస్త్ కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని అడ్డగూడూర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు డాక్టర్ ఆకవరం చైతన్యకుమార్ ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సోనోబర్సైదా, ఫార్మసిస్టు అన్నపూర్ణ, ఏఎన్ఎం లలిత, పాఠశాల వైస్‌ప్రిన్సిపాల్ రూప తదితరులు పాల్గొన్నారు.