‘మా కళ్లముందే అమ్మను చిత్రహింసలు పెట్టారు.. క్రూరంగా ప్రవర్తించారు’ | Addagudur Lockup Death: Mariyamma Daughter Explains How Police Beat Her | Sakshi
Sakshi News home page

‘అమ్మను చిత్రహింసలు పెట్టారు.. ఒళ్లంతా వాచిపోయింది’

Published Sat, Jun 26 2021 4:19 PM | Last Updated on Sat, Jun 26 2021 5:08 PM

Addagudur Lockup Death: Mariyamma Daughter Explains How Police Beat Her - Sakshi

దెబ్బలు తట్టుకోలేక.. ఒకవేళ ఆడామె పేరు చెప్పినా వదిలిపెడతారేమో అనే ఆలోచనతోని, నా తల్లి మీద నెట్టారండి.

సాక్షి, హైదరాబాద్‌/ఖమ్మం: ‘‘మా కళ్లముందే అమ్మను విచక్షణారహితంగా చితకబాదారు. పోలీసుల దెబ్బలు తట్టుకోలేకే అమ్మ చనిపోయింది. ఇలాంటి అన్యాయం ఏ కుటుంబానికి జరగొద్దు’’ అంటూ మరియమ్మ కూతుళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అని కూడా చూడకుండా తమ తల్లిని ఇష్టారీతిన చిత్రహింసలకు గురిచేసి చంపేశారని కన్నీళ్లుపెట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ముకుందాపురం గ్రామానికి చెందిన మరియమ్మ (40) యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో దెబ్బలు తాళలేక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం విదితమే. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ లాకప్‌డెత్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వినిపించాయి.

ఈ క్రమంలో శుక్రవారం ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. మరియమ్మ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహం, 15 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇద్దరు కూతుళ్లకు పది లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాక్షితో టీవీతో మాట్లాడిన మరియమ్మ కూతుళ్లు తమ తల్లి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘వంట మనిషిగా పనిచేసేందుకు అమ్మ వెళ్లింది. రెండు నెలల పాటు అంతా బాగానే ఉంది. తమ్ముడు నా దగ్గరే ఉండేవాడు. ఒకసారి.. అమ్మను చూడబుద్ధి అవుతోందని.. అమ్మకాడికి పోయి చూసి వచ్చిండు.

రెండోసారి.. వెంబడి తన ఫ్రెండును పట్టుకుని పోయిండు. అప్పుడు.. యజమాని.. ఇంట్లో బీరువా గెలికినట్లు ఉందని అడిగారట. ఆ తర్వాత ఫాదర్‌ మాకు ఫోన్‌ చేసి.. రెండు లక్షలు పోయాయి. మీ అమ్మవాళ్లు ఇట్లా చేశారని చెప్పారు. అమ్మా వాళ్లు అట్లా చేయరని ఫాదర్‌ అని చెప్పాను. సర్లే అన్నారు. ఆయన కూడా బాగానే ఉన్నారు. అమ్మ మీద బాగా నమ్మకం. వారం టైం కూడా ఇచ్చారు. ఆ తర్వాత కేసు బెట్టంగనే పోలీసులు.. తమ్ముడిని, తన ఫ్రెండ్‌ను తీసుకునిపోయి ఘోరంగా కొట్టారంట. తమ్ముడి దగ్గర అసలేమీ లేవు.

రెండోరోజు దెబ్బలు తట్టుకోలేక.. ఒకవేళ ఆడామె పేరు చెప్పినా వదిలిపెడతారేమో అనే ఆలోచనతోని, నా తల్లి మీద నెట్టారండి. ఏ పాపమైనా ఆమెకే తెలుసని అమ్మ మీదకు నెట్టేశారు. వాళ్లను అలా కొడుతుంటే అమ్మ ఏం మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత నన్ను అడిగారు. ఏదైనా తెలిస్తే చెప్పమన్నారు. నాకేమీ తెలియదన్నాను. నేనే తప్పు చేయనపుడు ఎవరికీ భయపడను అని చెప్పాను. మీరెక్కడికి తీసుకెళ్లినా వస్తాను. నా దగ్గరైతే డబ్బు లేదని అమ్మ కూడా చెప్పింది. దీంతో.. వీళ్లంతా డ్రామాలు చేస్తున్నారని చెప్పి నన్ను కూడా వ్యాన్‌ ఎక్కించి చింతకాని తీసుకువెళ్లారు. బాగా కొట్టారు సార్‌.

ఎంత క్రూరంగా అంటే అంత క్రూరంగా హింస పెట్టారు సార్‌ అమ్మను. అమ్మ ఒళ్లైతే ఇంత ఎత్తున వాచిపోయింది. నా కళ్లముందే నా తల్లిని చిత్రహింసలు పెడుతుంటే తట్టుకోలేకపోయానండి. నా పసిపిల్లను ఎత్తుకుని పోయిన. వాళ్లకు కొంచెం కూడా జాలిలేదు. మా ముందే అమ్మను ఘోరంగా కొట్టారు’’ అంటూ మరియమ్మ చిన్నకూతురు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక పెద్దకూతురు మాట్లాడుతూ.. ‘‘మా అమ్మను మీకు అప్పజెప్పాం. అట్లనే తెచ్చియండి అని బాగా ఏడ్చినం. మీ వాళ్లను రప్పించుకోమని చెప్పారు. హార్ట్‌ ఎటాక్‌లాగా వచ్చింది ఆస్పత్రికి తీసుకెళ్లాం అన్నారు. భువనగిరి వెళ్లేసరికి డెడ్‌బాడీ చూపించారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: Addagudur Lockup Death: సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement