చింతకాని: హైకోర్టు ఆదేశాల మేరకు అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో మృతిచెందిన మరియమ్మ మృతదేహానికి రీపోస్టుమార్టం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంలో, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు జ్యుడీషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ సమక్షంలో వరంగల్ రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందం, కాకతీయ మెడికల్ కళాశాల వైద్య బృందం శుక్రవారం రీ పోస్టుమార్టం నిర్వహించింది.
దొంగతనం కేసులో జూన్ 17వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసులు మరియమ్మతోపాటు ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్, అతని స్నేహితుడు వేముల శంకర్‌లను విచారణ పేరుతో గ్రామం నుంచి తీసుకెళ్లి కొట్టడంతో అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో మరియమ్మ మృతిచెందిన విషయం విదితమే.
దీంతో మరియమ్మ మృతిపై న్యాయ విచారణ చేపట్టాలని పౌరహక్కుల సంఘం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. మరియమ్మ లాకప్ డెత్ ఘటనపై న్యాయ విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆలేరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
జూన్ 18న మృతి చెందిన మరియమ్మ మృతదేహానికి అడ్డగూడూరు పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో మృతురాలి స్వగ్రామమైన కోమట్లగూ డెంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే న్యాయ విచారణలో భాగంగా గ్రామంలో పూడ్చిపెట్టిన మరియ మ్మ మృతదేహాన్ని 14 రోజుల తర్వాత వెలికితీసి ఆలేరు మేజిస్ట్రేట్ సమక్షంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మెజిస్ట్రేట్ మరియమ్మ ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లను విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment