తిరువణ్నామలై: తమిళనాడులో మరో లాకప్ డెత్ చోటుచేసుకుంది. దాన్ని కప్పిపుచ్చడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని, తమకు రూ.7 లక్షలు ఆఫర్ చేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఒప్పుకోవాలంటూ దాదాపు రోజంతా వెంట పడ్డారని చెప్పింది. తిరువణ్నామలై జిల్లాకు చెందిన తంగమణి (47)ని కల్తీ మద్యం అమ్ముతున్నాడంటూ ఏప్రిల్ 26న పోలీసులు అరెస్టు చేశారు. మర్నాడు అతను ఆస్పత్రిలో మరణించాడు. లాకప్‌లో పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం వల్లే చనిపోయాడని కుమారుడు దినకరన్ ఆరోపించాడు.
‘‘దీనిపై అల్లరి చేయొద్దని పోలీసులు బెదిరించారు. తక్షణం అంత్యక్రియలు పూర్తి చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం తెల్లవారుజాము దాకా మాతో బేరమాడారు. చివరికి రూ.7 లక్షలు ఇవ్వజూపారు’’ అని ఆరోపించాడు. తమకు డబ్బులొద్దని, తండ్రి మరణానికి కారకులైన పోలీసులపై కేసు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశాడు. దీనిపై విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే చెన్నైలో లాకప్ డెత్ జరగ్గా బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు పరిహారమిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment