40కి చేరుకున్న మరణాలు
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 116 మంది
విచారణకు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో కమిటీ వేస్తున్నామన్న సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణపురం ప్రాంతం కల్తీ మద్యం బాధితుల రోదనలతో ప్రతిధ్వనిస్తోంది. కల్తీ మద్యం కాటుకు బలైన వారి సంఖ్య 18 నుంచి గురువారం 40కి చేరుకుంది. ఆస్పత్రుల పాలైన బాధితుల సంఖ్య 116కు పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ చెప్పారు.
కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోవడం, పెద్ద సంఖ్యలో బాధితులు ఆస్పత్రి పాలైన ఘటన తనకు తీవ్ర వేదన కలిగించిందని సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారని సీఎం చెప్పారు. ఎక్కువ శాతం మిథనాల్ కలిపిన సారాయి తాగడం వల్లే మరణాలు సంభవించినట్లు తేలిందన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు చొప్పున సాయం అందజేస్తామని ప్రకటించారు. పెద్ద సంఖ్యలో సంభవించిన మరణాలకు కారణాలను కనుగొనడంతోపాటు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ బి.గోకుల్‌దాస్ సారథ్యంలో ఏకసభ్య కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు.
16 మంది పరిస్థితి విషమం
బుధవారం తమ ఆస్పత్రిలో చేరిన 19 మంది కల్తీ మద్యం బాధితుల్లో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. జిప్మర్‌తోపాటు సేలం, కళ్లకురిచ్చి, విల్లుపురం ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 34 మంది పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. కల్లకురిచ్చి ఘటనపై సీబీసీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టి ఇప్పటి వరకు 200 లీటర్ల కల్తీ మద్యం పట్టుకున్నారు. అందులో ప్రమాదకర స్థాయిలో మిథనాల్ ఉన్నట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment