adulterated liquor
-
కల్తీ మద్యం తాగి.. 20 మంది మృతి
పట్నా: బిహార్‌లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. మంగళవారం రాత్రి బిహార్‌లోని సివాన్, సారణ్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగిన పలువురు తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించగా.. బుధవారం నాటికి మృతుల సంఖ్య 6కు చేరింది. అయితే ఇవాళ మృతుల సంఖ్య 20కి చేరిందని ఎస్పీ శివన్ అమితేష్ కుమార్ వెల్లడించారు.#UPDATE | Bihar: The death toll in Siwan, Bihar after consuming illicit liquor, rises to 20: SP Siwan Amitesh Kumar https://t.co/GhfIE9961h— ANI (@ANI) October 17, 2024 భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లోని భగవాన్‌పూర్ ఎస్హెచ్ఓ, ప్రొహిబిషన్ ఏఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇంకా.. పలువురు కల్తీ మద్యం బాధితులకు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. సుమారుగా 73 మందికి పైగా కల్తీ మద్యం తాగినట్లు తెలుస్తోంది. -
తమిళనాట 50కి చేరిన మద్యం మృతులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం మరో 10 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 50కి చేరాయి. అలాగే, సారా తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న మరో ఇద్దరు కూడా మరణించడంతో ఆ సంఖ్య 50ని దాటింది. అయితే, వీరి మరణంపై అధికారులు విచారణ చేపట్టారు. దీంతోపాటు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కల్తీ సారా మరణాల ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. దద్దరిల్లిన అసెంబ్లీ కళ్లకురిచ్చి ఉదంతంపై శుక్రవారం అసెంబ్లీ దద్దరిల్లింది. విపక్ష ఏఐఏడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. కల్తీ మద్యం తాగి 50 మంది వరకు మృతి చెందడంపై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారంటూ స్పీకర్ అప్పావు వారిని మార్షల్స్‌తో బయటకు పంపించి వేశారు. ఈ ఆందోళనల్లో ఏఐఏడీఎంకేలోని మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గం సభ్యులు పాల్గొనక పోవడం గమనార్హం. -
తమిళనాట కల్తీ మద్యం కాటు..
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణపురం ప్రాంతం కల్తీ మద్యం బాధితుల రోదనలతో ప్రతిధ్వనిస్తోంది. కల్తీ మద్యం కాటుకు బలైన వారి సంఖ్య 18 నుంచి గురువారం 40కి చేరుకుంది. ఆస్పత్రుల పాలైన బాధితుల సంఖ్య 116కు పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ చెప్పారు. కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోవడం, పెద్ద సంఖ్యలో బాధితులు ఆస్పత్రి పాలైన ఘటన తనకు తీవ్ర వేదన కలిగించిందని సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారని సీఎం చెప్పారు. ఎక్కువ శాతం మిథనాల్ కలిపిన సారాయి తాగడం వల్లే మరణాలు సంభవించినట్లు తేలిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు చొప్పున సాయం అందజేస్తామని ప్రకటించారు. పెద్ద సంఖ్యలో సంభవించిన మరణాలకు కారణాలను కనుగొనడంతోపాటు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ బి.గోకుల్దాస్ సారథ్యంలో ఏకసభ్య కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు.16 మంది పరిస్థితి విషమంబుధవారం తమ ఆస్పత్రిలో చేరిన 19 మంది కల్తీ మద్యం బాధితుల్లో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. జిప్మర్తోపాటు సేలం, కళ్లకురిచ్చి, విల్లుపురం ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 34 మంది పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. కల్లకురిచ్చి ఘటనపై సీబీసీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టి ఇప్పటి వరకు 200 లీటర్ల కల్తీ మద్యం పట్టుకున్నారు. అందులో ప్రమాదకర స్థాయిలో మిథనాల్ ఉన్నట్లు తేలింది. -
కల్తీ మద్యానికి అవకాశం లేకుండా విశాఖలో ఎక్సైజ్ లేబొరేటరీ
దొండపర్తి(విశాఖ దక్షిణ)/ఆనందపురం(భీమిలి) : కల్తీ మద్యాన్ని పరీక్షించేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ లేబోరేటరీని గురువారం డిప్యూటీ సీఎం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలగకుండా, కల్తీ మద్యానికి అవకాశం లేకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ల్యాబ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. ప్రజలకు మెరుగైన విద్య, ఆరోగ్యం, సంక్షేమం అందించడమే నిజమైన అభివృద్ధి అని, అదే సీఎం జగన్ సంకల్పమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులు చంద్రబాబును కోరినప్పటికీ.. ఆయన పట్టించుకోలేదని విమర్శించారు. ఇదిలా ఉండగా ఆనందపురం మండలం గోరింటలో రూ.20 కోట్లతో నిరి్మంచనున్న ఎక్సైజ్ శాఖ కాంప్లెక్స్, ఏపీఎస్‌బీసీఎల్ డిపో నిర్మాణ పనులకు నారాయణస్వామి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ బొమ్మ పెట్టుకుని జగన్ రాష్ట్రమంతా తిరిగి సీఎం అయ్యారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఫొటో పట్టుకుని తిరిగి లోకేశ్ ఒక్క సీటైనా గెలవాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఒక అవినీతి చక్రవర్తి అని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో రూ.1000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని, చంద్రబాబు అక్రమాలను రోడ్డు మీదకు లాగుతానని చెప్పిన దత్తపుత్రుడు పవన్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడని ప్రశి్నంచారు. తండ్రి చావుకు కారకుడైన బాబుకు పురందేశ్వరి వత్తాసు పలకడం హాస్యాస్పదం కల్తీ మద్యం తాగడం వల్లే విశాఖలో ఇద్దరు చనిపోయారని పురందేశ్వరి అన్న వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన మండిపడ్డారు. కల్తీ మద్యం కారణంగానే ఎవరైనా చనిపోయారని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. తండ్రి చావుకు కారణమైన బాబుకు పురందేశ్వరి వత్తాసు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మార్గదర్శి అక్రమాలపై విచారణ జరుపుతున్నందుకే ఈనాడులో రామోజీరావు తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమాల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్, నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్ కోలా గురువులు, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి తదితరులున్నారు. -
నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపుతాం
హైదరాబాద్: రాష్ట్రంలో కల్తీ మద్యం సరఫరాను ఉక్కుపాదంతో అణచివేస్తామని, ఇందులో ఎంతటి వారి ప్రమేయమున్నా వదిలి పెట్టేది లేదని రాష్ట్ర ఎక్సైజ్, ప్రొబేషనరీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీస్టేషన్లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అసలు మద్యానికి ఏమాత్రం తేడా లేకుండా స్టిక్కర్లు, బాటిళ్లు, కార్టన్లు తీసుకుని వెళ్లి స్కాన్ చేసినా బయటపడని విధంగా ఒడిశాలోని కటక్ జిల్లా అభయ్‌పూర్ అటవీ ప్రాంతంలో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారని తెలిపారు. దొరికిన ఒక బాటిల్ ఆధారంగా కేవలం నాలుగు రోజుల్లోనే రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో పోలీసులు డొంకంతా కదిలించారని అభినందించారు. -
ఏడు లక్షలిస్తాం... ఏం మాట్లాడొద్దు
తిరువణ్నామలై: తమిళనాడులో మరో లాకప్ డెత్ చోటుచేసుకుంది. దాన్ని కప్పిపుచ్చడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని, తమకు రూ.7 లక్షలు ఆఫర్ చేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఒప్పుకోవాలంటూ దాదాపు రోజంతా వెంట పడ్డారని చెప్పింది. తిరువణ్నామలై జిల్లాకు చెందిన తంగమణి (47)ని కల్తీ మద్యం అమ్ముతున్నాడంటూ ఏప్రిల్ 26న పోలీసులు అరెస్టు చేశారు. మర్నాడు అతను ఆస్పత్రిలో మరణించాడు. లాకప్‌లో పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం వల్లే చనిపోయాడని కుమారుడు దినకరన్ ఆరోపించాడు. ‘‘దీనిపై అల్లరి చేయొద్దని పోలీసులు బెదిరించారు. తక్షణం అంత్యక్రియలు పూర్తి చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం తెల్లవారుజాము దాకా మాతో బేరమాడారు. చివరికి రూ.7 లక్షలు ఇవ్వజూపారు’’ అని ఆరోపించాడు. తమకు డబ్బులొద్దని, తండ్రి మరణానికి కారకులైన పోలీసులపై కేసు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశాడు. దీనిపై విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే చెన్నైలో లాకప్ డెత్ జరగ్గా బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు పరిహారమిచ్చింది. -
హోలీ విషాదం: కల్తీ మద్యానికి ఆరుగురి మృతి
పాట్నా: కల్తీ మద్యం కాటుకు బిహార్‌లో ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. కల్తీ మద్యం తాగి కొందరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిలో 24 గంటల్లో ఆరుగురి పరిస్థితి విషమించి మృతిచెందారు. హోలీ రోజు సరదాగా మద్యం తాగగా.. వారి ప్రాణం మీదకు వచ్చింది. ఈ ఘటనలు నవాడ జిల్లా ఖరిడి బిఘా, గుండాపూర్ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 29న హోలీ పండుగ సందర్భంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన రామ్‌దేవ్ యాదవ్, అజయ్ యాదవ్, దినేశ్, శైలేంద్ర యాదవ్, లోహ సింగ్, గోపాల్ కుమార్ వేర్వేరుగా మద్యం కొన్నారు. పండుగ ఆనందంలో వారు ఇతరులతో కలిసి మద్యం సేవించారు. అయితే సేవించిన అనంతరం వారి కళ్లు తిరిగాయి. స్పృహ కోల్పోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఈ విధంగా ఒకేరోజు ఆరు మందికి కావడంతో స్థానికంగా కలకలం రేపింది. ఆ దుకాణంలో మద్యం తీసుకున్న వారందరికీ ఆ విధంగా అయ్యిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు బిగుసరాయి ప్రాంతంలో కూడా ఇద్దరు కల్తీ మద్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. మద్యపానం నిషేధం విధించిన రాష్ట్రంలో ఏవిధంగా మద్యం ఏరులై పారుతోందని ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ప్రశ్నించింది. కల్తీ మద్యం తాగి ప్రజలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేసింది. వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై మంత్రి శ్రవణ్ కుమార్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాని తెలిపారు. -
కల్తీ కల్లు కలకలం, 100 మందికిపైగా అస్వస్థత
సాక్షి, వికారాబాద్: వికారాబాద్‌లో కల్తీ కల్లు కలకలం రేపింది. కృత్రిమ కల్లు తాగి రెండు గ్రామాల్లో దాదాపు 100కి మంది పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. వివరాల్లోకెళ్తే.. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం చిట్టిగిద్ద గ్రామంలో తయారు చేస్తున్న కృత్రిమ కల్లును మండల పరిధిలోని నవాబ్ పేట్, అర్కతల, వట్టిమీనపల్లి, ఎక్ మామిడి, కేశపల్లి, తిమ్మారెడ్డి పల్లి, మమ్దాన్పల్లి, వికారాబాద్ మండలం కొత్తగడి, నారాయణపూర్, ఎర్రవళ్లి, పాతూర్, కామరెడ్డిగూడ, పులుసుమామిడి గ్రామాలకు డీసీఎంలో గత కొంత కాలంగా సరఫరా చేస్తున్నారు. అయితే ఎప్పటి మాదిరిగానే శుక్రవారం కూడా కల్లు సరఫరా చేశారు. కల్లు సేవించిన వారిలో వికారాబాద్, నవాబ్‌పేట్ మండలాకు చెందిన దాదాపు 100 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చిట్టిగిద్దకు చెందిన ప్యాట రాములు(65) పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిని వారివారి బంధువులు నవాబ్‌పేట్, వికారాబాద్ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు గ్రామానికి చేరుకొని అస్వస్థతకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. బాధిత కుటుంబాలను వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, చేవేళ్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాలే యాదయ్యలు పరామర్శించారు. -
మహబూబ్‌నగర్‌లో కల్తీ కల్లు కలకలం
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. ఆలూరు కల్తీ కల్లు తాగిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకటేష్, ఖాసీం మృతి చెందారు. మరో వ్యక్తి శ్రీనివాస్ చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కల్తీ మద్యం: 86కి చేరిన మృతుల సంఖ్య
చండీగఢ్ : పంజాబ్‌లో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 86కు చేరింది. శుక్రవారం రాత్రి వరకు తార్న్‌తరన్‌లో 19, అమృత్‌సర్‌లో 11, బాటాల జిల్లాలో 9 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శనివారం తార్న్‌తరన్‌లో మరో 44 మంది, అమృత్‌సర్‌లో ఒకరు, బాటాల జిల్లాలో ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 86కు చేరుకుంది. కల్తీ మద్యం కేసులో పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. కల్తీ మద్యాన్ని అరికట్టడంతో విఫలమైన ఏడుగురు ఎక్సైజ్ అధికారులు, ఆరుగురు పోలీసులను ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సస్పెండ్ చేశారు. బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని ప్రకటించారు. -
కల్తీ మద్యం తాగి 14 మంది మృతి
బారాబంకీ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో కల్తీ మద్యం తాగి 14 మంది మృతిచెందారు. మరో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి రామ్‌నగర్‌లో ఈ ఘటన జరిగిందని, మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు యూపీ ప్రభుత్వం ఆదేశించింది. రాజకీయ కుట్ర కోణంలోనూ విచారించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. 10మంది ఎౖసజ్ అధికారులను, ఇద్దరు కానిస్టేబుళ్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బాధిత కుటుంబాలకు సీఎం 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై అన్నికోణాల్లోనూ విచారించాలని, 48 గంటల్లోగా నివేదిక అందించాలని సీఎం కోరినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. రాణీగంజ్, దాని పరిసర ప్రాంతాల ప్రజలు సోమవారం రాత్రి రామ్‌నగర్ ప్రాంతంలోని ఓ దుకాణంనుంచి మద్యం కొనుగోలు చేశారని, మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతతో స్థానిక ఆసుప్రతిలో చేరారు. బాధితులకు దగ్గరలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పోలీస్ సర్కిల్ ఆఫీసర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో సహా బారాబంకీ జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఐదుగురు కానిస్టేబుళ్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారని, అధికారుల పాత్రపై పూర్తి దర్యాప్తు చేపట్టాలని, వారి నిర్లక్ష్యం ఉంటే తీవ్రమైన చర్యలకు వెనుకాడవద్దని ఆదేశించినట్టు ఒక సీనియర్ అధికారి తెలిపారు. కాగా, గతంలో రాజకీయ కుట్ర కోణంలో ఇటువంటి సంఘటనలు జరిగాయని, ఉన్నత స్థాయి దర్యాప్తు బృందం ఈ దిశలోనూ విచారణ చేపట్టనున్నారు. -
గ్లాస్లో మందు పడకముందే.. సీసాలోనే మిక్సింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘బ్రాండ్ మిక్సింగ్’ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. మద్యం షాపులు, బార్లలో అమ్ముతున్న బ్రాండ్లలో చీప్ లిక్కర్ కలిపి విక్రయిస్తున్నారు. రెండ్రోజుల కిందట రాజధాని ప్రాంతం విజయవాడలోని బార్లలో భారీగా ‘బ్రాండ్ మిక్సింగ్’ కేసులు పట్టుబడ్డాయి. ఈ విషయాన్ని ఎక్సైజ్‌శాఖ అధికారులు గోప్యంగా ఉంచారు. దసరా సందర్భంగా పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరగనున్నందున బార్లలో బ్రాండ్ మిక్సింగ్‌కు పాల్పడుతున్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, ముఖ్య పట్టణాల్లోని బార్లలో ఈ బాగోతం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే విజయవాడ, గుంటూరు నగరాల్లో జరుగుతున్న ఈ తతంగం గురించి ఎక్సైజ్ అధికారులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. మద్యం షాపుల్లో, బార్లలో బ్రాండ్ మిక్సింగ్‌పై ఎక్సైజ్ కమిషనర్‌కు ఫిర్యాదులందడంతో ఇటీవలే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కమిషనర్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. గుంటూరు, ఉయ్యూరు, విజయవాడలో మద్యం దుకాణాలు, ఎక్సైజ్ స్టేషన్లలో తనిఖీలు చేశారు. కమిషనర్ తనిఖీ చేసిన నాలుగు రోజుల వ్యవధిలోనే విజయవాడలో బ్రాండ్ మిక్సింగ్ కేసులు పట్టుబడ్డాయి. అయితే మద్యం షాపుల్లో అక్రమాలు జరిగినా.. వాటి జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని మంత్రులే అధికారులను బెదిరిస్తుండటంతో వారు తనిఖీలను అటకెక్కించారు. ఎక్సైజ్ అధికారుల సహకారంతోనే.. బెల్టు షాపులు, ఎమ్మార్పీ ఉల్లంఘనలతో మద్యం ప్రియుల్ని దోచుకుంటున్న సిండికేట్లు.. జనం ప్రాణాలతో చెలగాటమాడేలా కల్తీ మద్యాన్ని విక్రయిస్తుండటం కలకలం రేపుతోంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి ఆ తర్వాత పట్టించుకోకపోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఈ ఏడాది గుంటూరు, విజయవాడలలో వరుసగా కల్తీ మద్యం ఘటనలు వెలుగు చూశాయి. కల్తీ మద్యం తయారీ కేంద్రాలను ఎక్సైజ్ అధికారుల సహకారంతోనే నడుపుతున్నారని ఉన్నతాధికారుల విచారణలో తేలిన సంగతి తెలిసిందే. టాస్క్‌ఫోర్సుని నిర్వీర్యం చేసిన సర్కారు మద్యం వ్యాపారులు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్), కల్తీ మద్యం అమ్మకాలు చేపట్టినా, బెల్టు షాపులు నడిపినా ఎక్సైజ్ సేŠట్ట్ టాస్క్ఫోర్సు దాడులు చేసి వీటిని అడ్డుకోవాలి. స్టేట్ టాస్క్ఫోర్సు యూనిట్‌కు ఓ సీనియర్ ఐజీ స్థాయి అధికారిని నియమించి తరచూ దాడులు నిర్వహించాలి. అయితే రెండు నెలల కిందట ఎస్టీఎఫ్ డైరెక్టర్‌ను బదిలీ చేసి ఇంతవరకు ఆ పోస్టులో ఎవ్వర్నీ నియమించలేదు. మద్యం సిండికేట్ల అక్రమ వ్యాపారం కోసం సర్కారు ఎస్టీఎఫ్ డైరక్టర్‌గా సీనియర్ ఐపీఎస్‌ను నియమించలేదని ఎక్సైజ్ వర్గాల్లోనే ప్రచారం జరగడం గమనార్హం. చీప్ లిక్కర్ విక్రయాలు గతేడాదికి 80 లక్షల కేసులకు చేరింది. అంతకు ముందు ఏడాది 40 లక్షల చీప్ లిక్కర్ కేసులు అమ్ముడయ్యాయి. ఏడాదికేడాదికి వంద శాతం చీప్ లిక్కర్ అమ్మకాలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఏడాదికేడాది 10 శాతం వరకే అమ్మకాలు పెరగాలి. అయితే ఏకంగా వంద శాతం అమ్మకాలు పెరుగుతుండటంతో మద్యం వ్యాపారులు చీప్ లిక్కర్‌ను మీడియం, అంతకంటే పెద్ద బ్రాండ్లలో కలుపుతున్నారని ఎక్సైజ్æ కమిషనరే స్వయంగా అంతర్గత సమావేశంలో వ్యాఖ్యానించారంటే.. ఇక క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. విజయవాడలో పట్టుబడిన డైల్యూషన్, బ్రాండ్ మిక్సింగ్ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బ్రాండ్ మిక్సింగ్ అంటే.. బ్రాండ్ మిక్సింగ్ అంటే.. చీప్ లిక్కర్‌ను మీడియం లిక్కర్, అంతకంటే పెద్ద బ్రాండ్లలో కలుపుతారు. ఒక బ్రాండ్, మీడియం బ్రాండ్‌లోని బాటిళ్లలో సగం పరిమాణం మద్యాన్ని తీసేసి.. చీప్ లిక్కర్‌ను కలుపుతారు. ఈ విధానం ఎక్కువగా బార్లలో జరుగుతోంది. దీంతో పాటు లిక్కర్ డైల్యూషన్ కూడా ఎక్కువగా జరుగుతుందని ఎక్సైజ్ ఉన్నతాధికారులే అంగీకరిస్తున్నారు. -
కల్తీమయం!
అచ్చంపేట రూరల్ : కొన్ని సంవత్సరాలుగా నల్లమల ప్రాంతంలో కల్తీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. వివిధ శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు ఇస్తూ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగించారు. గత పదేళ్లుగా మద్యం వ్యాపారంలో బాగా రాటుదేలిన నాయకులే దీనికి సూత్రధారులుగా ఉన్నారని తెలుస్తోంది. గతంలో అమ్రాబాద్ మండలంలో జోరుగా కల్తీ మద్యం వ్యాపారం కొనసాగగా.. ఆ ప్రాంతంలో వైన్సులను లాటరీ పద్ధతిన దక్కించుకున్న వారు విచ్చలవిడిగా మద్యం కల్తీ చేసి అమ్మకాలు సాగించారు. రెండుసార్లు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు. మద్యాన్ని అధిక రేట్లకు అమ్ముతున్నారని మరోసారి కేసు చేశారు. అయితే అప్పట్లో లైసెన్స్ ఉండటంతో మద్యాన్ని కల్తీ చేసి అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకున్నారు. అలవాటు పడిన వారు వైన్సులు.. లైసెన్సు లేకున్నా అదే తరహాలో మద్యం కల్తీ చేసి వైన్స్‌లకు చేరవేస్తున్నారు. కూతవేటు దూరంలోనే.. గతంలో అమ్రాబాద్ ప్రాంతంలో మద్యం కల్తీ చేసిన వారు, లైసెన్స్‌లు దక్కని వారు ప్రస్తుత సంవత్సరం నుంచి అచ్చంపేట పట్టణాన్ని ఎంచుకుని మద్యం కల్తీ చేసి అమ్రాబాద్, పదరతోపాటు వివిధ వైన్సులకు చేరవేస్తున్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ ఇంటిలో గుట్టుగా మద్యం కల్తీ వ్యాపారం సాగుతుందని స్థానికులు చెబుతున్నారు. అచ్చంపేటలో ఎక్సైజ్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే మద్యం కల్తీ దందా జరగడం గమనార్హం. అయినా ఇన్ని రోజులు స్థానిక ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మామూళ్ల విషయంలో తేడా వచ్చినందుకే ఇప్పుడు దాడులు జరిపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓసీ, ఎంసీలతో.. బ్రాండెడ్ అమ్రాబాద్ మండలానికి చెందిన వెంకట్రామ్నాయక్ గతంలో ఇదే మండలంలో వైన్సు షాపును దక్కించుకున్నారు. అప్పట్లో నకిలీ మద్యం తయారు చేసి వైన్‌షాపులో అమ్మినట్లు రెండు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ఏడాది మద్యం షాపు దక్కించుకోని వెంకట్రామ్నాయక్ అచ్చంపేట, వివిధ ప్రాంతాల్లో తక్కువ ధరకు చెందిన ఓసీ, ఎంసీ లాంటి కొన్ని మద్యం బాటిళ్లను షాంపిల్‌గా తీసుకుని, అధిక రేట్లు ఉన్న బ్లెండర్‌స్పైడ్, సిగ్నేచర్, రాయల్ ఛాలెంజ్, రాయల్‌స్టాగ్ లాంటి ఖాళీ బాటిళ్లలో సగం మద్యం, సగం నీటిని నింపి బాటిళ్లపై మూతలను ఏర్పాటు చేసి వైన్ షాపులకు తరలిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఇదే తంతు చేస్తున్నాడని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం రాత్రి వెంకట్రామ్నాయక్ ఇంట్లో తనిఖీ చేయగా కల్తీ మద్యం తయారు చేసిన 5 కాటన్ల ఓసీ బాటిళ్లు, 15 లీటర్ల కల్తీ మద్యం బాటిళ్లు, ఖాళీ సీసాలు, వాటిపై బిగించే మూతలను గుర్తించారు. బెల్టుషాపులకు సరఫరా.. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు వెలిశాయి. మద్యం ఏరులై పారుతుంది. సాధారణ మద్యం నుంచి విలువైన మద్యం వరకు లభ్యమవుతుంది. ప్రతి ఫుల్ బాటిల్‌పై రూ.50 నుంచి రూ.150 వరకు అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ తయారు చేసిన కల్తీ మద్యాన్ని గ్రామాల్లోని బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు అమ్యామ్యాలకు ఆశపడి బెల్ట్‌షాపులపై దాడులు చేయడం లేదని, కేసుల కోసం మాత్రమే అప్పుడప్పుడు దాడులు చేసి ఉనికి చాటుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా నల్లమల ప్రాంతంలో కల్తీ మద్యం వ్యాపారం జరగకుండా, గ్రామాల్లో బెల్ట్‌షాపు లేకుండా, మద్యం అధిక రేట్లకు విక్రయించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మత్తులో కల్తీ చిచ్చు!
కనిగిరి: కల్తీ మద్యం మందుబాబుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీనికి కనిగిరి వేదికగా మారింది. ఇటీవల జరిగిన వరుస మరణాలు.. మంగళవారం టాస్క్ ఫోర్స్ దాడుల్లో దొరికిన కల్తీ మద్యం బాటిళ్లతో అక్రమార్కుల గుట్టు రట్టయింది. కనిగిరిలో నకిలీ మద్యంపై గత కొంతకాలంగా పుకార్లు హోరెత్తుతున్నాయి. దీనిపై స్థానిక ఎక్సైజ్ అధికారులను పలుమార్లు ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదని కల్తీ జరిగే ప్రసక్తే లేదంటూ బుకాయించారు. ఈ నేపథ్యంలో కనిగిరిలో మద్యం వ్యాపారుల అక్రమాలపై స్టేట్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులకు పక్కా సమాచారం అందింది. ఎక్సైజ్ శాఖ స్టేట్ డైరక్టర్ కె. వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు విజయవాడ ఎక్సైజ్ ఎస్సై సుబ్బిరెడ్డి, రామకృష్ణ టీం కనిగిరిలో దాడులు నిర్వహించి రెండు షాపుల్లో 175 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏకకాలంలో దాడులు.. పక్కా సమాచారంతో విజయవాడ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు కనిగిరిలో మకాం వేశారు. మండంలోని అడ్డరోడ్డు వద్దగల నందిని వైన్స్, హాజీస్ పురం వద్ద గల కళ్యాణి వైన్స్‌పై ఏకకాలంలో మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. నందిని వైన్స్‌లో విక్రయదారుడు రమణారెడ్డి అప్పుడే బ్రాండ్ మిక్సింగ్ (కల్తీ)చేసి అమ్మకానికి ఉంచిన 144 క్వార్టర్ బాటిళ్లను పట్టుకొని అదుపులోకి తీసుకుని విచారించారు. అదే సమయంలో హజీస్‌పురం కల్యాణి వైన్స్‌లో దాడులు చేయగా నౌకర్ నామ శివరాములు షాపులో కల్తీ మద్యం బాటిళ్లు విక్రయిస్తుండటంతో టాస్క్ ఫోర్స్ టీం దాడులు చేసి పట్టుకున్నారు. ఇతని వద్ద నుంచి 32 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మిక్సింగ్ ఇలా.. ఆఫీసర్ ఛాయిస్ బ్రాండ్ రూ. 100 కాగా, హెచ్డీ బ్రాండ్ రూ. 50 వరకు ఉంటుంది. అయితే అక్రమార్జనే ధ్యేయంగా మద్యం వ్యాపారులు బ్రాండ్ మిక్సింగ్‌కు పాల్పడుతున్నారు. ఖాళీ ఓసీ (ఆఫీసర్ ఛాయిస్) మద్యం బాటిళ్లలో హెచ్డీ మద్యం నింపుతారు. అంటే రూ. 50 ఖరీదైన మద్యం సీసాకు అక్రమంగా రూ. 100 వసూలు చేస్తున్నారు. మద్యం ప్రియులకు అనుమానం రాకుండా హెచ్డీ బాటిళ్లపై ఉండే హెచ్ఈఎల్సీల్ను అతికిస్తారు. దీంతో మద్యం మిక్సింగ్ జరిగిన బాటిల్‌గా ఎవరూ గుర్తించలేరు. బాటిల్ అంతా ఓసీగా ఉంటుంది. మూతలపై మాత్రం హెచ్డీ బ్రాండ్‌కు సంబంధించిన సీల్ ఉంటుంది. కేవలం ఎక్సైజ్ శాఖ వారి అధునాత పరికరాలతో ప్రత్యేక యాప్ కోడ్‌తో మాత్రే వాటిని గుర్తించడానికే వీలయ్యే పరిస్థితి నెలకొనడంతో అక్రమార్కులు రెచ్చిపొతున్నారు. ఆ ముగ్గురు? కల్తీ మద్యం వ్యాపారంలో ముగ్గురు వ్యాపారులు ప్రధాన పాత్రధారులుగా ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా కల్తీ మద్యం పట్టుబడిన షాపుల్లోని నిందులను పోలీసులు విచారించగా చెందిన ఓ యువ మద్యం వ్యాపారి పేరును వెల్లడించినట్లు తెలిసింది. తమ పాత్ర ఏమీ లేదని యువ వ్యాపారి ఆధ్వర్యంలో తంతు జరిగిన తర్వాతే తాము అమ్మకాలు జరుపుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ టీం విచారణలో వారు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. యువ వ్యాపారి భాగస్వామ్యంతో ఉన్న వైన్ షాపుల టాస్క్ ఫోర్స్ టీం ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. 10 వేల కేసుల్లో 5వేల కేసులు హెడీనే.. కనిగిరి ఎక్సైజ్ పరిధిలో 28 షాపుల్లో నెలకు 10వేల కేసులు (సుమారు రూ. 4కోట్లు) మేర వివిధ రకాల బ్రాండ్లు ( ఓసీ, ఐవీ, తదితరాలు) కొనుగోలు జరుగుతుంటే.. ఒక్క హెడీ బ్రాండే సుమారు 5వేల కేసులు అంటే సుమారు రూ. 1.50 కోట్ల కొనుగోలు జరుగుతున్నట్లు నివేదికలున్నాయి. అధికారులు మాత్రం తక్కువ రేటు మద్యం కాబట్టి లేబర్ ఎక్కువగా హెచ్డీ బ్రాండ్‌ను తాగుతున్నట్లు వెల్లడిస్తున్నా... అసలు తతంగం ఇదని తాజా దాడుల్లో బహిర్గతమైంది. రెండు నెలల్లో ఇద్దరు మృతి మద్యం మత్తులో గడిచిన రెండు నెలల్లో సుమారు 6 మంది వరకు చనిపోగా అందులో వెలుగులోకి వచ్చింది ఇద్దరి మరణాలే. గత నెలలో లాడేసాహెబ్ వీధికి చెందిన బాష(40) పూటుగా మద్యం తాగి షాపు సమీపంలోనే చనిపోయాడు. తాజాగా కోటి కూడా మద్యం మత్తులో అపస్మారక స్థితికి చేరి షాపు సమీపంలోనే చనిపోవడంతో బంధువులు ఆందోళన చేశారు. మద్యం మరణాల వెనుక కల్తీ విక్రయాలే కారణం అన్న ప్రచారం జరుగుతోంది. గత రెండేళ్లలో కనిగిరిలో మాత్రమే ఇలాంటి కేసులు దొరికాయని చెబుతున్నారు. జిల్లా స్థాయి ఎక్సైజ్ అధికారులు కనిగిరి పై ప్రత్యేక నిఘా పెట్టి విస్తృత దాడులు నిర్వహిస్తే మరిన్ని కల్తీ విక్రయాల కేసులు దొరికే అవకాశం లేక పోలేదు. మద్యం వ్యాపారుల అరెస్ట్ కనిగిరి: పట్టణంలోని రెండు మద్యషాపుల్లో కల్తీ చేసిన (బ్రాండ్ మిక్సింగ్)175 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ టాస్క్ ఫోర్స్ టీం అధికారులు పి. సుబిరెడ్డి, రామకృష్ణ తెలిపారు. కనిగిరి ఎక్సైజ్ సీఐతో కలిసి బుధవారం విలేకర్లతో మాట్లాడారు. మండలంలోని అడ్డరోడ్డులో గల నందిని వైన్స్‌లో సుమారు 144 మద్యం క్వార్టర్ ఓసీ బాటిళ్లు, హజీస్పురంలోని కల్యాణి వైన్స్‌లో 32 మద్యం క్వార్టర్ ఓసీ బాటిళ్లు స్వాధినం చేసుకున్నట్లు వెల్లడించారు. రూ. 50 విలువ చేసే మద్యం హెచ్డీ బ్రాండ్ క్వార్టర్ బాటిళ్లను ఊడదీసి.. అదే లిక్కర్‌ను రూ. 100 విలువ చేసే ఓసీ బ్రాండ్‌లోకి మార్చి మూతలకు హెచ్డీ బ్రాండ్ సీల్స్ అతికించి అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. షాపులైసెన్స్పై కొనగోలు చేసిన ఓసీ క్వార్టర్ బాటిళ్ల సంఖ్య కంటే నిల్వలు అధికంగా ఉన్నాయన్నారు, బ్రాండ్ మిక్సింగ్ చేసి ఓసీ ఖాళీ బాటిళ్లలో హెచ్డీ బ్రాండ్ లిక్కర్‌ను నింపారని తెలిపారు. షాపుల్లో ఖాళీ ఓసీ, హెచ్డీ క్వార్టర్ ఖాళీ బాటిళ్లు, కుయ్యనులు, బాటిల్ మూతలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రెండు షాపుల్లో కల్తీ విక్రయాలకు కారకులైన ఆరు మందిపై సెక్షన్ 34ఏ, 36, 37, బ్రాండ్ మిక్సింగ్కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రమణారెడ్డి, శివరాములును అరెస్ట్ చేశామని, లైసెన్స్ దారులు, నౌకర్ నామాలు వై . మాలకొండారెడ్డి, సుధాకర్‌రెడ్డి, వెంకటరెడ్డి, రామయ్యలను త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. ఆ రెండు షాపులు సీజ్ చేయనున్నట్లు తెలిపారు. మార్కాపురం ఈఎస్ రావిపాటి హనుమంతరావు, ఏఈఎస్ చంద్రశేఖరరెడ్డి, సీఐ వెంకట్రావ్ సిబ్బంది పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో కల్తీ మద్యం కలకలం
-
అమరవతిలో కుటీర పరిశ్రమగా కల్తీ మద్యం
-
కల్తీ మద్యం సేవించి వ్యక్తి మృతి
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని కాటారం మండలంలోని గుమ్మళ్లపల్లి గ్రామంలో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. బుధవారం సాయంత్ర కల్తీ మద్యం సేవించి పలువురు అస్వస్థతకు గురి కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఎర్రోళ్ల లాస్మయ్య(50) చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో ఆరుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన కాటారం ఎక్సైజ్ ఎస్సై శీలం రాజేశ్వరిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ మురళి ఆదేశాలు జారీచేశారు. -
కల్తీ బీర్లంటూ వైన్స్ ఎదుట ఆందోళన
► రూ.110కి విక్రయించాల్సిన బీరు రూ.60కే ► బీరు రుచిగా లేదనే అనుమానంతో.. ► శేరిగూడ ఆంజనేయ వైన్స్ వద్ద ఘటన ఇబ్రహీంపట్నంరూరల్: కల్తీ బీర్లు అమ్ముతున్నరంటూ మద్యం దుకాణం ముందు పలువురు ఆందోళన చేశారు. బీరు ధర రూ.110 ఉండగా.. లెబుల్స్ మార్చి రూ.60కే 650ఎంఎల్ బీరును విక్రయించారు. దీంతో బీరు సేవిస్తుండగా లెబుల్స్ కవర్ ఉడిపోవడంతో అనుమానం వచ్చిన కొందరు యువకులు మద్యం దుకాణ యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ సంఘటన ఆదివారం శేరిగూడ శ్రీఆంజనేయ వైన్స్ వద్ద చోటు చేసుకుంది. స్థానికుల, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పోచారం గ్రామానికి చెందిన కొందరు యువకులు రెండు కాటన్ల హైవర్డ్స్ 5000 బీర్లు కొనుగోలు చేశారు. సమీపంలోని బహిరంగ ప్రదేశంలో సేవిస్తుండగా బీరుపై గల లేబుల్స్ ఉడిపోయింది. లేబుల్‌ను పరిశీలించగా దానిపై ఎమ్మార్పీ ధర రూ.60గా ఉంది. అదేవిధంగా సేవించిన బీరు రుచికరంగా లేకపోవడంతో అనుమానంతో ఆ యువకులు వైన్స్ వద్దకు వచ్చి కల్తీ బీర్లంటూ ప్రశ్నించారు. దీంతో వైన్స్ యాజమాన్యం ఏమీ కాదులేండీ అంటూ దాటవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని లేబుల్స్ పరిశీలించి పరీక్షలు నిర్వహిస్తామంటూ ఆ మద్యాన్ని తీసుకొని వెళ్లిపోయారు. ఇంత జరిగిన ఎక్సైజ్ అధికారులు రాకపోవడంతో పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఆంజనేయ వైన్స్‌లో కల్తీ మద్యం విక్రయిస్తున్నరని ఆరోపించారు. -
బెజవాడలో కల్తీ మద్యం కలకలం
విజయవాడ: విజయవాడలో మరోసారి కల్తీమద్యం కలకలం రేపుతోంది. శుక్రవారం రిక్షా కార్మికుడు అచ్చన్న శుక్రవారం మద్యం తాగిన కొద్దిసేపటికే మృతి చెందాడు. దీంతో అచ్చెన్న కుటుంబసభ్యులు కల్తీ మద్యం వల్లే మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి వద్ద ఉన్న మద్యం బాటిల్‌ను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలోనూ కల్తీ మద్యం సేవించి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. -
కల్తీ దందా
► నీళ్లు, స్పిరిట్ కలిపి మద్యాన్ని కల్తీ చేస్తున్న వ్యాపారులు ► ఇప్పటికే పలు కేసులు నమోదు ∙ఆందోళనలో మందుబాబులు ► పట్టించుకోని ఎక్సైజ్‌శాఖ అధికారులు సిర్పూర్(టి) : జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో కల్తీ మద్యం ఏరులైపారుతోంది. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు మద్యాన్ని కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మద్యంలో నీళ్లు, స్పిరిట్ కలిపి కల్తీ చేస్తున్నారు. గతంలో కాగజ్‌నగర్, దహెగాం మండలాల్లో కల్తీ మద్యం తయారు చేసిన బాటిళ్లలో స్పిరిట్ కలిపినట్లు తేలడంతో సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తరుచూ అధికారుల దాడుల్లో లూజ్ విక్రయాలు జరుగుతున్నట్లు తేలడంతో కల్తీ మద్యంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు కొందరు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా వారు పట్టించుకోవడం లేదు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌పోర్స్ హైదరాబాద్ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేస్తే కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. మామూళ్ల మత్తులో పడి ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షణ చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్, దహెగాం మండలాల్లో ఇది వరకే కల్తీ మద్యం లభించడంతో పలు కేసులు నమోదయ్యాయి. అయినా పలు మద్యం దుకాణాల్లో లూజ్ విక్రయాలు, అక్రమ రవాణా నిలిపివేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. మచ్చుకు కొన్ని సంఘటలు.. గతంలో కాగజ్‌నగర్ పట్టణంలోని కాపువాడలో అధికారులు చేసిన దాడుల్లో ఓ ఇంటిలో ఉన్న కల్తీ మద్యం తయారు చేసే పరికరాలు, ఖాళీ బాటిళ్లు, బాటిళ్లకు అమర్చే మూతలు చూసి నివ్వెరపోయారు. ఆ ఇంటిలో బాటిళ్లకు అమర్చే 15వేల మూతలు, 5వేల ఖాళీ బాటిళ్లు, 8 కాటన్ల మద్యం లభించింది. ఇంటిలో కల్తీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరిపై కేసులు కూడా నమోదు చేశారు. దీనికి ముందు దహెగాం మండలంలోని ఓ వ్యాపారి కల్తీ మద్యం విక్రయిస్తుండగా పట్టుబడటంతో కేసు నమోదైంది. అలాగే కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ వైన్‌షాపులో లూజ్ విక్రయాలు జరుపుతుండటంతో కేసు నమోదు చేశారు. సిర్పూర్(టి)లోని మద్యం షాపులో గతంలో అదిక ధరలు, లూజ్ విక్రయాలు చేస్తుండగా అధికారులకు పట్టుబడటంతో కేసులు నమోదు చేశారు. పదిహేను రోజుల క్రితం తిరిగి కల్తీ మద్యం, లూజ్ విక్రయాలు జరుపుతున్నారని గుర్తు తెలియని వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి షాపుసీజ్ చేసి కేసు నమోదు చేశారు. షాపులోని 12లూజ్ బాటిళ్లను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. లూస్ విక్రయాలు చేసినందుకు రూ.5లక్షల జరిమానా విధించారు. మహారాష్ట్రకు రవాణా.. మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో మద్య నిషేధం ఉండటంతో మహారాష్ట్రలోని పలు పట్టణాలు,, గ్రామాలకు మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఈ రెండు జిల్లాలు నియోజకవర్గంలోని సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూర్ మండలాలకు ఆనుకోని ఉండటంతో మద్యం అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. అలాగే కాగజ్‌నగర్ పట్టణం నుంచి రామగిరి ప్యాసింజర్, నాగ్‌పూర్ ప్యాసింజర్, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా రాత్రి సమయాల్లో మహారాష్ట్రకు మద్యం రవాణా చేస్తున్నారు. రైళ్లలో అప్పుడప్పుడు చేసిన తనిఖీలలో మద్యం రవాణాదారులు మద్యం వదిలి వెళ్లడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిర్పూర్(టి)–మాకిడి అంతర్రాష్ట్ర రోడ్డు గుండా ప్రతీరోజు మద్యం అక్రమ రవాణా చేస్తుండటంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి మద్యం రవాణా చేస్తున్న వాహనాలు సీజ్ చేసి పలు సార్లు కేసులు నమోదు చేశారు. అడపాదడపా ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నా అక్రమ రవాణాను అడ్డుకోవంలో విఫలమవుతున్నారు. అలాగే కౌటాల, బెజ్జూర్ మండలాల నుంచి సమీపంలో ఉన్న పెన్‌గంగ, ప్రాణహిత నదులను దాటిస్తూ మహారాష్ట్రకు మద్యం రవాణా చేస్తున్నారు. కౌటాల మండలంలో సైతం పలుమార్లు అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. మద్యం షాపుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా మద్యం తరలిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు స్పందించి కల్తీ మద్యం జరగకుండా చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం మద్యం అక్రమరవాణా, కల్తీ మద్యం, లూజ్ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటీవల వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించి సిర్పూర్(టి) షాపులో లూజ్ విక్రయాలు చేస్తుండటంతో షాపును సీజ్ చేసి రూ.5లక్షల జరిమానా విధించాం.– మంగమ్మ, ఎక్సైజ్ సీఐ -
కల్తీ కల్లు తాగి 30 మందికి అస్వస్థత
కల్తీ కల్లుతాగి 30 మంది అస్వస్థతకు గురైన సంఘటన ప్రకాశం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. జిల్లాలోని కొండేపి మండలం ముగచింతల, మర్రిపూడి మండలం రామయపాలెం గ్రామాల్లో ఆదివారం కల్తీకల్లు తాగి 30 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వికారాబాద్‌లో కల్తీ కల్లు కలకలం
వికారాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగడి గ్రామంలో కల్తీ కల్లు తాగి నీరొద్దిన్(30) అనే వ్యక్తి మృతి చెందాడు. ఉదయం నమాజ్ చేసుకున్న తర్వాత కల్లు తాగగానే అపస్మారకస్థితిలోకి వెళ్లి ప్రాణాలు వదిలాడు. దీంతో బంధువులు కల్లు కాంపౌండ్‌ను ధ్వంసం చేసి శవంతో రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ఆ మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. కల్లు కాంపౌండ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
గుడుంబా రహిత రాష్ట్రంగా తెలంగాణ
మంత్రి పద్మారావు కల్తీ కల్లు నియంత్రణ మిషన్ ప్రారంభం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాన్ని త్వరలోనే గుడుంబా రహిత రాష్ట్రంగా ప్రకటించనున్నట్లు ఎక్సైజ్ మంత్రి పద్మారావు తెలిపారు. కల్తీ కల్లు నియంత్రణ యంత్రాన్ని సచివాలయంలో సోమవారం ఆయన ప్రారంభించారు. కల్తీ కల్లు మరణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగానే కల్తీ కల్లు నియంత్రణ యంత్రాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈ యంత్రంతో కల్తీ కల్లును నిమిషాల్లోనే గుర్తించగలమన్నారు. మద్యంలో నీళ్లు కలిపి సీల్ వేసి అమ్ముతున్న సంఘటనలను అరికట్టేందుకు హైడ్రోమీటర్‌ను ప్రారంభించారు. ఈ మీటర్‌ను మద్యంలో వేస్తే ఎంతమేరకు నీళ్లు కలిపారో వెంటనే తెలిసిపోతుందని నిపుణులు వివరించారు. రాష్ట్రంలో కల్తీ కల్లు అమ్మకాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెంటనే ఈ యంత్రాలను పంపి దాడులు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎక్సైజ్ శాఖలో అవినీతికి చోటులేకుండా పనిచేస్తున్న అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ధూల్‌పేటలో గుడుంబా దాడుల కోసం ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నట్లు పేర్కొన్నారు. గుడుంబా తయారీ నుంచి బయటపడ్డవారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ డెరైక్టర్ అకున్ సబర్వాల్, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా, కమిషనర్ చంద్రసదన్ తదితరులు పాల్గొన్నారు. -
200కేసుల కల్తీ మద్యం స్వాధీనం
విజయవాడ : గురునానక్ కాలనీలోని ఓ వైన్ షాపులో కల్తీ మద్యం పట్టబడింది. అక్రమంగా నిల్వ ఉంచిన 200 కేసుల మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు తనిఖీల్లో భాగంగా గురువారం పట్టుకున్నారు. అయితే విషయాన్ని బయటకు పొక్కనీకుండా చూడాలని అధికార పార్టీకి చెందిన ఓ నేత ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఎక్సైజ్ అధికారులు దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించేందుకు నిరాకరించారు. -
కల్తీ కల్లు అమ్మినందుకు ఎక్సైజ్ జరిమానా
నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలంలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులకు ఎక్సైజ్ అధికారులు జరిమానాలు విధించారు. భైరాపూర్, నెమలి, మీర్జాపూర్ గ్రామాలకు చెందిన బాలరాజు, అశోక్, శ్రీశైలం కల్తీ కల్లు విక్రయిస్తూ మంగళవారం పట్టుబడ్డారు. గతంలో వీరిని ఇదే విషయమై తహశీల్దార్ బైండోవర్ చేసి హెచ్చరించి వదిలిపెట్టారు. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున ఎక్సైజ్ అధికారులు జరిమానా విధించారు.