నకిలీలలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు:‘మీకు నేనున్నాను.. గుట్టుగా కల్తీ మద్యం వ్యాపారం చేసుకోండి. మీకు ఏమైనా సమస్యలు వస్తే అండగా నేనుంటాను’!
- కల్తీ మద్యం వ్యాపారులకు సాక్షాత్తూ జిల్లా పరిషత్ చైర్మన్, టీడీపీ నేత రాజశేఖర్‌గౌడ్ మౌర్యఇన్ హోటల్‌లో ఇచ్చిన హామీ.
ఇదేదో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కాదు. స్వయంగా ఎక్సైజ్ పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన వాస్తవాలు. ఈ నెల 5వ తేదీన నల్లబల్లి గ్రామ సమీపంలో దొరికిన నకిలీ మద్యం కేసులో డోన్ ఎక్సైజ్ పోలీసులు మంగళవారం కోర్టులో రిమాండ్ రిపోర్టును సమర్పించారు. ఈ రిపోర్టును బట్టి.. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో జెడ్పీ చైర్మన్‌దే కీలకపాత్ర అని నిందితులు వెల్లడించినట్టు స్పష్టంగా పేర్కొన్నారు.
కల్తీ మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించి కోట్ల రూపాయలు గడిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికార పార్టీ నేతల ఆగడాలకు ఇది కేవలం ఒక మచ్చుతునక మాత్రమేనని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇసుక, మైనింగ్‌తో పాటు మద్యం మాఫియా మొత్తం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో కొనసాగుతుందన్న విషయం తాజాగా మరోసారి రూఢీ అయ్యింది.
అయితే, నకిలీ మద్యం కేసు నుంచి జెడ్పీ చైర్మన్‌ను తప్పించేందుకు అధికార పార్టీ పన్నాగం పన్నుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడ్పీ చైర్మన్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ)ను బలిపశువు చేసేందుకు పథక రచన చేసినట్టు తెలుస్తోంది. మొత్తం కేసును కేవలం పీఏకే చుట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్న ప్రచారమూ జరుగుతోంది.
మౌర్య-ఇన్ హోటల్ రూంలో కలిశాం!
నల్లబల్లి గ్రామ సమీపంలో దొరికిన నకిలీ మద్యం కేసులో ఇప్పటికే ఏ-1గా ప్యాపిలికి చెందిన కౌలురైతు తిరుపాలును చేర్చారు. తాజాగా ఈ నెల 10వ తేదీన దేవరబండ గ్రామ క్రాస్‌రోడ్డులో ఇద్దరు వ్యక్తులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అధికార పార్టీకి చెందిన ఎంపీపీ కుమారుడు రామన్‌గౌడ్‌తో పాటు ఉమామహేశ్వర్‌గౌడ్‌లుగా తేలింది.
వీరిని విచారించగా... నకిలీ మద్యం వ్యాపారంలో నిందితులుగా తేలింది. దీంతో ఏ-2, ఏ-3గా వీరిని పోలీసులు చేర్చారు. అదేవిధంగా వీరు విచారణలో జెడ్పీ చైర్మన్ అండగా ఉంటామన్న విషయాన్నీ వెల్లడించారు. ‘ప్రస్తుతం జెడ్పీ చైర్మన్‌కు పీఏగా ఉంటున్న రాజశేఖర్.. కర్నూలుకు వచ్చి కలవాలని ఫోన్‌లో మమ్మల్ని ఆదేశించారు. దీంతో మేము ఆయన్ను మౌర్య ఇన్ హోటల్ రూమ్‌లో కలిశాం.
కొద్దిసేపటి తర్వాత హోటల్ రూమ్‌కు జెడ్పీ చైర్మన్ కూడా వచ్చారు. ఆయనకు మమ్మల్ని పీఏ రాజశేఖర్ పరిచయం చేశారు. నకిలీ మద్యం వ్యాపారం చేసేందుకు డోన్ నుంచి మేము వచ్చామని జెడ్పీ చైర్మన్‌కు ఆయన పీఏ రాజశేఖర్ తెలిపాడు. వ్యాపారాన్ని గుట్టుగా చేసుకోవాలని.. ఎప్పుడైనా మాకు సమస్యలు వస్తే నేనుంటానని ఆయన మాకు హామీ ఇచ్చారు’అని తమ విచారణలో ఏ-2, ఏ-3లు వెల్లడించినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.
మద్యం లోడ్ వస్తుంది... తీసుకోండి
మౌర్య-ఇన్ హోటల్‌లో సమావేశం అనంతరం.. నకిలీ మద్యం లోడు వచ్చింది, రాఘవేంద్రగార్డెన్‌కు వచ్చి తీసుకెళ్లాలని అక్టోబరు 18వ తేదీన జెడ్పీ చైర్మన్ పీఏ రాజశేఖర్ నుంచి తమకు ఫోన్ వచ్చినట్టు నిందితులు రమణ్‌గౌడ్, ఉమా మహేశ్వర్‌గౌడ్‌లు తెలిపారు. అక్కడకు ఇన్నోవా వాహనంలో రాజశేఖర్ వచ్చారు.
అక్కడే ఐచర్ వాహనంలో ఉన్న 400 బాటిళ్ల బ్యాగ్‌పైపర్ నకిలీ విస్కీ బాటిళ్లను తీసుకున్నామని, తర్వాత ఇన్నోవా వాహనంలో అక్కడి నుంచి రాజశేఖర్ వెళ్లిపోయారని వారు తెలిపారు. అయితే, రాత్రి సమయం కాబట్టి ఇన్నోవా కారు నెంబరు చూడలేదని తెలిపారని రిపోర్టులో వెల్లడించారు.
తప్పించేందుకు పథకం షురూ!
ఈ కేసు నుంచి అధికార పార్టీ నేత, జెడ్పీ చైర్మన్‌ను తప్పించేందుకు తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇందులో భాగంగా కేవలం జెడ్పీ చైర్మన్ పీఏను బలిపశువు చేసేందుకు రంగం సిద్ధమయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే జెడ్పీ చైర్మన్ పీఏ రాజశేఖర్‌పై ఏ4 నిందితుడుగా చేర్చి... కేసు మూసివేయనున్నారన్న ప్రచారమూ అధికారపార్టీలో జరుగుతోంది.
ఈ కేసుతో చైర్మన్‌ను సంబంధం లేదని పీఏ రాజశేఖర్‌తో చెప్పించేందుకు ఆయనపై ఒత్తిళ్లు వస్తున్నాయన్న వార్తలూ గుప్పుమంటున్నాయి. తద్వారా కేవలం పీఏను మాత్రమే బలిపశువు చేసి... చైర్మన్‌ను తప్పించేందుకు రంగం సిద్ధమయ్యిందని తెలుస్తోంది.