
మాఫియా, ఎక్సైజ్ సార్ల దోస్తీ!
కల్తీ కల్లు మాఫియా, ఎక్సైజ్ శాఖ అధికారులు మిలాఖత్ అయినట్టు తెలుస్తోంది. జిల్లాలో కల్తీ కల్లు విక్రయాలు యథేచ్ఛగా సాగడానికి అసలు కారణమిదేనని సర్వత్రా ఆరోపణలు వినవస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/గజ్వేల్: కల్తీ కల్లు మాఫియా, ఎక్సైజ్ శాఖ అధికారులు మిలాఖత్ అయినట్టు తెలుస్తోంది. జిల్లాలో కల్తీ కల్లు విక్రయాలు యథేచ్ఛగా సాగడానికి అసలు కారణమిదేనని సర్వత్రా ఆరోపణలు వినవస్తున్నాయి. గజ్వేల్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో గత ఏడాది 187 కల్లు దుకాణాల నుంచి శాంపిల్స్, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు 56 కల్లు దుకాణాల నుంచి నమూనాలు సేకరించారు.
కేవలం ఐదింటిలో మాత్రమే కల్తీ ఉందని నిర్ధారించడమే ఇందుకు నిదర్శనం. అందులోనూ ఆల్ఫ్రోజోలం, డైజోఫాం వంటి రసాయనాలు లేవట.. ఏదో శాక్రీన్, సీహెచ్ పదార్థాల ఆనవాళ్లు మాత్రమే ఉన్నాయని తేల్చారు. నిజానికి అంత స్వచ్ఛమైన కల్లు విక్రయిస్తుంటే.. మత్తులో జనం ఎందుకు జోగుతున్నట్టు...? ఎక్కడికక్కడే ఎందుకు పడిపోతున్నారో అధికారులకే తెలియాలి మరి.
గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్, తూప్రాన్, ములుగు, వర్గల్, గజ్వేల్ మండలాల్లో 24 సొసైటీలు, 101 టీఎఫ్‌టీలు ఉన్నాయి. మొత్తం ఈ సంఘాలపై ఆధారపడి సుమారు 25 వేల మందికి పైగా గీత కార్మికులు జీవనం సాగిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం ఆయా మండలాల్లో 49,647 ఈత చెట్లు, మరో 3,281 తాటి చెట్లు ఉన్నాయి. ప్రత్యేకించి గజ్వేల్ నియోజకవర్గంలో కల్లు దందా ప్రస్తుతం వరంగల్ జిల్లాకు చెందిన దేవేందర్ గౌడ్ అనే బడా వ్యాపారి చేతుల్లోకి వెళ్లింది. ఎక్సైజ్ అధికారుల ఒత్తిళ్లకు, మాఫియా ఆగడాలకు తట్టుకోలేక సొసైటీ సభ్యులు మాఫియాకు అప్పగించారు. గజ్వేల్ కల్లు సొసైటీని ఏడాదికి రూ. 50 లక్షల చెల్లించే విధంగా దేవేందర్ గౌడ్ ఒప్పందం చేసుకున్నారని స్థానిక గీత కార్మికులే చెప్తున్నారు.
గజ్వేల్, తూప్రాన్, ములుగు, జగదేవ్‌పూర్ మండల కేంద్రాల్లో కల్లు దందా జోరుగా సాగుతోంది. 12 ఏళ్ల క్రితం వరకు ఈతచెట్ల వనం బాగానే ఉండేవి. 35 వేల ఈతచెట్లకు కల్లు తీసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉండేది. ఈ చెట్లకు గీసిన కల్లును ఈ ప్రాంతంలో విక్రయించి, మిగిలిన కల్లును హైదరాబాద్‌లోని సొసైటీల వారు తీసుకెళ్లేవారు. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారింది. భూగర్భ జలాలు తగ్గిపోయి చెట్లు అంతరించిపోవడం, ‘రియల్‌భూమ్’ కారణంగా సాగు భూముల నుండి చెట్లను తొలగించడం తదితర కారణాల వల్ల రోజురోజుకు ఈత వనం తగ్గిపోయింది. గతంలో లక్షల్లో వున్న చెట్లు 20 వేలకు పడిపోయినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ రికార్డులు చెబుతున్నాయి.
రెండేళ్ల కిందట ఏమైదంటే...
2012 ఆగస్టు 13న తూప్రాన్ మండలంలోని కాళ్లకల్‌లో బోనాల పండుగ జరుగుతోంది. ఊరు ఊరంతా జోరు మీదుంది. మహిళలు, పురుషులు, పిల్లలు స్థానిక కల్లు దుకాణం నుంచి కల్లు తెచ్చుకొని తాగారు. తాగిన వారికి నాలుక లావుగా, మెడలు తిరిగిపోవడం, కళ్లు తిరిగి పడిపోయారు. దాదాపు 160 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి, కల్తీ కల్లు తాగటం వలసే అస్వస్థతకు గురయ్యారని నిర్ధారించారు. ఎక్సైజ్ అధికారులు హడావుడి కొంతమంది గీత కార్మికులపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ గ్రామంలో మూడు కల్లు దుకాణాలు నడుస్తున్నాయి.
బెదిరింపు కాల్స్..
* ‘నరుకుత కొడుకా..! ముందు నా గురించి తెలుసుకో.. తర్వాత నీ ఇష్టం వచ్చింది రాసుకో’ ‘సాక్షి’ మెదక్ రూరల్ విలేకరికి శంకరయ్య అనే కల్లు కాంట్రాక్టర్ బెదిరింపు.
* ‘బ్రదర్..! మెదక్‌లో నీ లెక్కనే ఓ సీనియర్ విలేకరి కల్లు మీద వార్తలు రాసిండు, నడి రోడ్డు మీద దారుణంగా హత్యకు గురయ్యాడు. ఎక్కడి నుంచో వచ్చావు.. నువ్వే మోనగాడివి అనుకోకు, నీకు మెదక్ గురించి తెల్వనట్టుంది జాగ్రత్తగా ఉండు’ అని ‘సాక్షి ప్రతినిధి’కి ఓ వ్యక్తి
ఫోన్ కాల్..
కల్తీ కల్లు గుట్టు బట్టబయలు చేస్తూ వరుస కథనాలు ప్రచురిస్తున్న ‘సాక్షి’పై కల్లు మాఫియా బెదిరింపులకు పాల్పడుతోంది. ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్ మెసేజ్‌లతో పాటు, కార్యాలయానికి ఫోన్ చేసి బెదిరించారు. ఇక మెదక్ రూరల్ విలేకరి నీలయ్యకు 9948920921 అనే నంబర్ నుంచి మల్లేశంగౌడ్ అనే కల్లు వ్యాపారి ఫోన్ చేసి దుర్భాషలాడుతూ అంతు చూస్తానని బెదిరించాడు. తూప్రాన్ మండలానికి చెందిన మల్లేశంగౌడ్ మంబోజిపల్లి గ్రామంలోని కల్లు దుకాణాన్ని రూ.17 లక్షలకు లీజుకు తీసుకుని నడిపిస్తున్నాడు.
సల్మెడ అనే గ్రామం నుంచి నిత్యం కొద్దిగా కల్లు తెప్పించి, దాన్ని 160 పెట్టెల నుంచి 200 పెట్టెల కల్లు తయారుచేసి విక్రయిస్తున్నారు. ఎక్కువ మత్తు ఇచ్చే సీసాకు రూ. 6, తక్కువ మత్తు ఇచ్చే కల్లు సీసాకు రూ. 4 చొప్పున అమ్ముతున్నాడు. సమాచారం సేకరించిన విషయం తెలుసుకుని మల్లేశం గౌడ్ చంపుతానంటూ బెదిరించాడు. ఆయన మాటను రికార్డు చేసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.