కల్లుకు అండగా ‘కల్తీ’నేత! | a leader supporting to adulterated liquor | Sakshi
Sakshi News home page

కల్లుకు అండగా ‘కల్తీ’నేత!

Published Sat, Oct 17 2015 3:46 AM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM

కల్లుకు అండగా ‘కల్తీ’నేత!

కల్లుకు అండగా ‘కల్తీ’నేత!

కల్తీకల్లు మాఫియాతో అధికార పార్టీ ఎమ్మెల్యే కుమ్మక్కు
ఎక్సైజ్ దాడులను తనకు అనుకూలంగా మలచుకున్న పాలమూరు నేత
మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బేరాలు
‘అల్ఫ్రజోలం’ కల్లు విక్రయాలు సాగేలా చూస్తానంటూ రూ.3 కోట్లు వసూలు
అదే సమయంలో దాడులపై సర్కారు వెనకడుగు.. తన ఘనతేనని ప్రచారం
సీఎం దృష్టికి తీసుకువెళ్లిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్
ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరించిన సీఎం.. చర్యలకు సిద్ధం
త్వరలో మళ్లీ కల్తీకల్లుపై దాడులు

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘కల్తీకల్లు’పై ఆబ్కారీ శాఖ జరిపిన దాడులతో తలెత్తిన పరిణామాలను అధికార పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యే ఒకరు తనకు అనుకూలంగా మలచుకున్నారు. అల్ఫ్రజోలంతో నకిలీ కల్లు తయారుచేసే మాఫియాకు అండగా నిలిచారు. రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని కల్లు మాఫియాతో రూ.3 కోట్లకు బేరం కుదుర్చుకొని రంగంలోకి దిగారు. డీఅడిక్షన్ కేంద్రాల ఏర్పాటు వంటి జాగ్రత్తలు తీసుకోకుండా ‘మందు కల్లు’ను ఒక్కసారిగా నిలిపేయడంతో మరణాలు సంభవిస్తున్నాయంటూ సర్కారుపై ఒత్తిడి తెచ్చారు. మొత్తంగా ‘కల్తీకల్లు’పై దాడులను తాత్కాలికంగా
 నిలిపేసేందుకు కారణమయ్యారు.
 
రాష్ట్రంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు మళ్లీ కల్తీకల్లు ఏరులై పారేలా కల్లు మాఫియాకు అండగా నిలిచారు. ఈ ఎమ్మెల్యే ‘కల్తీ’ వ్యవహారాన్ని ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు వెల్లడించారని సమాచారం. దీనిపై సీఎం ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం సేకరించి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారంపై సీరియస్ అయిన సీఎం కేసీఆర్.. తదుపరి చర్యలకు ఎక్సైజ్ శాఖకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది.
 
 ‘కల్తీకి అడ్డా..
వలసల జిల్లాగా పేరుపడిన పాలమూరు దశాబ్దాలుగా కల్తీకల్లుకు అడ్డాగా మారింది. వర్షాభావ పరిస్థితులు, సముద్ర మట్టానికి ఎక్కువ ఎత్తులో ఉండడం, ఇతర భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఈ జిల్లాలో తాటి, ఈతచెట్లు తక్కువ. కల్వకుర్తి ప్రాంతంలో మినహా జిల్లాలో గుంపుగా తాటిచెట్లు కనిపించే గ్రామాలు కూడా లేవు. మహబూబ్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో తాటిచెట్లు 300కు మించవు. ఈ పరిస్థితుల్లో కల్తీకల్లు మాఫియా విజృంభించింది. జిల్లాలోని పేద కల్లు సహకార సంఘ సభ్యులను మచ్చిక చేసుకుని, వారికి నెలకు కొంత మొత్తాన్ని చెల్లిస్తూ కల్తీకల్లు విక్రయాలు జరిపింది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి వాసి ఒకరు ఐదేళ్ల క్రితం వరకు మహబూబ్‌నగర్ జిల్లాకు ‘కల్లు కింగ్’గా వ్యవహరించాడు. ఆయన 2009లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి కేసీఆర్‌పైనే ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం గమనార్హం.
 
 ఆ ఎన్నికల తరువాత ఆయన ప్రభావం తగ్గిపోయింది. అయితే 2014 ఎన్నికల తరువాత ఈ జిల్లా నుంచే గెలిచిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు తన ప్రతాపం చూపడం ప్రారంభించారు. ప్రభుత్వంలో తనకున్న పరిచయాలు, శాసనమండలిలోని పెద్దల అండతో పాలమూరులో ‘కల్తీకల్లు’పై ఆధిపత్యానికి పావులు కదిపారు. గద్వాల ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని మరో నేత కల్లు దందా సాగిస్తుండడంతో... అక్కడ కూడా అధికార పార్టీ నాయకుడిని రంగంలోకి దింపారు. తన అనుయాయుడికి జిల్లాలో ముఖ్యమైన పదవిని కట్టబెట్టడంతో పాటు అక్కడ కల్తీకల్లుపై పట్టున్న ఓ ఇద్దరిని తన అదుపాజ్ఞల్లోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కల్తీ కల్లుపై సర్కారు చేపట్టిన సమరం ఆ ఎమ్మెల్యేకు మంచి అవకాశంగా మారింది.
 
పాలమూరు జిల్లాతో పాటు నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో ‘కల్తీ’ మందు అమ్మే వ్యాపారులంతా ఈ ఎమ్మెల్యేతో మంతనాలు జరిపారు. అల్ఫ్రజోలాన్ని ఒక్కసారిగా నిలిపేస్తే మరణాలు సంభవిస్తున్నాయనే నెపంతో... కొన్నేళ్ల పాటు యధాతథంగా కొనసాగించేలా చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే రూ.3 కోట్లు చేతులు మారాయని సమాచారం. ఇదే సమయంలో ప్రభుత్వం కల్తీకల్లుపై వెనక్కి తగ్గింది. దీంతో ఆ ఎమ్మెల్యేకు అటు సొమ్ముతో పాటు కల్తీ మాఫియాకు పెద్దదిక్కుగా పేరొచ్చింది.
 
 ఎక్సైజ్ ఈడీ తిరిగి రాగానే..!
 డ్రగ్స్ కంట్రోల్ డెరైక్టర్‌గా ఉన్న అకున్ సబర్వాల్‌కు ఎక్సైజ్ ఈడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన డ్రగ్స్ కంట్రోల్‌కు సంబంధించి శిక్షణ కోసం విదేశాలకు వెళ్లారు. ఆయన తిరిగి రాగానే క ల్తీకల్లుపై దాడులను తిరిగి కొనసాగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈలోపు జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులు, మండలాలు, మున్సిపాలిటీల్లోని ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో డీఅడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎక్సైజ్, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి కూడా. ఇక కల్తీకల్లు అడ్డాలతో పాటు ‘అల్ఫ్రజోలం’ను సరఫరా చేసే ఫార్మా కంపెనీలు, హైదరాబాద్ శివార్లలోని పరిశ్రమలపైనా దాడులు చేయనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement