* మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో నేటి నుంచే దాడులు
* ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో మలివిడత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్తీ కల్లుపై దాడులకు ఆబ్కారీశాఖ మరోసారి సిద్ధమైంది. కల్తీ కల్లును అరికట్టే చర్యల్లో భాగంగా నెల కిందట విక్రయ దుకాణాలపై అధికారులు దాడులు చేయగా కల్తీ కల్లుకు అలవాటుపడ్డ వ్యక్తులు అది దొరకక పిచ్చెక్కినట్లు ప్రవర్తించడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం తాత్కాలికంగా దాడులను నిలిపేయడం తెలిసిందే.
కల్తీ కల్లును ఎక్కువగా విక్రయించే ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్యశాఖతో కలసి జిల్లా కేంద్రాలు, మండలాలు, మున్సిపాలిటీల్లోని ఆస్పత్రుల్లో కల్తీ కల్లు బాధితుల కోసం డీ-అడిక్షన్ సెంటర్లు, మందులు అందుబాటులో ఉంచిన సర్కారు... శుక్రవారం నుంచి దాడులు జరపాలని నిర్ణయించింది. ఆబ్కారీ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ ఈ మేరకు అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, స్టేట్ టాస్క్‌ఫోర్స్ ఏసీలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు జారీ చేశారు.
తాటి, ఈత చెట్లు తక్కువగా ఉండే మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో కల్తీ కల్లు అమ్మకాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందుగా ఈ జిల్లాల నుంచే దాడులు మొదలుపెట్టనున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో మలివిడతలో తనిఖీలు చేపట్టనున్నారు.
అల్ఫ్రజోలం స్టాక్ లక్ష్యంగా...
కల్లును కల్తీ చేసేందుకు గతంలో డైజోఫాం, క్లోరోఫాం వంటి రసాయనాలు వాడేవారు. మత్తును కలిగించే ఈ రసాయనాలు కల్లు తయారీలో వాడితే ఆబ్కారీ శాఖ అధికారులు దాడులు జరిగినప్పుడు పరీక్షల్లో ఈ మత్తు మందు కలిపినట్లు అప్పటికప్పుడు తేలుతుంది. ఈ నేపథ్యంలో కల్తీకల్లు తయారీదారులు అల్ఫ్రజోలం అనే మాదకద్రవ్యం (డ్రగ్) వాడకాన్ని ప్రారంభించారు.
ఈ మందు కలిపినట్లు నిర్ధారణ చేయాలంటే హైదరాబాద్‌లోని పరీక్ష కేంద్రంలోనే వెల్లడవుతుంది. ఈ నేపథ్యంలో ముంబై, హైదరాబాద్ శివార్లలోని ఫార్మా కంపెనీలు, ఇతర పరిశ్రమలకు సరఫరా అయ్యే అల్ఫ్రజోలం కల్లు దుకాణాలకు చేరడం మొదలైంది. కిలో అల్ఫ్రజోలం మందును ఆరునెలల పాటు ఒక దుకాణంలో వినియోగించుకునే అవకాశం ఉండడంతో కల్తీ కల్లు తయారీదారులులు దీన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు.
ఈ మందు మోతాదు మించితే నాడీ వ్యవస్థ దెబ్బతిని, మెదడుపై ప్రభావం చూపుతుంది. దీనికి అలవాటయితే అల్ఫ్రజోలం కలిపిన కల్లు లేకపోతే ఉండలేని స్థితికి చేరుకుంటారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో చెట్లు లేని చోట జరిపే విక్రయాల్లో అల్ఫ్రజోలంతో కూడిన కల్లు విక్రయాలు జరుగుతాయని ఎక్సైజ్ అధికారులు కూడా ఒప్పుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి జరిపే దాడులు అల్ఫ్రజోలం నిల్వలనే లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించారు. కల్లు దుకాణాలకు ఈ మందును అమ్ముతున్న మధ్యవర్తులు, ఎక్కడి నుంచి ఈ మందు తెస్తున్నారనే కోణంలోనే ప్రధానంగా దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. దాడులు జరిపే జిల్లాల్లో ముందుగా గుర్తించిన మండలాలు, గ్రామాల వివరాలను రహస్యంగా ఉంచి ఉదయం నుంచే దాడులు చేసేందుకు సిద్ధమైనట్లు ఓ అధికారి వివరించారు. భవిష్యత్తులో కల్తీ కల్లు దొరకదనే విషయాన్ని కౌన్సెలింగ్ ద్వారా బాధితులకు వివరించేందుకు వైద్యులను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
కల్తీ కల్లుపై మళ్లీ యుద్ధం
Published Fri, Nov 6 2015 3:54 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement
Advertisement