సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘బ్రాండ్ మిక్సింగ్’ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. మద్యం షాపులు, బార్లలో అమ్ముతున్న బ్రాండ్లలో చీప్ లిక్కర్ కలిపి విక్రయిస్తున్నారు. రెండ్రోజుల కిందట రాజధాని ప్రాంతం విజయవాడలోని బార్లలో భారీగా ‘బ్రాండ్ మిక్సింగ్’ కేసులు పట్టుబడ్డాయి. ఈ విషయాన్ని ఎక్సైజ్‌శాఖ అధికారులు గోప్యంగా ఉంచారు. దసరా సందర్భంగా పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరగనున్నందున బార్లలో బ్రాండ్ మిక్సింగ్‌కు పాల్పడుతున్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, ముఖ్య పట్టణాల్లోని బార్లలో ఈ బాగోతం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే విజయవాడ, గుంటూరు నగరాల్లో జరుగుతున్న ఈ తతంగం గురించి ఎక్సైజ్ అధికారులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. మద్యం షాపుల్లో, బార్లలో బ్రాండ్ మిక్సింగ్‌పై ఎక్సైజ్ కమిషనర్‌కు ఫిర్యాదులందడంతో ఇటీవలే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కమిషనర్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. గుంటూరు, ఉయ్యూరు, విజయవాడలో మద్యం దుకాణాలు, ఎక్సైజ్ స్టేషన్లలో తనిఖీలు చేశారు. కమిషనర్ తనిఖీ చేసిన నాలుగు రోజుల వ్యవధిలోనే విజయవాడలో బ్రాండ్ మిక్సింగ్ కేసులు పట్టుబడ్డాయి. అయితే మద్యం షాపుల్లో అక్రమాలు జరిగినా.. వాటి జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని మంత్రులే అధికారులను బెదిరిస్తుండటంతో వారు తనిఖీలను అటకెక్కించారు.
ఎక్సైజ్ అధికారుల సహకారంతోనే..
బెల్టు షాపులు, ఎమ్మార్పీ ఉల్లంఘనలతో మద్యం ప్రియుల్ని దోచుకుంటున్న సిండికేట్లు.. జనం ప్రాణాలతో చెలగాటమాడేలా కల్తీ మద్యాన్ని విక్రయిస్తుండటం కలకలం రేపుతోంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి ఆ తర్వాత పట్టించుకోకపోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఈ ఏడాది గుంటూరు, విజయవాడలలో వరుసగా కల్తీ మద్యం ఘటనలు వెలుగు చూశాయి. కల్తీ మద్యం తయారీ కేంద్రాలను ఎక్సైజ్ అధికారుల సహకారంతోనే నడుపుతున్నారని ఉన్నతాధికారుల విచారణలో తేలిన సంగతి తెలిసిందే.
టాస్క్‌ఫోర్సుని నిర్వీర్యం చేసిన సర్కారు
మద్యం వ్యాపారులు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్), కల్తీ మద్యం అమ్మకాలు చేపట్టినా, బెల్టు షాపులు నడిపినా ఎక్సైజ్ సేŠట్ట్ టాస్క్‌ఫోర్సు దాడులు చేసి వీటిని అడ్డుకోవాలి. స్టేట్ టాస్క్‌ఫోర్సు యూనిట్‌కు ఓ సీనియర్ ఐజీ స్థాయి అధికారిని నియమించి తరచూ దాడులు నిర్వహించాలి. అయితే రెండు నెలల కిందట ఎస్టీఎఫ్ డైరెక్టర్‌ను బదిలీ చేసి ఇంతవరకు ఆ పోస్టులో ఎవ్వర్నీ నియమించలేదు. మద్యం సిండికేట్ల అక్రమ వ్యాపారం కోసం సర్కారు ఎస్టీఎఫ్ డైరక్టర్‌గా సీనియర్ ఐపీఎస్‌ను నియమించలేదని ఎక్సైజ్ వర్గాల్లోనే ప్రచారం జరగడం గమనార్హం. చీప్ లిక్కర్ విక్రయాలు గతేడాదికి 80 లక్షల కేసులకు చేరింది. అంతకు ముందు ఏడాది 40 లక్షల చీప్ లిక్కర్ కేసులు అమ్ముడయ్యాయి. ఏడాదికేడాదికి వంద శాతం చీప్ లిక్కర్ అమ్మకాలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఏడాదికేడాది 10 శాతం వరకే అమ్మకాలు పెరగాలి. అయితే ఏకంగా వంద శాతం అమ్మకాలు పెరుగుతుండటంతో మద్యం వ్యాపారులు చీప్ లిక్కర్‌ను మీడియం, అంతకంటే పెద్ద బ్రాండ్లలో కలుపుతున్నారని ఎక్సైజ్æ కమిషనరే స్వయంగా అంతర్గత సమావేశంలో వ్యాఖ్యానించారంటే.. ఇక క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. విజయవాడలో పట్టుబడిన డైల్యూషన్, బ్రాండ్ మిక్సింగ్ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
బ్రాండ్ మిక్సింగ్ అంటే..
బ్రాండ్ మిక్సింగ్ అంటే.. చీప్ లిక్కర్‌ను మీడియం లిక్కర్, అంతకంటే పెద్ద బ్రాండ్లలో కలుపుతారు. ఒక బ్రాండ్, మీడియం బ్రాండ్‌లోని బాటిళ్లలో సగం పరిమాణం మద్యాన్ని తీసేసి.. చీప్ లిక్కర్‌ను కలుపుతారు. ఈ విధానం ఎక్కువగా బార్లలో జరుగుతోంది. దీంతో పాటు లిక్కర్ డైల్యూషన్ కూడా ఎక్కువగా జరుగుతుందని ఎక్సైజ్ ఉన్నతాధికారులే అంగీకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment