విలేకరులతో మాట్లాడుతున్న రజత్ భార్గవ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కల్తీ మద్యం అనేది లేనేలేదని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు దురుద్దేశంతోనే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. విజయవాడలో ఆదివారం విలేకరుల సమావేశంలో రజత్ భార్గవ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఏడాదికి 90 వేల మద్యం నమూనాలే పరీక్షించేవారని చెప్పారు. కానీ.. ప్రస్తుత ప్రభుత్వంలో రెండేళ్లుగా ఏటా 1.50 లక్షల నమూనాలను పరీక్షిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్ల నమూనాలను ఐదు ప్రాంతీయ ల్యాబొరేటరీల్లో ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ తగిన ప్రమాణాల మేరకు ఉన్నవాటినే మార్కెట్‌లో విక్రయానికి అనుమతిస్తున్నామని చెప్పారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం అమ్మకాలు జరగలేదన్నారు. అక్కడ మృతుల్లో ఎవరూ కల్తీ మద్యం వల్ల మరణించలేదని వైద్య పరీక్షల నివేదికలు కూడా స్పష్టం చేశాయని చెప్పారు.
కొత్త డిస్టిలరీలకు అనుమతివ్వలేదు
2018 తరువాత రాష్ట్రంలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని రజత్ భార్గవ తెలిపారు. ప్రస్తుతం మద్యం బ్రాండ్లను తయారు చేస్తున్న డిస్టిలరీలకు గత ప్రభుత్వ హయాంలో 2018లోనే అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. సారా తయారీ, అక్రమ మద్యం అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేసే వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలో మద్యపానాన్ని నిరుత్సాహ పరచడమే లక్ష్యంగా నిర్దేశించుకుని కార్యాచరణ చేపట్టిందన్నారు. అందుకోసమే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించడంతోపాటు 4,380 పర్మిట్ రూమ్‌ల అనుమతులను రద్దు చేసినట్టు తెలిపారు. మద్యం దుకాణాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని వాటి సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించినట్టు వివరించారు. మద్యం విక్రయ సమయాలను కూడా కుదించామన్నారు. దాంతో రాష్ట్రంలో 2018–19తో పోలిస్తే 2019–20లో మద్యం విక్రయాలు 25 శాతం, బీర్ విక్రయాలు 59 శాతం తగ్గాయని వివరించారు. ఇక 2020–21లో అయితే మద్యం విక్రయాలు 40 శాతం, బీర్ విక్రయాలు 77 శాతం తగ్గాయని చెప్పారు.
సారా, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నాం
రాష్ట్రంలో సారా, అక్రమ మద్యం అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ స్పష్టం చేశారు. అందుకోసం ప్రత్యేక బృందాలను వినియోగించి ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తృతంగా తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నామన్నారు. డ్రోన్ కెమెరాలు, జియో ట్యాగింగ్, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టామన్నారు. 2020లో సెబ్‌ను ఏర్పాటు చేసిన తరువాత ఇప్పటివరకు 93,722 కేసులు నమోదు చేసి, 70 వేల మందిని అరెస్ట్ చేశామన్నారు. సారా, అక్రమ మద్యం అరికట్టేందుకు గతంలో ‘ఆపరేషన్ నిఘా’ నిర్వహించగా.. ప్రస్తుతం ప్రత్యేకంగా ‘ఆపరేషన్ పరివర్తన్–2.ఓ’ నిర్వహిస్తున్నామన్నారు. గడచిన 10 రోజుల్లోనే 2,051 కేసులు నమోదు చేసి 1,260మందిని అరెస్ట్ చేశామన్నారు. మొత్తం 26,375 లీటర్ల సారా, 89 వాహనాలను జప్తు చేసి 10.05 లక్షల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని వివరించారు. సారా, అక్రమ మద్యం విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment