విజయవాడలో హయత్ ప్లేస్ హోటల్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, హయత్ విజయవాడ చైర్మన్ వీరాస్వామి, అధికారులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో అంతర్జాతీయ బ్రాండ్ హోటళ్లు మరిన్ని ఏర్పాటయ్యేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రాల జాబితాలో చేర్చి మన ఆతిథ్యం విశిష్టతను చాటుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలతో తోడ్పాటు అందిస్తుందని చెప్పారు.
విజయవాడలోని ఏలూరు రోడ్డులో నూతనంగా నిర్మించిన ‘హయత్ ప్లేస్’ హోటల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం ప్రారంభించారు. విజయవాడలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ప్రముఖ హోటళ్లు, ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ తమ కార్యకలాపాలను ప్రారంభించేలా ఉత్తమ టూరిజం పాలసీని తెచ్చినట్లు చెప్పారు. ఉత్తమ పర్యాటక విధానాలే కాకుండా చైన్ హోటళ్లను కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ఒబెరాయ్‌తో మొదలుకుని ఇవాళ ప్రారంభిస్తున్న హయత్ వరకు దాదాపు 11 పెద్ద బ్రాండ్ల సంస్థలను ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ఇతరులకు స్ఫూర్తినిస్తూ మరింత మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. హయత్ ఛైర్మన్ వీరస్వామి, హయత్ ఇంటర్నేషనల్ ఏరియా ప్రెసిడెంట్ శ్రీకాంత్, మేనేజింగ్ డైరెక్టర్ సాయికార్తీక్‌తోపాటు ఈ ప్రాజెక్టులో పాలు పంచుకున్న అందరికీ శుభాభినందనలు తెలియచేశారు.
డైనమిక్ సీఎం.. బెస్ట్ టూరిజం పాలసీ
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా అధునాతన వసతులతో హయత్ ప్లేస్‌ను తీర్చిదిద్దినట్లు హయత్ చైర్మన్ వీరాస్వామి చెప్పారు. హోటల్‌ను వందల సంఖ్యలో గదుల సదుపాయంతో అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలతో పాటు అన్ని రకాల సహాయ సహకారాలను అందచేసినట్లు తెలిపారు. డైనమిక్ సీఎం జగన్ ఉత్తమ టూరిజం పాలసీల ద్వారా రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ఏరియా ప్రెసిడెంట్ శ్రీకాంత్ ధన్యవాదాలు తెలియచేశారు.
హయత్ ప్లేస్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కే రోజా, గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్, అబ్బయ చౌదరి, ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ తూర్పు నియోజక వర్గ ఇన్‌చార్జీ దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫైబర్‌నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, టూరిజం శాఖ ప్రత్యేక కార్యదర్శి రజిత్ భార్గవ, కార్యదర్శి కన్నబాబు, కలెక్టర్ ఢిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు.
అవినాష్ నివాసానికి సీఎం జగన్
హయత్ ప్లేస్ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ను విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జీ దేవినేని అవినాష్ తమ నివాసానికి రావాలని సాదరంగా ఆహ్వానించారు. గుణదలలోని అవినాష్ నివాసం వద్ద సీఎం జగన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు.
జై జగన్ అని నినాదాలు చేస్తూ పూల వర్షం కురించారు. అవినాష్ కుటుంబ సభ్యులను సీఎం జగన్ ఆప్యాయంగా పలకరించారు. రాజకీయ జీవితం కల్పించిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని అవినాష్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తూర్పు నియోజకవర్గ నేతలు సీఎంను కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment