వరదలో చిక్కుకొని 3.5 లక్షల మంది నరకయాతన
వైఎస్ జగన్ హయాంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్
నిర్మాణంతో ఇప్పుడు లక్షల మందికి తప్పిన వరద ముప్పు
వరద అంచనా, ముంపు నివారణ, సహాయ చర్యల్లో సర్కారు దారుణ వైఫల్యం
బుడమేరు పొంగడంతో ఎన్టీటీపీఎస్‌ను ముంచెత్తిన వరద
కృష్ణా వరద ఎగదన్నడంతో బుడమేరు కరకట్టలకు 10 చోట్ల గండ్లు
కరకట్ట తెగిపోతుందనే భయంతో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ లాకుల ఎత్తివేత
ముందస్తు సమాచారం లేకుండా నీటి విడుదలతో మునిగిన బెజవాడ
కనీసం తాగునీరు అందక బాధితుల తీవ్ర అవస్థలు.. ఆహారం, మెడికల్
క్యాంపులు లేవు.. అంతా అంధకారం.. కొరవడిన శాఖల మధ్య సమన్వయం
విజయవాడలో 10 మంది మృతి, నలుగురు గల్లంతు
అతి భారీ వర్షాలపై ముందే హెచ్చరించిన ఐఎండీ, సీడబ్ల్యూసీ
అక్రమ నివాసంపై ప్రజల దృష్టి మళ్లించేందుకే బాబు అర్ధరాత్రి హడావుడి
సాక్షి విజయవాడ: ముంచెత్తిన అతి భారీ వర్షాలపై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చోవడంతో విజయవాడలో మూడున్నర లక్షల మందికిపైగా వరదల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. చుట్టుముట్టిన నీళ్ల నుంచి బయటకు రాలేక, కనీసం తాగునీరు కూడా అందక అల్లాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తిందనే అభిప్రాయం అధికారవర్గాల్లోనే బలంగా వ్యక్తమవుతోంది. అతి భారీ వర్షాలు కురవడం.. కృష్ణా, ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో పల్లపు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం కనీసం అప్రమత్తం చేయలేదు. కృష్ణా నదికి భారీ వరద వస్తున్న సమయంలోనే బుడమేరు ఉప్పొంగింది.
కృష్ణా వరద ప్రవాహం ఎగదన్నడంతో బుడమేరు కరకట్టలకు పలు చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో బుడమేరు కరకట్ట తెగిపోతుందనే భయంతో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ 11 లాకులను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎత్తేశారు. ఫలితంగా వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ లాకుల నుంచి బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. 30 వేల క్యూసెక్కుల ప్రవాహం సింగ్ నగర్, ఇందిరా నాయక్ నగర్, వాంబే కాలనీ, దేవీనగర్, పాయకాపురం, రాజీవ్ నగర్, న్యూరాజరాజేశ్వరిపేట, కండ్రిగ, వైఎస్సార్ కాలనీసహా పలు ప్రాంతాలను ముంచేసింది.
నగరంలో 12 డివిజన్‌లు పూర్తిగా మునిగాయి. మరోవైపు రాజధాని అమరావతి ప్రాంతంలో పోటెత్తిన వాగులతో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసి తగినంత నిధులు, సహాయ సామగ్రిని అందించాల్సిన సీఎం చంద్రబాబు తన కరకట్ట నివాసం వరదలో చిక్కుకోవడంతో దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కార్యాలయాల్లో గడుపుతూ బస్సులో బస పేరుతో డ్రామాకు తెర తీశారు. సీఎం నివాసాన్ని వరద నుంచి కాపాడేందుకు దాదాపు 25 ట్రక్కుల ఇసుకను తరలించినా లాభం లేకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు.
మోటార్లతో నీటిని తోడాల్సి వచ్చిందంటే సీఎం ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. చట్టాలను తుంగలో తొక్కి తాను నివాసం ఉంటున్న అక్రమ సౌధం కృష్ణా వరదలో మునిగిపోయిందనే వాస్తవాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో అర్థరాత్రి పూట పర్యటన పెట్టుకున్నారు. వరద బాధితులకు సహాయం అందించడంలో నిమగ్నం కావాల్సిన అధికారులు సీఎం పర్యటిస్తుండడంతో ఆయన చుట్టూ చేరిపోయారు. దాంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడింది.
తాగునీరు, ఆహారం అందకం పిల్లలు, గర్భిణీలు, వృద్ధుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా మహా విపత్తు సంభవించినప్పుడు ఆ దేశ అధినేతలు, ప్రధానులు సహాయక చర్యలపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయడం సాధారణం. సహాయ చర్యలు ముగిశాక క్షేత్ర స్థాయిలో బాధితులను పరామర్శించి సంతృప్తికరంగా సాయం అందిందో లేదో ప్రధానులు, ముఖ్యమంత్రులు తెలుసుకుంటారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా ఐఎండీ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా ప్రజలను అప్రమత్తం చేయకుండా ఉదాసీనంగా వ్యవహరించారు.
అర్ధరాత్రి హడావుడి
వరద సహాయ చర్యల్లో విఫలమవడంతో ఆ విషయం గురించి చర్చ జరగకుండా శనివారం మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు చంద్రబాబు డ్రామా నడుపుతూనే ఉన్నారు. వరదలో చిక్కుకున్న బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించకుండా తాను మాత్రం అక్కడే ఉండి వరుస సమీక్షలు, మీడియా సమావేశాలు, పర్యటనలతో హడావుడి చేశారు. మూడుసార్లు మీడియా సమావేశాలు పెట్టి రెండుసార్లు సింగ్‌నగర్‌లో పర్యటించారు. ఒకవైపు లక్షలాది మంది వరద నీటిలో చిక్కుకుపోయి ఉంటే సాయంత్రం ఒకసారి వెళ్లి రెండు గంటలు షో చేశారు. మళ్లీ రాత్రి 11.30 గంటలకు సింగ్‌నగర్ వెళ్లి హంగామా నడపడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. షో చేయడం మినహా బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారు.
నగరంలో ముంపు ప్రాంతాలు..
బుడమేరు పొంగటంతో అజిత్‌సింగ్‌నగర్, నందమూరి నగర్, ఆంధ్రప్రభ కాలనీ, ఎల్‌బీఎస్‌నగర్, వాంబేకాలనీ, అయోధ్యనగర్, మధురానగర్, రామకృష్ణాపురం, మధురానగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, నున్న, ఓల్డ్ రాజరాజేశ్వరిపేట, పైపులరోడ్డు, కండ్రిక, పాయకాపురం, శాంతినగర్, ప్రశాంతినగర్, జక్కంపూడి, పాతపాడు, నైనవరం, చిట్టినగర్, మిల్క్ ప్రాజెక్ట్ ఏరియా, వించిపేట, భవానీపురం హెచ్‌బీ కాలనీ, ఉర్మిళానగర్, విద్యాధరపురం, గొల్లపూడి, రాయనపాడు, నల్లకుంట, గుంటుపల్లి నీట మునిగాయి.
సంబంధాలు పూర్తిగా తెగిన కాలనీలు
సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, నందమూరినగర్, భరతమాత కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ వాంబే కాలనీ, అయోధ్యనగర్, ఊర్మిళా నగర్ ప్రాంతాలకు చేరుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ 1.5 లక్షల మంది వరద నీటిలో చిక్కుకున్నారు. మొత్తంమ్మీద సుమారు మూడున్నర లక్షల మందికి పైగా వరద ముంపు బారిన పడ్డారు.
కళ్లెదుటే కొట్టుకుపోయాయి..
మంచాలు.. టీవీలు.. కార్లు.. బైకులు.. కళ్లముందే క్షణాల్లో కొట్టుకుపోవడంతో నిర్వేదంగా మిగిలిపోయారు. సింగ్‌నగర్, ఇందిరానాయక్ నగర్, పాయకాపురం, న్యూరాజరాజేశ్వరీపేట, వాంబేకాలనీ, రాజీవ్‌నగర్, కండ్రిక, రామకృష్ణాపురం, దేవినగర్, మధ్యకట్ట, దావుబుచ్చయ్యకాలనీ, గద్దెవారి పొలాల పరిసర ప్రాంతాల్లో ఆదివారం కనిపించిన దయనీయ పరిస్థితి ఇదీ!! బుడమేరు ఉప్పొంగడంతో పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. పైనుంచి వరద రావడంతో శనివారం రాత్రే కొత్తూరు సమీపంలోని బుడమేరు గేట్లను ఎత్తివేశారు. ఈ సమాచారాన్ని బుడమేరు పరిసర ప్రాంతాల నివాసితులకు చేరవేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో లక్షలాది మంది కట్టుబట్టలతో రోడ్ల పాలయ్యారు.
సీఎం ఎదుట బాధితుల ఆక్రోశం
విజయవాడలో ముంపు ప్రాంతాల ప్రజలు ఆదివారం ఉదయం నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. రహదారులు మునిగిపోవడంతో జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. ప్రభుత్వం వారిని బయటికి తెచ్చే ప్రయత్నం చేయకుండా వారి ఖర్మకు వదిలేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో భోజనం, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయలేకపోయారు. ఇంత మంది వరదలో చిక్కుకుంటే ఏడు మాత్రమే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సాయంత్రం వరకు రెస్క్యూ టీములు, పడవలు లేవు. కొంత మంది ట్రాక్టర్ల సహాయంతో బయటపడ్డారు. వరద ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తమను పట్టించుకున్న నాథుడే లేడని, కనీసం తాగునీరు కూడా అందలేదని స్వయంగా సీఎం చంద్రబాబు ఎదుట బాధితులు ఆక్రోశించారు. విజయవాడలో వరదలో చిక్కుని ఇద్దరు మరణించగా మరొకరు గల్లంతు అయ్యారు.
పిల్లల కోసం ఉరుకులు.. పరుగులు..
సింగ్‌నగర్, న్యూరాజరాజేశ్వరీపేట, వాంబేకాలనీ పరిసర ప్రాంతాల్లో వారంతా దాదాపుగా కూలి పనులు చేసుకునేవారే. తెల్లవారుజామున పిల్లలను ఇంట్లో వదిలిపెట్టి పనులకు వెళ్లిపోయారు. సింగ్‌నగర్ పరిసర ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నట్లు తెలియడంతో ఉరుకులు పెట్టారు. సీఎం బందోబస్తు పేరుతో అధికారులు వారిని అడ్డుకున్నారు. సాయంత్రానికి నీటి ప్రవాహం పెరిగిపోవడంతో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వారిని లోపలకు వెళ్లకుండా నిలిపివేశారు. దీంతో పిల్లల జాడ తెలియక తల్లిదండ్రులు.. కన్నవారి కోసం చిన్నారులు తల్లడిల్లారు.
న్యూ రాజరాజేశ్వరీపేట, ఇందిరా నాయక్‌నగర్, నందమూరినగర్, సింగ్‌నగర్ ప్రాంతాలన్నీ నీట మునిగినా మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఎలాంటి సహాయ చర్యలు చేపట్టలేదు. దీంతో బాధితులు పూర్తిగా నీటిలో చిక్కుకుపోయారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటనతో అధికార యంత్రాంగం అంతా సహాయ చర్యలను పక్కనబెట్టి అక్కడకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment