దౌర్జన్యంగా అగ్రిమెంట్లు! | TDP Yellow Syndicate Politics in Liquor Shops Licenses | Sakshi
Sakshi News home page

దౌర్జన్యంగా అగ్రిమెంట్లు!

Published Wed, Oct 16 2024 4:16 AM | Last Updated on Wed, Oct 16 2024 4:17 AM

TDP Yellow Syndicate Politics in Liquor Shops Licenses

అడిగినంత వాటాలిస్తారా?.. మద్యం షాపు వదిలేస్తారా? 

లాటరీ తంతు ముగియడంతో ఎల్లో సిండికేట్‌ బెదిరింపుల పర్వం

మమ్మల్ని ధిక్కరిస్తే దుకాణాలకు కనీసం గదులు కూడా దక్కవ్‌ 

ఎక్సైజ్, పోలీసు దాడులు సరేసరి.. వ్యాపారం నిర్వహించలేరంటూ హెచ్చరికలు 

దౌర్జన్యాలు... గుడ్‌విల్‌కు ఒప్పిస్తూ సంతకాలు.. పర్మిట్‌ అమ్మేస్తున్నట్లు బలవంతంగా అగ్రిమెంట్లు  

సాక్షి నెట్‌వర్క్‌: మద్యం దుకాణాల లాటరీ తంతు ముగియడంతో అక్కడక్కడా స్వల్పంగా షాపులు దక్కించుకున్న ఇతరులకు టీడీపీ సిండికేట్‌ చుక్కలు చూపిస్తోంది. రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకుగానూ లాటరీ ముసుగులో 80 శాతం షాపులను  ఏకపక్షంగా దక్కించుకున్న టీడీపీ సిండికేట్‌ మిగిలిన 20 శాతం షాపుల లైసెన్సులు పొందిన వారిని నయాన భయాన దారికి తెచ్చుకుంటోంది. 

తమను ధిక్కరించి వ్యాపారం చేయలేరని.. వాటాలు చెల్లిస్తారో, దుకాణాలు అప్పగిస్తారో తేల్చుకోవాలని లేదంటే ఎక్సైజ్, పోలీసు దాడులు తప్పవని తీవ్ర బెదిరింపులకు గురి చేస్తోంది. టీడీపీ మద్యం సిండికేట్‌ దందాకు అధికార యంత్రాంగం జీ హుజూర్‌ అనడంతో రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన లాటరీ ప్రక్రియ ఓ ప్రహసనంగా ముగిసిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ కొనసాగింది.  

మంత్రి జనార్ధన్‌రెడ్డి వర్గం బెదిరింపులు..
బనగానపల్లె నియోజకవర్గంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న ఇతరులు గుడ్‌విల్‌ తీసుకుని తమకు అప్పగించాలని లేదంటే 25 శాతం వాటా ఇవ్వాలని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. తమ మాట వినకుంటే అద్దెకు గదులు కూడా దక్కకుండా చేస్తామని మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి వర్గం హెచ్చరిస్తోంది.  

⇒ డోన్‌లో 16 దుకాణాలు ఉండగా ధర్మవరం సుబ్బారెడ్డికి 3, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ వర్గానికి 2, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వర్గానికి రెండు, ఎస్సీవై రెడ్డి కుమారైకు ఒకటి, మిగతా 8 దుకాణాలను  ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వర్గం దక్కించుకుంది.  

⇒ కోడుమూరులో టీడీపీ ఇన్‌చార్జీ విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో సిండికేట్‌గా ఏర్పడి తమ వర్గంలో చేరాలని ఇతరులను ఒత్తిడి చేస్తున్నారు.   

⇒ నంద్యాలలో 30 శాతం కమీషన్‌ ఇవ్వాలని మంత్రి ఫరూక్‌ కుమారుడు ఫిరోజ్‌ బెదిరిస్తున్నారు. దీంతో ఇద్దరు వ్యక్తులు దుకాణాలను టీడీపీకే గుడ్‌విల్‌కు ఇచ్చేశారు. ఒక్కో షాపు రూ.20 లక్షల చొప్పున విక్రయించినట్లు సమాచారం.  

⇒ శ్రీశైలంలో 25 శాతం వాటా లేదంటే గుడ్‌విల్‌కు దుకాణాలు తమకు ఇవ్వాలని ఎమ్మెల్యే బుడ్డా వర్గీయులు చెబుతున్నారు. 

⇒ పత్తికొండలో దుకాణాలు దక్కించుకున్న వారికి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు వర్గీయులు ఫోన్‌ చేసి వాటిని తమకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే తమతో ఉండాలని చెబుతున్నారు. 
   
కప్పం కట్టలేక షాపు వదిలేసి..
చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్‌సీపీకి చెందిన కల్లు బాల, కృష్ణారెడ్డి, కర్ణాటకకు చెందిన దుర్గాప్రసాద్‌కు లక్కీడిప్‌లో మద్యం దుకాణాలు దక్కాయి. అయితే ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి సోదరుడు విష్ణువర్థన్‌రెడ్డి బెదిరించి వారి నుంచి వాటిని లాక్కున్నారు. కల్లు బాల సతీమణి ఎస్‌ భారతి పేరున బైరెడ్డిపల్లి మద్యం దుకాణం లాటరీ ద్వారా వచ్చింది. 

షాపును దక్కించుకున్న కల్లు బాలను ఎమ్మెల్యే సోదరుడు ఇంటికి పిలిపించుకుని అనుచరులతో దాడి చేశాడు. తమను కాదని మరెవరూ షాపు నడపటానికి వీల్లేదని, స్థలం ఎవరు ఇస్తారో చూస్తామంటూ హెచ్చరించాడు. రూ.కోటి కప్పం కట్టాలని ఆదేశించడంతో లాటరీ ద్వారా వచ్చిన దుకాణాన్ని కల్లు బాల వదులుకున్నారు. కృష్ణారెడ్డి తనకు లాటరీలో వచ్చిన మద్యం దుకాణాన్ని వదిలేసుకున్నారు. వారిని బెదిరించి మద్యం దుకాణం పర్మిట్‌ అమ్ముకున్నట్లు బలవంతంగా అగ్రిమెంట్‌ రాయించుకున్నారు. కర్ణాటకకు చెందిన దుర్గాప్రసాద్‌ ఆచూకీ తెలియరాలేదు.  

⇒ పూతలపట్టులో ఎమ్మెల్యే మురళీమోహన్‌ వర్గీయులు స్థానిక సీఐ ద్వారా టెండర్లు దక్కించుకున్న మద్యం వ్యాపారులతో మంతనాలు నెరిపారు. దుకాణాలను వదులు కోవాలని లేదంటే వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు లక్కీ డిప్‌ తీసే రోజు నేరుగా కలెక్టర్‌కే ఫోన్‌ చేసి తమ వారికే దుకాణాలు దక్కేలా చూడాలని కోరినట్లు తెలిసింది. కలెక్టర్‌ స్పందించకపోవటంతో టెండర్లు దక్కించుకున్న వారిని ఎక్సైజ్‌ పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారు. 

⇒ తిరుపతిలో 32 దుకాణాలకు జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బినామీ పేర్లతో 350 దరఖాస్తులు చేయగా ఆరు షాపులు దక్కాయి. దుకాణాలు నడవాలంటే తమకు వాటా ఇవ్వాల్సిందేనని ఇతరులను బెదిరిస్తున్నారు. శ్రీకాళహస్తి, గూడూరులో దరఖాస్తు దారులను ముందే పిలిచి ఎమ్మెల్యేలు అడిగినంత వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. 

కడపలో నేరుగా బేరసారాలు..
⇒ వైఎస్సార్‌ కడప జిల్లాలో మద్యం షాపు సవ్యంగా నిర్వహించుకోవాలంటే 50 శాతం భాగస్వామ్యం ఇవ్వాలని కొందరు హెచ్చరిస్తుండగా పూర్తిగా తమకే అప్పగించాలని మరికొందరు అల్టిమేటం జారీ చేస్తున్నారు. కడపలో టీడీపీయేతర వర్గీయులకు చెందిన మద్యం షాపులల్లో 50 శాతం వాటా ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి బేరసారాలకు దిగారు. జనసేన వర్గీయులకు మూడు మద్యం దుకాణాలు లభించగా ఒక్కొక్కటి రూ.15 లక్షలు చొప్పున గుడ్‌విల్‌కు అప్పగించారని సమాచారం. 

జమ్మలమడుగులో ప్రతి షాపులో 30 శాతం వాటా ఇవ్వాలంటూ టీడీపీ ఇన్‌చార్జీ దేవగుడి భూపేష్‌ రెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. ముద్దనూరు షాపు పూర్తిగా తమకే ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. కమలాపురంలో పునీత్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి మూసివేయించారు. తాము వారించినా వినకుండా చెన్నూరు మద్యం షాపు కోసం దరఖాస్తు చేశారంటూ దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం.  

ధర్మవరంలో పరిటాల వర్గం పర్యవేక్షణ.. 
⇒ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న తటస్థులు కూటమి నాయకుల బెదిరింపులతో షాపులను అప్పగించినట్లు సమాచారం. ఈ సిండికేట్‌ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరాం ఆధ్వర్యంలో జరుగుతోంది. సోమందేపల్లిలో  లైసెన్స్‌దారు దీక్షితను బెదిరించి గుడ్‌విల్‌కు షాపు దక్కించుకున్నారు. సీకే పల్లి స్టేషన్, కదిరి పరిధిలో దుకాణాలకు సంబంధించి పంచాయితీ కొనసాగుతోంది. హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో షాపు దక్కించుకుని ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించిన రంగనాథ్‌ నుంచి దుకాణం లాక్కునేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.  

⇒ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 127వ మద్యం షాపును దక్కించుకున్న హోటల్‌ నిర్వాహకుడు దినేష్‌ కుమార్‌ నాయుడు లొంగకపోవడంతో టీడీపీ నేతలు మునిసిపల్‌ అధికారులను ఉసిగొల్పి హోటల్లో తనిఖీలు జరిపి నోటీసులు ఇప్పించారు. 

చేయి కలిపితేనే సహకారం..
⇒ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అమలాపురం కొత్తపేట, ముమ్మిడివరం పరిధిలో సిండికేట్‌ ప్రాబల్యం అధికంగా ఉంది. దుకాణాలు దక్కించుకున్నవారు ఇతరులు తమతో చేయి కలపాలని ఒత్తిడి చేస్తున్నారు. రావులపాలెం మండలం ఈతకోటలో మద్యం షాపు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న ఇతరులను సిండికేట్‌ ఒత్తిడితో స్థానికులు అభ్యంతరం చెబుతున్నారు. ముమ్మిడివరంలో దుకాణాలు పొందిన మిగిలినవారిని తమ సిండికేట్‌లోకి తెచ్చుకునేందుకు టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులు సామ, దాన, భేద, దండోపాయాలు ప్రదర్శిస్తున్నారు.  

⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మండలాలకు గాను ఒక్కో చోట నాలుగు నుంచి తొమ్మిది వరకు షాపులు ఏర్పాటు అవుతున్నాయి. కొత్త పాలసీ ప్రకారం షాపులు దక్కినవారు మండలంలో ఎక్కడైనా షాపు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో అమ్మకాలు ఎక్కువగా జరిగే మండల కేంద్రాలు, మేజర్‌ పంచాయతీల్లో షాపుల ఏర్పాటుకు సిద్ధమయ్యారు.  

⇒ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వర్గానికి 11 దుకాణాలు దక్కాయి. మిగిలిన షాపులు పొందిన వారు 25 శాతం కమీషన్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, మంత్రి కందుల దుర్గేష్‌ వర్గం ఇతరుల నుంచి 25 శాతం కమీషన్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.  

⇒ కాకినాడ జిల్లాలో కొత్తగా మద్యం వ్యాపారంలోకి ప్రవేశించిన వారిని సిండికేట్‌ నయానా భయానా దారిలోకి తెచ్చుకుంటోంది. తొండంగి, కోటనందూరు, తునిలో ఏడు షాపులు దక్కించుకున్న వారు కౌన్సెలింగ్‌లో మాట వినకపోవడంతో వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఎక్సైజ్‌ పోలీసులు మీకు ఎలా సహకరిస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కాకినాడ సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో ఒక్కో షాపులో 20 శాతం వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.  

వెనిగండ్ల వర్గం వార్నింగ్‌లు
⇒ కృష్ణా జిల్లా పామర్రులో 75 శాతం షాపులను దక్కించుకున్న టీడీపీ నేతలు మిగిలిన వారిని వాటాలు ఇవ్వాలని ఫోన్లు చేస్తున్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోదరుడు షాపులు దక్కించుకున్న వారిని తన అనుచరులతో కలసి బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. వంగవీటి రాధా, కాజ రాజ్‌కుమార్‌ వర్గీయులు గుడివాడలో ఐదు షాపులు దక్కించుకున్నారు. ఎమ్మెల్యే వర్గానికి వారు ఎదురు తిరిగినట్లు సమాచారం.  

ఉదయభాను వర్గం ఒప్పందాలు.. 
గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సిండికేట్‌ 11 షాపులను దక్కించుకుంది. మిగిలిన 12 దుకాణాలను టీడీపీ నేతలు, గతంలో మద్యం వ్యాపారంలో ఉన్న వ్యక్తులు దక్కించుకున్నారు. పెనుగంచిప్రోలులో విజయవాడకు చెందిన ఓ వ్యక్తి దుకాణాన్ని దక్కించుకోగా గుడ్‌ విల్‌ కింద జనసేన నేత ఉదయభాను వర్గం రూ.90 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. 

జగ్గయ్యపేటలో దుకాణం పొందిన తెలంగాణ వాసితో ఎమ్మెల్యే సోదరుడు గుడ్‌విల్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. తిరువూరులో తెలంగాణ వ్యాపారులే ఎక్కువ షాపులు దక్కించుకున్నారు. మైలవరంలో 15 షాపులకుగానూ టీడీపీ సిండికేట్‌కే 14 దక్కాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ బావమరిది పోసాని కోటేశ్వరరావు కనుసన్నల్లో టీడీపీ నాయకులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. నందిగామలో షాపులన్నీ ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులకే దక్కాయి. 

పల్నాడులో డబ్బులు కడితేనే..
⇒ పల్నాడు జిల్లాలో తాము చెప్పిన మొత్తం తీసుకొని దుకాణాలు అప్పగించాలని లేదంటే 50 శాతం వాటా ఇవ్వాలని సిండికేట్‌ బెదిరిస్తోంది. నరసరావుపేట నియోజకవర్గంలో మద్యం పంచాయితీ ఇంకా తేలలేదు. సత్తెనపల్లిలో రూ.30 లక్షలు కట్టిన తరువాతే దుకాణాలు తెరుచుకోవాలని ఓ టీడీపీ నేత అల్టిమేటం జారీ చేశారు. పెదకూరపాడులో ప్రతి దుకాణంలో 20 వాటా ఇవ్వాలని లెక్క తేల్చారు.   

⇒ బాపట్ల జిల్లాలో టెండర్లకు ముందే రేపల్లె, వేమూరు, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో  సిండికేట్‌ ఏర్పాటైంది. తమతో కలవకుంటే షాపులు నిర్వహించలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారు.  

టెక్కలిలో ఏకఛత్రాధిపత్యం
⇒ టెక్కలి నియోజకవర్గంలో ప్రత్యర్థులే లేకుండా పోవడంతో కీలక నేత సోదరుడి కనుసన్నల్లోనే షాపులన్నీ నడుస్తున్నాయి.  
⇒ నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో నాలుగు షాపులు దక్కించుకున్న ఇతరులకు ఫోన్‌ చేసిన ఓ ఎమ్మెల్యే ఒక్కో దుకాణానికి రూ.25 లక్షలు చొప్పున ఇస్తానంటూ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. 

⇒ నరసన్నపేటలో 76వ నెంబర్‌ షాపు అప్పగించినందుకు ఏడాదికి రూ.20 లక్షలు చెల్లిస్తామన్న టీడీపీ ప్రజాప్రతినిధి ఆఫర్‌కు అంగీకరించినట్లు తెలుస్తోంది.  
⇒ పాతపట్నంలో పలు దుకాణాలు ఒడిశాకు చెందిన వ్యాపారులకు దక్కడంతో వారికి ఎమ్మెల్యే అనుచరులు ఫోన్‌ చేసి గుడ్‌విల్‌కు ఇచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలసలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement