సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచడంతో మందు బాబులు తాగుడు తగ్గించేశారు. గత రెండు రోజుల నుంచి మద్యం వినియోగం బాగా తగ్గింది. సాధారణంగా వారాంతంలో మద్యం వినియోగం అధికంగా ఉంటుంది. రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతుంటాయి. అలాంటిది శనివారం మద్యం షాపులు మూసే సమయానికి కేవలం రూ.40.77 కోట్ల అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే మద్యం ధరల పెరుగుదల ప్రభావం మందు బాబులపై ఊహించిన దానికంటే ఎక్కువ పడింది.
మద్యం కొనాలంటేనే మందు బాబులు భయపడుతున్నారు. మరోవైపు అక్రమ మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. నాటు సారా, సుంకం చెల్లించని మద్యం (ఎన్‌డీపీఎల్) అమ్మకాలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉండేలా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) పేరిట శనివారం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మద్యం షాపుల్ని ఈ నెలాఖరు నాటికి 13 శాతం తగ్గిస్తే మద్యం వినియోగం ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో తగ్గే 566 మద్యం షాపుల వివరాలపై ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్లు రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.
ఒక్క రోజులోనే రూ.2 కోట్లకు పైగా తగ్గిన అమ్మకాలు
► రాష్ట్రంలో ఈ నెల 8 (శుక్రవారం)న మద్యం, బీరు కలిపి 15.55 లక్షల బాటిళ్లు విక్రయించారు. అమ్మకాల విలువ రూ.42.72 కోట్ల వరకు ఉంది.
► శనివారం 15.40 లక్షల బాటిళ్లను మాత్రమే మద్యం ప్రియులు కొనుగోలు చేయగా, విక్రయాల విలువ రూ.40.77 కోట్లకు తగ్గిపోయింది.
► వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక 2020 జనవరి నుంచి ఏప్రిల్ వరకు మద్యం అక్రమాలకు పాల్పడుతున్న వారిపై 7,812 కేసులు నమోదు చేసింది. 5,870 మందిని అరెస్టు చేసి, 97,482 లీటర్ల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో తగ్గుతున్న మద్యం వినియోగం
Published Mon, May 11 2020 5:01 AM | Last Updated on Mon, May 11 2020 9:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment