సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో ఎలాంటి విషపూరిత అవశేషాలు లేవని.. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం కచ్చితంగా పూర్తి నాణ్యత పాటిస్తున్నామని ఏపీ, తెలంగాణ లిక్కర్, బీర్ సరఫరాదారుల అసోసియేషన్ స్పష్టం చేసింది. మద్యాన్ని మూడు దశల్లో ప్రభుత్వ ల్యాబొరేటరీల్లో పరీక్షించిన అనంతరమే ఎక్సైజ్ శాఖ అనుమతితో మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నామని వెల్లడించింది.
విజయవాడలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.కామేశ్వరరావు మాట్లాడుతూ.. మద్యంలో విషపూరిత అవశేషాలు ఉన్నట్టుగా తాము నివేదిక ఇవ్వలేదని చెన్నైలోని ఎస్‌జీఎస్ ల్యాబొరేటరీ కూడా స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎవరికైనా సందేహాలు ఉంటే తమ డిస్టిలరీలకు వచ్చి పరిశీలించుకోవచ్చన్నారు.
‘మద్యం ప్రైమరీ ప్రొడక్ట్‌ను మొదట ప్రభుత్వ కెమికల్ ల్యాబొరేటరీలో పరీక్షించి ఆమోదించిన తరువాతే ఉత్పత్తిని తయారు చేస్తారు. దాన్ని తీసుకుని మేం బ్లెండ్ చేసి మరోసారి ప్రభుత్వ ల్యాబొరేటరీకి పరీక్ష నిమిత్తం పంపిస్తాం. అక్కడ కూడా పరీక్షించి ఆమోదించిన తరువాతే మద్యం ఉత్పత్తిని ప్రారంభిస్తాం. ఆ విధంగా ఉత్పత్తి చేసిన మద్యాన్ని మరోసారి ప్రభుత్వ ల్యాబొరేటరీలో పరీక్షించి ఆమోదించిన తరువాతే మారెŠక్ట్‌లోకి విడుదల చేస్తాం’ అని ఆయన వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో విక్రయిస్తున్న మద్యం నాణ్యతపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన చెప్పారు. టీడీపీ నేతలు చెప్పిన ప్రమాదకర అవశేషాలేవి మద్యంలో లేనే లేవన్నారు. మద్యం తయారీ, బాట్లింగ్, ప్యాకింగ్, రవాణా వరకూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. తమ సొంత ల్యాబ్‌లతోపాటు ప్రభుత్వ ల్యాబొరేటరీలలో పరీక్షించిన అనంతరమే మద్యం ఉత్పత్తులు స్కాన్ అవుతాయన్నారు. నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించుకునేందుకు నావల్ ల్యాబొరేటరీలో కూడా పరీక్షించి ఆమోదం తీసుకుంటున్నామన్నారు. ఈ విధంగా మూడు దశాబ్దాలుగా మద్యం నాణ్యత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటున్నామని ఆయన చెప్పారు.
డిమాండ్‌ను బట్టే అందుబాటులో బ్రాండ్లు
ఏయే బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులో ఉంచాలన్నది వినియోగదారుల డిమాండ్‌ను బట్టి ఉంటుందని కామేశ్వరరావు చెప్పారు. దాదాపు అన్ని ప్రధాన బ్రాండ్లు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గతంలో ధర గిట్టుబాటు కాక కొన్ని బ్రాండ్లు మార్కెట్‌లోకి రాలేదని.. మళ్లీ ధర గిట్టుబాటు అయితే అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నవే మంచి బ్రాండ్లు అన్నది కేవలం అపోహ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
ఒక్కో కంపెనీకి నాలుగైదు బ్రాండ్లు ఉంటాయని ఆయన చెప్పారు. ఫలానా బ్రాండు మద్యాన్నే విక్రయించాలని ప్రభుత్వం నుంచి గానీ ఎవరి నుంచి గానీ తమపై ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. తెలంగాణతో పోలిస్తే మద్యం సరఫరాకు ఏపీ ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలు తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. మద్యం సరఫరా ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు సత్యనారాయణరెడ్డి (ఈగల్ డిస్టిలరీస్), చంద్రశేఖర్ (పీఎంకే డిస్టిలరీస్), వెంకటేశ్వరరావు (అంబర్ స్పిరిట్స్) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment