Andhra Pradesh liquor policy
-
ఏపీ మద్యం విధానం సరైనదే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తి సహేతుకమైదని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏకస్వామ్య విధానాలను నిరోధించేందుకు ఉద్దేశించిన ‘కాంపిటిషన్ యాక్ట్ – 2002’కు అనుగుణంగానే ఉందని కూడా తేల్చి చెబుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దశలవారీ మద్య నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని దేశంలో ప్రముఖ విదేశీ మద్యం తయారీ కంపెనీలు వ్యతిరేకించాయి. 8 పెద్ద కార్పొరేట్ మద్యం కంపెనీలు సభ్యులుగా ఉన్న ‘ఇంటర్నేషనల్ స్పిరిట్స్ – వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని ‘కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ను ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం మద్యం దుకాణాలను ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించడాన్ని ఆ సంఘం వ్యతిరేకించింది. మద్యం కొనుగోలు, అమ్మకాలు పూర్తిగా బెవరేజస్ కార్పొరేషన్ నిర్వహించడం కాంపిటిషన్ యాక్ట్‌కు విరుద్ధమని వాదించింది. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మద్యం విక్రయాలు తగ్గాయన్న బెవరేజస్ కార్పొరేషన్ వాదన సరికాదని కూడా చెప్పుకొచ్చాయి. ఆ సంఘం ఆరోపణలను రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ సమర్థంగా తిప్పికొట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచి్చన కొత్త మద్యం విధానం పూర్తిగా చట్ట నిబంధనలకు లోబడే ఉందని స్పష్టం చేసింది. కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేయడంతో పాటు మద్యం దుకాణాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్న విధానాన్ని కూడా వివరించింది. ఈ విధానం వల్ల రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయని గణాంకాలతో సహా వివరించింది. అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లను కొంటున్నామని, వాటికి చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నామని రికార్డులతో సహా వెల్లడించింది. బెవరేజస్ కార్పొరేషన్ బకాయిలు పెడుతోందన్న కొన్ని మద్యం కంపెనీల వాదనలో నిజం లేదని వివరించింది. ఇరు పక్షాల వాదనలను విన్న కాంపిటిషన్ కమిషన్ తన తీర్పును వెలువరించింది. ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ అనుసరిస్తున్న మద్యం విధానం చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉందని తీర్పులో స్పష్టం చేసింది. బెవరేజస్ కార్పొరేషన్ చేసుకున్న మద్యం సరఫరా ఒప్పందాలు అన్నీ చట్టానికి లోబడే ఉన్నాయని చెప్పింది. బెవరేజస్ కార్పొరేషన్ మద్యం డిమాండ్‌ను కృత్రిమంగా సృష్టిస్తోందన్న అభియోగాలు నిరాధారమని వెల్లడించింది. ‘ఇంటర్నేషనల్ స్పిరిట్స్ – వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ లేవనెత్తిన అభ్యంతరాలు హేతుబద్ధంగా లేవని చెప్పింది. అందువల్ల ఈ కేసును మూసివేస్తున్నట్టు ప్రకటించింది. -
రాష్ట్రంలో మద్యం కచ్చితంగా నాణ్యమైనదే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో ఎలాంటి విషపూరిత అవశేషాలు లేవని.. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం కచ్చితంగా పూర్తి నాణ్యత పాటిస్తున్నామని ఏపీ, తెలంగాణ లిక్కర్, బీర్ సరఫరాదారుల అసోసియేషన్ స్పష్టం చేసింది. మద్యాన్ని మూడు దశల్లో ప్రభుత్వ ల్యాబొరేటరీల్లో పరీక్షించిన అనంతరమే ఎక్సైజ్ శాఖ అనుమతితో మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని వెల్లడించింది. విజయవాడలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.కామేశ్వరరావు మాట్లాడుతూ.. మద్యంలో విషపూరిత అవశేషాలు ఉన్నట్టుగా తాము నివేదిక ఇవ్వలేదని చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబొరేటరీ కూడా స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎవరికైనా సందేహాలు ఉంటే తమ డిస్టిలరీలకు వచ్చి పరిశీలించుకోవచ్చన్నారు. ‘మద్యం ప్రైమరీ ప్రొడక్ట్‌ను మొదట ప్రభుత్వ కెమికల్ ల్యాబొరేటరీలో పరీక్షించి ఆమోదించిన తరువాతే ఉత్పత్తిని తయారు చేస్తారు. దాన్ని తీసుకుని మేం బ్లెండ్ చేసి మరోసారి ప్రభుత్వ ల్యాబొరేటరీకి పరీక్ష నిమిత్తం పంపిస్తాం. అక్కడ కూడా పరీక్షించి ఆమోదించిన తరువాతే మద్యం ఉత్పత్తిని ప్రారంభిస్తాం. ఆ విధంగా ఉత్పత్తి చేసిన మద్యాన్ని మరోసారి ప్రభుత్వ ల్యాబొరేటరీలో పరీక్షించి ఆమోదించిన తరువాతే మారెŠక్ట్‌లోకి విడుదల చేస్తాం’ అని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో విక్రయిస్తున్న మద్యం నాణ్యతపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన చెప్పారు. టీడీపీ నేతలు చెప్పిన ప్రమాదకర అవశేషాలేవి మద్యంలో లేనే లేవన్నారు. మద్యం తయారీ, బాట్లింగ్, ప్యాకింగ్, రవాణా వరకూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. తమ సొంత ల్యాబ్‌లతోపాటు ప్రభుత్వ ల్యాబొరేటరీలలో పరీక్షించిన అనంతరమే మద్యం ఉత్పత్తులు స్కాన్ అవుతాయన్నారు. నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించుకునేందుకు నావల్ ల్యాబొరేటరీలో కూడా పరీక్షించి ఆమోదం తీసుకుంటున్నామన్నారు. ఈ విధంగా మూడు దశాబ్దాలుగా మద్యం నాణ్యత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటున్నామని ఆయన చెప్పారు. డిమాండ్‌ను బట్టే అందుబాటులో బ్రాండ్లు ఏయే బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులో ఉంచాలన్నది వినియోగదారుల డిమాండ్‌ను బట్టి ఉంటుందని కామేశ్వరరావు చెప్పారు. దాదాపు అన్ని ప్రధాన బ్రాండ్లు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గతంలో ధర గిట్టుబాటు కాక కొన్ని బ్రాండ్లు మార్కెట్లోకి రాలేదని.. మళ్లీ ధర గిట్టుబాటు అయితే అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నవే మంచి బ్రాండ్లు అన్నది కేవలం అపోహ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఒక్కో కంపెనీకి నాలుగైదు బ్రాండ్లు ఉంటాయని ఆయన చెప్పారు. ఫలానా బ్రాండు మద్యాన్నే విక్రయించాలని ప్రభుత్వం నుంచి గానీ ఎవరి నుంచి గానీ తమపై ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. తెలంగాణతో పోలిస్తే మద్యం సరఫరాకు ఏపీ ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలు తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. మద్యం సరఫరా ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు సత్యనారాయణరెడ్డి (ఈగల్ డిస్టిలరీస్), చంద్రశేఖర్ (పీఎంకే డిస్టిలరీస్), వెంకటేశ్వరరావు (అంబర్ స్పిరిట్స్) తదితరులు పాల్గొన్నారు. -
ఆ హెల్త్ డ్రింక్‌ను ఆస్పత్రుల్లో ఇస్తారేమో!
మంత్రి జవహర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజం హైదరాబాద్: ‘బీరు హెల్త్ డ్రింక్’ అని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి జవహర్ మాట్లాడడం ఆశ్చర్యం, హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. దానిని మెడికల్ షాపుల్లో ఏమైనా అమ్మదలుచుకున్నారా? ఆస్పత్రుల్లో రోగులకు ఇస్తారా? అని మంత్రిని ప్రశ్నించారు. మంగళవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన జవహర్.. బీర్ హెల్త్ డ్రింక్ అని మాట్లాడటం దారుణమన్నారు. గిరిజన ప్రాంతాల్లో విష జ్వరా లు వ్యాపించి అనేక మంది మృత్యువాత పడితే.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి ప్రలోభాలకు తలొగ్గి పార్టీ ఫిరాయించిన ఎంపీ కొత్తపల్లి ఎస్టీ కాదని తాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. -
రాష్ట్రంలో బీరు పాలన: రోజా
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల జీవితాలతో చెలగాట మాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజా మండిపడ్డారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలకు తిండి, నీళ్లు, పనులు లేక అల్లాడుతుంటే.. చంద్రబాబు మాత్రం తాగినోళ్లకు తాగినంత బీరు.. బారు అంటూ గడపగడపకూ మద్యాన్ని తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జవహర్ బీరును హెల్త్ డ్రింక్‌గా ప్రకటించడంపై రోజా మండిపడ్డారు. అవి తాగే కేబినెట్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా? అంటూ ధ్వజమెత్తారు. మహిళల తాళిబొట్లు తెగినా పర్లేదు.. కమీషన్లు కావాలి, ఖజానా నిండాలనే బాబు బారు పాలసీలను తీసుకురావడం దురదృష్టకరమన్నారు. జనావాసాలు, స్కూళ్లు, గుళ్ల వద్ద మద్యం షాపులు పెట్టాలనుకుంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని, అవన్నీ పగలగొట్టే కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే మహిళల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా తాము సిద్ధమన్నారు. హెరిటేజ్ వ్యాన్‌లోని ఎర్రచందనం దుంగలమీద బాబు మాట్లాడకపోతే ఇకనుంచి ఆయన్ను ఎర్రచంద్రం అని పిలవడం ఖాయమని ఎద్దేవా చేశారు.