ఏపీ మద్యం విధానం సరైనదే  | Competition Commission of India On AP Liquor Policy | Sakshi
Sakshi News home page

ఏపీ మద్యం విధానం సరైనదే 

Published Wed, Sep 28 2022 3:55 AM | Last Updated on Wed, Sep 28 2022 3:55 AM

Competition Commission of India On AP Liquor Policy - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తి సహేతుకమైదని కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఏకస్వామ్య విధానాలను నిరోధించేందుకు ఉద్దేశించిన ‘కాంపిటిషన్‌ యాక్ట్‌ – 2002’కు అనుగుణంగానే ఉందని కూడా తేల్చి చెబుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దశలవారీ మద్య నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని దేశంలో ప్రముఖ విదేశీ మద్యం తయారీ కంపెనీలు వ్యతిరేకించాయి.

8 పెద్ద కార్పొరేట్‌ మద్యం కంపెనీలు సభ్యులుగా ఉన్న ‘ఇంటర్నేషనల్‌ స్పిరిట్స్‌ – వైన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని ‘కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’ను ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం మద్యం దుకాణాలను ఏపీ బెవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా నిర్వహించడాన్ని ఆ సంఘం వ్యతిరేకించింది. మద్యం కొనుగోలు, అమ్మకాలు పూర్తిగా బెవరేజస్‌ కార్పొరేషన్‌ నిర్వహించడం కాంపిటిషన్‌ యాక్ట్‌కు విరుద్ధమని వాదించింది.

కొత్త విధానం అమల్లోకి  వచ్చిన తరువాత రాష్ట్రంలో మద్యం విక్రయాలు తగ్గాయన్న బెవరేజస్‌ కార్పొరేషన్‌ వాదన సరికాదని కూడా చెప్పుకొచ్చాయి. ఆ సంఘం ఆరోపణలను రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌ సమర్థంగా తిప్పికొట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచి్చన కొత్త మద్యం విధానం పూర్తిగా చట్ట నిబంధనలకు లోబడే ఉందని స్పష్టం చేసింది. కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేయడంతో పాటు మద్యం దుకాణాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్న విధానాన్ని కూడా వివరించింది.

ఈ విధానం వల్ల రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయని గణాంకాలతో సహా వివరించింది. అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లను కొంటున్నామని, వాటికి చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నామని రికార్డులతో సహా వెల్లడించింది. బెవరేజస్‌ కార్పొరేషన్‌ బకాయిలు పెడుతోందన్న కొన్ని మద్యం కంపెనీల వాదనలో నిజం లేదని వివరించింది. ఇరు పక్షాల వాదనలను విన్న కాంపిటిషన్‌ కమిషన్‌ తన తీర్పును వెలువరించింది.

ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌ అనుసరిస్తున్న మద్యం విధానం చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉందని తీర్పులో స్పష్టం చేసింది. బెవరేజస్‌ కార్పొరేషన్‌ చేసుకున్న మద్యం సరఫరా ఒప్పందాలు అన్నీ చట్టానికి లోబడే ఉన్నాయని చెప్పింది. బెవరేజస్‌ కార్పొరేషన్‌ మద్యం డిమాండ్‌ను కృత్రిమంగా సృష్టిస్తోందన్న అభియోగాలు నిరాధారమని వెల్లడించింది.

‘ఇంటర్నేషనల్‌ స్పిరిట్స్‌ – వైన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ లేవనెత్తిన అభ్యంతరాలు హేతుబద్ధంగా లేవని చెప్పింది. అందువల్ల ఈ కేసును మూసివేస్తున్నట్టు ప్రకటించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement