Competition Commission of India
-
సీసీఐ చైర్పర్సన్ నియామకంలో విశేషం! మొదటిసారిగా..
న్యూఢిల్లీ: కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా రవనీత్ కౌర్ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని ఓ మహిళ పూర్తి స్థాయిలో చేపట్టడం ఇదే మొదటిసారి. రవనీత్ కౌర్ 1988 పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ సీసీఐ చైర్ పర్సన్‌గా కౌర్‌తో ప్రమాణం చేయించినట్టు ట్విటర్లో సీసీఐ ప్రకటించింది. సీసీఐ చైర్మన్‌గా అశోక్ కుమార్ గుప్తా పదవీ కాలం 2022 అక్టోబర్‌లో ముగిసింది. అప్పటి నుంచి ఈ పదవికి పూర్తి స్థాయి చైర్పర్సన్ లేరు. కౌర్ నియామకంతో ఈలోటు భర్తీ అయింది. సీసీఐ సభ్యురాలు సంగీత వర్మ గత సంవత్సరం అక్టోబర్ నుంచి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. గూగుల్, యాపిల్‌తో సహా డిజిటల్ స్పేస్‌కు సంబంధించిన వివిధ కేసులను అనుసరిస్తున్న సమయంలో రవనీత్ కౌర్ సీసీఐ పగ్గాలను చేపట్టారు. అలాగే జీఎస్టీ లాభదాయకతకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను సీసీఐ పరిష్కరిస్తోంది. ఇదీ చదవండి: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే.. -
సినిమాకు స్వీయ నియంత్రణ:సీసీఐ
న్యూఢిల్లీ: చలనచిత్ర పరిశ్రమలోని సంఘాలు సభ్యులు కానివారిని నిషేధించడం, బహిష్కరించడం మానుకోవాలని కాంపిటీషన్ కమిషన్ స్పష్టం చేసింది. వాటాదారుల మధ్య విభేదాలను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలను పరిశీలించాలని శుక్రవారం సూచించింది. దేశంలో చిత్ర పంపిణీపై మార్కెట్ అధ్యయనాన్ని సీసీఐ ఈ సందర్భంగా విడుదల చేసింది. పరిశ్రమ అనుసరించేలా వివిధ స్వీయ నిబంధనలను రూపొందించింది. మల్టీప్లెక్స్‌లు, నిర్మాతలు, వర్చువల్ ప్రింట్ ఫీ (వీపీఎఫ్), సినిమాతో ముడిపడి ఉన్న సంఘాలు, డిజిటల్ సినిమాలకు సంబంధించిన స్వీయ నియంత్రణలను ప్రతిపాదించింది. నిర్మాతల వాణిజ్య స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా చిత్రాల ప్రదర్శనలో వాణిజ్యంపై మల్టీప్లెక్స్‌లు ఎలాంటి నియంత్రణ ఉంచరాదని ఈ సందర్భంగా తెలిపింది. -
ఏపీ మద్యం విధానం సరైనదే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తి సహేతుకమైదని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏకస్వామ్య విధానాలను నిరోధించేందుకు ఉద్దేశించిన ‘కాంపిటిషన్ యాక్ట్ – 2002’కు అనుగుణంగానే ఉందని కూడా తేల్చి చెబుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దశలవారీ మద్య నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని దేశంలో ప్రముఖ విదేశీ మద్యం తయారీ కంపెనీలు వ్యతిరేకించాయి. 8 పెద్ద కార్పొరేట్ మద్యం కంపెనీలు సభ్యులుగా ఉన్న ‘ఇంటర్నేషనల్ స్పిరిట్స్ – వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని ‘కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ను ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం మద్యం దుకాణాలను ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించడాన్ని ఆ సంఘం వ్యతిరేకించింది. మద్యం కొనుగోలు, అమ్మకాలు పూర్తిగా బెవరేజస్ కార్పొరేషన్ నిర్వహించడం కాంపిటిషన్ యాక్ట్‌కు విరుద్ధమని వాదించింది. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మద్యం విక్రయాలు తగ్గాయన్న బెవరేజస్ కార్పొరేషన్ వాదన సరికాదని కూడా చెప్పుకొచ్చాయి. ఆ సంఘం ఆరోపణలను రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ సమర్థంగా తిప్పికొట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచి్చన కొత్త మద్యం విధానం పూర్తిగా చట్ట నిబంధనలకు లోబడే ఉందని స్పష్టం చేసింది. కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేయడంతో పాటు మద్యం దుకాణాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్న విధానాన్ని కూడా వివరించింది. ఈ విధానం వల్ల రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయని గణాంకాలతో సహా వివరించింది. అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లను కొంటున్నామని, వాటికి చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నామని రికార్డులతో సహా వెల్లడించింది. బెవరేజస్ కార్పొరేషన్ బకాయిలు పెడుతోందన్న కొన్ని మద్యం కంపెనీల వాదనలో నిజం లేదని వివరించింది. ఇరు పక్షాల వాదనలను విన్న కాంపిటిషన్ కమిషన్ తన తీర్పును వెలువరించింది. ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ అనుసరిస్తున్న మద్యం విధానం చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉందని తీర్పులో స్పష్టం చేసింది. బెవరేజస్ కార్పొరేషన్ చేసుకున్న మద్యం సరఫరా ఒప్పందాలు అన్నీ చట్టానికి లోబడే ఉన్నాయని చెప్పింది. బెవరేజస్ కార్పొరేషన్ మద్యం డిమాండ్‌ను కృత్రిమంగా సృష్టిస్తోందన్న అభియోగాలు నిరాధారమని వెల్లడించింది. ‘ఇంటర్నేషనల్ స్పిరిట్స్ – వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ లేవనెత్తిన అభ్యంతరాలు హేతుబద్ధంగా లేవని చెప్పింది. అందువల్ల ఈ కేసును మూసివేస్తున్నట్టు ప్రకటించింది. -
గూగుల్‌కు రూ.136 కోట్ల జరిమాన వేసిన భారత్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రఖ్యాత సెర్చింజన్ సంస్థ గూగుల్‌కు భారత్ భారీ జరిమానా విధించింది. ఇతర పోటీదారులు, వినియోగదారులకు నష్టం చేకూర్చేలా గూగుల్ ప్రవర్తించినట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పేర్కొంది. గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెల్ కంపెనీ వెబ్‌సెర్చ్‌లో, అడ్వర్టెయిజ్‌మెంట్స్‌లో పైచేయి సాధించేందుకు యత్నించినట్లు తెలిపింది. దీనివల్ల పోటీ సంస్థలు, యూజర్లు నష్టపోయారని చెప్పింది. ఈ మేరకు గూగుల్‌కు రూ. 136 కోట్ల జరిమానా విధించినట్లు వెల్లడించింది. అరవై రోజుల్లోగా గూగుల్ జరిమానాను చెల్లించాల్సివుంటుందని చెప్పింది. -
చిక్కుల్లో గూగుల్ యాజమాన్యం
శాన్ ఫ్రాన్సిస్కో: గూగుల్ సంస్థ తమ కంపెనీల విషయాలను తక్కువ చేసి చూపుతుందని అమెరికా, యూరప్ ఖండాలలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. అదేవిధంగా భారత్ లో కూడా ఈ సమస్యలు తలెత్తుతున్నాయిని పలు కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చెందిన నిఘా విభాగం ఆ సంస్థ తీరుపై తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తడంతో పాటు వివరణ కోరింది. కంపెనీల మధ్య నెలకొన్న కాంపిటీషన్ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. కంపెనీల ఆర్థిక లావాదేవిలు, ఆన్ లైన్ ప్రకటనల ర్యాంకింగ్స్, సేవల వివరాలను గూగుల్ సెర్చ్ ఇంజన్ తప్పుగా చూపిస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్రెజిల్, మెక్సికోలలో సొంత కంపెనీల సేవలను ఎక్కువ చేసి చూపిస్తూ ఇతర కంపెనీల మార్కెట్లను దెబ్బతీస్తుందని స్థానిక వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. ఇదేతరహాలో భారత వెబ్ సైట్ భారత్ మాట్రిమోని, కన్స్యూమర్ అండ్ ట్రస్ట్ సొసైటీలు కూడా అవాస్తవాలను ప్రచారం చేయడంతో తమ సైట్ల సేవలు కాస్త నెమ్మదించాయని, ప్రజలలో అపనమ్మకాలు పెరిగే అవకాశాలు లేకపోలేదని ఆరోపిస్తున్నాయి. సెప్టెంబర్ 10 లోపు వివరణ ఇచ్చుకోవాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, గూగుల్ సంస్థ నిర్వాహకులకు సూచించగా, గడువును మరింత పొడిగించాలని గూగుల్ కోరుతోంది. -
ఈ-కామర్స్ సంస్థలకు సీసీఐ ఊరట
అనుచిత వ్యాపార విధానాలపై ప్రాథమిక సాక్ష్యాల్లేవని స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ సహా ఐదు ఈ-కామర్స్ కంపెనీలకు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)లో ఊరట లభించింది. అనుచిత వ్యాపార విధానాలకు పాల్పడుతున్నాయంటూ ఈ కంపెనీలపై వచ్చిన ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాధారాలేవీ లేవని స్పష్టం చేసింది. సీసీఐలో ఫిర్యాదులు దాఖలైన జాబితాలో స్నాప్‌డీల్(జాస్పర్ ఇన్ఫోటెక్), అమెజాన్, జబాంగ్(జెరియాన్ రిటైల్), మింత్రా(వెక్టర్ ఈ-కామర్స్) కూడా ఉన్నాయి. గడిచిన కొద్దినెలలుగా సీసీఐ ఈ ఫిర్యాదులపై విచారణ జరుపుతోంది. మార్కెట్లో గుత్తాధిపత్యం, కుమ్మక్కుతో పాటు పోటీ నిబంధనలను ఆయా సంస్థలు ఉల్లంఘించిన దాఖలాల్లేవని తాజా తీర్పులో స్పష్టం చేసింది. ఈ-కామర్స్ కంపెనీలు, అమ్మకందార్లు(సెల్లర్లు) ముందస్తుగా ఒక ఒప్పందానికి వచ్చి కొన్ని ఉత్పత్తులను ప్రత్యేకంగా ఎంపిక చేసినపోర్టల్స్‌లోనే అమ్ముతున్నారన్నది ప్రధాన ఆరోపణ. మరోపక్క, ఫ్లిప్‌కార్ట్ ఇతరత్రా సంస్థలు తమ వెబ్సైట్లలో ఇస్తున్న భారీ డిస్కౌంట్ ఆఫర్లు గుత్తాధిపత్య ధోరణికి దారితీస్తున్నాయన్న ఆందోళనలు కూడా వెల్లువెత్తాయి. అయితే, ఈ ఆరోపణలను సీసీఐ తోసిపుచ్చింది. -
6 నెలల్లో మొత్తం జరిమానా కట్టేస్తాం
సుప్రీంకు డీఎల్ఎఫ్ హామీ న్యూఢిల్లీ: కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన జరిమానాకు సంబంధించిన మొత్తాన్ని జనవరి 15 నుంచీ ఆరు నెల వారీ విడతల్లో చెల్లిస్తామని రియల్టీ దిగ్గజం- డీఎల్ఎఫ్ బుధవారం సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. ఇప్పటికే రూ.150 కోట్లు చెల్లించిన డీఎల్ఎఫ్, మిగిలిన రూ.480 కోట్లను ఆరు నెలల్లో చెల్లిస్తానని అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించుకుంది. దీనికి జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ, ఎన్వీ రమణలతో కూడిన డివిజనల్ బెంచ్ అంగీకరించింది. సీసీఐ ఉత్తర్వుపై తుది విచారణను ఫిబ్రవరి 11 నుంచీ చేపడతామని సైతం ఈ సందర్భంగా బెంచ్ తెలిపింది. అసలు ఈ కేసు విచారణా పరిధి కాంపిటేషన్ కమిషన్‌కు ఉంటుందా...? లేదా దీనిని వినియోగదారుల ఫోరమ్ చూడాల్సి ఉందా..? అన్న అంశాన్ని తొలుత విచారణకు చేపట్టనున్నట్లు బెంచ్ పేర్కొంది. రియల్టీ రంగానికి సంబంధించి గుత్తాధిపత్యం కేసులో డీఎల్‌ఎఫ్‌పై సీఐఐ రూ. 650 కోట్లు జరిమానా విధించింది. అయితే దీనిపై డీఎల్ఎఫ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణకు తొలుత జరిమానాను రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనితో ఈ మొత్తంలో ఇప్పటికి సంస్థ రూ.150 కోట్లు చెల్లించింది. -
బ్యాంకుల ‘కుమ్మక్కు’పై కాంపిటీషన్ కమిషన్ దృష్టి
న్యూఢిల్లీ: పొదుపు ఖాతాల వడ్డీ రేట్లపై ఆర్బీఐ నియంత్రణ ఎత్తివేసినప్పటికీ చాలా మటుకు బ్యాంకులు దాదాపు ఒకే రేటును పాటిస్తుండటంపై కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) దృష్టి సారించనుంది. ఈ విషయంలో అవి కుమ్మక్కయ్యాయా అన్న కోణాన్ని పరిశీలించనుంది. శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లా ఈ విషయాలు తెలిపారు. నియంత్రణ ఎత్తివేతతో వడ్డీ రేట్లను తమ ఇష్టానుసారం మార్చుకునే అవకాశం ఉన్నా కూడా ఇప్పటికీ చాలా మటుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ), మరికొన్ని ఇతర బ్యాంకులు నాలుగు శాతం మాత్రమే ఇస్తున్న సంగతి తమ దృష్టికి వచ్చినట్లు ఆయన చెప్పారు. అవి కుమ్మక్కయ్యే ఇలా చేస్తున్నాయా లేక ఇతరత్రా మరో కారణమేదైనా ఉందా అన్నది పరిశీలిస్తామన్నారు. మరోవైపు, ఆన్లైన్ షాపింగ్ సంస్థలపై ఫిర్యాదుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. తమకు ఈ మధ్యనే సంబంధిత సమాచారం చేరిందని ఆయన చెప్పారు. దాని ఆధారంగా తదుపరి విచారణ చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వచ్చే నెలన్నర- రెండు నెలల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. సంప్రదాయ షాపులతో పోలిస్తే ఆన్లైన్ రిటైలింగ్ సంస్థలు భారీ డిస్కౌంట్లు ఇస్తుండటం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఏపీలో సిమెంటు సంస్థల కుమ్మక్కుపై ఫిర్యాదు కొట్టివేత.. ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో సిమెంటు కంపెనీలు కుమ్మక్కై సిమెంటు రేట్లు పెంచేశాయన్న ఫిర్యాదును సీసీఐ తోసిపుచ్చింది. ఈ ఆరోపణలను ధృవీకరించేలా తగిన ఆధారాలేమీ లేవని స్పష్టం చేసింది. మేలో ఎన్నికల తర్వాత నెల రోజుల వ్యవధిలో సిమెంట్ కంపెనీలన్నీ కూడబలుక్కుని బస్తాకు రూ. 75 మేర రేట్లను పెంచేశాయని ఫిర్యాదిదారు ఆరోపించారు. మరోవైపు, సిమెంటు దిగ్గజాలు హోల్సిమ్-లఫార్జ్‌ల విలీన ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవడానికి దాదాపు రెండు నెలలు పడుతుందని సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లా చెప్పారు. అటు ఫార్మా దిగ్గజాలు సన్-రాన్‌బ్యాక్సీ డీల్‌పై నెలాఖరులోగా నిర్ణయం తీసుకోగలమని వివరించారు. రాన్‌బాక్సీని దాదాపు 4 బిలియన్ డాలర్లతో సన్‌ఫార్మా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
ఫ్లిప్‌కార్ట్‌పై సీసీఐకి ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఈకామర్స్ సైట్ల డిస్కౌంట్లపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర ఆన్లైన్ రిటైలర్లపై ఫిర్యాదు వచ్చినట్లు గుత్తాధిపత్య వ్యాపార ధోరణుల నియంత్రణ సంస్థ సీసీఐ వర్గాలు తెలిపాయి. సదరు సంస్థలు అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టే అంశం మీద త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వివరించాయి. అక్టోబర్ 6న బిగ్ బిలియన్ డే పేరుతో ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ సేల్ ప్రకటించడం, మిగతా ఈకామర్స్ సంస్థలు కూడా పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇస్తుండటం వంటి అంశాలపై చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సంప్రదాయ స్టోర్స్‌ను దెబ్బతీస్తున్న ఇలాంటి ఆన్లైన్ సంస్థల వ్యాపారాలను నియంత్రించాలని వ్యాపార సంస్థల సమా ఖ్య సీఏఐటీ గతంలోనే వాణిజ్య శాఖను కోరింది. -
పసిడి దిగుమతి సంస్థల గుత్తాధిపత్యం లేదు: సీసీఐ
న్యూఢిల్లీ: బంగారం దిగుమతి సంస్థలు గుత్తాధిపత్య ధోరణులను అనుసరిస్తున్నాయని దాఖ లైన కొన్ని ఆరోపణలను కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తిరస్కరించింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలుసహా మొత్తం 16 సంస్థలపై ఈ ఆరోపణలు దాఖలయ్యాయి. ఆర్థికమంత్రిత్వశాఖ, వాణిజ్య పరిశ్రమల శాఖ, ఆర్బీఐ, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌తో పాటు మరో 12 ప్రభుత్వ నియమిత సంస్థలు ఇందులో ఉన్నాయి. ఎంఎంటీసీ, ఎస్టీసీ ఆఫ్ ఇండియా, పీఈసీ, హాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ ఎక్స్‌పోర్ట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నోవా స్కోటియా, కొటక్ మహీం ద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ప్రభుత్వ నియమిత సంస్థలు. మార్కెట్లో ఈ సంస్థలు తమ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్న ఫిర్యాదులను సీసీఐ తోసిపుచ్చుతూ, కేవలం ఇదే వ్యాపారంలో ఈ సంస్థలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. డీలర్లు, బంగారు ఆభరణాల తయారీదారులు, రిటైలర్లు కూడా ఈ వ్యాపార కార్యకలాపాలను ఎటువంటి ఆటం కం లేకుండా చేస్తున్నారని సీసీఐ పేర్కొంది. ఆ యా వ్యాపార అంశాలకు సంబంధించి 16 సంస్థలు కుమ్మకైనట్లు సైతం ఆధారాలు లేవంది. శ్రీ గురు జ్యూవెల్స్, తుషార్ దాఖలు చేసిన ఫిర్యాదు నిరాధారమని తేల్చింది. -
కొనలేం.. కట్టలేం!
చుక్కలు చూపిస్తున్న సిమెంట్ ధరలు నెల రోజుల్లో రూ.100కు పైగా పెరిగిన ధర రవాణా, ఇంధన చార్జీలతో స్టీల్, ఇసుక కూడా.. ఫ్లాట్ల ధరలను పెంచే యోచనలో బిల్డర్లు దీంతో సామాన్యులకు దూరమవుతున్న సొంతిల్లు ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు’ అన్న చందంగా ఉంది నిర్మాణ రంగ పరిస్థితి. ఏడాదికాలంగా స్థిరాస్తి కొనుగోళ్లు లేక, బ్యాంకులు రుణాలు మంజూరు చేయక తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న హైదరాబాద్ నిర్మాణ రంగానికి తాజాగా సిమెంట్, స్టీల్, ఇసుక ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మరీ ఎక్కువగా నెల రోజులుగా రూ.100కు పైగా పెరిగిన సిమెంట్ ధరలు బిల్డర్లకు మంట పుట్టిస్తున్నాయి. పెరిగిన ధరల నుంచి ఉపశమనం పొందేందుకు నిర్మాణ సంస్థలన్నీ ఒక్క తాటిపైకొచ్చి చ.అ. ధరను రూ.200 లకు పైగా పెంచేందుకు సిద్ధమయ్యాయి. అంటే సొంతంగా గూడు కట్టుకుందామనుకునే సామాన్యుడికి ఓ పక్క నిర్మాణ సామగ్రి ధరలు చుక్కలు చూపిస్తుంటే.. మరోపక్క అపార్ట్మెంట్లలో ఫ్లాట్ తీసుకుందామంటే చ.అ. ధరలు భారంగా మారాయన్నమాట. ఎటొచ్చీ నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల సామాన్యులకే గుదిబండగా మారింది. సాక్షి, హైదరాబాద్: సరిగ్గా నెల క్రితం.. సిమెంట్ (50 కిలోలు) ధర రూ.240-260గా.. అలాగే టన్ను స్టీలు రూ.44-45 వేలుగా, ట్రాక్టర్ ఇసుక రూ.4,400 లుగా ఉండేది. కానీ, ప్రస్తుతం సిమెంట్ ధర రూ.315 అయ్యింది. కొందరైతే రూ.350కి కూడా అమ్ముతున్నారు. ఇక స్టీలు ధర రూ.46-47 వేలుంటే, ఇసుక రూ.4,500లు పలుకుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ వాహనాల ప్రవేశ పన్నులు విధించడం, మరోవైపు రైల్వే సరుకు రవాణా చార్జీలు 6.5 శాతం పెరగడం, ఇంధన వనరుల ధరలూ ఇదే బాటలో పయనించడం వంటి కారణాలతో నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరిగాయి. 27 రోజుల్లో రూ.105 భారం: జూన్ 1న సిమెంట్ బస్తా ధర మార్కెట్లో 210 ఉంది. రాష్ట్ర విభజన 2వ తేదీన జరగ్గా 3వ తేదీన బస్తాకు రూ.50 పెంచి రూ.260 చేశారు. 7వ తేదీ నుంచి ఇంకో రూ.25 పెంచి రూ.285కి చేర్చారు. 19వ తేదీన మరో రూ.10 పెంచి రూ.295కు తీసుకెళ్లారు. తాజాగా మరో రూ.20 భారం వేసి బస్తాను రూ.315 విక్రయిస్తున్నారు. అంటే 27 రోజుల్లో సిమెంట్ బస్తాపై రూ.105 పెంచేశారన్నమాట. సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, ముడిపదార్థాల ధరలు పెరగడం, విద్యుత్, రవాణా చార్జీలూ భారంగా మారడం వల్లే ధరలు పెంచాల్సి వచ్చిందని సిమెంట్ కంపెనీలు చెబుతున్నాయి. 41 సిమెంట్ కంపెనీలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 41 సిమెంట్ కంపెనీలున్నాయి. ఇవి 34 రకాల బ్రాండ్లతో సిమెంట్‌ను విక్రయిస్తున్నాయి. ఇందులో 20 బ్రాండ్లకు మాత్రం మార్కెట్లో కొంచెం ఎక్కువ గిరాకీ ఉంది. గతంలో రెండు రాష్ట్రాల్లోని కంపెనీలు కలిపి నెలకు 20 లక్షల టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసేవి. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడానికి ఉత్పత్తిని 11 లక్షల టన్నులకు తగ్గించినట్టుగా బిల్డర్లు అసోసియేషన్లు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా సిమెంట్ తయారీ రాష్ట్రాల్లో ధర తక్కువగా ఉండి పొరుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే సిమెంట్ తయారీకి అవసరమయ్యే ముడిసరుకు రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాయితీ ధరకే సిమెంట్ లభించాలని బిల్డర్లు కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో: సమైక్య రాష్ట్రంలో గతేడాది జులైలో సిమెంట్ ధర (50 కిలోలు) రకాన్ని బట్టి రూ.320 దాకా ఉంది. తర్వాతి నెలలో రూ.200-225కు పడిపోయింది. గిరాకీ లేకపోవడమే ధర క్షీణతకు కారణమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 2014 మే నుంచి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడులో బస్తా సిమెంట్ ధర రూ.360-రూ.370, కర్ణాటకలో రూ.350, కేరళలో రూ.370, ఢిల్లీలో రూ.280-రూ.290, మహారాష్ట్రలో రూ.300, బెంగళూరులో రూ.310-320, ముంబైలో రూ.260-రూ.270 ఉంది. ప్రభుత్వం చేయాల్సినవివే.. 1. మూకుమ్మడిగా పెంచిన సిమెంట్ ధరలపై ‘కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా’ (సీసీఐ)కు ఫిర్యాదు చేస్తామని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ఏపీ ప్రెసిడెంట్ ఎస్ రాం రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. అన్ని నిర్మాణ రంగ సంస్థలను ఒకే వేదికపై తీసుకొచ్చి నిర్మాణ పనులను నిలిపివేస్తాం. అయినా ధరలు తగ్గించకపోతే ఫ్లాట్ల ధరలను చ.అ.కు రూ.200 లకు పైగా పెంచుతాం. అంతిమంగా ఈ భారం సామాన్యులపైనే పడుతుంది. 2. సిమెంట్ ఫ్యాక్టరీలు స్థాపించేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రత్యేక రాయితీలు కల్పించాలి. తాండూర్, ఆదిలాబాద్‌ల్లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచాలి. 3. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇసుక, స్టీల్, సిమెంట్ వంటి వాహనాలకు టోల్, సర్వీస్ టాక్స్ వంటి పన్నుల్లో మినహాయింపులివ్వాలి. 4. సిమెంట్ పరిశ్రమల్లో విడుదలయ్యే ఉష్ణోగ్రతను వృథాగా వదిలేయకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటే ఖర్చు బాగా కలిసొస్తుంది. ఉష్ణోగ్రతను సద్వినియోగం (వేస్ట్‌హీట్ రికవరీ) చేసుకునే ప్రక్రియకు పునరుత్పాదక ఇంధన హోదాను కూడా కల్పించాలి. 5. విద్యుత్తు ప్లాంట్ల నుంచి వచ్చే ఫ్లైయాష్, శ్లాగ్ను ముడిపదార్థంగా వినియోగించి సిమెంట్‌ను తయారు చేయవచ్చు. విద్యుత్ సంస్థల నుంచి సిమెంట్ కంపెనీలకు ఉచితంగా ఫ్లైయాష్‌ను అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. -
గూగుల్‌కు రూ. కోటి జరిమానా
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొరడా ఝళిపించింది. భారత్‌లో అనుచిత వాణిజ్య విధానాలను అనుసరించడంపై చేపట్టిన దర్యాప్తునకు అవసరమైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆ కంపెనీపై రూ. కోటి జరిమానా విధించింది. సీసీఐ డెరైక్టర్ జనరల్ కోరిన సమాచారం ఇవ్వకుండా దర్యాప్తునకు సహకరించనందుకే కమిషన్ ఈ జరిమానా విధించిందని, ఇకపై సహకరించాలని ఆదేశించిందని ఈ మేరకు గురువారం అధికారిక వర్గాలు వెల్లడించాయి. -
ప్రస్తుతం నష్టాల్లో పరిశ్రమ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో సిమెంటు రంగం ఆరు నెలల్లో గాడిన పడుతుందని పరిశ్రమ భావిస్తోంది. కొత్త రాష్ట్రాల్లో సాధారణంగా మౌలిక వసతుల పరంగా అభివృద్ధి ఉంటుంది కాబట్టి సిమెంటుకు డిమాండ్ పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇదే జరిగితే పరిశ్రమకు పెద్ద ఊరట లభిస్తుందని ప్రముఖ కంపెనీకి చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణ రంగం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ప్రభుత్వ సంబంధిత నిర్మాణ పనులవల్ల సాధారణంగా ఎన్నికల ముందు సిమెంటకు డిమాండ్ పెరుగుతుంది. అయితే ఈ దఫా ఆ తరహా పనులేవీ జరగడం లేదు. దాంతో పరిశ్రమ ఇంకా నీరసంగానే నెట్టుకొస్తోంది. సిమెంటు కంపెనీలు పెద్ద ఎత్తున నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. సిమెంటు వినియోగం పెరిగితేనే కంపెనీలు మనగలుగుతాయి. ఈ ఏడాది అక్టోబరు నుంచి నెలకు 20 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడవుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. బస్తాకు రూ.60 దాకా నష్టం..: రాష్ట్రంలో నాలుగేళ్ల క్రితం నెలకు 23-24 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడైంది. ఇప్పుడది నెలకు 15-16 లక్షల టన్నులకు పడిపోయింది. రాజకీయ అనిశ్చితి, బలహీన సెంటిమెంటుతో అమ్మకాలు గణనీయంగా క్షీణించాయి. రాష్ట్రంలో బస్తా సిమెంటు ధర అటూఇటూగా రూ.220-250 పలుకుతోంది. ఉత్తరాదిన ఇది రూ.350 ఉంది. కంపెనీల మధ్య పోటీ కారణంగానే రాష్ట్రంలో ధర తక్కువగా ఉందని ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఒక్కో బస్తాపైన రకాన్నిబట్టి కంపెనీలు రూ.20-60 దాకా నష్టపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మూడు కంపెనీలు మూతపడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని ప్లాంట్లు మూతపడక తప్పదని అన్నారు. అక్టోబరు నుంచి అమ్మకాలు పుంజుకుంటాయన్న సంకేతాలు ఉన్నాయి. బస్తా ధర రూ.300-320 ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. అలా అయితేనే నష్టాల నుంచి గట్టెక్కుతామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఖర్చులనుబట్టే ధర..: గిరాకీ-సరఫరాకుతోడు సెంటిమెంటు బాగోలేనప్పుడు సహజంగానే సిమెంటు ధరలు తక్కువగా ఉంటాయి. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ఇలాంటిదే. రానున్న రోజుల్లో డిమాండ్ పెరిగినంత మాత్రాన ధరలు గణనీయంగా పెరుగుతాయని చెప్పలేమని ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. కేంద్రంలో, రాష్ట్రంలో స్థిర ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి ఉంటుంది. దీనికనుగుణంగానే సిమెంటు పరిశ్రమ వృద్ధి ఆధారపడుతుందన్నారు. బొగ్గు, డీజి ల్, విద్యుత్ చార్జీలపై కొత్త సర్కారు పన్నుల విధానం పరిశ్రమకు కీలకమని వెల్లడించారు. వీటి ధరలకుతోడు తయారీ వ్యయం ఆధారంగానే సిమెంటు ధర నిర్ణయమవుతుందని ఆయన చెప్పారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని సిమెంటు కంపెనీలన్నింటి వార్షిక స్థాపిత సామర్థ్యం సుమారు 70 మిలియన్(7 కోట్లు) టన్నులు. ఉత్పత్తి 45-50 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ఇందులో రాష్ట్ర అవసరాలకుపోను మిగిలినది తమిళనాడు, కర్నాటక, ఒరిస్సాలకు తరలివెళ్తోంది. ప్రోత్సాహమిస్తే మరిన్ని.. రాష్ట్ర కంపెనీలు ఇటీవలి కాలం నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌కు నెలకు సుమారు లక్ష టన్నుల సిమెంటు, క్లింకర్‌ను ఎగుమతి చేస్తున్నాయి. పోర్టు చార్జీల తగ్గింపు, పన్నుల మినహాయింపు వంటి ప్రోత్సాహకాలిస్తే ఎగుమతులు మరింత పెంచేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉంది. కొత్త ప్రభుత్వం గనక చార్జీలు పెంచితే తయారీ వ్యయంతోపాటు సిమెంటు ధరలకూ రెక్కలొస్తాయి. తద్వారా ఎగుమతులు తగ్గుతాయనేది పరిశ్రమ ఆందోళన.