ఈ-కామర్స్ సంస్థలకు సీసీఐ ఊరట
అనుచిత వ్యాపార విధానాలపై ప్రాథమిక సాక్ష్యాల్లేవని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ సహా ఐదు ఈ-కామర్స్ కంపెనీలకు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)లో ఊరట లభించింది. అనుచిత వ్యాపార విధానాలకు పాల్పడుతున్నాయంటూ ఈ కంపెనీలపై వచ్చిన ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాధారాలేవీ లేవని స్పష్టం చేసింది. సీసీఐలో ఫిర్యాదులు దాఖలైన జాబితాలో స్నాప్‌డీల్(జాస్పర్ ఇన్ఫోటెక్), అమెజాన్, జబాంగ్(జెరియాన్ రిటైల్), మింత్రా(వెక్టర్ ఈ-కామర్స్) కూడా ఉన్నాయి. గడిచిన కొద్దినెలలుగా సీసీఐ ఈ ఫిర్యాదులపై విచారణ జరుపుతోంది.
మార్కెట్లో గుత్తాధిపత్యం, కుమ్మక్కుతో పాటు పోటీ నిబంధనలను ఆయా సంస్థలు ఉల్లంఘించిన దాఖలాల్లేవని తాజా తీర్పులో స్పష్టం చేసింది. ఈ-కామర్స్ కంపెనీలు, అమ్మకందార్లు(సెల్లర్లు) ముందస్తుగా ఒక ఒప్పందానికి వచ్చి కొన్ని ఉత్పత్తులను ప్రత్యేకంగా ఎంపిక చేసినపోర్టల్స్‌లోనే అమ్ముతున్నారన్నది ప్రధాన ఆరోపణ. మరోపక్క, ఫ్లిప్‌కార్ట్ ఇతరత్రా సంస్థలు తమ వెబ్‌సైట్లలో ఇస్తున్న భారీ డిస్కౌంట్ ఆఫర్లు గుత్తాధిపత్య ధోరణికి దారితీస్తున్నాయన్న ఆందోళనలు కూడా వెల్లువెత్తాయి. అయితే, ఈ ఆరోపణలను సీసీఐ తోసిపుచ్చింది.