దేశంలో సగటు కస్టమర్ల బలహీనతను కంపెనీలు పట్టేస్తున్నాయి. ఇలాంటి కస్టమర్ల కోసం ప్రత్యేక ఈ-కామర్స్ విభాగాలను తెరుస్తున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా "బజార్" అనే పేరుతో కొత్త చవక ఉత్పత్తుల విభాగాన్ని పరిచయం చేసింది.
ఈ వినూత్న విభాగం కస్టమర్లకు అతి తక్కువ ధరలలో అన్‌బ్రాండెడ్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను అందిస్తుంది. భారతీయ వినియోగదారుల విభిన్న అవసరాలు, ప్రాధాన్యతలను తీరుస్తుంది. ఈ కొత్త వెంచర్ ఇప్పుడు అమెజాన్ ఇండియా ఆండ్రాయిడ్ యాప్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంది.
‘ది ఎకనామిక్ టైమ్స్’ ప్రకారం.. ఈ-కామర్స్ దిగ్గజం రూ. 600లోపు ధర కలిగిన దుస్తులు, వాచీలు, బూట్లు, ఆభరణాలు, బ్యాగ్‌లతో సహా బ్రాండెడ్ ఉత్పత్తులను జాబితా చేయడానికి విక్రేతలను ఆన్‌బోర్డింగ్ చేసింది. వీటిని ఆర్డర్ చేసే ప్రైమ్ సభ్యులకు 4-5 రోజుల్లోనే డెలివరీ చేయనుంది. సాధారణంగా చవకైన ఉత్పత్తుల డెలివరీకి ఎక్కువ సమయం పడుతుంది.
‘బజార్’ పరిచయాన్ని అమెజాన్ ఇండియా ప్రతినిధి ధ్రువీకరించారు. ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, భారతదేశం అంతటా ఉన్న తయారీ కేంద్రాల నుండి విక్రేతలు అందించే ఫ్యాషన్, ఇతర వస్తువులను తక్కువ ధరలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు అని కంపెనీ పేర్కొంది.
దేశంలో ఇప్పటికే ఇలాంటి లోకాస్ట్ ఈ-కామర్స్ సంస్థలు కొన్ని ఉన్నాయి. చవక ధర ఉత్పత్తులను విక్రయించడానికి మరో దిగ్గజ ఆన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) కూడా షాప్సీ (Shopsy) పేరుతో వేరే యాప్‌ని నిర్వహిస్తుంది. దీంతోపాటు లోకాస్ట్ ఈ-కామర్స్ మార్కెట్‌లో పురోగతి సాధిస్తున్న సాఫ్ట్‌బ్యాంక్-మద్దతు గల మీషోతోనూ అమెజాన్ బజార్ పోటీపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment