bazaar
-
గుండె జారిపోతోంది!
సాక్షి, అమరావతి: దేశంలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో గుండె జబ్బుల సంబంధిత ఇన్సూ్యరెన్స్ క్లెయిమ్‌లు దాదాపు రెట్టింపవడమే ఇందుకు నిదర్శనం. కాలుష్యం, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలు గుండె జబ్బులకు ప్రధాన కారణం. పాలసీ బజార్ సంస్థ అధ్యయన నివేదిక ప్రకారం 2019–20లో దేశవ్యాప్తంగా నమోదైన ఆరోగ్య బీమా నమోదైన క్లెయిమ్‌లలో గుండె చికిత్సల క్లెయిమ్‌ల వాటా దాదాపు 12 శాతం. ఇవి 2023–24లో 20 శాతం వరకు పెరిగాయి. గుండె జబ్బుల చికిత్స ఖర్చులు సైతం 47 నుంచి 53 శాతం మేర పెరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఒక్కో క్లెయిమ్ 2019–20లో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల ఉంటే.. 2023–24లో రూ. 12 – 15 లక్షలకు పెరిగినట్లు తెలిపింది. యువతలో పెరుగుతున్న జబ్బులు కొద్ది సంవత్సరాలుగా యువతలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేని జీవన శైలి ఇందుకు కారణమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 2020లో 40 ఏళ్ల లోపు యువతకు సంబంధించిన గుండె వ్యాధుల క్లెయిమ్‌లు 10–12 శాతం నమోదు కాగా, 2022–23లో 15–18 శాతంగా నమోదైంది. గుండె జబ్బులకు సంబంధించిన మొత్తం క్లెయిమ్‌లలో 60–70 శాతం పురుషులు, 30–40 శాతం మహిళలు ఉన్నట్టు తేలింది.ప్రాంతాల వారీగా అత్యధికంగా గుండె చికిత్సల క్లెయిమ్లుఉత్తర భారతదేశం (ఢిల్లీ, పంజాబ్, హర్యానా) 20- 25%పశ్చిమ భారతదేశం (మహారాష్ట్ర, గుజరాత్) 15- 18%దక్షిణ భారతదేశం (తమిళనాడు, కర్ణాటక) 15-20%తూర్పు భారతదేశం (పశ్చిమ బెంగాల్) 10- 12%(కోల్‌కతా వంటి నగరాల్లో గుండె జబ్బుల రేట్లు గణనీయంగా ఉంటున్నాయి. అయినప్పటికీ బీమా పాలసీదారులు తక్కువగా ఉండటంతో తక్కువ నమోదైంది) -
కొత్త ఈ-కామర్స్ కంపెనీ.. చవకా.. వీక్నెస్ పట్టేశారు!
దేశంలో సగటు కస్టమర్ల బలహీనతను కంపెనీలు పట్టేస్తున్నాయి. ఇలాంటి కస్టమర్ల కోసం ప్రత్యేక ఈ-కామర్స్ విభాగాలను తెరుస్తున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా "బజార్" అనే పేరుతో కొత్త చవక ఉత్పత్తుల విభాగాన్ని పరిచయం చేసింది. ఈ వినూత్న విభాగం కస్టమర్లకు అతి తక్కువ ధరలలో అన్‌బ్రాండెడ్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను అందిస్తుంది. భారతీయ వినియోగదారుల విభిన్న అవసరాలు, ప్రాధాన్యతలను తీరుస్తుంది. ఈ కొత్త వెంచర్ ఇప్పుడు అమెజాన్ ఇండియా ఆండ్రాయిడ్ యాప్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ‘ది ఎకనామిక్ టైమ్స్’ ప్రకారం.. ఈ-కామర్స్ దిగ్గజం రూ. 600లోపు ధర కలిగిన దుస్తులు, వాచీలు, బూట్లు, ఆభరణాలు, బ్యాగ్‌లతో సహా బ్రాండెడ్ ఉత్పత్తులను జాబితా చేయడానికి విక్రేతలను ఆన్‌బోర్డింగ్ చేసింది. వీటిని ఆర్డర్ చేసే ప్రైమ్ సభ్యులకు 4-5 రోజుల్లోనే డెలివరీ చేయనుంది. సాధారణంగా చవకైన ఉత్పత్తుల డెలివరీకి ఎక్కువ సమయం పడుతుంది. ‘బజార్’ పరిచయాన్ని అమెజాన్ ఇండియా ప్రతినిధి ధ్రువీకరించారు. ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, భారతదేశం అంతటా ఉన్న తయారీ కేంద్రాల నుండి విక్రేతలు అందించే ఫ్యాషన్, ఇతర వస్తువులను తక్కువ ధరలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు అని కంపెనీ పేర్కొంది. దేశంలో ఇప్పటికే ఇలాంటి లోకాస్ట్ ఈ-కామర్స్ సంస్థలు కొన్ని ఉన్నాయి. చవక ధర ఉత్పత్తులను విక్రయించడానికి మరో దిగ్గజ ఆన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) కూడా షాప్సీ (Shopsy) పేరుతో వేరే యాప్‌ని నిర్వహిస్తుంది. దీంతోపాటు లోకాస్ట్ ఈ-కామర్స్ మార్కెట్లో పురోగతి సాధిస్తున్న సాఫ్ట్‌బ్యాంక్-మద్దతు గల మీషోతోనూ అమెజాన్ బజార్ పోటీపడనుంది. -
విశాఖలో అఖిల భారత డ్వాక్రా బజార్ (ఫొటోలు)
-
జైహింద్ స్పెషల్: ఖిస్సా ఖ్వానీ బజార్ ఊచకోత
బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం భారతదేశంలో ఎగసిపడిన చిన్న నిప్పు రవ్వ కూడా స్వాతంత్య్ర సమరజ్వాలకు ఆజ్యం పోసినదే. నేటి పాకిస్థాన్‌లోని ఖిస్సా ఖ్వామీ బజార్లో 90 ఏళ్ల క్రితం 1930 ఏప్రిల్‌లో చెలరేగిన అలాంటి జ్వాలే ఒకటి భారత స్వాతంత్య్ర సంగ్రామానికి తన వంతుగా నిప్పందించింది. ఆనాటి ఘటనకు ఈనాటి చేదు జ్ఞాపకమే.. ‘ఖిస్సా ఖ్వానీ బజార్ ఊచకోత’. నేటి పాకిస్థాన్‌లోని ప్రస్తుత ప్రావిన్సులలో ఒకటైన ఖైబర్ పక్తున్‌క్వా రాజధాని పెషావర్‌లోని ఒక వీధి పేరే ఖిస్సా ఖ్వానీ. ఖిస్సా ఖ్వానీ అంటే ‘కథలు చెప్పేవాళు’్ల అని. మన బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ సరిగ్గా నూరేళ్ల క్రితం ఆ ఖిస్సా ఖ్వానీ వీధిలోనే జన్మించారు! మరో నటుడు రాజ్ కపూర్ పుట్టింది కూడా ఖిస్సా ఖ్వానీలోనే. షారుక్ ఖాన్ కుటుంబ సభ్యులు కొందరు కూడా ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నారు. ఆ వీధికి ఇంతకుమించి ఉన్న చారిత్రక గుర్తింపు మాత్రం అక్కడ జరిగిన ఊచకోతే. ఆ రోజు.. ఏప్రిల్ 23 న ఖిస్సా ఖ్వానీలో ‘ఖుదాయి కిద్మత్గార్’ ఉద్యమకారులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అహింసాయుత ప్రదర్శన జరుపుతున్నారు. వారి నాయకుడు అబ్దుల్ గఫార్ ఖాన్. ఖుదాయీ కిద్మత్గార్ (దేవుని సేవకులు) ఉద్యమకర్త ఆయనే. నాటి వాయవ్య సరిహద్దు ప్రావిన్సులోని ఉత్మాన్‌జాయ్ పట్టణంలో గఫార్ ఖాన్ తన ప్రసంగం పూర్తి చేసి వేదిక కిందికి దిగుతుండగానే గఫార్ ఖాన్‌ను, మరికొందరు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రదర్శనా స్థలానికి చేరుకున్న బ్రిటిష్ బలగాలు అందుకు నిరసనగానే అనేక ప్రాంతాలతో పాటు ఖిస్సా ఖ్వానీలోనూ ప్రదర్శనలు జరిగాయి. గఫార్ ఖాన్‌ను తక్షణం విడుదల చేయాలని ప్రదర్శనకారులు నినాదాలిచ్చారు. ‘గుమికూడి ఉన్న మీరంతా తక్షణం నినాదాలు మాని ఎవరిదారిన వారు వెళ్లకుంటే తగిన సమాధానం చెప్పవలసి ఉంటుంది’ అని ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన బ్రిట్రిష్ సైనిక బలగాలు హెచ్చరించాయి. ఆ బలగాలలో ఉన్నది కూడా భారతీయులే. ప్రదర్శనకారులు కదల్లేదు. సైనికులు తుపాకులు తీశారు. ప్రదర్శనకారులు బెదరలేదు. దాంతో సైనిక వాహనాలు క్రూరాతిక్రూరంగా వారిని తొక్కిపడేశాయి. ఆ ఘటనలో ప్రదర్శనకారులతో పాటు, నిలబడి చూస్తున్న కొందరు పౌరులు కూడా అక్కడికక్కడే మరణించారు. తుపాకీ కాల్పులకు మరికొందరు ప్రాణాలు వదిలారు. ఆ బలగాలు ‘గర్వాల్ రెజిమెంట్’వి. అందులోని కొందరు సైనికులు నిరాయుధులైన ప్రదర్శనకారులపై కాల్పులు జరిపేందుకు నిరాకరించారు. కానీ పైనుంచి ఆదేశాలు రావడంతో రెజిమెంట్‌లోని మిగతా సైనికులు తమ ‘డ్యూటీ’ తాము చేసేశారు. కాల్పులు జరిపేందుకు నిరాకరించిన సైనికులపై బ్రిటిష్ అధికారులు ఆ తర్వాత సైనిక విచారణ జరిపించి ఎనిమిదేళ్ల జైలుశిక్ష విధించారు. ఊచకోత తర్వాత కూడా పెషావర్, ఆ పరిసర ప్రాంతాలలో ఖుదాయి కిద్మత్గార్ కార్యకర్తలు తీవ్రమైన అణచివేతలను ఎదుర్కొన్నారు. దీనిపై వ్యాఖ్యానిస్తూ .. ‘హింసాత్మకమైన ఉద్యమకారుడికన్నా, అహింసాయుతంగా పోరాడుతున్న ఒక పష్తూన్ తెగ మనిషి ఎక్కువ ప్రమాదకారి అని బ్రిటిష్ ప్రభుత్వం భావించినట్లుంది..’ అని గఫార్ ఖాన్ రాశారు. ఈ కారణంగానే తరచు తమ ఉద్యమం తేలికపాటి ప్రదర్శనకే భగ్గుమనేటంతటి ఘర్షణగా మారేది అని కూడా రాసుకున్నారు. ఖిస్సా ఖ్వామీ ఊచకోత దేశవ్యాప్తంగా ప్రజల్ని ఆగ్రహావేశాలకు గురిచేసింది. దేశంలో తిరుగుబాటు ధోరణులు వ్యాప్తి చెందాయి. ఖిస్సా ఖ్వామీ ఊచకోత విషయం బ్రిటన్ రాజు ఆరవ జార్జి దృష్టికి వెళ్లి, ఘటనపై ఆయన న్యాయ విచారణకు ఆదేశించారు. నాటి లక్నో ప్రొటెక్టరేట్‌కు చెందిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నైమతుల్లా చౌదరికి కేసు బాధ్యతను అప్పగించారు. ఆయన ఘటనాస్థలి వద్దకు అనేకమార్లు స్వయంగా వెళ్లి, సాక్షులతో మాట్లాడి ‘బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ’దే తప్పు అంటూ.. 200 పేజీల నివేదికను రాజుకు సమర్పించారు. రాజు ఆయన నిబద్దతను గుర్తించి, గౌరవించారు. ఖుదాయీ కిద్మత్గార్ దేశ విభజనను వ్యతిరేకించింది. అయితే స్వతంత్ర పాకిస్తాన్ ఏర్పడేందుకు అలాంటి వ్యతిరేకత ప్రతికూలాంశమౌతుందని ఎక్కువశాతం పాక్ నాయకులు భావించారు. అబ్డుల్ గఫార్‌ఖాన్‌కు ఇష్టం లేకుండానే ఒక దేశం రెండు దేశాలుగా విడిపోయింది. ఖిస్సా ఖ్వామీ ఊచకోత.. స్వాతంత్య్ర సంగ్రామాల జ్ఞాపకాల్లోంచి కాలంతో పాటు దాదాపుగా కరిగిపోయింది. -
తీరొక్క సంతసం
సాక్షి, కామారెడ్డి: వారమైందంటే.. వారి మనసంతా సంతపైనే! ఆన్లైన్లో ఆర్డరిస్తే తమకు కావాల్సిన వస్తువులు ఇంటిముందు వాలే ఈ కాలంలోనూ అంగడికి ఆదరణ తగ్గలేదు. తీరొక్క వస్తువులకు ముచ్చటైన నెలవు అది. సరుకులు, బట్టలు, చిన్న, పెద్ద వస్తువులు, కూరగాయలు, పశువులు, మేకలు... ఇలా అన్ని రకాలు అక్కడ లభిస్తాయి. ‘అంగడికి పోయి గొంగడి తెస్త ’అన్న సామెత కూడా అట్ల పుట్టిందే. అయితే, ఇప్పుడు స్పెషల్ సంతలు వచ్చేశాయి. కామారెడ్డి అంగడి వాహనాలకు ప్రసిద్ధి. నవీపేట మేకలకు కేరాఫ్‌గా మారింది. బిచ్కుంద పప్పుదినుసులకు ఫేమస్. పిట్లం తలుపుచెక్కల పొట్లంగా మారింది. మద్నూర్ ఎలక్ట్రానిక్ పరికరాలు.. ఇలా పలు చోట్ల ఒక్కోరకం వస్తువుకు ఒక్కో రకం అంగడి నిర్వహిస్తున్నారు. ప్రజల మధ్య ఆత్మీయతకు అంగడి వేదికగా కూడా ఉంటోంది. చుట్టాలు, స్నేహితులు అంగట్లో కలుసుకుంటారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు. వారానికోసారి జరిగే అంగడికి తప్పనిసరిగా వెళ్లేవారు చాలామంది ఉంటారు. ఇప్పుడు జనం అవసరాల మేరకు వారంలో రోజుకో చోట అంగడి సాగుతోంది. తలుపుచెక్కలకు కేరాఫ్ పిట్లం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో నిర్వహించే అంగడి.. ఇంటి దర్వాజాలకు బిగించే తలుపు చెక్కలకు స్పెషల్. వేప, మామిడి చెక్కలు ఇక్కడ లభిస్తాయి. పిట్లం మండలంతోపాటు పొరుగున ఉన్న సంగారెడ్డి జిల్లా నుంచి కూడా ప్రజలు తరలివచ్చి చెక్కలు కొనుగోలు చేస్తుంటారు. కామారెడ్డిలో వాహనాల అంగడి జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో కొన్ని దశాబ్దాలుగా ప్రతి గురువారం సాధారణ అంగడి సాగుతోంది. అయి తే, ఇక్కడ ఐదారేళ్లుగా ప్రత్యేకంగా బైకుల అంగడి కూడా సాగుతోంది. కొత్త బస్టాండ్ సమీపంలోని సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో ప్రతి గురువారం సెకండ్ హ్యాండ్ బైకుల అంగడి నిర్వహిస్తున్నారు. బాబా అనే ఒక వ్యక్తి ప్రారంభించిన బైకుల అంగడి ప్రతివారం నిరాటంకంగా కొనసాగుతోంది. బైకులతోపాటు కార్లు, ట్రాక్టర్లు, వ్యాన్లు, ఆటోలు కూడా అమ్ముతున్నారు. నవీపేట మేకల సంత నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం మేకల సంత సాగుతోంది. వారంవారం రూ.కోట్లలో వ్యాపారం నడుస్తోంది. మేకల కొనుగోలుకు రాష్ట్రంలోని ఇతర జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాం తాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తుంటారు. పప్పుదినుసులకు ఫేమస్ బిచ్కుంద కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం నిర్వహించే అంగడిలో పప్పుదినుసుల అమ్మకాలు జోరుగా సాగుతాయి. పెసర్లు, బబ్బెర్లు, కందులు, శనగలతోపాటు జొన్నలు, గోధుమలు కూడా భారీగా అమ్ముడవుతాయి. చుట్టుపక్కల మండలాల నుంచి పప్పుదినుసుల కోసం వస్తుంటారు. మద్నూర్ అంగట్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కామారెడ్డి జిల్లాలో మారుమూలన మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న మద్నూర్ అంగడి ఎలక్ట్రానిక్ ఉపకరణాల అమ్మకాలకు పెట్టింది పేరు. ఇక్కడ విరివిగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, సామగ్రి విక్రయిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి కొందరు వ్యాపారులు వచ్చి ఫ్యాన్లు, కూలర్లు, స్పీకర్లు, డెక్కులు, మిక్సీలు, గ్రైండర్లు, మైకులు విక్రయిస్తారు. బైకులపై ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకువచ్చి అంగట్లో విక్రయిస్తుంటారు. ధరలు కూడా అందుబాటులో ఉండటంతో వీటి అమ్మకాలకు ఆదరణ కూడా బాగానే ఉంటుంది. -
జనతాబజార్లలో ఆక్వా ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: జనతాబజార్లలో ఆక్వా ఉత్పత్తులను విక్రయించేలా చూడాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రేడింగ్, ప్యాకింగ్ దశ కూడా గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు ఈ బజార్ల ద్వారా తగిన స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు లభించాలని.. కరోనా నేపథ్యంలో వికేంద్రీకరించిన బజార్లను భవిష్యత్తులోనూ కొనసాగేలా చూడాలని ఆయనన్నారు. జనతా బజార్ల విధివిధానాలు.. అధికారుల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను జనతా బజార్లలో విక్రయించేలా చూడాలి. ► కనీసం 20–25 రకాల ఉత్పత్తులు వీటిల్లో అందుబాటులో ఉంచాలి. ► పళ్లు, కూరగాయాలు, గుడ్లు, పాలు, ఆక్వా ఉత్పత్తులు వంటి నిత్యావసరాలు లభించే ఈ బజార్లలో వీటి వినియోగం 30–35 శాతం ఉండాలి. ► ఇలా అయితే మార్కెట్లో పోటీ పెరిగి రైతులకు మంచి ధరలు వచ్చి లాభం చేకూరుతుంది. ► ఏడాదిలోపు వీటిని ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ► గ్రేడింగ్, ప్యాకింగ్ కూడా గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలి. ► ఈ బజార్ల ద్వారా రైతులకు మార్కెటింగ్ అవకాశాలు లభించాలి. ► అలాగే, కరోనా నేపథ్యంలో వికేంద్రీకరించిన బజార్లను భవిష్యత్తులోనూ కొనసాగేలా చూడాలి. ► మార్కెట్లో ఉత్పత్తులు నిలవాలంటే గ్రేడింగ్, ప్యాకింగ్ బాగుండాలి. ► సమావేశంలో చర్చించిన అంశాలతో విధివిధానాలు తయారుచేయాలి. మరింత మేధోమథనం చేసి మంచి ప్రతిపాదనలతో రావాలి. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డుల్లోనూ రైతు బజార్లు రాష్ట్రంలోని మార్కెట్ యార్డుల్లోనూ శనివారం నుంచి రైతుబజార్లు ప్రారంభం కానున్నాయి. వాటిలోని గోడౌన్లు, ప్లాట్‌ఫారాలపై కూరగాయలు, పండ్లు విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గోడౌన్లు లేని యార్డుల్లో తాత్కాలికంగా షెడ్లు వేసి అమ్మకాలు ప్రారంభించాలని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న ఆదేశించారు. గ్రామ, పట్టణ శివారు ప్రాంతాల్లోని గోడౌన్లకు కొనుగోలుదారులు పెద్దగా వచ్చే అవకాశాలు లేకపోవడంతో వాటిని మినహాయించాలన్నారు. వంద యార్డుల గుర్తింపు ► రాష్ట్రంలోని 216 మార్కెట్ కమిటీల పరిధిలో 150 మార్కెట్ యార్డులు ఉన్నాయి. సౌకర్యాలున్న 100 యార్డులను అధికారులు గుర్తించారు. ► వాటిలో శనివారం నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఈ యార్డుల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. ► వీటికి రైతులు, హమాలీలు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది కలిపి రోజుకు సగటున 200 మంది వరకు వస్తున్నట్లు అంచనా. వీరితోపాటు పరిసర ప్రాంతాల వినియోగదారులకు ఇవి ఉపయోగపడతాయి. ► కరోనా వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే.. ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు వెళ్లాయి. ► మార్కెట్ కమిటీల పరిధిలో ఉండే మేజర్ పంచాయతీల్లోనూ అక్కడి పరిస్థితులను బట్టి రైతు బజార్లు ఏర్పాటు కానున్నాయి. అందుబాటులోకి మొబైల్ బజార్లు ► కరోనా వైరస్‌కు ముందు రాష్ట్రంలో 100 రైతు బజార్లు ఉండేవి. తర్వాత తాత్కాలిక రైతు బజార్ల ఏర్పాటు ద్వారా వాటి సంఖ్యను 417కు పెంచారు. ► వీటికి అధిక సంఖ్యలో కొనుగోలుదారులు వ స్తుండటంతో మొబైల్ రైతు బజార్ల విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం 451 మొబైల్ రైతు బజార్లు పని చేస్తున్నాయి. ఇందు కు ఆర్టీసీ బస్సులను కూడా వాడుతున్నారు. -
రైతు బజారుల్లో బినామిల హవా
హోటళ్లకు భారీగా సరఫరా ప్రజలకు దక్కని కూరగాయాలు జాడలేని రైతులు పట్టించుకోని అధికారులు దళారుల బారిన పడకుండా కష్టానికి తగిన ప్రతిఫలం పొందేందుకు రైతుల కోసం రెండు దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసిన రైతుబజారులు నేడు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. రైతులే తమ పొలాల్లో పండించిన స్వచ్ఛమైన తాజా కూరగాయలను రైతు బజారుకు తీసుకువచ్చి తక్కువ ధరకు విక్రయిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. కానీ అందంతా ఒకప్పటి మాట. ఇప్పుడు బినామీ పేర్లతో బయటి వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. రైతులు రైతుబజారుల బయట సైకిళ్లపై కూరగాయలు విక్రయిస్తున్నారు. ఈ విషయం ఎస్టేట్ అధికారులతో పాటు, ఉన్నతాధికారులకు తెలిసిందే. కానీ పట్టించుకోరంతే - కోటగుమ్మం (రాజమహేంద్రవరం) జిల్లాలో రాజమహేంద్రవరంలో ఏడు, కాకినాడలో రెండు, అమలాపురంలో ఒకటి, కొత్తపేటలో ఒకటి, రామచంద్రపురంలో ఒకటి, రావులపాలెంలో ఒకటి, మండపేటలో ఒక రైతు బజారు ఉంది. రాజమహేంద్రవరానికి దోసకాయలపల్లి, కోరుకొండ, సీతానగరం, బొబ్బిల్లంక, మునగాల, తదితర ప్రాంతాలు, మిగిలిన రైతు బజార్లకు ఆయా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి రైతులు కూరగాయలు పండించి తీసుకువస్తుంటారు. జిల్లా నలుమూలలకు చెందిన సుమారు 1200 మంది రైతులు, పొదుపు మహిళా సంఘాలకు, వారి ఆర్థికాభివృద్ధికి ఆసరాగా ఉన్న రైతు బజార్లు పర్యవేక్షణ లోపాల వల్ల అస్తవ్యస్తంగా మారుతున్నాయి. రైతుల స్థానంలో బినామీ వ్యాపారులు లాభపడుతున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, ఉద్యానశాఖ ఉద్యోగుల ఉదాసీన విధానం వల్ల సమస్యలు శృతి మించుతున్నాయి. గుర్తింపు కార్డులు లేకుండానే.. జిల్లాలో 14 రైతు బజార్లు ఉన్నాయి. అయితే పలు రైతు బజార్లలో చాలా మంది రైతులు గుర్తింపు కార్డులు లేకుండానే వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రశ్నిస్తే కార్డులు చిరిగిపోయాయంటున్నారు. మరికొందరు కార్డులు పోగొట్టుకున్నారు. ఇదే ఆసరాగా కొందరు ఎస్టేట్ ఆఫీసర్లు ప్రజాప్రతినిధుల సిఫార్సుల నెపంతో బినామీ వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూరలు పక్కదారి.. ఉదయమే పార్లర్లు, రెస్టారెంట్ల సిబ్బంది వచ్చి అధిక పరిమాణంలో కూరగాయలు కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల తాము వచ్చేసరికి రైతుబజారులో కూరగాయాలు చాలా వరకు అయిపోతున్నాయని ప్రజలు అంటున్నారు. ఇక తూనికల్లో తేడాలు సరేసరి. కొన్ని స్టాళ్లలో ఎలక్ట్రానిక్ కాటాలు మూలకు చేరాయి. మర్చిపోయిన జంబ్లింగ్ జాయింట్ కలెక్టర్లు మారిపోయినా బజార్లలో జంబ్లింగ్ జరగలేదు. గతంలో ఏడాదికోసారి జంబ్లింగ్ పద్దతిని పాటించే వారు. అయితే ఎనిమిదేళ్లుగా జరగకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఫైలు ఉన్నతాధికారుల వద్ద ఉందంటూ మార్కెటింగ్ శాఖ సిబ్బందే చెబుతున్నారు. ఒక్కో రైతు బజారులో ఒక ఎస్టేట్ ఆఫీసర్, ఒక అటెండర్ మాత్రమే ఉండడంతో పని ఒత్తిడి అధికంగా ఉంటోంది. బియ్యం వ్యాపారులు దుకాణాలు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినా ఫలితం కనిపించలేదు. దాంతో పాత వ్యాపారులే ఇక్కడ పాతుకుపోయారన్న విమర్శలు ఉన్నాయి. సమస్యలతో సతమతమవుతున్న రైతు బజార్లను అధికారులు గాడిలో పెట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.