రైతు బజారుల్లో బినామిల హవా
రైతు బజారుల్లో బినామిల హవా
Published Wed, Dec 28 2016 10:48 PM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM
హోటళ్లకు భారీగా సరఫరా
ప్రజలకు దక్కని కూరగాయాలు
జాడలేని రైతులు
పట్టించుకోని అధికారులు
దళారుల బారిన పడకుండా కష్టానికి తగిన ప్రతిఫలం పొందేందుకు రైతుల కోసం రెండు దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసిన రైతుబజారులు నేడు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. రైతులే తమ పొలాల్లో పండించిన స్వచ్ఛమైన తాజా కూరగాయలను రైతు బజారుకు తీసుకువచ్చి తక్కువ ధరకు విక్రయిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. కానీ అందంతా ఒకప్పటి మాట. ఇప్పుడు బినామీ పేర్లతో బయటి వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. రైతులు రైతుబజారుల బయట సైకిళ్లపై కూరగాయలు విక్రయిస్తున్నారు. ఈ విషయం ఎస్టేట్ అధికారులతో పాటు, ఉన్నతాధికారులకు తెలిసిందే. కానీ పట్టించుకోరంతే - కోటగుమ్మం (రాజమహేంద్రవరం)
జిల్లాలో రాజమహేంద్రవరంలో ఏడు, కాకినాడలో రెండు, అమలాపురంలో ఒకటి, కొత్తపేటలో ఒకటి, రామచంద్రపురంలో ఒకటి, రావులపాలెంలో ఒకటి, మండపేటలో ఒక రైతు బజారు ఉంది. రాజమహేంద్రవరానికి దోసకాయలపల్లి, కోరుకొండ, సీతానగరం, బొబ్బిల్లంక, మునగాల, తదితర ప్రాంతాలు, మిగిలిన రైతు బజార్లకు ఆయా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి రైతులు కూరగాయలు పండించి తీసుకువస్తుంటారు. జిల్లా నలుమూలలకు చెందిన సుమారు 1200 మంది రైతులు, పొదుపు మహిళా సంఘాలకు, వారి ఆర్థికాభివృద్ధికి ఆసరాగా ఉన్న రైతు బజార్లు పర్యవేక్షణ లోపాల వల్ల అస్తవ్యస్తంగా మారుతున్నాయి. రైతుల స్థానంలో బినామీ వ్యాపారులు లాభపడుతున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, ఉద్యానశాఖ ఉద్యోగుల ఉదాసీన విధానం వల్ల సమస్యలు శృతి మించుతున్నాయి.
గుర్తింపు కార్డులు లేకుండానే..
జిల్లాలో 14 రైతు బజార్లు ఉన్నాయి. అయితే పలు రైతు బజార్లలో చాలా మంది రైతులు గుర్తింపు కార్డులు లేకుండానే వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రశ్నిస్తే కార్డులు చిరిగిపోయాయంటున్నారు. మరికొందరు కార్డులు పోగొట్టుకున్నారు. ఇదే ఆసరాగా కొందరు ఎస్టేట్ ఆఫీసర్లు ప్రజాప్రతినిధుల సిఫార్సుల నెపంతో బినామీ వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కూరలు పక్కదారి..
ఉదయమే పార్లర్లు, రెస్టారెంట్‌ల సిబ్బంది వచ్చి అధిక పరిమాణంలో కూరగాయలు కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల తాము వచ్చేసరికి రైతుబజారులో కూరగాయాలు చాలా వరకు అయిపోతున్నాయని ప్రజలు అంటున్నారు. ఇక తూనికల్లో తేడాలు సరేసరి. కొన్ని స్టాళ్లలో ఎలక్ట్రానిక్ కాటాలు మూలకు చేరాయి.
మర్చిపోయిన జంబ్లింగ్
జాయింట్ కలెక్టర్లు మారిపోయినా బజార్లలో జంబ్లింగ్ జరగలేదు. గతంలో ఏడాదికోసారి జంబ్లింగ్ పద్దతిని పాటించే వారు. అయితే ఎనిమిదేళ్లుగా జరగకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఫైలు ఉన్నతాధికారుల వద్ద ఉందంటూ మార్కెటింగ్ శాఖ సిబ్బందే చెబుతున్నారు. ఒక్కో రైతు బజారులో ఒక ఎస్టేట్ ఆఫీసర్, ఒక అటెండర్ మాత్రమే ఉండడంతో పని ఒత్తిడి అధికంగా ఉంటోంది. బియ్యం వ్యాపారులు దుకాణాలు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినా ఫలితం కనిపించలేదు. దాంతో పాత వ్యాపారులే ఇక్కడ పాతుకుపోయారన్న విమర్శలు ఉన్నాయి. సమస్యలతో సతమతమవుతున్న రైతు బజార్లను అధికారులు గాడిలో పెట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.
Advertisement
Advertisement