రైతుబడి
'దేశరాజధాని నగరం న్యూఢిల్లీలోని ట్రిపుల్‌ఐటీ సంస్థ. ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదిక మీద దేశవిదేశీ ప్రముఖుల సమక్షంలో ప్రసంగించవలసిందిగా ఆహ్వానం అందుకున్నాడు మన తెలుగు యువకుడు. నేడు జరగనున్న ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్–2024లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలలో యువతకున్న వ్యాపార అవకాశాల గురించి ప్రసంగించే అవకాశాన్నందుకున్న జూలకంటి రాజేందర్‌రెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన ప్రస్థానాన్ని పంచుకున్నారు.'
‘‘న్యూఢిల్లీ వేదికగా అది కూడా అత్యున్నత స్థాయి విద్యాసంస్థలో ప్రసంగించే అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అంతకుముందు జాతీయ స్థాయిలో ‘ద నేషనల్ క్రియేటర్స్ అవార్డు’కు సంబంధించిన ‘మోస్ట్ ఇంపాక్ట్‌ఫుల్ అగ్రి క్రియేటర్’ కేటగిరీలో 36 శాతానికి పైగా ఓట్లు సాధించి రైతుబడి చానెల్ ప్రథమస్థానంలో నిలిచింది. ఇందుకు అసలైన కార్యక్షేత్రం మా నల్గొండ జిల్లా, మాడ్గుల పల్లి మండలంలోని మాచనపల్లి గ్రామం.
నా ఎదుగుదల మూలాలు మా ఊరిలోనే ఉన్నాయి. మాది వ్యవసాయ కుటుంబం. కానీ నేనెప్పుడూ పొలం పని చేయలేదు. నన్ను బాగా చదివించి మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని కలలు కన్నారు అమ్మా నాన్న. పనుల ఒత్తిడి ఉంటే సీజన్‌లో కూడా నాకు పొలం పనులు కాదు కదా, పశువుల దగ్గర సహాయానికి కూడా రానిచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు నా కెరీర్ వ్యవసాయ భూమిలోనే వేళ్లూనుకు΄ోయింది.
పలక.. పేపర్!
అమ్మానాన్న కోరుకున్నట్లే చదువుకున్నాను. బీఈడీ చేసిన తర్వాత స్కూల్లో పలక మీద పిల్లలకు అక్షరాలు దిద్దించాల్సిన వాడిని, అనుకోకుండా కొత్తదారిలో అడుగుపెట్టాను. రోజూ పేపర్ చదివే అలవాటు ఉండడంతో ఓ రోజు జర్నలిజం కోర్సు ప్రవేశ పరీక్ష ప్రకటన నా కంటపడింది. ఉత్సాహం కొద్దీ పరీక్ష రాశాను. సెలెక్ట్ అయ్యాను. కానీ అక్కడ శిక్షణ పూర్తి చేయలేదు. కానీ 2008లో ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌తో జర్నలిస్టుగా నా ప్రయాణం మొదలైంది.
టీవీ చానెల్స్ మారుతూ కొంతకాలం హైదరాబాద్‌లో, మరికొంత కాలం జిల్లాల్లో ఉద్యోగం చేశాను. వార్తలకే పరిమితం కాకుండా ఫీచర్ స్టోరీల కోసం అన్వేషించేవాడిని. నా అన్వేషణలో కెమెరా కంటికి చిక్కిన ఓ వాస్తవం ఎంత ఆసక్తికరమైందో ఊహించగలరా!? కాకతీయుల వారసులు ఇప్పటికీ ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే... చత్తీస్‌గడ్ రాష్ట్రం, జగదల్‌పూర్‌లో. ‘కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ’ అక్కడ రాజు హోదాలో ఉన్నారు.
వివరాలు సేకరిస్తూ వాళ్లను వెతుక్కుంటూ వెళ్లి షూట్ చేయడంలో కలిగిన జాబ్ శాటిస్‌ఫాక్షన్ ఇంత అని చెప్పలేను. ఇలా ఆరేళ్లు గడిచింది, అనుకోకుండా ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ప్రింట్ మీడియాకి మారాను. అక్కడ ఆరేళ్లు పని చేశాను. ఉద్యోగం చేస్తున్నాను కానీ సంతృప్తి స్థాయి క్రమంగా తగ్గి΄ోసాగింది. ఎన్నాళ్లో... ఎన్నేళ్లో ఉద్యోగిగా నీ పయనం... అని నా ఆవేదనను ఫేస్‌బుక్‌లో రాసుకునేవాడిని.
కరోనా వచ్చింది.. లాక్‌డౌన్ తెచ్చింది!
అది 2020, ప్రపంచానికి గుర్తొచ్చేది కరోనా, లాక్‌డౌన్. నాకు గుర్తొచ్చే అపురూపమైన ఘట్టం రైతుబడి ఆవిర్భావం. ఆ ఏడాది జనవరిలోనే రైతుబడి మొదలుపెట్టేశాను. ఉద్యోగం మానేయాలనే నిర్ణయానికి వచ్చాను. మేలో మానేశాను. ఆశ్చర్యం ఏమిటంటే... ఉద్యోగంలో అందుకున్న జీతానికి సమానమైన రాబడిని జూన్‌లోనే చూశాను. రైతులకు ఉపయోగపడే అంశాల మీదనే ఉంటాయి నా వీడియోలన్నీ.
ఒకే పంట వేస్తున్న రైతులకు రకరకాల పంటలు వేయమని మాటలతో చెప్పడం వల్ల ప్రభావితం చేయలేం. ఏకకాలంలో రకరకాల పంటలు పండిస్తున్న రైతు అనుభవాలను వారి మాటల్లో వింటే సాటి రైతులు త్వరగా ప్రభావితమవుతారు. ఇదే నా సక్సెస్ ఫార్ములా. వ్యవసాయరంగ పరిశోధకులు, అధికారుల ద్వారా కూడా కొన్ని విషయాలు చెప్పించాను. కానీ రైతులు చెప్పిన విషయాలనే సాటి రైతులు గుర్తు పెట్టుకుంటున్నారు, ఆచరణలో పెడుతున్నారు. రైతులు కొందరు వ్యవసాయ పరికరాలను సొంతంగా తయారు చేసుకుంటారు, ఉన్న పరికరాలను తమ అవసరాలకు అనుగుణంగా మలుచుకుంటూ ఉంటారు.
అలాంటి వాటిని కూడా బాగా చూపించేవాడిని. పంటలను, రైతులను వెతుక్కుంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో పర్యటించాను. లక్షకు పైగా కిలోమీటర్లు ప్రయాణించాను. పదమూడు వందలకు పైగా వీడియోలు చేశాను. నా రైతుబడికి పదమూడు లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్‌లున్నారు. ఇప్పటి వరకు వన్ మ్యాన్ ఆర్మీలాగ నేనొక్కడినే పొలాలకు వెళ్లి కెమెరా ఆన్ చేసి రైతుతో మాట్లాడేవాడిని. ఆ ఫుటేజ్‌ని మా మంజుల (భార్య) ఇంట్లో ఎడిట్ చేసిచ్చేది. ఈ మధ్యనే ఒక టీమ్‌ను తయారు చేసుకున్నాను.
నా విజయగాధ నేనే రాసుకున్నాను!
"నాలో ఎడతెగని ఆలోచన మొదలైంది. ఎంతోమంది సక్సెస్ స్టోరీలు రాశాను. నా సక్సెస్ స్టోరీని నేను రాసుకోలేనా అనిపించింది. నాలుగు సంస్థల్లో పని చేశాను. సంస్థ పేరు నా ఇంటిపేరుగా నా పేరుకు ముందు చేరుతోంది. కానీ నా పేరే సంస్థ పేరు కాలేదా? ఆ మధనంలో నుంచి పుట్టుకొచ్చిందే రైతుబడి. రైతుబడి అనే అమృతం పుట్టడానికి ముందు నా మదిమధనంలో అనేక గరళాలు కూడా కోరలు సాచాయి.
సూపర్‌మార్కెట్, ‘రైతు పంట’ పేరుతో రైతుల ఉత్పత్తుల విక్రయం, ఇన్ షాట్ తరహాలో ‘లోకల్ న్యూస్ యాప్’ పేరుతో ఓ న్యూస్ యాప్, అదే పేరుతో ఓ యూ ట్యూబ్ చానెల్... వీటిలో కొన్ని భారీ వైఫల్యాలు, మరికొన్ని పాక్షిక విజయాలనిచ్చాయి. ఆ తర్వాత మరో నాలుగు యూ ట్యూబ్ చానెళ్లు కూడా పెట్టాను. అవి విజయవంతం కాలేదు, కానీ నన్ను విజయపథంలో నడిపించే మార్గదర్శకాలయ్యాయి." – జూలకంటి రాజేందర్ రెడ్డి, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్, రైతుబడి యూట్యూబ్ చానెల్
గుర్తు పడుతున్నారు!
‘నాకు గుర్తింపు వచ్చింది’ అనే పెద్ద మాట చెప్పను. కానీ ఇప్పుడు ఏ ఊరికి వెళ్లినా నన్ను గుర్తు పడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయం కోసం పని చేస్తున్న చానెళ్లలో రైతుబడి పెద్దది. ఇప్పుడు ఢిల్లీలో ప్రసంగించడానికి ట్రిపుల్ ఐటీ నుంచి ఆహ్వానం రావడానికి కారణం ఈ యూ ట్యూబ్ చానెలే. నేననుకున్నట్లే నా సంస్థపేరు నా పేరు కలిసి ‘రైతుబడి రాజేందర్’నయ్యాను. ఇది కాకుండా నేను చేరాల్సిన లక్ష్యాలు రెండున్నాయి.
ఒకటి... వ్యవసాయంలో అనుభవాలు పంచుతున్న రైతుబడి తరహాలోనే మరో వేదిక ద్వారా వ్యాపార అనుభవాలను యువతకు చేర్చడం, కొత్త ఎంటర్‌ప్రెన్యూర్‌లను తయారు చేయడం. ఇప్పటికే బిజినెస్ బుక్ పేరుతో ఆ ప్రయత్నం మొదలైంది. మరొకటి వ్యవసాయ భూమిని కొనుక్కోవడం. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాన్న ΄ోయారు. అనివార్యమైన పరిస్థితుల్లో మా పొలాన్ని అమ్ముకున్నాం. కొద్దిగానైనా వ్యవసాయభూమిని కొని మా అమ్మకు బహుమతిగా ఇవ్వాలి. రైతు కుటుంబంలో పుట్టిన వాళ్లం భూమితో బంధాన్ని తెంచుకోలేం’’ అన్నారు రాజేందర్‌రెడ్డి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment