వైరల్
జపాన్‌లోని ఒసాకా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో ఒక విద్యార్థి రిన్. ఇరవై ఏళ్ల రిన్‌ని ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా కాలేజీ వాళ్లు ‘ఫ్యామిలీ ట్రీ’ తయారుచేయమన్నారు. తల్లి తప్ప మరెవరూ లేకపోవడంతో తండ్రి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించాడు రిన్. తల్లి సచియే తకహతాను అడిగాడు. తల్లి–తండ్రి విడిపోయే సమయంలో రిన్ వయసు కేవలం ఒక సంవత్సరం మాత్రమే. వారు విడిపోయిన తర్వాత ఇద్దరి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ‘ఆధారాల కోసం వెతికే క్రమంలో కొన్ని పాత ఫ్యామిలీ ఫొటోలు, తండ్రి సుఖ్‌పాల్ పేరు, అమృతసర్ అడ్రస్ దొరికాయి. గూగుల్ మ్యాప్‌లో లొకేషన్ కోసం వెతికి, టికెట్ బుక్ చేసుకొని ఆగస్టు 15న పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి చేరుకున్నాడు.
అయితే విధి అతన్ని మరింతగా పరీక్ష పెట్టింది. సుఖ్‌పాల్ అక్కడి నుండి ఎప్పుడో వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాడని తెలిసింది. తండ్రి ప్రస్తుతం ఉంటున్న అడ్రెస్ ఎవరూ చెప్పలేకపోయారు. ‘నా దగ్గర మా నాన్న పాత ఫొటోలు ఉండటంతో స్థానిక ప్రజలను అడిగి కనుక్కోవడానికి ప్రయత్నించాను. చాలా మందిని అడిగాక అదృష్టం కొద్దీ ఒక వ్యక్తి నా తండ్రి ఫొటో గుర్తించి, అతని కొత్త చిరునామా నాకు ఇచ్చే ఏర్పాటు చేశాడు. అలా 19 ఏళ్ల తర్వాత మా నాన్నను మళ్లీ కలవగలిగాను’ అని తండ్రిని కలుసుకున్న ఉద్విగ్న క్షణాలను పంచుకుంటున్నాడు రిన్.
‘ఇలా జరుగుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ, జరిగింది. నా ప్రస్తుత భార్య గుర్విందర్‌జిత్ కౌర్, నా ఏకైక కుమార్తె అవ్లీన్ కూడా రిన్‌ను కుటుంబంలోకి హృదయపూర్వకంగా స్వాగతించినందుకు సంతోషంగా ఉన్నాను. నా మాజీ భార్య సచియేతో ఫోన్‌లో మాట్లాడాను. రిన్ క్షేమం గురించి చె΄్పాన’ని సుఖ్‌పాల్ కొడుకును కలుసుకున్న మధుర క్షణాలను పంచుకుంటున్నాడు.
రక్షాబంధన్ రోజే...
రిన్ తండ్రి కుటుంబాన్ని కలవడం, పండగప్రాముఖ్యతను గురించి తెలుసుకొని, ఆ రోజు సవతి సోదరి అవ్లీన్ చేత రాఖీ కట్టించుకోవడం.. వంటివి రిన్‌ను థ్రిల్ అయ్యేలా చేశాయి. ‘మా సోదర–సోదరీ బంధం చాలా బలమైనది’ అని ఆనందంగా చెబుతాడు రిన్.
కొడుకును అమృత్‌సర్‌కి తీసుకెళ్లి..
ఇన్నేళ్లకు వచ్చిన కొడుకును వెంటబెట్టుకొని సుఖ్‌పాల్ స్వర్ణదేవాలయాన్ని సందర్శించుకున్నాడు. అటారీ వాఘా సరిహద్దులో జరిగిన జెండా వేడుకను వీక్షించారు. సుఖ్‌పాల్ తన గతాన్ని వివరిస్తూ ‘2000 సంవత్సరం మొదట్లో థాయ్‌లాండ్ విమానాశ్రయంలో భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు అనుకోకుండా సచియేను చూశాను. విమానంలో మా సీట్లు పక్కపక్కనే ఉన్నాయి. అలా మా మొదటి సంభాషణ జరిగింది. ఆమె వరుసగా ఎర్రకోట, తాజ్‌మహల్‌లను సందర్శించడానికి న్యూఢిల్లీ, ఆగ్రాకు వెళుతోంది.
గోల్డెన్ టెంపుల్ గురించి చెప్పి, అమృత్‌సర్‌కి తన పర్యటనను పొడిగించమని సచియేని నేనే అడిగాను. ఆమె వెంటనే ‘ఓకే’ చెప్పి అమృత్‌సర్‌కి నాతో పాటు వచ్చింది. మా కుటుంబంతో కలిసి 15 రోజులకు పైగా ఉంది. ఇక్కడ ఉన్న సమయంలో స్థానిక పర్యాటక ప్రదేశాలతో పాటు ఎర్రకోట, తాజ్‌మహల్‌ను సందర్శించాం. సచియే జపాన్‌కు వెళ్లాక కూడా ఇద్దరం ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. అప్పుడు తనకు 19 ఏళ్లు, నాకు 20 ఏళ్లు. 2002లో సచియేను వివాహం చేసుకుని, జపాన్ పర్యటనకు వెళ్లాను. ఏడాది తర్వాత రిన్ జన్మించాడు. నేను జపనీస్ నేర్చుకున్నాను. అక్కడ చెఫ్‌గా పని చేశాను.
కొన్ని రోజుల తర్వాత మేం కొన్ని కారణాల వల్ల కలిసి ఉండలేకపోయాం. దీంతో నేను భారతదేశానికి తిరిగి వచ్చేశాను. ఆమె రిన్‌తో కలిసి నన్ను చూడటానికి భారతదేశం వచ్చింది. మరోసారి తనతో కలిసి జపాన్‌కు వెళ్లాను. కానీ, కలిసి ఉండలేకపోయాం. 2004లో విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత మూడేళ్ళు జపాన్‌లోనే ఉన్నా కానీ, వారిని కలవలేదు. 2007లో స్వదేశానికి తిరిగి వచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు మేమంతా రిన్‌తో టచ్‌లో ఉంటాం’ అని గత స్మృతులను, ప్రస్తుత ఆనందాన్ని ఏకకాలంలో పొందుతూ ఆనందంగా చెబుతున్నాడు సుఖ్‌పాల్.
Comments
Please login to add a commentAdd a comment