2019–20లో మొత్తం క్లెయిమ్‌లలో గుండె చికిత్సలవే 12 శాతం
2023–24లో 20 శాతానికి పెరుగుదల
చికిత్స ఖర్చులు 53 శాతం పెరుగుదల
పాలసీ బజార్ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో గుండె జబ్బుల సంబంధిత ఇన్సూ్యరెన్స్ క్లెయిమ్‌లు దాదాపు రెట్టింపవడమే ఇందుకు నిదర్శనం. కాలుష్యం, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలు గుండె జబ్బులకు ప్రధాన కారణం. పాలసీ బజార్ సంస్థ అధ్యయన నివేదిక ప్రకారం 2019–20లో దేశవ్యాప్తంగా నమోదైన ఆరోగ్య బీమా నమోదైన క్లెయిమ్‌లలో గుండె చికిత్సల క్లెయిమ్‌ల వాటా దాదాపు 12 శాతం.
ఇవి 2023–24లో 20 శాతం వరకు పెరిగాయి. గుండె జబ్బుల చికిత్స ఖర్చులు సైతం 47 నుంచి 53 శాతం మేర పెరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఒక్కో క్లెయిమ్ 2019–20లో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల ఉంటే.. 2023–24లో రూ. 12 – 15 లక్షలకు పెరిగినట్లు తెలిపింది.
యువతలో పెరుగుతున్న జబ్బులు
కొద్ది సంవత్సరాలుగా యువతలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేని జీవన శైలి ఇందుకు కారణమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 2020లో 40 ఏళ్ల లోపు యువతకు సంబంధించిన గుండె వ్యాధుల క్లెయిమ్‌లు 10–12 శాతం నమోదు కాగా, 2022–23లో 15–18 శాతంగా నమోదైంది. గుండె జబ్బులకు సంబంధించిన మొత్తం క్లెయిమ్‌లలో 60–70 శాతం పురుషులు, 30–40 శాతం మహిళలు ఉన్నట్టు తేలింది.
ప్రాంతాల వారీగా అత్యధికంగా గుండె చికిత్సల క్లెయిమ్‌లు
ఉత్తర భారతదేశం (ఢిల్లీ, పంజాబ్, హర్యానా) 20- 25%
పశ్చిమ భారతదేశం (మహారాష్ట్ర, గుజరాత్) 15- 18%
దక్షిణ భారతదేశం (తమిళనాడు, కర్ణాటక) 15-20%
తూర్పు భారతదేశం (పశ్చిమ బెంగాల్) 10- 12%
(కోల్‌కతా వంటి నగరాల్లో గుండె జబ్బుల రేట్లు గణనీయంగా ఉంటున్నాయి. అయినప్పటికీ బీమా పాలసీదారులు తక్కువగా ఉండటంతో తక్కువ నమోదైంది)
Comments
Please login to add a commentAdd a comment