సాక్షి, అమరావతి : అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా రానున్న రోజుల్లో ఏపీ గణనీయమైన వృద్ధి, పట్టణీకరణ జరిగే క్రమంలో ఎదురయ్యే విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా విద్యుత్ రంగం బలోపేతంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా.. రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్‌స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్‌కో) శ్రీకారం చుడుతోంది.
వీటిలో 16 సబ్‌స్టేషన్ల శంకుస్థాపన, 12 సబ్‌స్టేషన్ల ప్రారంపోత్సవాలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వర్చువల్ విధానంలో చేయనున్నారు. రూ.3,100 కోట్ల వ్యయంతో కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 28 ప్రాంతాల్లో 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, 400/132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్‌స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి.
రెండు సోలార్ ప్రాజెక్టులు కూడా..
ఇవికాక.. కడపలో 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, అనంతపురంలో 100 మెగావాట్ల మరో సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. కడప జిల్లా మైలవరం మండలంలో 1,000 మెగావాట్ల సోలార్ పార్కు అభివృద్ధికి కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) ఆమోదం తెలిపింది. ఇందులో 250 మెగావాట్లను 2020 ఫిబ్రవరి 8న ప్రారంభించారు. మిగిలిన 750 మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ) ద్వారా అభివృద్ధి చేయనున్నారు. ఈ 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు పెట్టుబడి అవుతుందని అంచనా. ఏడాదిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్లాంట్ ఏటా 1,500 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిద్వారా సంవత్సరానికి 12 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా.
అలాగే.. శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని ఎన్.పీ.కుంట, గాలివీడు గ్రామాల వద్ద 1,500 మెగావాట్ల సోలార్ పార్క్‌కు ఎంఎన్‌ఆర్‌ఈ ఆమోదం తెలిపింది. వివిధ సోలార్ పవర్ డెవలపర్లు 1,400 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తిచేశారు. మిగిలిన 100 మెగావాట్ల కోసం, హెచ్‌పీసీఎల్ ముందుకొచ్చింది. ఈ సోలార్ ప్రాజెక్టుకు రూ.400 కోట్లు పెట్టుబడి అంచనా వేయగా, ఏడాది నిర్మాణ కాలంలో 200 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్ ఏటా 200 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ఏటా 1.6 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు.
గడువులోగా ప్రాజెక్టులు పూర్తి
విద్యుత్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్ణిత సమయానికి పూర్తి చేసేందుకు పక్కాగా ప్రణాళికలు రూపొందించాలని విద్యుత్ సంస్థలను ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె. విజయానంద్ ఆదేశించారు. సీఎం కార్యక్రమం ఏర్పాట్లపై విద్యుత్ సౌధలో సోమవారం ఆయన అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి, అందుకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందించిన సహాయ సహకారాలతోనే వినియోగదారులకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు ఇవ్వగలుగుతున్నామని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో జెన్‌కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ జేఎండీ బి. మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు ఐ. పధ్వితేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ఎండీ, సీఈఓ కమలాకర్ బాబు, డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment