వైట్‌ పేపర్‌.. లైట్‌ తీస్కో.. 'కరెంట్‌పైనా కోతలే'! | CM Chandrababu Naidu Over Action In The Name Of White Paper On Power Sector, More Info Inside | Sakshi
Sakshi News home page

వైట్‌ పేపర్‌.. లైట్‌ తీస్కో.. 'కరెంట్‌పైనా కోతలే'!

Published Wed, Jul 10 2024 3:39 AM | Last Updated on Wed, Jul 10 2024 1:26 PM

CM Chandrababu Over Action in the name of white paper on Power Sector

పొంతనలేని లెక్కలు..అర్థం లేని ఆరోపణలు

తెలంగాణ నుంచి బకాయిలు వసూలు చేయనిది ఈ బాబే 

ట్రాన్స్‌ మిషన్‌ చార్జీలేని సెకీ విద్యుత్‌కు ట్రాన్స్‌ మిషన్‌ చార్జీల కోసమే అధికధర అంటూ వక్ర భాష్యం 

థర్మల్‌ బ్యాక్‌ డౌన్‌ చేసి విద్యుత్‌ సంస్థలపై అదనపు భారం వేసి ఆ నెపం గత ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం 

మిగులు విద్యుత్‌ ఉండగా అధిక ధరలకు పీపీఏలు కుదిర్చి డిస్కంలను అప్పుల కుప్పలు చేసిన టీడీపీ.. ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచి జాప్యం చేసిందే చంద్రబాబు 

వాస్తవాలు దాచి విద్యుత్‌ పై వైట్‌ పేపర్‌ పేరుతో సీఎం చంద్రబాబు ఫీట్లు 

టారిఫ్‌ పెంపు, ట్రూ అప్‌ తగ్గింపుపై మాట దాటవేత

శ్వేత పత్రం... యథార్థాలు చెబుతుందన్న అర్థాన్ని వదిలేస్తే.. జస్ట్‌ తెల్ల కాగితం! ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్లు రాసుకోవచ్చు. అందుకే... సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే శ్వేతపత్రాల పరంపర మొదలెట్టారు. పోలవరం.. అమరావతి... ఇప్పుడు విద్యుత్‌ రంగం. కాసుల కోసం ప్రత్యేక హోదాపై రాజీ పడి.. ప్యాకేజీగా తెచ్చుకున్న పోలవరాన్ని తమ వారికి కట్టబెట్టేసి... డబ్బులొచ్చే పనులు మాత్రమే చేసి తాను నాశనం చేసిన జీవనాడి పాపాలను సైతం జగన్‌పైకే నెట్టేయడమన్నది తొలి తెల్ల కాగితం సారాంశం. 

తను ఏలిన ఐదేళ్లూ గ్రాఫిక్స్‌లోనే చూపించిన అమరావతిని కూడా జగనే దెబ్బ తీశారనేది మరో శ్వేతపత్ర కథనం. కోలుకోలేని బకాయిలతో విద్యుత్‌ సంస్థల మనుగడనే ప్రశ్నార్థకం చేసి... సరఫరా వ్యవస్థను సర్వనాశనం చేసిన చంద్రబాబు... పాత ప్రభుత్వ బకాయిల్ని చెల్లించి విద్యుత్‌ వ్యవస్థను పట్టాలెక్కించిన జగన్‌పై మూడో పత్రం సహితంగా మరిన్ని అసత్యాలు వండివార్చారు. ఏడు అంశాలపై శ్వేతపత్రాలు తెస్తానని ముందే చెప్పిన బాబు... తన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేయటానికి ముందే కొంత ప్రిపేరయ్యారనేదే ఈ రోత పత్రాల లోగుట్టు!! ఇక విద్యుత్తు పై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఏర్పాట్లు సరిగా లేవని ఉద్యోగులను బెదిరిస్తూ.. బాబు తన సహజ ధోరణి ప్రదర్శించారు!

సాక్షి, అమరావతి: అబద్ధాలతో మునుపటి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లడమే ప్రధాన అజెండాగా సీఎం చంద్రబాబు మంగళవారం విద్యుత్‌ శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఐదేళ్లలో ఒక్క సారి కూడా పవర్‌ హాలిడే విధించకుండా, విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో జరిగినప్పుడు కూడా ఎక్కడా సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టిన గత ప్రభుత్వంలో లేని తప్పులను, జరగని నష్టాలను కల్పించి శ్వేతపత్రంలో పొందుపరిచారు. 

తాను గతంలో అధికారంలో ఉన్నప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలతో కుదేలైన డిస్కంలను ఆదుకున్న వైఎస్‌ జగన్‌ వల్లనే విద్యుత్‌ రంగం రూ.1,29,503 కోట్ల నష్టం వచ్చిందంటూ చంద్రబాబు కనికట్టు విద్యను ప్రద­ర్శించారు.  2018–19 నాటికి జెన్‌కో ఇన్‌స్టాల్డ్‌ కెపాసిటీ 5613 మెగావాట్లుకాగా 7,213 మెగావాట్లు అని చంద్రబాబు శ్వేత పత్రంలో అబద్ధాలు చెప్పుకొ­చ్చారు. ఆ అబద్దాలు..వాటి వెనుక వాస్తవాలు ఇవీ...

డిస్కంలకు అప్పుల పాలు చేసింది మీరేగా చంద్రబాబు
డిస్కంల నికర విలువ 2014లో చంద్రబాబు గెలిచే నాటికి సుమారు మైనస్‌ రూ.4,315 కోట్లు ఉంటే, ఆ ప్రభుత్వం దిగిపోయేనాటికి... అంటే 2019 నాటికి నికర విలువ దారుణంగా క్షీణించి ఏకంగా మైనస్‌ రూ.20వేల కోట్లకు చేరింది.  2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్ళలో రూ.13,225 కోట్లు మాత్రమే అప్పటి ప్రభుత్వం సబ్సిడీ చెల్లించింది. 2019–20 నుంచి 2023–24 వరకు నాలుగేళ్ళలోనే సబ్సిడీ, ఆర్థిక మద్దతు కింద జగన్‌ సర్కారు రూ.47,800.92 కోట్లు చెల్లించింది. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంల అప్పులు,  విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు పంపిణీ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు 2014 మార్చి నాటికి రూ.29,551 కోట్లు ఉంటే, చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.86,215 కోట్లకు పెరిగాయి. 

అంటే ఏకంగా 56,663 కోట్లు పెరిగాయి. సగటున అప్పుల వృద్ధిరేటు 24శాతం. అదే జగన్‌ హయాంలో రూ.86,215 కోట్లు కాస్తా..రూ.1,22,518కోట్లకు పెరిగాయి. అంటే కోవిడ్‌ లాంటి సంక్షోభాలున్నా,  చంద్రబాబు చేసిన అప్పులభారం అధికంగా ఉన్నా... జగన్‌ హయాంలో పెరిగిన అప్పులు కేవలం రూ.36,303 కోట్లు. వాటి వృద్ధిరేటు 7.3 శాతమే. టీడీపీ ప్రభుత్వం 8 వేల మెగావాట్ల పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ (పీపీఏ)లను అధిక ధర (యూనిట్‌ రూ.7)లకు కుదుర్చుకుంది. దీనివల్ల డిస్కంలు ఏటా దాదాపు రూ.3,500  కోట్ల చొప్పున 25 ఏళ్ల పాటు ఈ భారం మోయాల్సి వస్తోంది. ఈ ఒప్పందాల కోసం థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని (బ్యాక్‌ డౌన్‌)తగ్గించింది. 



గత ప్రభుత్వంలో తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించడం కోసం డిస్కంలు ఆర్థిక సంస్థల నుంచి మరిన్ని రుణాలను  తీసుకోవాల్సి వచ్చింది. బాబు సీఎంగా ఉన్నన్నాళ్లూ విద్యుత్‌ కొనుగోలు వ్యయం (ట్రూ అప్‌)ను బిల్లుల్లో సర్ధుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కంలకు ఇవ్వలేదు. దీంతో 2014–19 మధ్య దాదాపు రూ.20 వేల కోట్లు డిస్కంలు నష్టపోవాల్సి వచ్చింది. ఆ ట్రూ చార్జీలే జగన్‌ హయాంలో ఏపీఈఆర్‌సీ అనుమతితో డిస్కంలు వేశాయి. మరిప్పుడు ట్రూ అప్‌  ఛార్జీలను వెనక్కి తీసుకునే ఆలోచన ఉందా?, విద్యుత్‌ చార్జీల టారిఫ్‌ పెంచరా? అని విలేకరులు అడిగితే ‘నేను అలా అన్నానా’ అంటూ, అవేవీ జరగవని, చార్జీల పెంపు తప్పదనే సంకేతాన్ని చంద్రబాబు ఇవ్వనే ఇచ్చారు. 


ఉచిత విద్యుత్‌ ఇస్తే బట్టలారేసుకోవాలన్నది ఎవరు
రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్‌ వినియో­గ­దారులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతో పాటు విద్యుత్‌ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా రైతు ఖాతాలో నెలవారీ వినియోగ చార్జీలను ప్రభుత్వం జమ చేస్తుంది. ఆ మొత్తాన్ని రైతులు డిస్కంలకు చెల్లి­స్తారు. ఇదంతా తప్పని ఎన్నికల ముందు గొంతు చించుకున్న చంద్రబాబు ఇప్పుడు మాత్రం స్మార్ట్‌ మీటర్లపై సమాధానం దాటవేశారు. 

వ్యవసాయానికి స్మార్ట్‌ మీటర్లు పెడుతుంటే, రైతులపై విద్యుత్‌ బిల్లులు భారం వేస్తారని తప్పుడు ప్రచారం చేసిన బాబు..మీటర్లపై మీ వైఖరేమిటని అడిగితే అర్ధం లేని సమాధానాలతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. స్మార్ట్‌ మీటర్ల గురించి చెప్పకుండా సోలార్‌ నెట్‌ మీటరింగ్‌ గురించి చెప్పుకొచ్చారు. నిజానికి వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఇదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా  రైతు­లకు ఉచిత విద్యుత్‌ బకాయిలను రూ.8845 కోట్లు ఇవ్వకుండా ఎగవేశారు. 

దానిని కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది.ఉచిత వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ కింద రూ.43,744 కోట్లను జగన్‌ ప్రభుత్వం అందించింది. రైతులకు పగటిపూట 9 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంచారు. రూ.1,700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటు చేసి రైతులకు పగటి పూట నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. 

చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా జగన్‌ ప్రభుత్వం 5 లక్షలకుపైగా వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది.

మీ వల్ల కానిది జగన్‌ చేసి చూపించలేదా?
కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎస్‌డీఎస్‌టీ­పీఎస్‌)­లోని 800 మెగావాట్ల యూని­ట్, నార్ల తాతా­రావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎన్టీటీ­పీఎస్‌)­లోని 800 మెగావాట్ల యూ­ని­­­ట్‌ల జాప్యం వల్ల రూ.12,818 కో­ట్లు నష్టమని అసత్యాల కథ అల్లారు చంద్రబాబు. నిజానికి ఈ రెండు యూనిట్లతో 1,600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చిందే జగన్‌. ఈ 2 ప్రాజెక్టుల్లో పనులకు స్థిర (ఫిక్సిడ్‌) రేటును నిర్ణయించారు. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి, పెంచడానికి అవ­కాశం లేదు. 

ఎగ్జిక్యూషన్‌ ఏజెన్సీల్లో జగన్‌ హ­యాంలో ఎటువంటి మార్పులు, విజిలెన్స్‌ విచా­రణలు కూడా జరగలేదు. అంటే ఈ రెండు ప్రాజె­క్టుల అమలులో ఉద్దేశపూర్వకంగా ఎలాంటి జా­ప్యం జరగలేదు. కోవిడ్‌ రెండు దశల కారణంగా 2020, 2021ల్లో ఏడాదిన్నరకు పైగా ప్రాజెక్టుల పనులు నిలి­చిపో­యాయి. కోవి­డ్‌ మూడో దశలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కార్మికులను సమీకరించడం, వారికి పునరా­వాసం కల్పించడానికి చాలా సమయం పట్టింది. అయినప్పటికీ పనులు చకచకా జరిపించి 2022 అక్టోబర్‌లో ప్రారంభిచారు. 

ఎన్టీటీపీఎస్‌లో యూనిట్‌లో అదే ఏడాది డిసెంబరులో ఉత్పత్తి మొదలుపెట్టారు. అయితే జీఎస్టీ అమలు, చట్టంలో మార్పు, ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తంపై వడ్డీ కారణంగా అంచనా వ్యయంతో పోలిస్తే ప్రాజెక్ట్‌ వ్యయం పెరిగింది. ఇందులో జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమాత్రం లేదు. అంతేకాకుండా జగన్‌ హయాంలో ఉత్పత్తి 63,675 మిలియన్‌ యూనిట్లు కాస్తా, ఉత్పత్తి 2023–24 నాటికి 80,151 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది.

‘సెకీ’తో లాభమేగానీ నష్టం లేదువ్యవసాయానికి 9 గంటల పగటిపూట ఉచిత విద్యు­త్‌­ను వచ్చే 30 ఏళ్ల పాటు కొనసాగించేందుకు, 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌­ఈసీఐ) తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకు­న్నారు. అది కూడా యూనిట్‌ కేవలం రూ.2.49 పైసలకే. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్‌ ధర యూనిట్‌ రూ.2.79పై. (ట్రేడింగ్‌ మార్జిన్‌ కలిపి) కన్నా ఇది‡ తక్కువ. 

ప్రస్తుత సరాసరి విద్యుత్‌ కొను­గోలు వ్యయం యూనిట్‌ రూ.5.10 ఉంది.  దీని వల­న ఏటా రూ.3,750 కోట్లు ఆదా అవుతుంది. ఈ విద్యుత్‌ను రాజస్థాన్‌ నుంచి ట్రాన్స్‌మిషన్‌ చేయాల్సి రావడం వల్ల అధిక ధర పెట్టారని చంద్రబాబు చె­ప్పు­కొచ్చారు. కానీ సెకీ విద్యుత్‌కు కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్‌మిషన్‌ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆ విషయాన్ని దాచిపెట్టారు చంద్రబాబు.

ఈ మంచి కనిపించలేదా
పునరుత్పాదక విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు విండ్‌ సోలార్‌ హైబ్రిడ్‌ ప్రాజెక్టులను స్థాపించడానికి పునరుత్పాదక ఇంధన ఎగు­మతి విధానం  2020ని గత ప్రభుత్వంలో ప్ర­క­టించారు. ప్రపంచంలోనే అతిపెద్ద 5,230 ­మెగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్ట్‌కు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్, పాణ్యం మండలాల సరిహద్దులోని పిన్నాపురంలో శంకుస్థాపన చేశారు. 

⇒ నెడ్‌కాప్‌ ఆధ్వర్యంలో దాదాపు 44,240 మెగా­వాట్ల సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రోపవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 
⇒ వైజాగ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకు­న్నారు. వీటి ద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. 

⇒ రాష్ట్రంలో ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3800 కోట్లు విలువైన 5600 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అయ్యింది. తద్వారా 4.76 మిలియన్‌ టన్నుల కార్బన్‌ ఉద్గారాలు తగ్గాయి. ఇంధన భద్రత దిశగా చేస్తున్న కషిని గుర్తించి రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ను కేంద్రం ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందించింది. అలాగే ఏపీట్రాన్స్‌కో, నెడ్‌కాప్, ఏపీకి మూడు ఎనర్షియా అవార్డులు వరించాయి.ఏపీఎస్పీడీసీఎల్‌కు రెండు జాతీయ అవార్డులు లభించాయి. ‘కన్సూ్యమర్‌ సర్వీస్‌ రేటింగ్‌ ఆఫ్‌ డిస్కమ్స్‌’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏపీలోని మూడు డిస్కంలకు ‘ఏ’ గ్రేడ్‌ లభించింది. 

⇒ రాష్ట్రానికి రావాల్సిన అంతరాష్ట్ర విద్యుత్‌ ప్రసార చార్జీలపై ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ట్రాన్స్‌­మిషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీ ట్రాన్స్‌కో) చేసిన పోరాటం ఫలించి రాష్ట్రానికి రూ.306.2 కోట్ల ఆదాయం సమకూరింది. 
⇒ మాచ్‌ఖండ్‌లో ఒడిశా హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఓహెచ్‌పీసీ), ఏపీ జెన్‌కో సంయుక్తంగా మాచ్‌ఖండ్‌ ప్రాజెక్టు ఎగువ, దిగువ  98 మెగావాట్ల  సామర్థ్యం గల మూడు జల విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి  చర్యలు  చేపట్టింది. అప్పర్‌ సీలేరులో రూ.11,154 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే 1350 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజి ప్లాంట్‌ (పీఎస్పీ)కు కేంద్ర విద్యుత్‌ మండలి (సీఈఏ) నుంచి అనుమతి తీసుకువచ్చింది. 

⇒ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు 2023లో రూ.2,479 కోట్లతో 16 సబ్‌ స్టేషన్ల నిర్మాణానికి శంకు­స్థాపన చేయడంతో పాటు రూ.620 కోట్లతో నిర్మించిన 12 సబ్‌స్టేషన్లను అప్పటి సీఎం జగన్‌ ప్రారంభించారు. ఇందుకోసం మొత్తం రూ.3,099 కోట్లను వెచ్చించారు. 
⇒ ఏపీట్రాన్స్‌కో ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ లభ్యత 99.70 శాతానికి పెరిగింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌ని ఉపయోగించి ‘ది మోస్ట్‌ అక్యు­రేట్‌’ డే–ఎహెడ్‌ ఫోర్‌కాస్ట్‌ మోడల్‌ను ప్రవేశ­పెట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. 3 శాతం లోపు ఉన్న ప్రసార నష్టాలను  2.69 శాతానికి ఏపీట్రాన్స్‌కో తగ్గించింది. 

⇒ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి 14948 మెగావాట్ల నుంచి 17102 మెగావాట్లకి మెరుగుపడింది. 2022–23 సంవత్సరంలో 93 శాతం (12.40 మిలియన్‌ మెట్రిక్‌ టన్‌) ఉన్న బొగ్గు లభ్యత,  2023–24లో 96.52 శాతానికి (14.74 మిలియన్‌ మెట్రిక్‌ టన్‌)కి పెరిగింది. 
⇒ వ్యవసాయం, ఆక్వా ,పశుసంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాలు కలిపి మొత్తం 39.64 లక్షల మంది వినియోగదారులకు ‘నవరత్నాల’ పథకాల ద్వారా ఉచిత, సబ్సిడీ విద్యుత్‌ను అందించింది. ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించింది. వెనుకబడిన వర్గాల కుటుంబాలకు, ధోబీ ఘాట్‌లు, హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌లు, చేనేత  కార్మికులు, లాండ్రీలు, దారిద్రయ రేఖకు దిగువ ఉన్న వారికి,  ప్రొఫెషనల్‌ గోల్డ్‌స్మిత్‌ల దుకాణాలకు కూడా ఉచిత, సబ్సిడీ విద్యుత్‌ సరఫరాను చేసింది.

తెలంగాణ బకాయిలు వసూలుకు చొరవ తీసుకున్నది జగనే
తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఆంధ్రప్రదేశ్‌ సరఫరా చేసిన విద్యుత్‌కు చెల్లించాల్సిన రూ.7300 కోట్ల బకాయిలను వసూలు చేసేందుకు అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రంపై అనేక పర్యాయాలు ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి విద్యుత్‌ బకాయిలు కట్టాల్సిందేనని కేంద్రం తెలంగాణకు చెప్పింది. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ)ల నుంచి 2014 జూన్‌ 2 నుంచి 2017 మార్చి 31 మధ్య రూ.5625 కోట్ల రుణాలను ఏపీ జెన్‌కో తీసుకుంది. 

అలా తీసుకున్న డబ్బులతోనే తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేసింది. కానీ వాడుకున్న విద్యుత్‌కు తెలంగాణ నుంచి అప్పడు అధికారంలో ఉన్న చంద్ర­బాబు వసూలు చేయలేకపోయారు. ఇప్పుడు ఆ బకా­యిలను కూడా గత ప్రభుత్వం ఖాతాలోకి నెట్టే ప్రయత్నం చేశారు. మీరేం చొరవ తీసుకుంటు­న్నారని విలేకరులు అడిగితే మాత్రం ‘వాళ్లేదో అంటున్నారు. కమిటీ వేస్తాం..చూస్తాం’ అంటూ సమాధానం చెప్పలేకపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement