APSPDCL
-
విద్యుత్ సంస్థల్లో కొత్త సర్కిళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల్లో కొత్తగా 13 సర్కిళ్లు(జిల్లా కార్యాలయాలు) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. గత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలు చేసింది. కొత్తగా వచ్చిన జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించింది. అనంతరం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, జిల్లాల్లో సర్కిల్, డివిజన్, ఏఈ కార్యాలయాల ఏర్పాటుతోపాటు వాటికి అధికారులు, సిబ్బందిని నియమించడంపై దృష్టి సారించలేదు. దీంతో దాదాపు 1.92 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులకు మూడు డిస్కంలు పాత పద్ధతిలోనే విద్యుత్ పంపిణీ, బిల్లుల జారీ వంటి అన్ని కార్యకలాపాలు కొనసాగిçÜ్తున్నాయి.చివరికి సర్కిళ్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్లు ఆగస్టు 21వ తేదీన, ఏపీసీపీడీసీల్ అదే నెల 27న ప్రభుత్వాన్ని కోరాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు.‘సాక్షి’ కథనంతో కదలికఈ నేపథ్యంలో ‘కొత్త సర్కిళ్లు ఎంతెంత దూరం?’ శీర్షికతో గత నెల 30న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఆ కథనంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇంధన శాఖ అధికారులతో నివేదికలు తెప్పించుకుని చర్చించింది. తాజాగా 13 కొత్త సర్కిల్స్ ఏర్పాటుకు అనుమతిచ్చింది. రాష్ట్రంలోని మూడు డిస్కంలలో సుమారు 23 వేల మంది శాశ్వత సిబ్బంది పనిచేస్తున్నారు. ఎటువంటి ఆర్థక భారం పడకుండా ఇప్పుడు ఉన్నవారినే పాత, కొత్త సర్కిళ్లకు సర్దుబాటు చేయాల్సిందిగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ఈ ప్రక్రియను పూర్తిచేసి ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలను పంపాలని సీఎండీలకు సూచించారు. కొత్త సర్కిళ్లు ఏర్పడితే ప్రజలకు విద్యుత్ సేవలు మరింత చేరువవుతాయి. అదేవిధంగా ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. దూరం(కిలో మీటర్లు), హెచ్‌టీ సర్వీసులు, ఎల్టీ సర్వీసులు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, వాటి సామర్థ్యం, సబ్ స్టేషన్ల సంఖ్య, నెలకు వచ్చే సగటు ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ సర్కిళ్ల విస్తరణకు చర్యలు చేపట్టాలని డిస్కంలు భావిస్తున్నాయి. -
వైట్ పేపర్.. లైట్ తీస్కో.. 'కరెంట్‌పైనా కోతలే'!
శ్వేత పత్రం... యథార్థాలు చెబుతుందన్న అర్థాన్ని వదిలేస్తే.. జస్ట్ తెల్ల కాగితం! ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్లు రాసుకోవచ్చు. అందుకే... సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే శ్వేతపత్రాల పరంపర మొదలెట్టారు. పోలవరం.. అమరావతి... ఇప్పుడు విద్యుత్ రంగం. కాసుల కోసం ప్రత్యేక హోదాపై రాజీ పడి.. ప్యాకేజీగా తెచ్చుకున్న పోలవరాన్ని తమ వారికి కట్టబెట్టేసి... డబ్బులొచ్చే పనులు మాత్రమే చేసి తాను నాశనం చేసిన జీవనాడి పాపాలను సైతం జగన్‌పైకే నెట్టేయడమన్నది తొలి తెల్ల కాగితం సారాంశం. తను ఏలిన ఐదేళ్లూ గ్రాఫిక్స్‌లోనే చూపించిన అమరావతిని కూడా జగనే దెబ్బ తీశారనేది మరో శ్వేతపత్ర కథనం. కోలుకోలేని బకాయిలతో విద్యుత్ సంస్థల మనుగడనే ప్రశ్నార్థకం చేసి... సరఫరా వ్యవస్థను సర్వనాశనం చేసిన చంద్రబాబు... పాత ప్రభుత్వ బకాయిల్ని చెల్లించి విద్యుత్ వ్యవస్థను పట్టాలెక్కించిన జగన్‌పై మూడో పత్రం సహితంగా మరిన్ని అసత్యాలు వండివార్చారు. ఏడు అంశాలపై శ్వేతపత్రాలు తెస్తానని ముందే చెప్పిన బాబు... తన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేయటానికి ముందే కొంత ప్రిపేరయ్యారనేదే ఈ రోత పత్రాల లోగుట్టు!! ఇక విద్యుత్తు పై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఏర్పాట్లు సరిగా లేవని ఉద్యోగులను బెదిరిస్తూ.. బాబు తన సహజ ధోరణి ప్రదర్శించారు!సాక్షి, అమరావతి: అబద్ధాలతో మునుపటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లడమే ప్రధాన అజెండాగా సీఎం చంద్రబాబు మంగళవారం విద్యుత్ శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఐదేళ్లలో ఒక్క సారి కూడా పవర్ హాలిడే విధించకుండా, విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో జరిగినప్పుడు కూడా ఎక్కడా సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టిన గత ప్రభుత్వంలో లేని తప్పులను, జరగని నష్టాలను కల్పించి శ్వేతపత్రంలో పొందుపరిచారు. తాను గతంలో అధికారంలో ఉన్నప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలతో కుదేలైన డిస్కంలను ఆదుకున్న వైఎస్ జగన్ వల్లనే విద్యుత్ రంగం రూ.1,29,503 కోట్ల నష్టం వచ్చిందంటూ చంద్రబాబు కనికట్టు విద్యను ప్రదర్శించారు. 2018–19 నాటికి జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 5613 మెగావాట్లుకాగా 7,213 మెగావాట్లు అని చంద్రబాబు శ్వేత పత్రంలో అబద్ధాలు చెప్పుకొచ్చారు. ఆ అబద్దాలు..వాటి వెనుక వాస్తవాలు ఇవీ...డిస్కంలకు అప్పుల పాలు చేసింది మీరేగా చంద్రబాబుడిస్కంల నికర విలువ 2014లో చంద్రబాబు గెలిచే నాటికి సుమారు మైనస్ రూ.4,315 కోట్లు ఉంటే, ఆ ప్రభుత్వం దిగిపోయేనాటికి... అంటే 2019 నాటికి నికర విలువ దారుణంగా క్షీణించి ఏకంగా మైనస్ రూ.20వేల కోట్లకు చేరింది. 2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్ళలో రూ.13,225 కోట్లు మాత్రమే అప్పటి ప్రభుత్వం సబ్సిడీ చెల్లించింది. 2019–20 నుంచి 2023–24 వరకు నాలుగేళ్ళలోనే సబ్సిడీ, ఆర్థిక మద్దతు కింద జగన్ సర్కారు రూ.47,800.92 కోట్లు చెల్లించింది. జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంల అప్పులు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు పంపిణీ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు 2014 మార్చి నాటికి రూ.29,551 కోట్లు ఉంటే, చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.86,215 కోట్లకు పెరిగాయి. అంటే ఏకంగా 56,663 కోట్లు పెరిగాయి. సగటున అప్పుల వృద్ధిరేటు 24శాతం. అదే జగన్ హయాంలో రూ.86,215 కోట్లు కాస్తా..రూ.1,22,518కోట్లకు పెరిగాయి. అంటే కోవిడ్ లాంటి సంక్షోభాలున్నా, చంద్రబాబు చేసిన అప్పులభారం అధికంగా ఉన్నా... జగన్ హయాంలో పెరిగిన అప్పులు కేవలం రూ.36,303 కోట్లు. వాటి వృద్ధిరేటు 7.3 శాతమే. టీడీపీ ప్రభుత్వం 8 వేల మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను అధిక ధర (యూనిట్ రూ.7)లకు కుదుర్చుకుంది. దీనివల్ల డిస్కంలు ఏటా దాదాపు రూ.3,500 కోట్ల చొప్పున 25 ఏళ్ల పాటు ఈ భారం మోయాల్సి వస్తోంది. ఈ ఒప్పందాల కోసం థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని (బ్యాక్ డౌన్)తగ్గించింది. గత ప్రభుత్వంలో తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించడం కోసం డిస్కంలు ఆర్థిక సంస్థల నుంచి మరిన్ని రుణాలను తీసుకోవాల్సి వచ్చింది. బాబు సీఎంగా ఉన్నన్నాళ్లూ విద్యుత్ కొనుగోలు వ్యయం (ట్రూ అప్)ను బిల్లుల్లో సర్ధుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కంలకు ఇవ్వలేదు. దీంతో 2014–19 మధ్య దాదాపు రూ.20 వేల కోట్లు డిస్కంలు నష్టపోవాల్సి వచ్చింది. ఆ ట్రూ చార్జీలే జగన్ హయాంలో ఏపీఈఆర్సీ అనుమతితో డిస్కంలు వేశాయి. మరిప్పుడు ట్రూ అప్ ఛార్జీలను వెనక్కి తీసుకునే ఆలోచన ఉందా?, విద్యుత్ చార్జీల టారిఫ్ పెంచరా? అని విలేకరులు అడిగితే ‘నేను అలా అన్నానా’ అంటూ, అవేవీ జరగవని, చార్జీల పెంపు తప్పదనే సంకేతాన్ని చంద్రబాబు ఇవ్వనే ఇచ్చారు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలారేసుకోవాలన్నది ఎవరురాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతో పాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా రైతు ఖాతాలో నెలవారీ వినియోగ చార్జీలను ప్రభుత్వం జమ చేస్తుంది. ఆ మొత్తాన్ని రైతులు డిస్కంలకు చెల్లిస్తారు. ఇదంతా తప్పని ఎన్నికల ముందు గొంతు చించుకున్న చంద్రబాబు ఇప్పుడు మాత్రం స్మార్ట్ మీటర్లపై సమాధానం దాటవేశారు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే, రైతులపై విద్యుత్ బిల్లులు భారం వేస్తారని తప్పుడు ప్రచారం చేసిన బాబు..మీటర్లపై మీ వైఖరేమిటని అడిగితే అర్ధం లేని సమాధానాలతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. స్మార్ట్ మీటర్ల గురించి చెప్పకుండా సోలార్ నెట్ మీటరింగ్ గురించి చెప్పుకొచ్చారు. నిజానికి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఇదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలను రూ.8845 కోట్లు ఇవ్వకుండా ఎగవేశారు. దానిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది.ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కింద రూ.43,744 కోట్లను జగన్ ప్రభుత్వం అందించింది. రైతులకు పగటిపూట 9 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంచారు. రూ.1,700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటు చేసి రైతులకు పగటి పూట నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా జగన్ ప్రభుత్వం 5 లక్షలకుపైగా వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది.మీ వల్ల కానిది జగన్ చేసి చూపించలేదా?కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)లోని 800 మెగావాట్ల యూనిట్, నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లోని 800 మెగావాట్ల యూనిట్ల జాప్యం వల్ల రూ.12,818 కోట్లు నష్టమని అసత్యాల కథ అల్లారు చంద్రబాబు. నిజానికి ఈ రెండు యూనిట్లతో 1,600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చిందే జగన్. ఈ 2 ప్రాజెక్టుల్లో పనులకు స్థిర (ఫిక్సిడ్) రేటును నిర్ణయించారు. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి, పెంచడానికి అవకాశం లేదు. ఎగ్జిక్యూషన్ ఏజెన్సీల్లో జగన్ హయాంలో ఎటువంటి మార్పులు, విజిలెన్స్ విచారణలు కూడా జరగలేదు. అంటే ఈ రెండు ప్రాజెక్టుల అమలులో ఉద్దేశపూర్వకంగా ఎలాంటి జాప్యం జరగలేదు. కోవిడ్ రెండు దశల కారణంగా 2020, 2021ల్లో ఏడాదిన్నరకు పైగా ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయి. కోవిడ్ మూడో దశలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కార్మికులను సమీకరించడం, వారికి పునరావాసం కల్పించడానికి చాలా సమయం పట్టింది. అయినప్పటికీ పనులు చకచకా జరిపించి 2022 అక్టోబర్‌లో ప్రారంభిచారు. ఎన్టీటీపీఎస్లో యూనిట్లో అదే ఏడాది డిసెంబరులో ఉత్పత్తి మొదలుపెట్టారు. అయితే జీఎస్టీ అమలు, చట్టంలో మార్పు, ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తంపై వడ్డీ కారణంగా అంచనా వ్యయంతో పోలిస్తే ప్రాజెక్ట్ వ్యయం పెరిగింది. ఇందులో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమాత్రం లేదు. అంతేకాకుండా జగన్ హయాంలో ఉత్పత్తి 63,675 మిలియన్ యూనిట్లు కాస్తా, ఉత్పత్తి 2023–24 నాటికి 80,151 మిలియన్ యూనిట్లకు పెరిగింది.‘సెకీ’తో లాభమేగానీ నష్టం లేదువ్యవసాయానికి 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ను వచ్చే 30 ఏళ్ల పాటు కొనసాగించేందుకు, 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నారు. అది కూడా యూనిట్ కేవలం రూ.2.49 పైసలకే. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2.79పై. (ట్రేడింగ్ మార్జిన్ కలిపి) కన్నా ఇది‡ తక్కువ. ప్రస్తుత సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 ఉంది. దీని వలన ఏటా రూ.3,750 కోట్లు ఆదా అవుతుంది. ఈ విద్యుత్‌ను రాజస్థాన్ నుంచి ట్రాన్స్మిషన్ చేయాల్సి రావడం వల్ల అధిక ధర పెట్టారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ సెకీ విద్యుత్‌కు కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆ విషయాన్ని దాచిపెట్టారు చంద్రబాబు.ఈ మంచి కనిపించలేదా⇒ పునరుత్పాదక విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడానికి పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020ని గత ప్రభుత్వంలో ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్ట్‌కు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్, పాణ్యం మండలాల సరిహద్దులోని పిన్నాపురంలో శంకుస్థాపన చేశారు. ⇒ నెడ్కాప్ ఆధ్వర్యంలో దాదాపు 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ⇒ వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. వీటి ద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. ⇒ రాష్ట్రంలో ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3800 కోట్లు విలువైన 5600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యింది. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. ఇంధన భద్రత దిశగా చేస్తున్న కషిని గుర్తించి రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ను కేంద్రం ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందించింది. అలాగే ఏపీట్రాన్స్కో, నెడ్కాప్, ఏపీకి మూడు ఎనర్షియా అవార్డులు వరించాయి.ఏపీఎస్పీడీసీఎల్కు రెండు జాతీయ అవార్డులు లభించాయి. ‘కన్సూ్యమర్ సర్వీస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏపీలోని మూడు డిస్కంలకు ‘ఏ’ గ్రేడ్ లభించింది. ⇒ రాష్ట్రానికి రావాల్సిన అంతరాష్ట్ర విద్యుత్ ప్రసార చార్జీలపై ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీ ట్రాన్స్‌కో) చేసిన పోరాటం ఫలించి రాష్ట్రానికి రూ.306.2 కోట్ల ఆదాయం సమకూరింది. ⇒ మాచ్‌ఖండ్‌లో ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఓహెచ్‌పీసీ), ఏపీ జెన్కో సంయుక్తంగా మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ఎగువ, దిగువ 98 మెగావాట్ల సామర్థ్యం గల మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అప్పర్ సీలేరులో రూ.11,154 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే 1350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్లాంట్ (పీఎస్పీ)కు కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) నుంచి అనుమతి తీసుకువచ్చింది. ⇒ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు 2023లో రూ.2,479 కోట్లతో 16 సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు రూ.620 కోట్లతో నిర్మించిన 12 సబ్స్టేషన్లను అప్పటి సీఎం జగన్ ప్రారంభించారు. ఇందుకోసం మొత్తం రూ.3,099 కోట్లను వెచ్చించారు. ⇒ ఏపీట్రాన్స్కో ట్రాన్స్మిషన్ సిస్టమ్ లభ్యత 99.70 శాతానికి పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌ని ఉపయోగించి ‘ది మోస్ట్ అక్యురేట్’ డే–ఎహెడ్ ఫోర్కాస్ట్ మోడల్‌ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 3 శాతం లోపు ఉన్న ప్రసార నష్టాలను 2.69 శాతానికి ఏపీట్రాన్స్కో తగ్గించింది. ⇒ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి 14948 మెగావాట్ల నుంచి 17102 మెగావాట్లకి మెరుగుపడింది. 2022–23 సంవత్సరంలో 93 శాతం (12.40 మిలియన్ మెట్రిక్ టన్) ఉన్న బొగ్గు లభ్యత, 2023–24లో 96.52 శాతానికి (14.74 మిలియన్ మెట్రిక్ టన్)కి పెరిగింది. ⇒ వ్యవసాయం, ఆక్వా ,పశుసంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాలు కలిపి మొత్తం 39.64 లక్షల మంది వినియోగదారులకు ‘నవరత్నాల’ పథకాల ద్వారా ఉచిత, సబ్సిడీ విద్యుత్‌ను అందించింది. ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించింది. వెనుకబడిన వర్గాల కుటుంబాలకు, ధోబీ ఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లు, చేనేత కార్మికులు, లాండ్రీలు, దారిద్రయ రేఖకు దిగువ ఉన్న వారికి, ప్రొఫెషనల్ గోల్డ్‌స్మిత్‌ల దుకాణాలకు కూడా ఉచిత, సబ్సిడీ విద్యుత్ సరఫరాను చేసింది.తెలంగాణ బకాయిలు వసూలుకు చొరవ తీసుకున్నది జగనేతెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఆంధ్రప్రదేశ్ సరఫరా చేసిన విద్యుత్‌కు చెల్లించాల్సిన రూ.7300 కోట్ల బకాయిలను వసూలు చేసేందుకు అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి కేంద్రంపై అనేక పర్యాయాలు ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి విద్యుత్ బకాయిలు కట్టాల్సిందేనని కేంద్రం తెలంగాణకు చెప్పింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ)ల నుంచి 2014 జూన్ 2 నుంచి 2017 మార్చి 31 మధ్య రూ.5625 కోట్ల రుణాలను ఏపీ జెన్కో తీసుకుంది. అలా తీసుకున్న డబ్బులతోనే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసింది. కానీ వాడుకున్న విద్యుత్‌కు తెలంగాణ నుంచి అప్పడు అధికారంలో ఉన్న చంద్రబాబు వసూలు చేయలేకపోయారు. ఇప్పుడు ఆ బకాయిలను కూడా గత ప్రభుత్వం ఖాతాలోకి నెట్టే ప్రయత్నం చేశారు. మీరేం చొరవ తీసుకుంటున్నారని విలేకరులు అడిగితే మాత్రం ‘వాళ్లేదో అంటున్నారు. కమిటీ వేస్తాం..చూస్తాం’ అంటూ సమాధానం చెప్పలేకపోయారు. -
యథాస్థితికి విద్యుత్ వ్యవస్థ
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపానుకు అతలాకుతలమైన విద్యుత్ వ్యవస్థను విజయవంతంగా య«థాస్థితికి తీసుకొచ్చామని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య పంపిణీ సంస్థల (ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్) పరిధిలో పునరుద్థరణ పనులు వంద శాతం పూర్తయ్యాయని తెలిపాయి. తీవ్రంగా ప్రభావితమైన దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో మరమ్మతు పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఇంధన శాఖకు డిస్కంలు శుక్రవారం నివేదించాయి. ఈ సందర్భంగా జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో తుపానును ఎదుర్కోవడం, పునరుద్ధరణ ప్రణాళిక అమలులో సమర్థవంతంగా పని చేసిన విద్యుత్ సంస్థలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అభినందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకత్వంలో ఏపీ విద్యుత్ శాఖ సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి విద్యుత్ మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారని ఆయన వెల్లడించారు. భారీ గాలులు, వర్షం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏపీజెన్కో ఎండీ, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, డిస్కంల సీఎండీలు ఐ.పృ«థ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె. సంతోషరావు క్షేత్రస్థాయిలో పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, పడిపోయిన విద్యుత్ స్తంభాలను తిరిగి ఏర్పాటు చేయడం, పాడైన ఇన్సులేటర్ల మారి్పడి, విరిగిన కండక్టర్లను సరిచేయడం వంటి పనులను శరవేగంగా పూర్తి చేయించారని తెలిపారు. జిల్లా కేంద్రాల నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాలకు అవసరమైన స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర సామాగ్రితో పాటు ప్రత్యేక బృందాలు, ఇతర అన్ని రకాల సామగ్రిని వేగంగా సమకూర్చుకొని పనులు పూర్తి చేశాయని పేర్కొన్నారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి, జిల్లా కేంద్రాల నుంచి క్షేత్రస్థాయి అధికారులను, సిబ్బందిని నిరంతరం పర్యవేక్షించడం వల్ల మరమ్మతు పనులు వేగంగా జరిగాయని తెలిపారు. దెబ్బతిన్న 17 ఫీడర్లలో 14 ఫీడర్లను పునరుద్ధరించామని, తమిళనాడులో విద్యుత్ టవర్ కూలిపోవడం వల్ల మూడు ఫీడర్ల పనులు ఇంకా కొనసాగుతున్నాయని ట్రాన్స్‌కో గ్రిడ్ డైరెక్టర్ ఏవీకే భాస్కర్ వెల్లడించారు. అయినప్పటికీ విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని వివరించారు. -
విద్యుత్ బిల్లుల పేరుతో సైబర్ మోసాలు
సాక్షి, అమరావతి: ‘డియర్ కన్స్యూమర్... మీ మునుపటి నెల బిల్లు అప్డేట్ కానందున ఈ రాత్రికి మీ విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. దయచేసి బిల్లు చెల్లించడానికి కింది లింక్‌పై క్లిక్ చేయండి..’ అంటూ వస్తున్న వాట్సప్, టెక్ట్స్ మెసేజీలను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల సైబర్, ఆన్లైన్ మోసాలు గత కొన్ని నెలలుగా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మోసగాళ్లు ఆన్లైన్లో ప్రజల ఫోన్లను హ్యాక్ చేసి ఇలాంటి సందేశం పంపుతారని, వినియోగదారులు తమకు వచ్చిన మెసేజ్, లింక్‌పై క్లిక్ చేయవద్దని ఆయన సూచించారు. పొరపాటున వారు పంపిన లింక్‌పై క్లిక్ చేస్తే వినియోగదారుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి మెసేజ్‌లు వస్తే విద్యుత్ అధికారులకు గానీ, సైబర్ క్రైం పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఎడాపెడా ‘ఈనాడు’ అబద్ధాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతల్లేవని, వినియోగదారులకు నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేసేందుకు కృషిచేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సీఎండీ కె. సంతోషరావు, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సీజీఎం వి. విజయలలిత స్పష్టంచేశారు. ఈనాడు దినపత్రికలో శుక్రవారం ‘ఎడాపెడా విద్యుత్ కోతలు’.. ‘కరెంటు కోతతో రోగుల కన్నీరు’.. ‘రొయ్యకు కరెంట్ షాక్’.. శీర్షికలతో ప్రచురితమైన కథనాలపై వారు స్పందించారు. కేవలం సాంకేతిక సమస్యలతోనే అక్కడక్కడా సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయే తప్ప, రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలను అమలుచేయడంలేదని వారు వెల్లడించారు. వారు పేర్కొన్న అంశాలివీ.. ♦ తిరుపతి జిల్లా, పెళ్లకూరు మండలం చెంబేడు గ్రామంలో విద్యుత్ కోతలులేవు. గ్రామ పరిధిలోని ఓ వినియోగదారుడు చెట్ల కొమ్మలను తొలగిస్తున్నప్పుడు కొమ్మలు విద్యుత్ లైనుపై పడడంతో సంబంధిత ట్రాన్స్ఫార్మర్ పరిధిలో మాత్రమే గురువారం ఉ.8 నుంచి 10 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా నాయుడుపేటలో కండక్టర్ తెగిపోయిన కారణంగా బుధవారం రాత్రి అరగంట పాటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ ఫీడరు ద్వారా విద్యుత్ సరఫరా చేశారు. అయితే, లైన్ మరమ్మతు పూర్తయిన తర్వాత ఫీడర్‌ను మార్చేందుకు మరోమారు పది నిమిషాలపాటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ♦ ఏలూరు జిల్లా, దెందులూరులో విద్యుత్ కోతలులేవు. కానీ, గత శుక్ర, శనివారాలలో రాత్రి వేళల్లో భీమడోలు, పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈదురుగాలులు, వర్షాల కారణంగా, 33కేవీ లైనులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. వాటి మరమ్మతుల కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఎండల తీవ్రతకు, అధిక లోడు వలన 220 కేవీ నుంచి ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్‌లో మూడో పవర్ ట్రాన్స్ఫార్మర్ ఓవర్ లోడ్ కారణంగా దానిని మార్చడానికి లైన్ క్లియర్ తీసుకున్నారు. దీంతో గణపవరం, నిడమర్రు, ఉండి, భీమవరం, పాలకోడేరు, కాళ్ళ, ఆకివీడు మండలాల్లో ఆక్వా రైతులకు కొంతమేర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ♦ విజయనగరం జిల్లాలో గురువారం ఉ.11.02 నుండి 11.08 వరకు, బుడతనాపల్లి గ్రామంలో ఎల్టి సర్విసు ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏబీ స్విచ్ ఆపడంవల్ల అంతరాయం కలిగింది. గురువారం 11 కేవీ ఉడా ఫీడర్పై 14.42 గంటలకు యూకలిప్టస్ చెట్టు కొమ్మలు పడటంవల్ల అదే ఫీడర్పై ఉన్న బీఆర్ అంబేడ్కర్ గురుకుల కార్యాలయానికి విద్యుత్ అంతరాయం కలిగిన వెంటనే సిబ్బంది చెట్లు, కొమ్మలు తొలగించి 15.48 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ♦ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం 50 పడకల ఆసుపత్రి, ఏలూరు గవర్నమెంట్ ఆస్పత్రికి ఎలాంటి విద్యుత్ అంతరాయం ఏర్పడలేదు. టెక్కలి గవర్నమెంట్ ఆస్పత్రికి గురువారం 12 నిమిషాల పాటు, పలాస కమ్యూనిటీ ఆస్పత్రికి గంట 40 నిమిషాలు పాటు ఈదురుగాలులు వేస్తున్న సమయంలో మాత్రమే అంతరాయం ఏర్పడింది. ♦వేసవిలో ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా వున్నందున విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతోంది. సంస్థ పరిధిలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగినప్పటికీ డిమాండుకు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. వేడి నుంచి ఉపశమనం కోసం ఏసీల వినియోగం పెరగడంవల్ల లోడ్ ఎక్కువైనపుడు కొన్ని ప్రాంతాల్లోని ట్రాన్స్ఫార్మర్లలో ఫ్యూజులు పోతున్నాయి. గత కొన్నిరోజులుగా బలమైన గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడం, లైన్లు తెగిపోవడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎండలు, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. ఇక ప్రజల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు కోటాను అందిస్తోంది. రోజూవారీ వినియోగం 255 మిలియన్ యూనిట్లు ఉన్నప్పటికీ కోతలు లేకుండా సరఫరా చేస్తోంది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు అధికారులు, సిబ్బంది ఎండలు, వర్షాన్ని లెక్కచేయకుండా త్వరితగతిన సరఫరాను పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్నారు. ముఖ్యంగా ఆస్పత్రులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి కోతలు విధించడంలేదు. అదేవిధంగా రాత్రి సమయాల్లో విధుల నిర్వహణకు టీమ్‌లను ఏర్పాటుచేశారు. సమాచారం అందుకున్న సిబ్బంది సత్వరం స్పందించి సరఫరాను పునరుద్ధ రించేందుకు చర్యలు చేపడుతున్నారు. కార్పొరేట్ ఆఫీస్ నుంచే కాకుండా సర్కిల్ స్థాయి, డివిజన్ స్థాయిల్లో కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయాల పర్యవేక్షణకు లోడ్ మానిటరింగ్ సెల్లు 24గంటలూ పనిచేస్తున్నాయి. విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలు తలెత్తితే వినియోగదారులు టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫోన్‌చేసి పరిష్కారం పొందవచ్చు. -
గుబులు పుట్టిస్తోన్న ఎండ వేడి.. గిర్రున మీటర్లు
సాక్షిప్రతినిధి,కాకినాడ: వేసవి ప్రభావం విద్యుత్ వినియోగంపై పడుతోంది. ప్రతి ఇంటా విద్యుత్ మీటర్ గిర్రున తిరుగుతోంది. నెల బిల్లులు రెట్టింపు అవుతున్నాయి. అయినా జనం ఎడాపెడా కరెంటు వాడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈనెలలో వాడకం బాగా పెరిగింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గృహ విద్యుత్ వినియోగం 50శాతం పైనే ఉందని ఏపీఈపీడీసీఎల్ వర్గాలు లెక్కలేస్తున్నాయి. గడచిన రెండు వారాలుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫలితంగా ఏసీల వినియోగం పెరిగింది.ప్రస్తుతం రోజూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో విద్యుత్ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ, రాత్రి 8 నుంచి తెల్లవారేవరకు ఏసీలు వాడుతున్నారు. గడచిన ఏప్రిల్‌లో మధ్యాహ్నం ఒక గంట, రాత్రి రెండు, మూడు గంటలు మాత్రమే ఏసీలు, ఫ్యాన్లు వినియోగించే వారు. ఇప్పుడు ఏసీలతో పాటు ఫ్యాన్ల వినియోగం కూడా మూడొంతులు పెరిగిపోయింది. మార్చి, ఏప్రిల్‌తో పోలిస్తే మే వచ్చేసరికి ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. వారం రోజులుగా మరింత తీవ్రంగా ఉంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోతోంది. ఈనెల గుండె గు‘భిల్లు’ ఉదాహరణకు రెండు ఫ్యాన్లు, ఒక ఏసీ, మూడు ట్యూబులైట్లు ఉన్న ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబ విద్యుత్ వినియోగం ఏప్రిల్‌లో సగటున 185 యూనిట్లు నమోదైంది. అంటే రూ.800 బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ నెలలో అదే తరహా కుటుంబ బిల్లు చూస్తే 300 యూనిట్లు దాటిపోయింది. అంటే రూ.1500 చెల్లించాలి. ఇలా ప్రతి కుటుంబంలో స్థాయిని బట్టి వినియోగం పెరిగింది. గతేడాది మేతో పోలిస్తే ఈ ఏడాది వినియోగంలో భారీగా పెరిగింది. గతేడాది మే 10న 11.575 మిలియన్ యూనిట్లు విద్యుత్‌ను వాడారు. తాజాగా ఈ నెల 10న సుమారు ఐదారు మిలియన్ యూనిట్లు అదనంగా వాడారని తేలింది. ఇలా ఈ నెలలో 10 నుంచి 16 వరకు పరిశీలిస్తే గతేడాడి కంటే ఐదారు మిలియన్ యూనిట్లు అదనంగా వాడినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గృహవినియోగం 50శాతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా విద్యుత్ వాడకంలో (జగ్గంపేట విద్యుత్ డివిజన్‌తో కలిపి) 45శాతంతో మొదటి స్థానంలో ఉంది. కాకినాడ నగరంతో పాటు మెట్ట ప్రాంత మండలాల్లో అత్యధికంగా కరెంటు వాడుతున్నారు. రామచంద్రాపురం డివిజన్‌తో కలిపి ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 30 శాతంతో రెండో స్థానం, 20శాతంతో రాజమహేంద్రవరం(నిడదవోలు సబ్ డివిజన్ మినహా) మూడో స్థానంలో ఉన్నాయి. రంపచోడవరం విద్యుత్ సబ్‌డివిజన్‌లో మిగిలిన ఐదు శాతం వినియోగం నమోదైంది. గృహవిద్యుత్ వినియోగం 50శాతం పైనే ఉంది. వేసవికి ముందు రోజుకు 16 మిలియన్ యూనిట్లు ఉంటే ప్రస్తుతం 17 నుంచి 20 మిలియన్ యూనిట్లు వాడుతున్నారు. ఈ నెల 13న 20.08 మినియన్ యూనిట్లు క్రాస్ చేసింది. నిరంతరాయంగా సరఫరా విద్యుత్ వినియోగం పెరిగినా ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా ఈపీడీసీఎల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిరంతరం విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నారు. గతంలో ప్రతి వేసవిలోనూ విద్యుత్‌కోతలతో ప్రజలు నరకం చూసే వారు. ప్రస్తుతం పెరుగుతోన్న వినియోగానికి తగ్గట్టు ఉత్పత్తికి ఢోకా లేకపోవడంతో కోతల ఊసే లేదు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో లోపాలు తలెత్తుతుంటే డివిజన్ స్థాయిలో అధికారులు యుద్ధప్రాతిపదికన స్పందిస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు డిమాండ్‌కు దగ్గట్టుగా ఉత్పత్తి వేసవి దృష్ట్యా వినియోగం పెరిగినప్పటికీ సరఫరాలో ఎక్కడా ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి ఉంది. గతంలో మాదిరిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోతలు ఎక్కడా విధించడంలేదు. అత్యవసర మరమ్మతులు, లైన్లలో నిర్వహణాలోపాలు తలెత్తినప్పుడు అంతరాయం ఏర్పడుతోంది. 24 గంటలు విద్యుత్ సరఫరాకుఎక్కడా ఇబ్బంది లేదు. భవిష్యత్ అవసరాలకు పూర్తిగా విద్యుత్ అందుబాటులో ఉంది. – పి.వి.ఎస్.మూర్తి, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్ -
ఏపీ ‘పవర్’ఫుల్.. పెరిగిన తలసరి విద్యుత్
ఏ రాష్ట్రంలో అయినా పౌరులకు సరిపడినంత స్థాయిలో విద్యుత్ అందుబాటులో ఉందంటే ఆ రాష్ట్రంలో ఉత్పాదకత, జీవన ప్రమాణాలు మెరుగైన స్థితిలో ఉన్నాయని అర్థం. ఆర్థిక అభివృద్ధికి విద్యుత్ వినియోగాన్ని సైతం ప్రామాణికంగా తీసుకుంటారు. అలాంటి అత్యుత్తమ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని మరోసారి రుజువైంది. రాష్ట్రంలో తలసరి విద్యుత్ లభ్యత పెరుగుదలే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. 2018లో తలసరి విద్యుత్ లభ్యత 1,180.3 యూనిట్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడది 1,378.6 యూనిట్లకు పెరిగింది. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఇస్తున్న ప్రోత్సాహం, బలపడుతున్న విద్యుత్ వ్యవస్థల కారణంగానే ఇది సాధ్యమైంది. సాక్షి, అమరావతి: వినియోగదారులకు అత్యధిక విద్యుత్‌ను అందుబాటులో ఉంచేందుకు ఏపీ ట్రాన్స్‌కో మెరుగైన నెట్వర్క్ మెయింటెనెన్స్, మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను సులభతరం చేసే దిశగా చర్యలు చేపట్టింది. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) అంతర్గత డిమాండ్ అంచనా నమూనాను అభివృద్ధి చేసింది. ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఏపీ ఎస్ఎల్డీసీ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించి మరింత అధునాతన అంతర్గత ఎనర్జీ ఫోర్ కాస్టింగ్ మోడల్‌ను అభివృద్ధి చేసింది. తద్వారా ఎప్పటికప్పుడు అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేయగలుగుతోంది. మరోవైపు పంపిణీ వ్యవస్థను డిస్కంలు మెరుగుపరుచుకుంటున్నాయి. దీంతో 2018–19లో 16.36 శాతంగా ఉన్న యాగ్రిగేట్ టెక్నికల్, కమర్షియల్ (ఏటీసీ) నష్టాలు 2021–22లో 11.21 శాతానికి తగ్గాయి. 5.15 శాతం తగ్గుదలతో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు దేశంలోనే అత్యుత్తమమని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ప్రకటించింది. మున్ముందు మరింత మెరుగ్గా.. రాష్ట్రంలోని 1.92 కోట్ల వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు డిస్కంలు ‘కన్సూ్యమర్ సర్వీస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్’ నివేదికలో ఇప్పటికే ‘ఏ’ గ్రేడ్ సాధించాయి. రానున్న రోజుల్లో సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ‘లాస్ డిడక్షన్ వర్క్స్’ పేరుతో ఏపీ ఈపీడీసీఎల్‌లో రూ.2,617.54 కోట్లు, ఏపీ సీపీడీసీఎల్‌లో రూ.1,498.5 కోట్లు, ఏపీ ఎస్పీడీసీఎల్లో రూ.5,160.64 కోట్లు వెచ్చించాలని భావిస్తున్నాయి. విద్యుత్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దానివల్ల ప్రజలు, విద్యుత్ సిబ్బంది ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు కూడా విద్యుత్ సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. భద్రతా చర్యలలో భాగంగా స్ప్రింగ్ చార్జ్ బ్రేకర్స్ స్థానంలో సాంకేతికంగా మెరుగైన ‘ఫాస్ట్ యాక్టింగ్ పర్మినెంట్ మాగ్నెట్ యాక్యుయేటర్’ మెకానిజం టైప్ వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్లతో భర్తీ చేయాలని డిస్కంలు ఇప్పటికే ప్రతిపాదించాయి. ప్రభుత్వ ప్రోత్సాహం గడచిన మూడేళ్లలో డిస్కంలకు ప్రభుత్వం రూ.40 వేల కోట్లకుపైగా ఆర్థిక సాయం అందించింది. దీంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను అభివృద్ధి పరుచుకుంటున్నాం. మౌలిక సదుపాయాలు కల్పించుకుంటున్నాం. ఆధునిక సాంకేతికతతో వినియోగదారులకు అధిక విద్యుత్‌ను అందుబాటులో ఉంచుతున్నాం. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ మనమే ఆదర్శం విద్యుత్ కొరత ఏర్పడితే బహిరంగ మార్కెట్ నుంచి అత్యధిక ధరకు కొనైనా సరే వినియోగదారులకు అందించేందుకు ప్రభుత్వమే ఆర్థికంగా చేయూతనిస్తోంది. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం అత్యాధునిక సబ్స్టేషన్లు నిర్మిస్తున్నాం. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, మరమ్మతులను తరచుగా నిర్వహిస్తున్నాం. – జె.పద్మాజనార్దనరెడ్డి, సీఎండీ, ఏపీ సీపీడీసీఎల్ -
‘అనంత’లో విద్యుత్ ప్రమాదాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి/తిరుపతి రూరల్: విద్యుత్ ప్రమాదాలకు అవకాశమున్న ప్రాంతాలను, బలహీనంగా ఉన్న లైన్లను గుర్తించి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీ ఎస్పీడీసీఎల్) రంగంలోకి దిగింది. ముఖ్యంగా అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహెూన్నూరు సమీపంలో విద్యుత్ ప్రమాదం నేపథ్యంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సంస్థ సీఎండీ కె.సంతోషరావు మంగళవారం తెలిపారు. అనంతపురం సర్కిల్ పరిధిలోని సబ్స్టేషన్లు, లైన్లను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రమాదం జరిగేందుకు వీలున్న లైన్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ పనులు చేపట్టేందుకు వీలుగా సంస్థ కార్పొరేట్ కార్యాలయం నుంచి సర్కిల్ ఇన్చార్జ్, నోడల్ ఆఫీసర్ కె.గురవయ్య(చీఫ్ జనరల్ మేనేజర్/ఓఎం) నేతృత్వంలో అనంతపురం టౌన్, అనంతపురం రూరల్, గుత్తి, కళ్యాణదుర్గం, కదిరి, హిందూపురం డివిజన్లకు బాధ్యులుగా జి.బాలకృష్ణారెడ్డి (జనరల్ మేనేజర్/ఎనర్జీ ఆడిట్), కె.ఆదిశేషయ్య(సూపరింటెండింగ్ ఇంజనీర్/అసెస్మెంట్, ఎంక్వైరీస్), సీహెచ్.రామచంద్రారావు (జనరల్ మేనేజర్/కమర్షియల్), జి.సత్యనారాయణ(జనరల్ మేనేజర్/ప్రాజెక్ట్స్), జె.రమణాదేవి (సూపరింటెండింగ్ ఇంజనీర్/డీపీఈ), పి.మురళి (జనరల్ మేనేజర్/ప్లానింగ్)లను నియమిస్తూ ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. వీరికి సహాయకులుగా నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు డీపీఈ డివిజన్ల అధికారులు విధులు నిర్వహిస్తారని, సర్కిల్ పరిధిలోని 33/11 కేవీ సబ్స్టేషన్లలో లోపాలను గుర్తించి, సరిదిద్దేందుకు వీలుగా అనంతపురం టౌన్, అనంతపురం రూరల్, గుత్తి, కళ్యాణ దుర్గం, కదిరి, హిందూపురం డివిజన్లకు మీటర్స్, ప్రొటెక్షన్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను కేటాయించినట్లు వివరించారు. అధికారులంతా వారికి కేటాయించిన విధులకు తక్షణమే హాజరు కావాలని, ఈ పనులు పూర్తయ్యేవరకు వారంతా తమకు కేటాయించిన ప్రాంతంలోనే బస చేయాలని ఆదేశాలిచ్చామన్నారు. -
నాణ్యమైన పరికరాలనే కొంటున్నాం..
సాక్షి, అమరావతి: డిస్కమ్ పరిధిలో వివిధ పనుల కోసం నాణ్యమైన పరికరాలనే కొనుగోలు చేస్తున్నామని ఏపీ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీ కె.సంతోషరావు తెలిపారు. డిస్కంలో నాసిరకం తీగలు, పరికరాలను కొనుగోలు చేస్తున్నారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేయడం అవాస్తవమన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. వివిధ పనులకు టెండర్ల స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ రూపొందించే ప్రక్రియలో భాగంగా బిడ్డర్ అర్హతను తెలుసుకోవడం కోసం కూడా టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌ను ఇండియన్ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్‌కు అనుగుణంగా తయారు చేస్తారని తెలిపారు. ఈ–ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలో రివర్స్ బిడ్డింగ్ ద్వారా పారదర్శకంగా కాంట్రాక్టర్‌కు టెండరు దక్కాక సంబంధిత ఫ్యాక్టరీలో పరికరాల నాణ్యతను ఐఎస్ నాణ్యత ప్రమాణాలననుసరించి థర్డ్ పార్టీ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్‌తో పరీక్షిస్తామని ఆయన వెల్లడించారు. ఆఫీసర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరికరాల తరలింపునకు అనుమతించి, ఆయా ఫ్యాక్టరీల నుంచి సంస్థ పరిధిలోని స్టోర్లకు తరలిస్తామని తెలిపారు. స్టోర్లకు చేరిన పరికరాల నాణ్యతను ఐఎస్ నాణ్యత ప్రమాణాలననుసరించి మరోసారి పరీక్షించాకే వాటిని స్టాక్‌లోకి తీసుకుని క్షేత్ర స్థాయిలో అమర్చేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ పనుల్లో, పరికరాల్లో నాణ్యత ప్రమాణాలను పరీక్షించేందుకు డిస్కంలలో ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగాలు పని చేస్తున్నాయని వెల్లడించారు. అలాగే, డిస్కంలో లైన్మెన్ పోస్టులను కుదించేశారని పేర్కొనడంలో కూడా వాస్తవం లేదని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు క్షేత్రస్థాయిలో నియామకాలు జరగలేదన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. క్షేత్రస్థాయి సిబ్బంది నియామకాలకు ఆమోద ముద్ర వేశారని గుర్తు చేశారు. దీంతో 2019 అక్టోబర్‌లో ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 3,088, ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 2,859 ఎనర్జీ అసిస్టెంట్లను నియమించినట్లు వివరించారు. -
సత్యసాయి జిల్లా: ఆటో ప్రమాదానికి కారణం ఇదే..
సాక్షి, సత్యసాయి జిల్లా: తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆటోలో వెళ్తున్న కూలీలపై హై టెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడటంతో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు మృతిచెందగా.. ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై డీఎస్పీ రమాకాంత్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల కోసం ఆటోపై ఇనుప మంచం తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇనుప మంచానికి తెగిపడిన విద్యుత్ తీగ తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కొందరు ఆటో నుంచి దూకి బయటపడ్డారు. ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు మాత్రం మంటల్లో సజీవ దహనమయ్యారు. మృతులను గుడ్డంపల్లి వాసులుగా గుర్తించాము అని తెలిపారు. ఇదిలా ఉండగా.. విద్యుత్ ప్రమాద ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాధ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద ఘటనలో వెలుగు చూసిన దాని ప్రకారం ఒక ఉడుత కారణంగా ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. కరెంట్ వైర్‌ను ఎర్త్‌ను ఉడుత క్రాస్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద ఘటనపై శాఖ పరమైన విచారణకు ఆదేశించనట్టు వెల్లడించారు. అనంతపురం ఎస్.ఈతో పూర్తి విచారణకు ఆదేశించామని, ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల తక్షణ సహాయం అందిచనున్నట్టు తెలిపారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పారిస్ పర్యటనలో ఉన్న ఆయన.. సీఎంవో ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయాల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియాకు, మెరుగైన చికిత్సకు ఆదేశం -
సాగు, ఇళ్లకు ఫుల్ ‘పవర్’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరెంట్ కష్టాలు నెలకొన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు కోతలు విధించకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రోజూ దాదాపు రూ.40 కోట్లు వెచ్చించి మరీ విద్యుత్‌ను కొనుగోలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టింది. ఇక పరిశ్రమలు మాత్రం ఇంధన శాఖ విధించిన ఆంక్షలను మరికొన్నాళ్లు పాటించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నెల 15వతేదీ వరకు పరిశ్రమలు, హెచ్‌టీ సర్వీసుల విద్యుత్ వినియోగంపై పరిమితులను పొడిగించేందుకు డిస్కమ్‌లు చేసిన అభ్యర్థనను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదించింది. డిస్కమ్‌లు ఏప్రిల్ 8వతేదీ నుంచి ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎండల తీవ్రతతో.. రాష్ట్రంలో తాజాగా రోజూ 207.22 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. మే నెల మొదటి వారానికి వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తగ్గి కొంతమేర కరెంట్ అందుబాటులోకి వస్తుందని భావించినా ఎండల కారణంగా ఏమాత్రం వినియోగం తగ్గలేదు. దీంతో రోజువారీ అవసరాల కోసం 32.71 మిలియన్ యూనిట్లను యూనిట్ రూ.11.60 చొప్పున చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. విద్యుత్తు కొనుగోలు కోసం రోజూ రూ.37.73 కోట్లు ఖర్చు చేస్తోంది. సగం తగ్గించుకుంటే.. గృహ, వ్యవసాయ సర్వీసులకు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమలపై ఆంక్షలు కొనసాగించాల్సి వస్తోందని ఇంధనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిరంతరం విద్యుత్ వినియోగించే పరిశ్రమలు ప్రతి రోజూ 50 శాతం మాత్రమే వినియోగించాలని, మిగతా పరిశ్రమలు వారంలో ఒకరోజు పవర్ హాలిడే పాటించాలని నిబంధనలు విధించారు. షాపింగ్ మాల్స్ తరహాలోని వాణిజ్య సముదాయాల్లో కూడా విద్యుత్తు వాడకాన్ని 50 శాతం మేర తగ్గించుకోవాలని, ప్రకటనలకు సంబంధించిన సైన్ బోర్డులకు సరఫరాను నిలిపివేయాలని ఆదేశించారు. పరిశ్రమల నిర్వాహకులు, సంఘాల అభ్యర్థన మేరకు కొన్నిటికి మినహాయింపులు, చార్జీల నుంచి వెసులుబాటును ఏపీఈఆర్సీ కల్పించింది. పవర్ హాలిడే ఇలా ► ఏపీఎస్పీడీసీఎల్లో పరిధిలోని తిరుపతిలో శుక్రవారం, హిందుపురం డివిజన్లో శనివారం, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో సోమవారం, నెల్లూరు జిల్లాలోని నెల్లూరు గ్రామీణ, గూడూరు డివిజన్లు మినహా మిగిలిన అన్ని డివిజన్లలో మంగళవారం, నెల్లూరు గ్రామీణ, గూడూరు డివిజన్లలో బుధవారం, పుత్తూరు డివిజన్లో గురువారం పరిశ్రమలకు పవర్ హాలిడే అమలు చేస్తున్నట్టు సీఎండీ హెచ్.హరనాధరావు తెలిపారు. ► ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖ జోన్–11 డివిజన్లో శుక్రవారం, జోన్–1, జోన్–3, నర్సీపట్నం, పాడేరు, కశింకోట డివిజన్లలో శనివారం, శ్రీకాకుళం జిల్లాలో సోమవారం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంగళవారం, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి డివిజన్లో బుధవారం, అచ్యుతాపురం, పాయకరావుపేట, యలమంచిలి డివిజన్లలో గురువారం పవర్ హాలిడే ప్రకటించినట్లు సీఎండీ కె.సంతోషరావు వెల్లడించారు. ► ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని గుంటూరులో శుక్రవారం, విజయవాడలోని గుణదల, మాచర్ల, కందుకూరులో శనివారం, విజయవాడ గ్రామీణ, గుంటూరు–1 టౌన్, మార్కాపురం, చీరాలలో సోమవారం, మచిలీపట్నం, బాపట్ల, అద్దంకిలో మంగళవారం, విజయవాడ, ఉయ్యూరు, నూజివీడు, తెనాలి, ఒంగోలు, అమరావతిలో బుధవారం, గుడివాడ, నరసరావుపేట, దర్శిలో గురువారం పవర్ హాలిడే విధిస్తున్నామని సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు. -
విద్యుత్‌ను పొదుపుగా వాడాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘రోజూ జిల్లాలో 1.50 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగమవుతోంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ కె.విజయ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని విద్యుత్ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోమవారం నుంచి నెల్లూరు నగరంతోపాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో అరగంట సేపు, గ్రామాల్లో గంటసేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. నెల్లూరులో ఉదయం 8 గంటల నుంచి 8.30 వరకు సరఫరా ఉండదన్నారు. కావలి, ఆత్మకూరు, గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి, సూళ్లూరుపేట మున్సిపాలిటీల్లో కొన్నింట్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 వరకు, మరికొన్నింట్లో 12.30 నుంచి ఒంటి గంట వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. రూరల్ ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో 9 నుంచి పది గంటల వరకు, ఇంకొన్ని చోట్ల 12.00 నుంచి ఒంటి గంట వరకు సరఫరా నిలిపి వేస్తున్నట్లు చెప్పారు. కావలి, ఆత్మకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట ప్రాంతాల్లోని పరిశ్రమలకు ప్రతి మంగళవారం పవర్ హాలిడేగా నిర్ణయించామని ఎస్ఈ తెలిపారు. నెల్లూరు రూరల్, గూడూరు ప్రాంతాల్లోని పరిశ్రమలకు బుధవారం పవర్ హాలిడేగా ప్రకటించామన్నారు. వ్యవసాయానికి సంబంధించి రెండు గ్రూపులుగా విభజించి ఏడుగంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. -
చార్జీల పెంపు స్వల్పమే
సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాలతో పోల్చితే వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు కరెంట్ చార్జీలు ఆంధ్రప్రదేశ్‌లోనే అతి తక్కువని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ వెల్లడించారు. కామన్ టెలిస్కోపిక్ విధానం ప్రకారం సామాన్యులపై భారం లేకుండా విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కొత్త టారిఫ్ ప్రకటించిందని చెప్పారు. విద్యుత్ చార్జీలను భారీగా పెంచినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. కొత్త టారిఫ్ ప్రకారం చార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. గురువారం విజయవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్ధనరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలివీ.. ► విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.35 వేల కోట్లు ఇచ్చి ఆదుకుంది. ఇకపైనా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు చార్జీలు ఏపీలోనే తక్కువ. 75 యూనిట్ల వరకు వినియోగానికి టారిఫ్ ఇప్పటికీ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువగా ఉంది. దీని పరిధిలోకి వచ్చే వారు మొత్తం గృహ వినియోగదారుల్లో 50 శాతం వరకు ఉంటారు. ► టెలిస్కోపిక్ విధానంలో 0–30 యూనిట్లకు విద్యుత్ చార్జీల పెంపు చాలా స్వల్పం. ప్రజల వినతి మేరకే ఏపీఈఆర్సీ ఈ శ్లాబ్‌లను తెచ్చింది. ► తెలంగాణలో తాజాగా రూ.5,600 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచగా ఆంధ్రప్రదేశ్‌లో పెంపుదల రూ.1,400 కోట్లు మాత్రమే ఉంది. ► ట్రూ అప్ చార్జీలను మూడో త్రైమాసికంలో ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.3,368 కోట్లు, ఏపీఈపీడీసీఎల్‌లో రూ.609 కోట్లుగా మండలి నిర్ణయించింది. రూ.3,977 కోట్ల సర్దుబాటు మొత్తంలో వ్యవసాయ విద్యుత్ వినియోగదారుల రాయితీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,066.54 కోట్ల భారాన్ని భరిస్తుండగా మిగతాది మాత్రమే ఇతర వినియోగదారుల నుంచి పంపిణీ సంస్థలు వసూలు చేయాలని మండలి ఆదేశించింది. అది కూడా వినియోగదారుల వాస్తవ వినియోగం ఆధారంగా యూనిట్‌కు ఏపీఎస్పీడీసీఎల్ రూ.0.23, ఏపీసీపీడీసీఎల్ రూ.0.22, ఏపీఈపీడీసీఎల్ రూ.0.07 చొప్పున మాత్రమే విధించాలని నిర్దేశించింది. ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్‌లో ఆగస్టు 1వ తేదీ నుంచి 36 నెలలు, ఏపీఈపీడీసీఎల్ 18 నెలల వాయిదాలలో వసూలు చేయాలని ఆదేశించింది. దీని ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ట్రూఅప్ వసూలు రూ.700 కోట్లు మాత్రమే. గత సర్కారు ట్రూ అప్ ఫైల్ చేయకపోవడం పెనుభారంగా పరిణమించింది. ► 2022–23లో మొత్తం ఆదాయ అవసరం రూ.45,398.66 కోట్లుగా డిస్కమ్‌లు అంచనా వేశాయి. ఇందులో రూ.11,123.21 కోట్లను ఉచిత విద్యుత్, సబ్సిడీల కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుండటంతో 20.76 లక్షల మంది వినియోగదారులపై చార్జీల పెంపు ప్రభావం ఏమాత్రం ఉండదు. మూడు పంపిణీ సంస్థల సగటు విద్యుత్ కొనుగోలు ఖర్చు యూనిట్‌కు రూ.6.82 నుంచి రూ.6.98కు పెరిగింది. ► రాష్ట్రంలో 74 శాతం విద్యుత్ థర్మల్ ద్వారా ఉత్పత్తి అవుతుండగా ప్రస్తుతం 230 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతోంది. మనకు బొగ్గు గనులు లేకపోవడంతో మహానది (ఒడిశా), సింగరేణి కాలరీస్(తెలంగాణ)పై ఆధారపడి కొనుగోలు చేస్తున్నాం. బొగ్గు రేట్లు, రవాణా చార్జీల పెరుగుదల కారణంగా ఏటా 14 శాతం ఉత్పత్తి వ్యయం అధికం అవుతోంది. నిజానికి దీని కారణంగానే విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చింది. గుదిబండల్లా పీపీఏలు గత సర్కారు హయాంలో కుదుర్చుకున్న దీర్ఘకాలిక పీపీఏల వల్ల విద్యుత్ సంస్థలపై అదనపు భారం పడుతోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ పేర్కొన్నారు. గత ప్రభుత్వం సగటు విద్యుత్ కొనుగోలు రేటు కంటే అధిక ధరలకు 25 ఏళ్లకు పీపీఏలు కుదుర్చుకుందని పీపీఏల రద్దు వల్ల చార్జీలు పెరిగాయనే వాదనలో వాస్తవం లేదన్నారు. ఆ పీపీఏలను రద్దు చేయలేదని, ధరలను సమీక్షించాలని ప్రభుత్వం ఆయా కంపెనీలకు సూచించిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి విద్యుత్ రంగంలో రూ.68 వేల కోట్లకుపైగా అప్పులు, రూ.21 వేల కోట్లకుపైగా బిల్లుల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. 2014 నాటికి విద్యుత్తు సంస్థలు రూ.29,703 కోట్ల మేర అప్పుల్లో ఉండగా టీడీపీ హయాంలో 2019 నాటికి రూ.68,596 కోట్లకు పెరగడంతో నష్టాలతో దివాలా తీసే పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యుత్ రంగ సంస్కరణలతోపాటు పొదుపు చర్యలను సమర్థంగా అమలు చేయడం, ఆర్థికంగా చేయూత ద్వారా డిస్కమ్‌లను ఆదుకున్నట్లు చెప్పారు. గత సర్కారు ట్రూ అప్ చార్జీలను ఫైల్ చేయకుండా వ్యవస్థలను అడ్డదిడ్డంగా మేనేజ్ చేయడం వల్లే అప్పులు ఆ స్థాయికి పెరిగాయని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్వాకాల కారణంగా విద్యుత్తు రంగం కుప్పకూలే పరిస్థితి నెలకొనడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రైతులకు అందించే వ్యవసాయ ఉచిత విద్యుత్ కోసం సెకీ నుంచి తక్కువ ధరకే కరెంట్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. -
ఎందుకీ కారు కూతలు! పాత ఫొటోలతో కరెంట్ కోతలంటూ రాతలు
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ( ఏపీఎస్పీడీసీఎల్ ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.హరనాధరావు స్పష్టం చేశారు. ‘ఎందుకీ కోతలు!’ శీర్షికన ఓ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని ఖండిస్తూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ► కర్నూలు జిల్లా కోసిగి మండలంలో 160 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎల్టీ కేబుల్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఎటువంటి అంతరాయాలు లేవు. ► రైతులకు 9 గంటల పాటు విద్యుత్ అందడం లేదన్న కథనంలో నిజం లేదు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేవు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. ► అనంతపురం జిల్లా మడకశిర మండలంలో మంగళవారం ఆర్టీపీపీలో కెపాసిటర్ ఓల్టేజ్ ట్రాన్స్ ఫార్మర్ సమస్య కారణంగా సబ్ స్టేషన్లు ట్రిప్ కావడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. ► చిత్తూరు జిల్లాలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేవు. ► అనంతపురం జిల్లాలో గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేవు. బుధవారం 18.227 ఎంయూల విద్యుత్‌ను సరఫరా చేశాం. ప్రతి నెలా రెండో శనివారం లేదా 3వ శనివారం సబ్ స్టేషన్లు, లైన్ల నిర్వహణ కోసం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ► ప్రస్తుతం రాష్ట్ర గ్రిడ్‌లో దాదాపు 45 శాతం సౌర, పవన, ఇతర వనరుల స్థాపిత విద్యుత్ ఉంది. వీటి నుంచి వచ్చే విద్యుత్ ’తప్పక సేకరణ’ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. సంవత్సరంలో దాదాపు ఆరు నెలలు ఈ వనరుల నుంచి విద్యుదుత్పత్తి అధికంగా ఉంటుంది. సౌర కేంద్రాల నుంచి సంవత్సరం మొత్తం ఉంటుంది కానీ పగటి పూట మాత్రమే లభ్యత ఉంటుంది. ► రోజువారీ గ్రిడ్ డిమాండ్‌లో కేవలం 4 గంటలు (ఉదయం, సాయంత్రం పీక్ లోడ్ సమయంలో) మాత్రమే కొంత వరకూ విద్యుత్ కొరత ఏర్పడుతోంది. దీన్ని అధిగమించడానికి బహిరంగ మార్కెట్ లో ముందురోజు బిడ్డింగ్ విధానంలో సమకూర్చుకుంటున్నాం. ఈ విధానంలో అందుబాటులోకి రాకపోతే రోజువారీ మార్కెట్లో కానీ అత్యవసర మార్కెట్లో కానీ విద్యుత్ సేకరించి కొనుగోలు చేస్తున్నాం. ► రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాల నుంచి అందుబాటులో ఉన్నంతవరకు ఎలాంటి బ్యాక్ డౌన్ లేకుండా విద్యుత్ సేకరిస్తున్నాం. ప్రస్తుతం ఏ విద్యుత్ కేంద్రాన్ని షట్ డౌన్ చేయడం లేదు. బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నా వినియోగదారుల సౌకర్యార్ధం ముఖ్యంగా వ్యవసాయదారుల కోసం ప్రస్తుత రబీ సీజన్లో ఒక్క సెంటు భూమికి కూడా సాగు నీటి కొరత తలెత్తకుండా విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం. కోతలు లేవు.. నాణ్యమైన కరెంట్ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలోని విద్యుత్తు వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామని ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.జనార్దనరావు ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎందుకీ.. కోతలు!’ శీర్షికతో ఓ దినపత్రిక ప్రచురించిన కథనంలో నిజం లేదని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యుత్ కోతలతో సాగు నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయనడం అవాస్తవమన్నారు. బుట్టాయగూడెం విద్యుత్ శాఖ అధికారులు లోడ్ రిలీఫ్ కోసం కోతలు విధిస్తున్నారనడం కూడా అవాస్తవమేనని, విద్యుత్ అధికారులు అటువంటి వివరణ ఏదీ ఇవ్వలేదని వెల్లడించారు. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు. వినియోగదారులందరికి నిరంతరాయంగా సరఫరా చేసేందుకు అవసరమైన సిబ్బంది, సామగ్రి 24 గంటలు అందుబాటులో ఉన్నాయన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఏర్పడిన అంతరాయాలను సరిదిద్ది త్వరితగతిన పునరుద్ధరిస్తున్నారని వివరించారు. విద్యుత్ అంతరాయాలు తలెత్తినప్పుడు వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912కు తెలియచేయాలని ఎస్ఈ కోరారు. మడకశిరలో కరెంట్ కోతలు లేవు అనంతపురం జిల్లా మడకశిరలో బుధవారం కరెంట్ కోతలు విధించారన్న వార్తల్లో నిజం లేదని హిందూపురం డివిజన్ డీఈ డి.భూపతి స్పష్టం చేశారు. ఆర్టీపీపీలో సాంకేతిక సమస్యలతో మంగళవారం ఉదయం మాత్రం కొద్ది గంటలు సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. విద్యుత్ కోతలపై ఓ పత్రిక ప్రచురించిన కథనం నిరాధారమని మడకశిర ఏడీఈ వెంకటేశ్వర్లు చెప్పారు. ఆ ఫొటో... ఇప్పటిది కాదు నా ఫ్యాక్టరీలో కరెంటు లేకపోవడంతో కార్మికులు ఖాళీగా కూర్చున్నట్లు ఓ పత్రికలో ఫొటో ప్రచురించారు. అసలు ఆ ఫొటో ఇప్పటిది కాదు. ఇటీవల కరెంట్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదు. గురువారం ఓ ఛానల్ వాళ్లు వచ్చి విద్యుత్తు కోతల గురించి మాట్లాడాలని కోరారు. లేని వాటిని ఉన్నట్లు చెప్పడం అన్యాయం. అందుకు నేను ఒప్పుకోలేదు. బుధవారం కరెంటు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగలేదు. మంగళవారం మాత్రం రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఈమేరకు మాకు ముందుగానే సెల్‌ఫోన్‌కు సమాచారం ఇచ్చారు. – ఆనంద్, టెక్ మనోరా ప్యాకింగ్ పరిశ్రమ యజమాని, మడకశిర ఆగింది అరగంటే.. శ్రీకాకుళం జిల్లా పలాస–కాశిబుగ్గలో విద్యుత్తు కండెక్టర్ తెగిపోవడంతో బుధవారం సాయంత్రం 6.40 నుంచి 7.14 వరకు 34 నిమిషాల పాటు కరెంట్ సరఫరా ఆగిపోయింది. మరమ్మతుల అనంతరం సరఫరాను పునరుద్ధరించారు. ఇక్కడ కరెంట్ లేక రాత్రంతా గాడాంధకారం నెలకొందనే తరహాలో ఓ పత్రిక ఫోటోలు ప్రచురించింది. -
ఏపీ ఎస్పీడీసీఎల్కు జాతీయ అవార్డు
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలతో నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్)కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఆధ్వర్యంలో మంగళవారం 15వ ఇంధన సదస్సును వర్చువల్ విధానంలో నిర్వహించారు. విద్యుత్ పంపిణీలో ఆవిష్కరణల అంశంలో చేస్తున్న కృషిలో ఏపీ ఎస్పీడీసీఎల్ జాతీయ స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచినట్లు ఈ సదస్సు తీర్మానించింది. ఈ సదస్సులో భాగంగా జరిగిన ఐసీసీ అవార్డులు–2022 ప్రదానోత్సవ కార్యక్రమం సందర్భంగా జ్యూరీ సభ్యుల నుంచి ఈ అవార్డును ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ – మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.హరనాథరావు అందుకున్నారు. ఎస్పీడీసీఎల్కు జాతీయ అవార్డు లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగుల అత్యుత్తమ పనితీరుకు నిదర్శనంగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నట్లు తెలిపారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం ద్వారా సంస్థ మరెన్నో అవార్డులను అందుకోవాలని ఆకాంక్షించారు. -
2021లో విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు
సాక్షి, అమరావతి: కొద్దిసేపు కరెంట్ లేకపోతే లోకమంతా చీకటైపోయినట్టుగా ఉంటుంది. కరెంట్ రాగానే హమ్మయ్య అనుకుంటాం. మన దైనందిక జీవితంలో చీకటి వెలుగులు నింపే విద్యుత్ రంగంలో కూడా ఈ ఏడాది అలాంటి పరిస్థితులే ఉన్నాయి. బొగ్గు సంక్షోభంలో అధిక ధరలకు బయట మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడటం దగ్గర్నుంచి, డిస్కంల చరిత్రలోనే తొలిసారి ట్రూడౌన్ చార్జీల పేరుతో వినియోగదారులకు తిరిగి డబ్బులివ్వడం వరకు ప్రజల సంక్షేమానికే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు ‘సెకి’తో ఒప్పందానికి ఆమోదం తెలిపింది. వివిధ విభాగాల్లో రూ.కోట్లలో విద్యుత్ ఆదా అయింది. ఇలా విద్యుత్ రంగంలో ఈ ఏడాది చోటుచేసుకున్న అనేక పరిణామాల్లో ముఖ్యమైనవి కొన్ని.. అంతర్జాతీయ పరిస్థితులు, వర్షాలు, కోవిడ్ సెకండ్‌వేవ్ తదనంతర పరిణామాల కారణంగా దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ఏర్పడే పరిస్థితులు తలెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, ముందస్తుగా చేపట్టిన చర్యల కారణంగా మన రాష్ట్రంలో మాత్రం బొగ్గు సంక్షోభం ఏర్పడ లేదు. అయితే బొగ్గు కొరత కారణంగా మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలు పెరిగాయి. సాధారణంగా రూ.4 నుంచి రూ.5కు వచ్చే యూనిట్‌కు దాదాపు రూ.6 నుంచి పీక్ అవర్స్‌లో రూ.20 వరకు వెచ్చించాల్సి వచ్చింది. బొగ్గు కొరత తీర్చే విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని, విద్యుత్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని దేశంలో అందరికంటే ముందు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఫలితంగా రాష్ట్రానికి బొగ్గు సరఫరా మెరుగైంది. బొగ్గు కొనుగోలు కోసం ఏపీ జెన్కోకు రూ.250 కోట్ల అత్యవసర నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఉచిత విద్యుత్ పథకంతో రానున్న 30 ఏళ్ల పాటు రైతులకు పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అవసరమైన సోలార్ విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ–సెకి) ప్రతిపాదించింది. 25 ఏళ్లపాటు యూనిట్‌కు రూ.2.49 చొప్పున ఏడువేల మెగావాట్ల సౌర విద్యుత్తును కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బహిరంగ మార్కెట్లో చౌక విద్యుత్ కొనుగోలు, ఇతర ఉత్తమ ప్రమాణాల అమలు ద్వారా రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాదాపు రూ.2,500 కోట్లు ఆదా చేయగలిగాయి. పరిశ్రమలు, స్థానిక సంస్థలు, వ్యవసాయం, భవనాల్లో విద్యుత్ పొదుపు చర్యల కారణంగా గడిచిన ఏడాదిలో రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల ఇంధనం ఆదా అయింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 2019తో పోలిస్తే 2021లో 20 శాతం పెరిగింది. కేంద్రప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ప్రారంభించిన ఎనర్జీ ఎఫిషియెన్సీ (ఈఈ) ప్రాజెక్టుల గ్రేడింగ్‌లో టాప్ 10 రాష్ట్రాల్లో ఏపీకి స్థానం దక్కింది. భారీ వరదల కారణంగా చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో విద్యుత్ శాఖకు సుమారు రూ.19.13 కోట్ల నష్టం వాటిల్లింది. గులాబ్ తుఫాన్ వల్ల తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ.7.87 కోట్ల నష్టం సంభవించింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల 21 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా నెగెటివ్ ఫ్యూయెల్, పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ (ఎఫ్‌పీపీసీఏ)కు దరఖాస్తు చేశాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకుంటున్న ఇంధన పొదుపు చర్యలు, సంస్కరణల కారణంగా డిస్కంలు తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసి ఖర్చులు మిగుల్చుతున్నాయి. అలా మిగిలిన మొత్తాన్నీ వినియోగదారులకే ఇవ్వాలని భావిస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు దాదాపు రూ.126.16 కోట్లు తిరిగి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో వైఎస్సార్ జగనన్న కాలనీల పేరిట నిర్మిస్తున్న 28.30 లక్షల ఇళ్లకు అత్యంత నాణ్యమైన విద్యుత్తును అందించడానికి రూ.7,080 కోట్లు వెచ్చించేందుకు విద్యుత్తు సంస్థలు సిద్ధమయ్యాయి. కాలనీల్లో ఓవర్ హెడ్, అండర్ గ్రౌండ్ విద్యుదీకరణ పనులు చేపట్టాయి. 2014–15 నుంచి 2018–19 మధ్య కాలానికి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సమర్పించిన రూ.7,224 కోట్ల ట్రూ అప్ చార్జీల పిటిషన్ల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) రూ.3,669 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతి ఇచ్చింది. ఏపీఎస్పీడీసీఎల్ రూ.3,060 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ రూ.609 కోట్లు ట్రూఅప్ చార్జీలను ఎనిమిది నెలల్లో వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసి సెప్టెంబర్, అక్టోబర్ నెల బిల్లుల్లో ఆ మేరకు చార్జీలు విధించాయి. కానీ న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏపీఈఆర్సీ తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. దీంతో ఏపీఈపీడీసీఎల్ రూ.126 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్లో రూ.70 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) రూ.28 లక్షలను (మొత్తం రూ.196.28 కోట్లను) వినియోగదారులకు వెనక్కి ఇస్తూ, విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేశాయి. -
ట్రూఅప్‌కు తాత్కాలిక బ్రేక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన సర్దుబాటు చార్జీల (ట్రూ అప్)కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. విద్యుత్ బిల్లుల్లో ట్రూఅప్ చార్జీలను ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల చార్జీలతో కలిపి సెప్టెంబరు, అక్టోబరు నెలల బిల్లుల్లో వసూలు చేశారు. దీంతో డిస్కంలు తమ నష్టాల్ని కొంత మేర భర్తీ చేసుకోగలిగాయి. అయితే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) తన ఆదేశాలను వెనక్కి తీసుకోవడంతో ఈ నెల విద్యుత్ బిల్లులు (అక్టోబరు చార్జీలు) ట్రూఅప్ చార్జీ లేకుండానే వినియోగదారులకు అందాయి. రెండు నెలలు వసూలు 2014–15 ఆర్థిక సవంత్సరం నుంచి 2018–19 మధ్య కాలానికి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సమర్పించిన రూ.7,224 కోట్ల ట్రూ అప్ చార్జీల పిటిషన్ల ఆధారంగా ఏపీఈఆర్సీ రూ.3,669 కోట్ల వసూలుకు ఆగస్టులో అనుమతినిచ్చింది. సెప్టెంబర్, అక్టోబరు నెలల బిల్లుల్లో ఆ మేరకు డిస్కంలు చార్జీలు విధించాయి. వీటిపై పలు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏపీఈఆర్సీ తన ఉత్తర్వులను నిలిపివేసి మళ్లీ విచారణ చేపట్టింది. అక్టోబర్ 19న ఒకసారి, నవంబర్ 1న మరోసారి అభిప్రాయ సేకరణ జరిపింది. ఇంకా నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో డిస్కంలు నవంబర్ నెల బిల్లు.. అంటే అక్టోబర్ నెల వినియోగానికి ట్రూ అప్ చార్జీలు వేయలేదు. ఫలితంగా రెండు డిస్కంల పరిధిలోని దాదాపు 1.27 కోట్ల విద్యుత్ వినియోగదారులకు ఏపీఈపీడీసీఎల్ పరిధిలో యూనిట్‌కు రూ.0.45 పైసలు, ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.1.27 పైసలు చొప్పున చార్జీలు తగ్గాయి. సాధారణ వినియోగానికే బిల్లు పడింది. ఈ నెల 24న మరోసారి విచారణ మరోవైపు 2019–20 ఆర్ధిక సంవత్సరానికి ఏపీఈపీడీసీఎల్ రూ.701.28 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.1,841.58 కోట్లు చొప్పున మొత్తం రూ.2,542.86 కోట్ల ట్రూ అప్ చార్జీల వసూలుకు అనుమతి కోరుతూ ఏపీఈఆర్సీకి పిటిషన్లు దాఖలు చేశాయి. అదే విధంగా 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 మధ్య రూ.528.71 కోట్ల ట్రాన్స్మిషన్ బిజినెస్ ట్రూ అప్ చార్జీల వసూలు పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీట్రాన్స్కో) సమర్పించింది. వీటన్నిటిపైనా ఏపీఈఆర్సీ ఈనెల 24న ప్రజాభిప్రాయసేకరణ చేపట్టనుంది. వీటితో కలిపి, ఇప్పటికే విచారణ పూర్తయిన ట్రూ అప్ చార్జీల్లో ఎంత వసూలు చేయాలనేది ఏపీఈఆర్సీ నిర్ణయంపై అధారపడి ఉంది. -
ఏపీ: భారీ వర్షాలతో విద్యుత్ శాఖ అప్రమత్తం
సాక్షి, తిరుపతి(చిత్తూరు): తుఫాను ప్రభావంతో చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ హెచ్. హరనాథ రావు ఆదేశించారు. తుఫాను నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గురువారం ఉదయం సీఎండి హరనాథ రావు 5 జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లతో అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకుముందు రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి భారీ వర్షాల నేపథ్యంలో ఏపీఎస్పీడీసీఎల్ చేపడుతున్న ముందు జాగ్రత్త చర్యలపై సమీక్షించినట్లు సీఎండీ తెలిపారు. చదవండి: రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి: సీఎం జగన్ వర్షాల కారణంగా వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు చేపట్టాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించినట్లు తెలియజేశారు. టెలికాన్ఫరెన్స్ సందర్భంగా సీఎండీ హరనాథ రావు మాట్లాడుతూ..తుఫాను కారణంగా ఎదురయ్యే విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. చిత్తూరు జిల్లా పరిధిలోని వినియోగదారులు మొబైల్ నెంబరు: 94408 17412, కడప: 94408 17440, కర్నూలు: 73826 14308, అనంతపురం: 94910 67446, నెల్లూరు జిల్లా పరిధిలోని వినియోగదారులు మొబైల్ నెంబరు: 9440817468లకు కాల్ చేసి విద్యుత్ ప్రమాదాలు, సమస్యలపై సమాచారాన్ని అందించవచ్చని తెలిపారు. చదవండి: Heavy Rains: ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్ తుఫాను దృష్ట్యా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు. వినియోగదారుల సమస్యలపై తక్షణం స్పందించేందుకు వీలుగా ప్రతి సబ్ స్టేషన్ పరిధిలో ఐదుగురు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు ఒదిగిపోవడం తదితర ప్రమాదాలు సంభవించినట్లు అయితే వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా డ్రిల్లింగ్ యంత్రాలు, సామాగ్రిని, వాకిటాకీలను, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బలమైన గాలి, వర్షం ఉన్న సందర్భాల్లో ప్రజలు విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు పడిపోవడం, లైన్లు తెగిపోవడం జరిగినట్లయితే తక్షణమే కంట్రోల్ రూమ్ లకు గానీ, సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులు గానీ లేదా టోల్ ఫ్రీ నెంబరు; 1912కు ఫోన్ చేసి సమాచారం అందించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. -
విద్యుత్ రంగం బలోపేతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ రంగ సమగ్రాభివృద్ధి కోసం త్వరలో సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ట్రాన్స్‌కో విజిలెన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ) కె.వెంకటేశ్వరరావు, డిస్కంల సీఎండీలు జె.పద్మజనార్దనరెడ్డి (ఏపీసీపీడీసీఎల్), హెచ్.హరనాథరావు (ఏపీఎస్పీడీసీఎల్), కె.సంతోషరావు (ఏపీఈపీడీసీఎల్), ట్రాన్స్‌కో డైరెక్టర్లు కె.ప్రవీణ్‌కుమార్, కె.ముత్తు పాండియన్, ఇతర అధికారులతో ఆదివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఇంధన పర్యవేక్షక మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి వెల్లడించిన ఈ సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి. ► చౌక విద్యుత్ ఆలోచనను అమలు చేయడం, సరికొత్త రికార్డులను నెలకొల్పడం ద్వారా దేశ వ్యాప్తంగా మన విద్యుత్ రంగానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. రాష్ట్ర విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ► ఈ క్రమంలో సామర్థ్యం పెంపు, సరఫరా, పంపిణీ నెట్వర్క్ బలోపేతం చేయడం, వినియోగదారులే ఆధారంగా కార్యక్రమాలను చేపట్టడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వం సూచించింది. ► 2019–20లో 3 లక్షలు ఉన్న అంతరాయాలను 2020–21 నాటికి 1.77 లక్షలకు తగ్గించింది. 2019–20లో యూనిట్‌కు రూ.7.23గా ఉన్న సగటు సర్వీసు వ్యయాన్ని 2020–21 నాటికి రూ.7.18కి తగ్గించగలిగింది. ► విద్యుత్ సంస్థలు 2019–21 మధ్య విద్యుత్ కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. మార్చి 31, 2019 నాటికి విద్యుత్ సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది. 2019–21 సంవత్సరాల్లో విద్యుత్ సబ్సిడీ, ఇతర చార్జీల కింద మరో రూ.16,724 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ.28,166 కోట్లు విడుదల చేసింది. ► 30 ఏళ్లపాటు పగటి పూట వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించేందుకు 10 వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ► విద్యుత్ సంస్థలు కార్యనిర్వహణ, ఆర్థిక సుస్థిరత సాధిస్తేనే వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను అందించగలుగుతాం. డిస్కంల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రూ.3,669 కోట్ల ట్రూ అఫ్ చార్జీలను వసూలు చేసుకునేందుకు ఏపీఈఆర్సీ అనుమతించింది. -
సెంట్రల్ డిస్కం వెబ్సైట్, యాప్ ప్రారంభం
ఒంగోలు: సెంట్రల్ డిస్కం నూతనంగా అభివృద్ధి చేసిన శాప్ అండ్ ఐటీ అప్లికేషన్, వెబ్‌సైట్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలినేని మాట్లాడుతూ.. సెంట్రల్ డిస్కం అధునాతన సాంకేతిక విలువలతో వినియోగదారులకు సత్వర సేవలందించే దిశగా ముందుకెళ్లడం అభినందనీయమన్నారు. 2019 డిసెంబర్లో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు, వినియోగదారులకు మరింత మేలు జరిగేలా ఏపీఎస్పీడీసీఎల్ను విభజించి ఏపీసీపీడీసీఎల్ను ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్ 28 నుంచి కొత్తగా ఏర్పడ్డ సెంట్రల్ డిస్కం సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించిందన్నారు. నేడు ప్రారంభించిన అప్లికేషన్ ద్వారా సెంట్రల్ డిస్కంలోని ఉద్యోగుల దైనందిన కార్యకలాపాలను పారదర్శకతతో చేయడానికి వీలవుతుందన్నారు. అత్యుత్తమ, నాణ్యమైన, కచి్చతమైన సమాచారం ఉంటుందని, ఏ సమయంలో అయినా అందుబాటులో ఉండటం వల్ల ఉద్యోగులకు, వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ
సాక్షి, నెల్లూరు : మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో నెల్లూరు ఏపీఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయ్‌కుమార్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలను అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం రెండు ఇళ్లు ,5 స్థలాలు,14 ఎకరాల వ్యవసాయ భూమి ,ఒక కేజీ బంగారం, 50 లక్షల బ్యాంకు డిపాజిట్లు గుర్తించినట్లు తెలిపారు. మరిన్ని సోదాలు నిర్వహిస్తామని ఏసీబీ అడిషనల్ ఎస్పీ శాంత్రో పేర్కొన్నారు. నెల్లూరుతో పాటు విజయ్‌కుమార్ రెడ్డి బంధువుల ఇళ్లు ముత్తుకూరు,కలువాయి,కోట ప్రాంతంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
విద్యుత్ బిల్లుల విధానాన్ని సరళతరం చేశాం
సాక్షి, అమరావతి: వినియోగదారులకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో విద్యుత్ బిల్లుల విధానాన్ని చాలా సరళతరం చేశామని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) హైకోర్టుకు నివేదించింది. ఎంత వాడుకుంటే అంతే బిల్లు చెల్లించేలా కేటగిరీల వారీగా మార్పులు చేశామని తెలిపింది. గతంలో కొన్ని కేటగిరీల్లో తక్కువ విద్యుత్ వాడుకున్నప్పటికీ, ఏడాది మొత్తం వాడుకున్న యూనిట్ల ప్రకారం చెల్లింపులు చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు దాన్ని మార్చామని వివరించింది. దీనివల్ల విద్యుత్ వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొంది. లాక్డౌన్ వల్ల మార్చి విద్యుత్ రీడింగ్‌ను ఏప్రిల్‌లో తీసుకోవడం సాధ్యం కాలేదంది. కొందరు వినియోగదారులు 24 గంటల పాటు విద్యుత్‌ను వినియోగించడంతో మార్చిలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని తెలిపింది. ఏప్రిల్ నుంచి మేలో రీడింగ్ నమోదు చేసేంత వరకు 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నిర్దేశించిన రేట్ల ప్రకారం బిల్లులు జారీ చేశామంది. అధిక మొత్తాలను వసూలు చేస్తున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదంది. ఎటువంటి వడ్డీ, అపరాధ రుసుం లేకుండా బిల్లు చెల్లింపు గడువును జూన్ 30 వరకు ఇచ్చామని తెలిపింది. బిల్లుల విషయంలో సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్ కూడా ఇచ్చామని వివరించింది. నెలకు 75 యూనిట్ల కంటే తక్కువ వినియోగం ఏ కేటగిరీ, 75 నుంచి 225 యూనిట్ల వరకు బీ కేటగిరీ, 225 యూనిట్లకు పైన సీ కేటగిరీగా నిర్ణయించామంది. ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరింది. కొత్త విద్యుత్ టారిఫ్‌ను సవాల్ చేస్తూ న్యాయవాది ఎం.శ్రీనివాసరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ హరనాథ్‌రావు పై వివరాలతో కౌంటర్ దాఖలు చేశారు. -
మోదీ పిలుపు: ఈ జాగ్రత్తలు పాటించండి!
సాక్షి, తిరుపతి : కరోనా నేపథ్యంలో భారతీయులలో ఐక్యతా భావాన్ని నింపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ‘ లైట్ దియా’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి లైట్స్ ఆర్పే ముందు ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథ్ సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లైట్స్ ఆర్పినప్పటికీ నివాస గృహంలోని ఫ్యాన్స్, రిఫ్రిజిరేటర్లు, ఏసీలను ఆ 9 నిమిషాల పాటు ఆన్‌లో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఒకే సారి అన్నీ ఆఫ్ చేస్తే పవర్ గ్రిడ్ కూలి పోయే ప్రమాదం ఉందన్నారు. ( కరోనా: డీమార్ట్ రూ.155 కోట్ల విరాళం ) పవర్ గ్రిడ్ కూలకుండా ఉండటానికి తాము కూడా కొన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలోని రైతుల పంపు సెట్లకు రాత్రి 8:30 గంటల నుంచే పవర్ ఇస్తున్నామన్నారు. కరోనా వైరస్ వల్ల కరెంట్ బిల్లులు ఇవ్వడం వీలు కావడం లేదని, వినియోగదారులు మార్చి నెలలో చెల్లించిన బిల్లు మొత్తాన్నే ఇప్పుడు చెల్లించవచ్చని చెప్పారు. బిల్లుల చెల్లింపులో ఆలస్యం అయినా డిస్కనెక్షన్ ఉండదని తెలిపారు. -
కరెంట్ షాక్‌లకు కారకులెవరు?
సాక్షి, అమరావతి : దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి పెరిగినా.. కారు చౌకగా విద్యుత్ అందుబాటులో ఉన్నా చంద్రబాబు హయాంలో విద్యుత్ చార్జీల మోత ఎందుకు మోగింది? కరెంట్ చార్జీల షాక్‌లకు కారకులెవరు? ఇప్పటికీ కొనసాగుతున్న ఈ భారాలకు చంద్రబాబు స్వలాభాపేక్షే కారణమయ్యిందా? కర్ణాటకలోని కుడిగీ విద్యుత్ కేంద్రం పీపీఏని పరిశీలిస్తే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు తేలిగ్గా దొరకుతాయి.. కర్ణాటకలోని కుడిగీ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచీ యూనిట్ రూ. 4.80కి ఇవ్వడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో 2010లోనే కొనుగోలు ఒప్పందం చేసుకుంది. 360 మెగావాట్ల ఈ పీపీఏ వల్ల విభజన తర్వాత కూడా ఏపీకి ఏడాదికి 2,681 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందేది. ఈ విద్యుత్ చౌకగా లభించేది. 360 మెగావాట్లకు ఫిక్స్డ్ చార్జీలు (ప్లాంట్ నిర్మాణ వ్యయం) కింద రూ. 317 కోట్లు చెల్లించాలి. 2,681 మిలియన్ యూనిట్లకు లెక్కగడతారు కాబట్టి యూనిట్‌కు రూ. 1.20 మాత్రమే ఫిక్స్డ్ కాస్ట్ పడుతుంది. ఇక బొగ్గు, ఇతర చార్జీలు (వేరియబుల్ కాస్ట్) యూనిట్‌కు రూ. 3.58 అవుతుంది. అన్నీ కలుపుకుంటే యూనిట్ రూ. 4.80కే లభిస్తుంది. కానీ కుడిగీతో ఉన్న ఒప్పందం ప్రకారం ఏడాదికి 2,681 మిలియన్ యూనిట్లు తక్కువ ధరకే తీసుకునే అవకాశం ఉన్నా స్వలాభం కోసం చంద్రబాబు ఇతర ప్రైవేట్ విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. విద్యుత్ నియంత్రణ మండలిపై ఒత్తిడి తెచ్చి కుడిగీ నుంచి 392 మిలియన్ యూనిట్లే తీసుకోవాలని షరతుపెట్టేలా చేశారు. దానివల్ల చౌకగా వచ్చే 2,681 మిలియన్ యూనిట్లు తీసుకునే అవకాశం లేకుండా పోవడమే కాదు 392 మిలియన్ యూనిట్లు మాత్రమే కొనడం వలన ఏటా ఫిక్స్డ్ చార్జీల కింద అదనంగా రూ. 274 కోట్లు ఎన్టీపీసీకి కట్టాల్సి వస్తోంది. ఇది రాష్ట్రప్రభుత్వానికి నష్టమే కాక అదనపు భారం కూడా.. ఇదంతా ప్రజలపైనే విద్యుత్ చార్జీల రూపంలో పడుతోంది. అందుకే మార్కెట్లో చౌకగా విద్యుత్ దొరికినా విద్యుత్ వినియోగదారులపై భారం తప్పడం లేదు. ప్రైవేట్ విద్యుత్‌పైనే ప్రేమెక్కువ.. ప్రైవేటు పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారుల మీదే గత ప్రభుత్వం ప్రేమ చూపించింది. సౌర విద్యుత్ ధర గరిష్టంగా రూ. 6.99, పవన విద్యుత్ గరిష్టంగా రూ. 4.84 చొప్పున కొనుగోలు చేసేందుకు గత సర్కార్ 25 ఏళ్లుకు పీపీఏలు చేసుకుంది. వాస్తవానికి ఐదేళ్లుగా రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ డిమాండ్ స్వల్పం. కానీ ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. గత ప్రభుత్వ విధానాల ఫలితంగా ఇప్పుడు కేంద్ర విద్యుత్ కావాలన్నా చౌకగా లభించే వీల్లేకుండా పోయింది. కుడిగీ విషయానికే వస్తే అనుకున్న ప్రకారం 2,681 మిలియన్ యూనిట్ల విద్యుత్ తీసుకుని ఉంటే యూనిట్ రూ. 4.80లకే లభించేంది. కానీ 392 మిలియన్ యూనిట్లే తీసుకోవడం వల్ల పీపీఏ చేసుకున్న మొత్తానికి ఫిక్స్డ్ ఛార్జీ చెల్లిస్తున్నాం. దీనివల్ల ఇప్పుడు కుడిగీ విద్యుత్ ఫిక్స్డ్ చార్జీనే యూనిట్ రూ. 8.10 పడుతోంది. వేరియబుల్ కాస్ట్ మరో రూ. 3.58 అదనం. అంటే యూనిట్ రూ. 11.68 అవుతోంది. ప్రైవేటు వ్యక్తుల కోసం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న వైఖరి వల్ల డిస్కమ్‌లు నష్టపోతున్నాయని నిపుణుల కమిటీ అధ్యయనంలో తేలింది. -
పదోన్నతి కల్పించాల్సి ఉన్నా..
సాక్షి, ప్రొద్దుటూరు (కడప) : ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులు ప్రకటించిన జేఏఓల పదోన్నతుల్లో తనకు అన్యాయం జరిగిందని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు డివిజనల్ కార్యాలయంలో పనిచేస్తున్న దివ్యాంగుడు బి. సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం సాక్షి తో మాట్లాడారు. 2006లో రిక్రూట్మెంట్ ద్వారా 88 మార్కులతో తాను విద్యుత్ సంస్థలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందానని పేర్కొన్నారు. ఈ నెల 21 తేదీన ఎస్పీడీసీఎల్ అధికారులు సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న 12 మంది జేఏఓలకు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లుగా (ఏఏఓ) పదోన్నతులు కల్పించారని తెలిపారు. జీఓఎంఎస్ నంబర్42, 2011 అక్టోబర్ 19 తో పాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సివిల్ అప్పీల్ నంబర్.9096 ఆఫ్ 2013 ప్రకారం దివ్యాంగుల కోటాలో తనకు పదోన్నతి కల్పించాల్సి ఉందన్నారు. అయితే అధికారులు ఇందుకు భిన్నంగా తనకంటే తక్కువ మార్కులు పొందిన మరో అధికారికి పదోన్నతి కల్పించారన్నారు. రిక్రూట్ మెంట్లో 75 మార్కులు పొందిన అతనికి ఎస్సీ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం ఇచ్చిన అధికారులు ప్రస్తుతం అదే రోస్టరు ద్వారా పదోన్నతి కల్పించకుండా దివ్యాంగుల కోటాలో ఎలా పదోన్నతి కల్పిస్తారని ప్రశ్నించారు. పదోన్నతి గురించి దాదాపు రెండేళ్లుగా సీఎండీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు. -
తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలపై ఆన్లైన్ హ్యాకర్లు రెచ్చిపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్సైట్లను హ్యాక్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్), హన్మకొండ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్), తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్), వైజాగ్ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్)ల అధికారిక వెబ్సైట్లపై అంతర్జాతీయ హ్యాకర్లు పంజా విసిరారు. ర్యాన్సమ్వేర్ వైరస్ ద్వారా సర్వర్లలో ఉన్న డేటాను హ్యాకర్లు తస్కరించారు. అనంతరం సర్వర్లలో ఉన్న డేటాను పూర్తిగా డిలీట్ చేశారు. తస్కరించిన డేటాను వెనక్కి ఇచ్చేందుకు రూ.35 కోట్లకు పైగా డబ్బులు ఇవ్వాలని హ్యాకర్లు మెయిల్ పంపించినట్లు అధికారులు తెలిపారు. అయితే, 4 డిస్కంలకు సంబంధించిన సర్వర్లకు బ్యాకప్ ఉండడంతో డేటా భద్రత సమస్య తప్పింది. తిరుపతిలో డిస్కంల సర్వర్లు.. నాలుగు డిస్కంల ద్వారానే 2 రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఈ సంస్థల వెబ్సైట్లను తిరుపతి కేంద్రంగా టాటా కన్సల్టెన్సీ లిమిటెడ్(టీసీఎస్) నిర్వహిస్తోంది. ఉమ్మడి ఏపీ నుంచే డిస్కంల వెబ్సైట్ల సర్వర్లను తిరుపతి నుంచి నిర్వహిస్తున్నారు. గుర్తుతెలియని మెయిల్స్‌ను తెరవగానే వీటి సర్వర్లలో వైరస్ చొరబడి వెబ్సైట్లను హ్యాక్ చేసింది. సర్వర్ల నుంచి మొత్తం డేటాను డిలీట్ చేయడంతోపాటు వాటిని తెరుచుకోకుండా చేశారు. మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురికావడంతో 2 రోజులుగా ఆన్లైన్, పేటీఎం ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు స్తంభించిపోడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. టీసీఎస్ నిర్వహిస్తున్న వెబ్సైట్లే లక్ష్యం.. హ్యాకర్లు టీసీఎస్ కంపెనీ నిర్వహిస్తున్న పలు సంస్థల వెబ్సైట్లపై దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలోని 4 డిస్కంలతో పాటు ఇండియన్ ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సైతం హ్యాకింగ్‌కు పాల్పడినట్లు అధికారవర్గాలు తెలిపాయి. దీనితో పాటు ఆంధ్రాబ్యాంక్ వెబ్‌సైట్‌ను సైతం టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై ఇప్పటివరకు ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హ్యాకింగ్ నిజమే.. తమ సంస్థ వెబ్సైట్ హ్యాక్ అయినట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ధ్రువీకరించారు. సంస్థ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలను టీసీఎస్‌కు అప్పగించామని, టీసీఎస్‌తో కలసి సంస్థ ఐటీ నిపుణులు వెబ్‌సైట్‌ను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ర్యాన్సమ్వేర్ వైరస్ కారణంగా వెబ్సైట్ హ్యాక్ అయ్యిందన్నారు. ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ వెబ్సైట్లను హ్యాక్ చేసిన దుండగులే తమ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు భావిస్తున్నామన్నారు. తిరుపతిలో డిస్కంల వెబ్సైట్లకు సంబంధించిన డేటా బ్యాకప్ ఉందన్నారు. బ్యాకప్ బాధ్యత టీసీఎస్‌దే.. తమ సంస్థ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలు టీసీఎస్ చూస్తోందని, పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదేనని టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ.గోపాల్‌రావు అన్నారు. ఇప్పటికే వెబ్‌సైట్‌లోని కొన్ని ఆప్షన్లను పునరుద్ధరించామని తెలిపారు. డిస్కంల వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురికావడంపై హైదరాబాద్ నగర సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 65 కింద గుర్తుతెలియని హ్యాకర్లపై కేసు నమోదు చేశామని సీసీఎస్ అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు. -
కవర్డ్ కండక్టర్ల స్కామ్‌లో కవరింగ్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కవర్డ్ కండక్టర్ల కుంభకోణం మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ప్రమేయం వెలుగు చూస్తున్న నేపథ్యంలో దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సీఎండీ బాధ్యతలను వేరొకరికి అప్పగించారు. విజయవాడలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాజబాపయ్యను ఎస్పీడీసీఎల్ డైరెక్టర్(టెక్నికల్)గా నియమించి, ఎస్పీడీసీఎల్ సీఎండీగా అదనపు బాధ్యత అప్పగించారు. ఇప్పటివరకూ ఈ స్థానంలో ఉన్న ఐఏఎస్ అధికారి ఎంఎం నాయక్‌ను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు(ఈపీడీసీఎల్) పరిమితం చేశారు. కవర్డ్ కండక్టర్ల కుంభకోణంలో ఈపీడీసీఎల్ సీఎండీగా ఉన్న హెచ్‌వై దొర పాత్ర ఉందన్న ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేశారు. ఎస్పీడీసీఎల్ సీఎండీ బాధ్యతలను రాజబాపయ్యకు అప్పగిస్తూ శనివారం ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ ఆగమేఘాలపై జీవో విడుదల చేయడం విద్యుత్ వర్గాలను విస్మయ పరుస్తోంది. ఇలాంటి జీవోలు మునుపెన్నడూ శని, ఆదివారాల్లో విడుదల చేసిన దాఖలాలు లేవు. కవర్డ్ కండక్టర్ల కుంభకోణంలో సీఎంవోలోని ఓ ఐఏఎస్ అధికారి పాత్ర ఉందంటూ ‘సాక్షి’లో కథనం వెలువడిన కొన్ని గంటల్లోనే ఈ జీవో వెలువడడం గమనార్హం. విచారణను ప్రభావితం చేసేందుకేనా? రూ.131 కోట్ల విలువైన కవర్డ్ కండక్టర్ల స్కామ్‌పై ఎస్పీడీసీఎల్ డైరెక్టర్(ఫైనాన్స్) నేతృత్వంలో విచారణ చురుగ్గా సాగుతోంది. విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాతే కాంట్రాక్టు సంస్థకు ఎస్పీడీసీఎల్ సీఎండీ బిల్లులు చెల్లించినట్టు తేలింది. ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులకు, ప్రభుత్వాధినేతకు గుట్టుచప్పుడు కాకుండా ముడుపులు సమకూర్చిపెట్టే ప్రసాద్ అనే బ్రోకర్ ప్రమేయం ఇందులో ఉందని బయటపడినట్లు సమాచారం. దీంతో ఉలిక్కిపడ్డ ముఖ్యమంత్రి కార్యాలయం హడావిడిగా రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సీఎంవోలోని ఐఏఎస్ అధికారి తనకు అనుకూలమైన వ్యక్తికి సీఎండీగా బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. కుంభకోణంపై జరుగుతున్న విచారణను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిష్పక్షపాతంగా విచారణ ‘కవర్డ్ కండక్టర్ల కుంభకోణంలో సీఎంవో’ శీర్షికన ఈ నెల 22వ తేదీన ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఎస్పీడీసీఎల్ డైరెక్టర్(టెక్నికల్) స్పందించారు. ఈ స్కామ్‌పై నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నట్టు తెలిపారు. బిల్లుల చెల్లింపు వ్యవహారంలో సీఎంవో పాత్ర లేదని పేర్కొన్నారు. అనుభవం లేని అధికారికి కీలక పదవా? కవర్డ్ కండక్టర్ల కుంభకోణంలో విచారణ కీలక దశకు చేరిన నేపథ్యంలో అనుభవం లేని వ్యక్తికి ఎస్పీడీసీఎల్ సీఎండీగా బాధ్యతలు అప్పగించడాన్ని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి వ్యతిరేకించినట్టు తెలిసింది. ఆయన తన అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేసినట్లు సమాచారం. రాజబాపయ్య ఇప్పటివరకూ చీఫ్ ఇంజనీర్‌గానే పనిచేశారని, డైరెక్టర్ పోస్టుకు తీసుకోవడమే కొత్త అని ఆక్షేపిస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి వ్యక్తికి ఏకంగా సీఎండీగా బాధ్యతలు ఇవ్వడం వల్ల పలు అనుమానాలు వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేసినట్టు తెలిసింది. -
ప్రతి సబ్‌స్టేషన్ వద్ద ఇంకుడుగుంత
తిరుపతి రూరల్: సదరన్ డిస్కం పరిధిలో ఉన్న 2,200 సబ్ స్టేషన్లలో ఇంకుడు గంతలను నిర్మించనున్నట్టు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర తెలిపారు. బుధవారం తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంకుడుగుంతను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇకపై కొత్తగా ఏర్పాటు చేయబోయే విద్యుత్ సబ్‌స్టేషన్లలోనూ ఇంకుడు గుంతలను నిర్మించాలని ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు. -
విద్యుత్‌శాఖ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు
విజయవాడ (కృష్ణా జిల్లా) : విజయవాడలోని విద్యుత్ విభాగంలో చీఫ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న పి.జితేంద్ర ఇల్లు, ఆఫీసు, ఆయన బంధువుల ఇళ్లపై ఏక కాలంలో శనివారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. విజయవాడలోని పటమట హైస్కూల్ రోడ్డులోని ఆయన నివాసంతోపాటు, లహరి ఆస్పత్రి పక్క వీధిలోని ఆయన కార్యాలయంపై కూడా ఏక కాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇతర ప్రాంతాల్లోని ఆయన బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ దాడులు కొనసాగాయి. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి వీఆర్ఓగా పనిచేస్తున్న ఆయన సోదరుడు ఉపేంద్ర ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. -
డిస్కం అధికారిక దోపిడీ!
రైతులకు ట్రాన్స్ఫార్మర్ పెట్టినా.. కనెక్షన్ ఇచ్చినా రూ.2వేలు నిర్బంధ వసూళ్లు ప్రశ్నించలేకపోతున్న కరువు రైతులు బి.కొత్తకోట: ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా ఆపరేషన్స్ (డిస్కం) వ్యవసాయ రైతులనుంచి అధికారిక దోపీడీకి పాల్పడుతోంది. కరువు పరిస్థితులు, పంటలు పండకపోవడంతో తీవ్రంగా న ష్టాలు చవిచూస్తున్న రైతులకు డిస్కం అధికారులు తీసుకొన్న నిర్ణయం ఇబ్బందులకు గురిచేస్తోంది. తీసుకొవాల్సిన మొత్తం కంటే ముందుచూపు పేరుతో అధికారికంగా అన ధికార వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలో 2.65లక్షల వ్యవసాయ కనె క్షన్లు పనిచేస్తున్నాయి. ఈ కనెక్షన్ల నుంచి ఒక్కొటీకి నెలకు రూ.30 చార్జీలను రైతులు చెల్లించాలి. అయితే దీనికి విరుద్ధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అనధికార ఆదేశాలను అమలుచేస్తున్నారు. ఒక్కో రైతునుంచి ఏకకాలంలో ఒకే మొత్తంగా రూ.2వేలు వసూలు చేస్తున్నారు. రైతులు విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు, అదనపు సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు వీటిని మంజూరు చేస్తున్నారు. డిమాండ్ నోటీసులమేరకు రైతులు సొమ్మును చెల్లించారు. ప్రస్తుతం వీటిని ఇస్తున్న అధికారులు రైతులనుంచి నిర్బంధంగా రూ.2వేలు వసూలు చేస్తూ బిల్లులు ఇస్తున్నారు. ఇది ఎందుకంటే భవిష్యత్తులో చెల్లించాల్సిన బిల్లులకోసమని చెప్పుకొస్తున్నారు. ఇక రైతు నెలకు కేవలం రూ.30 చెల్లించాలి. దీనికోసం కనెక్షన్ కలిగివుండాలి. కొత్త కనెక్షన్ పొందిన రైతులకు కనెక్షన్ ఇచ్చేముందు, లేకపోతే ఇవ్వకముందే రూ.2వేలు వసూలు చేసుకుంటున్నారు. ఇది చెల్లించకుంటే కనెక్షన్, ట్రాన్స్ఫార్మర్ ఇవ్వరే మోనన్న ఆందోళనతో రైతులు విధిలేని పరిస్థితుల్లో చెల్లిస్తున్నారు. దీంతో 67నెలల బిల్లులను ఓకేసారి రైతులనుంచి వసూలు చేస్తున్నారు. సర్వీసు నంబర్లు ఇవ్వకనే రూ.4వేలు బి.కొత్తకోట మండలం నాయనబావికి చెందిన రైతు డీ.లోకనాథరెడ్డి రెండు వ్యవసాయబోర్లు వేశాడు. వీటికి వ్యవసాయ కనెక్షన్లకోసం 2014 జూన్2న 20హెచ్‌పీ సామర్థ్యానికి డిపాజిట్టు చెల్లించాడు. ఇంతవరకు కనెక్షన్లకు సర్వీసు నంబర్లు ఇవ్వలేదు. అయితే జనవరి 23న ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు. ఇది ఇవ్వాలంటే రూ.4వేల సర్వీసు చార్జీలు ముందుగానే చెల్లించాలన్న షరతు విధించడంతో విధిలేక చెల్లించి రశీదు పొందాడు. సర్వీసు నంబర్లు లేకున్నా చార్జీలైతే వసూలు చేసుకున్నారు. కనెక్షన్ ఇవ్వకనే రూ.2వేలు బి.కొత్తకోట మండలం కాయలవారిపల్లెకు చెందిన మహిళా రైతు టీ.అమరావతమ్మ రెండెకరాల పొలంలో వ్యవసాయకోసం బోరుచేయించింది. కనెక్షన్ కోసం 2014 ఏప్రిల్ 1న రూ.10,600 చెల్లించింది. అప్పటికే వున్న 15హెచ్‌పీ సామర్థ్యాన్ని 25 హెచ్‌పీ స్థాయికి పెంచాలి. అయితే ఈ ఏడాది జనవరి18న సామర్థ్యం పెంచుతూ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేశారు. దీన్ని ఏర్పాటు చేసేందుకు రూ.2వేలు కట్టించుకున్నారు. అప్పటివరకు సేద్యమే జరగలేదు. సర్వీసు చార్జీలు కట్టాల్సిన అవసరం కూడా లేదు. అయినప్పటికీ ముందుగానే 67 నెలల బిల్లులను వసూలు చేసుకున్నారు. -
కొత్త రాజధానికి ముందస్తు ‘పవర్’!
* విజయవాడ, గుంటూరు పరిసరాల్లో 14 కొత్త సబ్స్టేషన్లు * ఇండోర్, గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్లు * ఏపీఎస్పీడీసీఎల్ ప్రతిపాదనలు * సబ్స్టేషన్లకు స్థలాలు దొరక్క సతమతం * గుంటూరు కేంద్రంగా మరో డిస్కంపై దృష్టి సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ పరిసరాల్లో రూపుదిద్దుకునే నూతన రాజధాని నగరానికి సరిపడా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ముందుగానే చర్యలు చేపడుతున్నారు. విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు పరిసర ప్రాంతాల్లో కొత్తగా ఇండోర్, గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మించేందుకు సమాయత్తమవుతున్నారు. వీటితో పాటు కొత్త ఫీడర్లు, వాటి నుంచి కొత్త లైన్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారు చేశారు. రాబోయే ఐదేళ్లలో విజయవాడ, గుంటూరు శివార్లలో పెరిగే అన్ని కేటగిరీల విద్యుత్ కనెక్షన్లకు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు రూ. 600 కోట్ల అంచనాతో తాజా ప్రతిపాదనలను రూపొందించారు. ప్రభుత్వం వీటిని పరిశీలిస్తోంది. విజయవాడ, గుంటూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో 7 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. నిత్యం 3 మెగావాట్ల విద్యుత్ లోడ్ పెరుగుతూనే ఉంది. నెలకు 30 వేలకు పైగా కొత్త కనెక్షన్లు ఇవ్వాల్సి వస్తోంది. దీనివల్ల ప్రతి నెలా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుగానే విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేసుకోవడం అవసరమని విద్యుత్ శాఖ భావించింది. రెండు నగరాల్లోనూ మరో 14 సబ్స్టేషన్లు... విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లతో పాటు ఆయా నగరాలకు శివారు ప్రాంతాల్లో మరో పద్నాలుగు 33 కేవీ సబ్స్టేషన్ల ఏర్పాటు అవసరమని అంచనావేశారు. విజయవాడ టౌన్ డివిజన్లో 24, గుణదల డివిజన్లో 21 సబ్స్టేషన్లు ఉండగా, ఈ రెండు డివిజన్లలోనూ మరో 8 సబ్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేశారు. అదేవిధంగా గుంటూరులో 6 చోట్ల వీటిని నిర్మించనున్నారు. రెండు నగరాల్లోనూ అన్ని ఫీడర్లపైనా ఓవర్‌లోడ్ సమస్య ఎదురవడంతో ఇండోర్ సబ్స్టేషన్ల ఏర్పాటు అవసరమని అధికారులు నివేదించారు. మొగల్రాజపురం, గాంధీనగరం, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర, గొల్లపూడి, భవానీపురం ప్రాంతాల్లో ఇండోర్ సబ్స్టేషన్లు, గుణదలలో రూ. 80 కోట్ల అంచనాతో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు తయారు చేశారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ, అచ్చంపేట, అమరావతి ప్రాంతాల్లోనూ కొత్తగా సబ్స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించారు. గుంటూరు, విజయవాడ నగరాల్లో గజం స్థలం కూడా దొరక్క విద్యుత్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రభుత్వ, మునిసిపల్ స్థలాలను కేటాయించాలని కోరుతూ విజయవాడ, గుంటూరు, ఒంగోలు మునిసిపల్ కమిషనర్లకు, ఏపీఐఐసీ అధికారులకు విద్యుత్ శాఖ లేఖలు రాసింది. గుంటూరు కేంద్రంగా మరో డిస్కం? గుంటూరు కేంద్రంగా మరో డిస్కం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి కేంద్రంగా ఉన్న ఏపీఎస్పీడీసీఎల్ను రెండుగా విభజించి ఒక డిస్కం కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేస్తారని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గుంటూరులోని స్పిన్నింగ్ మిల్లుల యజమానులు, వినియోగదారుల సంఘం ప్రతినిధులు ఇటీవల సీఎంను కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించారు. -
ట్రాన్స్ఫార్మర్ల కొరత..
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ శాఖ పరిధిలోని ఏపీఎస్పీడీసీఎల్లో ట్రాన్స్ఫార్మర్ల కొరత వేధిస్తోంది. జిల్లా అవసరాలకు తగినట్లు వీటిని మంజూరు చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఈ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడాదిన్నర కాలంగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న కర్నూలు విద్యుత్ సర్కిల్‌ను అనంతపురంతో కలిపి తిరుపతి కేంద్రంగా పని చేస్తున్న ఎస్పీడీసీఎల్లో విలీనం చేశారు. అప్పటి నుంచి ట్రాన్స్ఫార్మర్ల సమస్య తలెత్తింది. సాధారణంగా జిల్లా అవసరాలకు ప్రతి నెలా సగటున 150 త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు అవసరం. వీటిని దరఖాస్తు చేసుకున్న రైతుల సినియారిటీ, లోఓల్టేజీ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రాధాన్యత మేరకు కేటాయిస్తారు. అయితే గత మూడు నెలల్లో 138 మాత్రమే జిల్లాకు కేటాయించడం సమస్యకు కారణమవుతోంది. బోర్లు, బావులపై ఆధారపడి పంటలు సాగు చేసుకునే అన్నదాతలు ట్రాన్స్ఫార్మర్ల కొరత కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అరకొర వర్షాలకు సాగుకు సిద్ధం కాగా.. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో పాటు భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఈ పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లపైనే అధిక లోడు వేసి మోటార్లను వినియోగిస్తుండటంతో కాలిపోతున్నాయి. నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే పట్టణ ప్రాంతాల్లో 24 గంటల్లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లోపు మార్పు చేయాల్సి ఉన్నా సాధ్యపడని పరిస్థితి నెలకొంది. రోలింగ్ ట్రాన్స్ఫార్మర్ల కొరత కూడా తీవ్రతరంగా ఉంది. వాస్తవానికి ట్రాన్స్ఫార్మర్ల సంఖ్యకు 4 శాతం రోలింగ్(కాలిపోయినప్పుడు వెంటనే మార్చేందుకు సిద్ధం చేసినవి) ట్రాన్స్ఫార్మర్లు ఉండాలి. అలాంటిది ప్రస్తుతం వీటి శాతం 2.3 మాత్రమే కావడం గమనార్హం. హెచ్‌వీడీఎస్ కింద ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిన ఫీడర్లలో మినహా తక్కిన చోట్ల అధిక లోడ్ కారణంగా లోఓల్టేజీ సమస్య వేధిస్తోంది. మరో 500 పైగా ట్రాన్స్ఫార్మర్లు వస్తే తప్ప సమస్యల పరిష్కారమయ్యే పరిస్థితి లేదని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకున్న 11,409 మంది రైతులు ప్రభుత్వం ఎప్పుడు కరుణిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. -
కమీషన్లకు నోచుకోని మీ సేవ కేంద్రాలు
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: గ తేడాది నవంబర్ నుంచి కమీషన్లు అందలేదని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు. వివిధ శాఖలకు, ప్రజలకు వారధిగా ఉంటున్న మీ సేవ కేంద్రాల నిర్వహణ తడిసిమోపెడవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, ఏపీఎస్పీడీసీఎల్, రవాణ, స్టాక్ బుకింగ్, మున్సిపాలిటీ, ట్రాన్సక్షన్ తదితర సేవలను అందిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శ్రీవెన్ ఏజెన్సీ కింద మీ సేవ కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. శ్రీవెన్ ఏజెన్సీ వారు ఏడు నెలలుగా కమీషన్ ఇవ్వడంలేదన్నారు. దీంతో వీటి నిర్వహణ కష్టతరమైందని ఆవేదన చెందుతున్నారు. గది బాడుగ, విద్యుత్ బిల్లు, ఇతర ఖర్చులు భరించలేకున్నామన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను కలిసినా వారు స్పందించడం లేదన్నారు. ఒక్కోసారి రీచార్జి చేసుకోవాలంటే రూ.50వేలు అవుతుందన్నారు. పెట్టుబడి పెడితేనే లాభాలు వస్తాయని చెబుతున్నారేగానీ, కమీషన్లు ఇవ్వాలన్న ఆలోచన వారికి లేనట్లుందని నిర్వాహకులు అంటున్నారు. సమైక్యాంధ్ర సమ్మె కాలంలో రీచార్జి చేసుకున్నందుకు చార్జీల పేరుతో రు.2,500లకుపైగా వసూలు చేశారని వారు ఆరోపించారు. నిరుద్యోగులకు ప్రభుత్వం కల్పించిన భృతికి ఏజెన్సీవారు గండికొడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ఒక్కో మీ సేవ కేంద్రానికి ఇప్పటి వరకు రు.70వేల నుంచి లక్ష వరకు కమీషన్లు రావాల్సి ఉందన్నారు. ఈ ఏడాది మార్చిలో శ్రీవెన్ ఏజెన్సీవారు మీ సేవ సాఫ్ట్‌వేర్‌ను మార్చారన్నారు. దీంతో అప్పటివరకు జరిగిన లావాదేవీలు, వాటి వివరాలు, కమీషన్ ఎంత అనే విషయాలు కనిపించడంలేదని నిర్వాహకులు వాపోతున్నారు. ఈ విషయమై కలెక్టర్ స్పందించి తమకు కమీషన్లు ఇప్పించాలని వారు కోరుతున్నారు. వారంలోపు కమీషన్లు చెల్లిస్తాం.. 2013 నవంబర్ నుంచి మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు కమీషన్లు రాలేదని, మరో వారంలోపు చెల్లిస్తామని శ్రీవెన్ ఏజెన్సీ మీ సేవ కేంద్రాల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాజు ‘న్యూస్‌లైన్’కు వివరణ ఇచ్చారు. -
కోతల వాత
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: అనధికారిక విద్యుత్ కోతలతో జనం అల్లాడుతున్నారు. ఒక వైపు విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో పాటు, ఎండ తీవ్రత నానాటికీ పెరుగుతుండటంతో అన్ని వర్గాల ప్రజలు విద్యుత్ కోతలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రకటించిన వేళలకంటే గంట నుంచి మూడు గంటల వరకు కోతల సమయాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ కేంద్ర కార్యాలయం తిరుపతి నుంచి జిల్లాల అధికారులకు కోత వేళలు, వాటిని పాటించాల్సిన తీరుపై గతంలో వివరాలు పంపించారు. కానీ ఆ వేళలు పాటించడం లేదు. = ఒంగోలు నగరంలో పగలు 3 గంటలు విద్యుత్ కోత విధిస్తారని ప్రకటించారు. అదికాస్త 4 నుంచి 4.30 గంటల వరకు చేరుకుంది. ఉదయం 9 నుంచి 10.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తారని ప్రకటించారు. కానీ 11 గంటల వరకు కూడా విద్యుత్ ఇవ్వడం లేదు. మున్సిపాలిటీల్లో పగలు నాలుగు గంటలు కోత విధిస్తారని గతంలో ప్రకటించినా ఐదు గంటలకుపైగా కోత విధిస్తున్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోత విధిస్తారని చెప్పారు. అలాంటిది ఉదయం 45 నిమిషాలు, సాయంత్రం మరో 45 నిమిషాలు అదనంగా కోత విధిస్తున్నారు. గ్రామాల్లో పగటి పూటంతా విద్యుత్ ఉండటం లేదు. గతంలో గ్రామాల్లో వ్యవసాయ విద్యుత్, పగలు ఇచ్చే సమయాల్లో గ్రామాల్లో విద్యుత్ ఉండేది. వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్‌ను 7 గంటల పాటు ఇస్తామని చెబుతున్నా ఆ సమయాలను అధికారులు సక్రమంగా పాటించడం లేదు. దీంతో పంటలు కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వ్యవసాయ విద్యుత్‌ను అధికారులు మండలాన్ని యూనిట్‌గా చేసుకొని ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించి ఇచ్చేవారు. అది కాస్తా జనవరి 15 నుంచి 4 గ్రూపులుగా చేశారు. ఏ, బీ, సీ, డీలుగా విభజించి పగలు, రాత్రి సమయాల్లో విద్యుత్‌ను ఇస్తున్నారు. సమయాలు అయితే ప్రకటిచారు కానీ.. వాటి అమలే ప్రశ్నార్థకంగా మారింది. పరిశ్రమల పరిస్థితి అధ్వానం: విద్యుత్ కోతలతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే చివరకు పరిశ్రమలకూ విద్యుత్ కోతల బెడద తప్పలేదు. వారానికి సరిపడా విద్యుత్‌ను పరిశ్రమలకు ఇవ్వలేమంటూ ఏపీఎస్పీడీసీఎల్ చేతులెత్తేసింది. ఈ మేరకు ఈ నెల 3వ తేదీ నుంచి పరిశ్రమలకు వారానికి ఒకరోజు పూర్తిగా విద్యుత్ ఇవ్వకుండా నిలిపేస్తున్నారు. అంటే వారానికి ఆరు రోజులు మాత్రమే పరిశ్రమలు పనిచేస్తాయి. అయితే ఈ ఆరు రోజుల్లోనూ రోజుకు 2,3 గంటలు పరిశ్రమల ప్రాంతంలో కూడా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో పరిశ్రమల నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. -
పరిశ్రమలకు ‘పవర్’ పంచ్
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: గృహ వినియోగదారులకు విద్యుత్ కోతల వాతలు పెడుతున్న ప్రభుత్వం పరిశ్రమలనూ వదలడం లేదు. వారానికి సరిపడా విద్యుత్‌ను పరిశ్రమలకు సరఫరా చేయలేమంటూ ఏపీఎస్పీడీసీఎల్ చేతులెత్తేసింది. ఈమేరకు ఈనెల 3వ తేదీ నుంచి పరిశ్రమలకు వారానికి ఒకరోజు పూర్తిగా విద్యుత్ ఇవ్వకుండా నిలిపేయనున్నారు. ప్రతి గురువారం పరిశ్రమలకు విద్యుత్ సరఫరా ఉండదు. దీంతో వారానికి ఒకరోజు పరిశ్రమలు మూతేసుకోవాల్సిన పరిస్థితి. ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు కూలీల ఉపాధి కూడా కష్టంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ ఇస్తామని చెబుతున్న అధికారులు 5 గంటలకు మించి ఇవ్వడం లేదు. పంటలు కాపాడుకునేందుకు అర్ధరాత్రుళ్లు పొలాల గట్ల వెంట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లా కేంద్రంలో మూడు గంటలు, మున్సిపాలిటీల్లో నాలుగు గంటలు, మండల కేంద్రాల్లో ఆరు గంటల పాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. ఇక గ్రామాల పరిస్థితి వర్ణనాతీతం. వ్యవసాయ విద్యుత్ ఇచ్చే సమయాల్లోనే గ్రామాల్లో పగటిపూట కరెంటు ఉంటోంది. పగటి పూట పట్టుమని రెండు, మూడు గంటలు కూడా విద్యుత్ ఉండటం లేదు. రాత్రివేళల్లోనూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు. వేసవికి ముందే ఇలా ఉంటే ఇక వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. -
కోతలు షురూ..!
పాలమూరు, న్యూస్‌లైన్: ఇది మండుతున్న వేసవి కాదు.. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. ఆశించిన మేర విద్యుదుత్పత్తి కూడా ఉంది. అయినా జిల్లాలో ఇప్పటికే అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. జిల్లా కేంద్రంలో రెండు గంటలు, మునిసిపాలిటీ, మండలకేంద్రాల్లో మూడు గంటల పాటు కోతలు విధిస్తున్నారు. ఇకనుంంచి గ్రామాలను ఏ, బీ, సీ, కేటగిరీలుగా విభజించి రోజుకు ఆరు గంటల చొప్పున విద్యుత్ సరఫరాను నిలిపేస్తారు. ఆదివారం నుంచి అధికారికంగా జిల్లాలో విద్యుత్‌కోతలను అమలుచేయాలని నిర్ణయించారు. దీంతో పండుగల వేళ పల్లెల్లో అంధకారం అలుముకునే పరిస్థితులు నెలకొన్నాయి. వేళాపాళ లేని కరెంట్ కోతలపై రైతన్నలు భగ్గుమంటున్నారు. జిల్లాలో సెప్టెంబర్‌లోనే విద్యుత్ కోతలు మొదలయ్యాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు కోతలను విధిస్తూ ఏపీఎస్పీడీసీఎల్ ఆదేశాలిచ్చింది. హైదరాబాద్‌లో లోడ్ రిలీవ్ కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే కోతలు అమలుచేస్తున్నామని జిల్లా విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ఓ వైపు ప్రాజెక్టులు నిండి నీరంతా వృథాగా పోతుంటే విద్యుదుత్పత్తి పెరగాల్సింది పోయి కోతలు విధించడం ఏమిటని అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో గంటలకొద్దీ కోత గ్రామాల్లో అధికారికంగా రోజుకు ఆరు గంటల విద్యుత్ కోత ప్రకటించినప్పటికీ.. అనధికారికంగా 12 నుంచి 14 గంటల పాటు విధిస్తుండటంతో రైతులు, జనం ఇబ్బందులు పడుతున్నారు. వేళాపాళలేని కరెంట్‌కోతలకు మోటారు పంపుసెట్లపై ఆధారపడి ఖరీఫ్ పంటలు సాగుచేసిన రైతులు గగ్గోలుపెడుతున్నారు. జిల్లాలో 1.85 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటి పరిధిలో సుమారు మూడు లక్షల హెక్టార్ల మేర మోటార్ల ద్వారా నీటిని పారిస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్‌కోతల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు 1.50 లక్షల యూనిట్లకు పైగా విద్యుత్‌ను వినియోగించే పరిశ్రమలు 75 వరకు ఉన్నాయి. నెలలో 12 రోజుల పాటు భారీ పరిశ్రమలకు విద్యుత్‌ను నిలిపివేస్తే ఆయా కంపెనీలకు కోట్లల్లో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో లక్షలాదిమంది కార్మికుల ఉపాధికి ఆటంకం కలిగే అవకాశం ఉంది. జిల్లాలో 51వేల వరకు వాణిజ్య వ్యాపార సంస్థలకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. చిన్నతరహా పరిశ్రమలు సుమారు ఐదువేలు ఉన్నాయి. వీటికి ప్రతిరోజు నాలుగు లక్షల యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాల్సి ఉటుంది. విద్యుత్ కోతల నేపథ్యంలో ఈ పరిశ్రమలకు నెలలో 8 రోజులపాటు విద్యుత్ సరఫరాను నిలిపేయాలని నిర్ణయించారు. దీంతో ఇక్కడ పనిచేస్తున్న సుమారు 10వేల మంది కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడాల్సి వస్తుంది. ఇదిలాఉండగా జిల్లా వ్యాప్తంగా ట్రెడిషనల్ రైస్ మిల్లులు 200, నాన్‌ట్రెడిషన్ రైస్ మిల్లులు మరో 100 ఉన్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల రైస్ మిల్లులు కూడా నడపలేని పరిస్థితి నెలకొంది. -
ప్రాజెక్ట్ విభాగం సీఈ సరెండర్
వరంగల్, న్యూస్‌లైన్ : ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాల యంలో తొలిసారిగా ఓ సీఈ స్థాయి అధికారిపై వేటు పడింది. పని తీరు సరిగా లేదనే కారణంగా ఆయనను సరెండర్ చేస్తూ సీఎండీ కార్తికేయ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు డీఈ స్థాయి వరకే పరిమితమైన చర్యలు... ఇప్పుడు చీఫ్ ఇంజి నీర్ల వరకూ చేరుకోవడం ఆ సంస్థలో కల కలం రేపుతోంది. విద్యుత్ భవన్లో ప్రాజెక్టు విభాగం సీఈగా సురేందర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో ఫర్చేసింగ్ విభాగంలో సీఈగా పని చేశారు. ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో సీఎండీ ప్రశ్నలకు సీఈ సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. పలు నివేదికలు ఇవ్వడంలో జాప్యం సైతం జాప్యం చేసినట్లు సమాచారం. దీంతో ఆయనపై సీఎండీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా.. విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని, పనితీరు సరిగా లేదనే కారణంగా సీఎండీ పేషీకి సరెండర్ చేస్తూ సీఎండీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పలు ఆరోపణలు, విధుల నిర్లక్ష్యంపై కింది స్థాయి ఉద్యోగులపై వేటు పడుతున్న విషయం విదితమే. కానీ... డిస్కంలో ఎన్నడూ లేని విధంగా సీఈని సరెండర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అరుుతే మరో కొద్ది నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్న సురేందర్... సరెండర్ కావడంపై మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. మరో ఎనిమిది నెలల సర్వీసు ఉండగా... దీర్ఘకాలిక సెలవులో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా... సీఈ స్థాయి అధికారులపై ఇలా సరెండర్ చర్యలు తీసుకోవడం సరికాదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.