కొత్త రాజధానికి ముందస్తు ‘పవర్’!
* విజయవాడ, గుంటూరు పరిసరాల్లో 14 కొత్త సబ్‌స్టేషన్లు
* ఇండోర్, గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్లు
* ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రతిపాదనలు
* సబ్‌స్టేషన్లకు స్థలాలు దొరక్క సతమతం
* గుంటూరు కేంద్రంగా మరో డిస్కంపై దృష్టి
సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ పరిసరాల్లో రూపుదిద్దుకునే నూతన రాజధాని నగరానికి సరిపడా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా ఏపీఎస్‌పీడీసీఎల్ అధికారులు ముందుగానే చర్యలు చేపడుతున్నారు. విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు పరిసర ప్రాంతాల్లో కొత్తగా ఇండోర్, గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ సబ్‌స్టేషన్లను నిర్మించేందుకు సమాయత్తమవుతున్నారు. వీటితో పాటు కొత్త ఫీడర్లు, వాటి నుంచి కొత్త లైన్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారు చేశారు.
రాబోయే ఐదేళ్లలో విజయవాడ, గుంటూరు శివార్లలో పెరిగే అన్ని కేటగిరీల విద్యుత్ కనెక్షన్లకు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు రూ. 600 కోట్ల అంచనాతో తాజా ప్రతిపాదనలను రూపొందించారు. ప్రభుత్వం వీటిని పరిశీలిస్తోంది. విజయవాడ, గుంటూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో 7 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. నిత్యం 3 మెగావాట్ల విద్యుత్ లోడ్ పెరుగుతూనే ఉంది. నెలకు 30 వేలకు పైగా కొత్త కనెక్షన్లు ఇవ్వాల్సి వస్తోంది. దీనివల్ల ప్రతి నెలా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుగానే విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేసుకోవడం అవసరమని విద్యుత్ శాఖ భావించింది.
రెండు నగరాల్లోనూ మరో 14 సబ్‌స్టేషన్లు...
విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లతో పాటు ఆయా నగరాలకు శివారు ప్రాంతాల్లో మరో పద్నాలుగు 33 కేవీ సబ్‌స్టేషన్ల ఏర్పాటు అవసరమని అంచనావేశారు. విజయవాడ టౌన్ డివిజన్‌లో 24, గుణదల డివిజన్‌లో 21 సబ్‌స్టేషన్లు ఉండగా, ఈ రెండు డివిజన్లలోనూ మరో 8 సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేశారు. అదేవిధంగా గుంటూరులో 6 చోట్ల వీటిని నిర్మించనున్నారు. రెండు నగరాల్లోనూ అన్ని ఫీడర్లపైనా ఓవర్‌లోడ్ సమస్య ఎదురవడంతో ఇండోర్ సబ్‌స్టేషన్ల ఏర్పాటు అవసరమని అధికారులు నివేదించారు.
మొగల్రాజపురం, గాంధీనగరం, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర, గొల్లపూడి, భవానీపురం ప్రాంతాల్లో ఇండోర్ సబ్‌స్టేషన్లు, గుణదలలో రూ. 80 కోట్ల అంచనాతో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు తయారు చేశారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ, అచ్చంపేట, అమరావతి ప్రాంతాల్లోనూ కొత్తగా సబ్‌స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించారు. గుంటూరు, విజయవాడ నగరాల్లో గజం స్థలం కూడా దొరక్క విద్యుత్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రభుత్వ, మునిసిపల్ స్థలాలను కేటాయించాలని కోరుతూ విజయవాడ, గుంటూరు, ఒంగోలు మునిసిపల్ కమిషనర్లకు, ఏపీఐఐసీ అధికారులకు విద్యుత్ శాఖ లేఖలు రాసింది.
గుంటూరు కేంద్రంగా మరో డిస్కం?
గుంటూరు కేంద్రంగా మరో డిస్కం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి కేంద్రంగా ఉన్న ఏపీఎస్‌పీడీసీఎల్‌ను రెండుగా విభజించి ఒక డిస్కం కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేస్తారని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గుంటూరులోని స్పిన్నింగ్ మిల్లుల యజమానులు, వినియోగదారుల సంఘం ప్రతినిధులు ఇటీవల సీఎంను కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించారు.