సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపానుకు అతలాకుతలమైన విద్యుత్ వ్యవస్థను విజయవంతంగా య«థాస్థితికి తీసుకొచ్చామని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య పంపిణీ సంస్థల (ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్) పరిధిలో పునరుద్థరణ పనులు వంద శాతం పూర్తయ్యాయని తెలిపాయి. తీవ్రంగా ప్రభావితమైన దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో మరమ్మతు పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఇంధన శాఖకు డిస్కంలు శుక్రవారం నివేదించాయి.
ఈ సందర్భంగా జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో తుపానును ఎదుర్కోవడం, పునరుద్ధరణ ప్రణాళిక అమలులో సమర్థవంతంగా పని చేసిన విద్యుత్ సంస్థలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అభినందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకత్వంలో ఏపీ విద్యుత్ శాఖ సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి విద్యుత్ మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారని ఆయన వెల్లడించారు.
భారీ గాలులు, వర్షం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏపీజెన్‌కో ఎండీ, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, డిస్కంల సీఎండీలు ఐ.పృ«థ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె. సంతోషరావు క్షేత్రస్థాయిలో పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే లక్ష్యంతో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, పడిపోయిన విద్యుత్ స్తంభాలను తిరిగి ఏర్పాటు చేయడం, పాడైన ఇన్సులేటర్ల మారి్పడి, విరిగిన కండక్టర్లను సరిచేయడం వంటి పనులను శరవేగంగా పూర్తి చేయించారని తెలిపారు.
జిల్లా కేంద్రాల నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాలకు అవసరమైన స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర సామాగ్రితో పాటు ప్రత్యేక బృందాలు, ఇతర అన్ని రకాల సామగ్రిని వేగంగా సమకూర్చుకొని పనులు పూర్తి చేశాయని పేర్కొన్నారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి, జిల్లా కేంద్రాల నుంచి క్షేత్రస్థాయి అధికారులను, సిబ్బందిని నిరంతరం పర్యవేక్షించడం వల్ల మరమ్మతు పనులు వేగంగా జరిగాయని తెలిపారు.
దెబ్బతిన్న 17 ఫీడర్లలో 14 ఫీడర్లను పునరుద్ధరించామని, తమిళనాడులో విద్యుత్ టవర్ కూలిపోవడం వల్ల మూడు ఫీడర్ల పనులు ఇంకా కొనసాగుతున్నాయని ట్రాన్స్‌కో గ్రిడ్ డైరెక్టర్ ఏవీకే భాస్కర్ వెల్లడించారు. అయినప్పటికీ విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment