
ముందుగా తెనాలిలో ప్రయోగాత్మకంగా పరిశీలన: సీఎస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలోనే ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెలలోనే తెనాలిలో ప్రయోగాత్మకంగా వాట్సాప్ ద్వారా జనన, మరణ ధ్రువీకరణపత్రాలు పొందే ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ప్రక్రియపై సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ తెనాలిలో సాంకేతికంగా ఇబ్బందులను సునిశితంగా పరిశీలించి, దానికి అనుగుణంగా ఈ వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆర్టీజీఎస్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ వాట్సాప్ ద్వారా జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీ కోసం ఏపీ సివిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ పేరిట ఒక పోర్టల్‌ను రూపొందించినట్లు తెలిపారు.
సదరన్ జోనల్ కౌన్సిల్ దృష్టికి విభజన అంశాలు
రాష్ట్ర విభజన సంబంధించిన పెండింగ్ అంశాలను సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకెళ్లి చర్చించేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎస్ కె.విజయానంద్ ఆదేశించారు. త్వరలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు.