కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ శాఖ పరిధిలోని ఏపీఎస్‌పీడీసీఎల్‌లో ట్రాన్స్‌ఫార్మర్ల కొరత వేధిస్తోంది. జిల్లా అవసరాలకు తగినట్లు వీటిని మంజూరు చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఈ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడాదిన్నర కాలంగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న కర్నూలు విద్యుత్ సర్కిల్‌ను అనంతపురంతో కలిపి తిరుపతి కేంద్రంగా పని చేస్తున్న ఎస్‌పీడీసీఎల్‌లో విలీనం చేశారు.
అప్పటి నుంచి ట్రాన్స్‌ఫార్మర్ల సమస్య తలెత్తింది. సాధారణంగా జిల్లా అవసరాలకు ప్రతి నెలా సగటున 150 త్రీఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు అవసరం. వీటిని దరఖాస్తు చేసుకున్న రైతుల సినియారిటీ, లోఓల్టేజీ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రాధాన్యత మేరకు కేటాయిస్తారు. అయితే గత మూడు నెలల్లో 138 మాత్రమే జిల్లాకు కేటాయించడం సమస్యకు కారణమవుతోంది. బోర్లు, బావులపై ఆధారపడి పంటలు సాగు చేసుకునే అన్నదాతలు ట్రాన్స్‌ఫార్మర్ల కొరత కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అరకొర వర్షాలకు సాగుకు సిద్ధం కాగా.. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో పాటు భానుడు ఉగ్రరూపం దాల్చాడు.
ఈ పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లపైనే అధిక లోడు వేసి మోటార్లను వినియోగిస్తుండటంతో కాలిపోతున్నాయి. నిబంధనల ప్రకారం ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే పట్టణ ప్రాంతాల్లో 24 గంటల్లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లోపు మార్పు చేయాల్సి ఉన్నా సాధ్యపడని పరిస్థితి నెలకొంది. రోలింగ్ ట్రాన్స్‌ఫార్మర్ల కొరత కూడా తీవ్రతరంగా ఉంది. వాస్తవానికి ట్రాన్స్‌ఫార్మర్ల సంఖ్యకు 4 శాతం రోలింగ్(కాలిపోయినప్పుడు వెంటనే మార్చేందుకు సిద్ధం చేసినవి) ట్రాన్స్‌ఫార్మర్లు ఉండాలి.
అలాంటిది ప్రస్తుతం వీటి శాతం 2.3 మాత్రమే కావడం గమనార్హం. హెచ్‌వీడీఎస్ కింద ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసిన ఫీడర్లలో మినహా తక్కిన చోట్ల అధిక లోడ్ కారణంగా లోఓల్టేజీ సమస్య వేధిస్తోంది. మరో 500 పైగా ట్రాన్స్‌ఫార్మర్లు వస్తే తప్ప సమస్యల పరిష్కారమయ్యే పరిస్థితి లేదని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకున్న 11,409 మంది రైతులు ప్రభుత్వం ఎప్పుడు కరుణిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ల కొరత..
Published Sat, Aug 23 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM
Advertisement
Advertisement