![Nagulapalli Srikanth Comments On Power Sector Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/13/SRIKANTH-NAGULAPALLI-IAS-3.jpg.webp?itok=vhk9lJwG)
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ రంగ సమగ్రాభివృద్ధి కోసం త్వరలో సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ట్రాన్స్‌కో విజిలెన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ) కె.వెంకటేశ్వరరావు, డిస్కంల సీఎండీలు జె.పద్మజనార్దనరెడ్డి (ఏపీసీపీడీసీఎల్), హెచ్.హరనాథరావు (ఏపీఎస్పీడీసీఎల్), కె.సంతోషరావు (ఏపీఈపీడీసీఎల్), ట్రాన్స్‌కో డైరెక్టర్లు కె.ప్రవీణ్‌కుమార్, కె.ముత్తు పాండియన్, ఇతర అధికారులతో ఆదివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఇంధన పర్యవేక్షక మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి వెల్లడించిన ఈ సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి.
► చౌక విద్యుత్ ఆలోచనను అమలు చేయడం, సరికొత్త రికార్డులను నెలకొల్పడం ద్వారా దేశ వ్యాప్తంగా మన విద్యుత్ రంగానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. రాష్ట్ర విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
► ఈ క్రమంలో సామర్థ్యం పెంపు, సరఫరా, పంపిణీ నెట్‌వర్క్ బలోపేతం చేయడం, వినియోగదారులే ఆధారంగా కార్యక్రమాలను చేపట్టడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వం సూచించింది.
► 2019–20లో 3 లక్షలు ఉన్న అంతరాయాలను 2020–21 నాటికి 1.77 లక్షలకు తగ్గించింది. 2019–20లో యూనిట్‌కు రూ.7.23గా ఉన్న సగటు సర్వీసు వ్యయాన్ని 2020–21 నాటికి రూ.7.18కి తగ్గించగలిగింది.
► విద్యుత్ సంస్థలు 2019–21 మధ్య విద్యుత్ కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. మార్చి 31, 2019 నాటికి విద్యుత్ సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది. 2019–21 సంవత్సరాల్లో విద్యుత్ సబ్సిడీ, ఇతర చార్జీల కింద మరో రూ.16,724 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ.28,166 కోట్లు విడుదల చేసింది.
► 30 ఏళ్లపాటు పగటి పూట వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించేందుకు 10 వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టింది.
► విద్యుత్ సంస్థలు కార్యనిర్వహణ, ఆర్థిక సుస్థిరత సాధిస్తేనే వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను అందించగలుగుతాం. డిస్కంల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రూ.3,669 కోట్ల ట్రూ అఫ్ చార్జీలను వసూలు చేసుకునేందుకు ఏపీఈఆర్సీ అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment