
సాక్షి, అమరావతి: డిస్కమ్ పరిధిలో వివిధ పనుల కోసం నాణ్యమైన పరికరాలనే కొనుగోలు చేస్తున్నామని ఏపీ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీ కె.సంతోషరావు తెలిపారు. డిస్కంలో నాసిరకం తీగలు, పరికరాలను కొనుగోలు చేస్తున్నారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేయడం అవాస్తవమన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.
వివిధ పనులకు టెండర్ల స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ రూపొందించే ప్రక్రియలో భాగంగా బిడ్డర్ అర్హతను తెలుసుకోవడం కోసం కూడా టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌ను ఇండియన్ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్‌కు అనుగుణంగా తయారు చేస్తారని తెలిపారు. ఈ–ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియలో రివర్స్ బిడ్డింగ్ ద్వారా పారదర్శకంగా కాంట్రాక్టర్‌కు టెండరు దక్కాక సంబంధిత ఫ్యాక్టరీలో పరికరాల నాణ్యతను ఐఎస్ నాణ్యత ప్రమాణాలననుసరించి థర్డ్ పార్టీ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్‌తో పరీక్షిస్తామని ఆయన వెల్లడించారు.
ఆఫీసర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరికరాల తరలింపునకు అనుమతించి, ఆయా ఫ్యాక్టరీల నుంచి సంస్థ పరిధిలోని స్టోర్లకు తరలిస్తామని తెలిపారు. స్టోర్లకు చేరిన పరికరాల నాణ్యతను ఐఎస్ నాణ్యత ప్రమాణాలననుసరించి మరోసారి పరీక్షించాకే వాటిని స్టాక్‌లోకి తీసుకుని క్షేత్ర స్థాయిలో అమర్చేందుకు చర్యలు చేపడతామన్నారు.
ఈ పనుల్లో, పరికరాల్లో నాణ్యత ప్రమాణాలను పరీక్షించేందుకు డిస్కంలలో ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగాలు పని చేస్తున్నాయని వెల్లడించారు. అలాగే, డిస్కంలో లైన్‌మెన్ పోస్టులను కుదించేశారని పేర్కొనడంలో కూడా వాస్తవం లేదని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు క్షేత్రస్థాయిలో నియామకాలు జరగలేదన్నారు.
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. క్షేత్రస్థాయి సిబ్బంది నియామకాలకు ఆమోద ముద్ర వేశారని గుర్తు చేశారు. దీంతో 2019 అక్టోబర్‌లో ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 3,088, ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 2,859 ఎనర్జీ అసిస్టెంట్లను నియమించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment