సాక్షి, అమరావతి: విశాఖలో విద్యుత్ వ్యవస్థను సంపూర్ణంగా మారుస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అత్యంత సురక్షిత విద్యుత్ సరఫరాకు భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. తుపానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా నిరంతరం వెలుగులు ప్రసరించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) రూ.720 కోట్లతో ఈ పనులు చేపట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయి. నగరంలో విద్యుత్ వ్యవస్థ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భూగర్భ విద్యుత్ లైన్లతో రీప్లేస్ చేయాలని ఏపీఈపీడీసీఎల్ భావిస్తోంది.
సగానికి తగ్గనున్న ప్రసార నష్టాలు
భూగర్భ విద్యుత్ కేబుల్ ప్రాజెక్టులో భాగంగా విశాఖ సముద్రతీర ప్రాంతంలోని 28 సబ్‌స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకు 115 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు, 349 కిలోమీటర్ల 11 కేవీ లైన్లు, 940 కిలోమీటర్ల ఎల్‌టీ లైన్లు, 660 రింగ్ మెయిన్ యూనిట్ (ఆర్‌ఎంయు)లు, 986 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌లు), 1,498 ఫీడర్ పిల్లర్లు, 9,179 సర్వీస్ పిల్లర్లు నిర్మించారు.
1,03,281 సర్వీసులను భూగర్భ విద్యుత్ వ్యవస్థతో అనుసంధానించారు. దీంతో ఎంవీపీ కాలనీ, పాండురంగాపురం, సాగర్‌నగర్, బీచ్ రోడ్, జాతీయ రహదారి–16 ప్రాంతాల్లో ఇటీవల తుపాన్ల సమయంలోను నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంది. నగరంలోని మిగతా ప్రాంతాల్లో బహిరంగంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, లైన్లను తొలగించి భూగర్భంలోకి మార్చనున్నారు.
ఇందుకోసం రూ.157 కోట్లతో మూడు గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్)లు, 35 ఇండోర్ 33/11 కేవీ సబ్‌స్టేషన్లను నిర్మించాల్సి ఉంది. వీటికోసం 613.31 కిలోమీటర్ల మేర కొత్తగా 33 కేవీ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టును నాలుగు భాగాలుగా విభజించారు. ఏపీఈపీడీసీఎల్ ప్రస్తుత ప్రసార నష్టాలు 6 శాతంగా ఉన్నాయి.
ఈ ప్రాజెక్టు పూర్తయితే ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాల శాతాన్ని సగానికి తగ్గించవచ్చని విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. కరెంటు తీగలకు తగులుతున్నాయని చెట్లను నరికేయాల్సిన అవసరం ఉండదు. కొత్త మొక్కలను కూడా నాటి నగరాన్ని పచ్చదనంతో నింపవచ్చు.
ఈ కేబుళ్లు ప్రత్యేకం
నేషనల్ ఎలక్ట్రిక్ కోడ్ ప్రమాణాలకు అనుగుణంగా భూగర్భ విద్యుత్ లైన్లు ఉండాలి. సరైన వైర్, కేబుల్ ఎంచుకోవడంపైనే ప్రాజెక్టు ఆధారపడి ఉంటుంది. అందువల్ల వాటి ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కేబుల్‌ను ఎక్కడ ఉపయోగిస్తారు, గేజ్ పరిమాణం, స్ట్రాండ్డ్ సాలిడ్, వోల్టేజ్ రేటింగ్, ఇన్సులేషన్, జాకెట్ రంగు వంటివి పరిగణనలోకి తీసుకోవాలి.
వైర్లు, కేబుల్స్ రెండింటినీ భూగర్భ నిర్మాణంలో ఉపయోగించవచ్చు. భూగర్భ తీగను రాగి, అల్యూమినియంతో తయారు చేస్తారు. రాగి తీగ సురక్షితంగా భూమిలో మనగలుగుతుంది. దీనిచుట్టూ అత్యంత భద్రతనిచ్చే పొర ఉంటుంది. ఈ కేబుళ్లు కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. వైర్‌కు మట్టికి మధ్య ఒక కండ్యూట్ (గొట్టం) యాంత్రిక అవరోధంగా పనిచేస్తుంది.
సరికొత్త విశాఖను చూస్తాం
విశాఖ సాగరతీర ప్రాంతంలో ఇప్పటికే భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చాలా వరకు పూర్తయింది. నగరంలో మిగిలిన ప్రాంతాల్లోను భూగర్భ విద్యుత్ లైన్లు వేస్తున్నాం. మొత్తం పనులు పూర్తయితే విశాఖలో విద్యుత్ సరఫరా వ్యవస్థ స్వరూపమే మారిపోతుంది. సరికొత్త విశాఖను చూస్తాం.
ప్రజలకు అత్యంత సురక్షితంగా, నాణ్యమైన నిరంతర విద్యుత్ అందుతుంది. డిస్కం పరిధిలోని ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంలోను 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లను భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థలోకి మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్
Comments
Please login to add a commentAdd a comment