సాక్షి, అమరావతి: ప్రజలపై పైసా భారం పడకుండా, పూర్తి పారదర్శకంగా స్మార్ట్ మీటర్ల టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రంగం సిద్ధం చేశాయి. రాష్ట్రంలోని గృహాలకు, వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఇంధన శాఖ సంకల్పించింది. బోర్లకు మీటర్లు అమర్చడం వల్ల డిస్కంల సమర్థత పెంచవచ్చని, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టవచ్చని, రైతులకు బాధ్యత పెంచవచ్చనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయనుంది.
ఈ వివరాలతో టెండర్ డాక్యుమెంట్లను అక్టోబర్ 21న విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు న్యాయ సమీక్షకు పంపించాయి. వాటిపై ప్రజలు, వినియోగదారులు సూచనలు, సలహాలు, అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగుస్తుంది. డాక్యుమెంట్ల పరిశీలన పూర్తికాగానే రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి డిస్కంలు దరఖాస్తు చేయనున్నాయి. ఏపీఈఆర్‌సీ తుది నిర్ణయం తరువాత మీటర్ల ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
అది అవాస్తవం
మీటరుకు రూ. 6 వేలు, నిర్వహణకు రూ.29వేలు చొప్పున మొత్తం రూ.35 వేలను డిస్కంలు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అవాస్తవమని డిస్కంలు స్పష్టం చేశాయి. నిజానికి టెండర్లు కోట్ చేసిన రేటు ప్రకారం ఒక నెలకు ఒక్కో మీటరుకు రూ. 255 చొప్పున అన్ని నిర్వహణ బాధ్యతలు, దొంగతనం జరిగిన, మీటర్లు కాలిపోయిన టెండర్ బిడ్ చేసేవారే మీటర్లు మార్చే విధంగా డాక్యుమెంట్ పొందుపరిచారు. దీని ప్రకారం ఐదేళ్లకు రూ. 15,300 మాత్రమే ఖర్చుఅవుతోంది.
వ్యవసాయ విద్యుత్ మీటర్లకు డీఓఎల్ స్టార్టర్లు వాడటం వల్ల 4 నుంచి 5 రెట్లు ఎక్కువ విద్యుత్ డ్రా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీటరు సామర్థ్యం దానికి తగ్గట్టుగా ఉండాలి. వ్యవసాయ క్షేత్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా ఉండదు. అందువల్ల దానికి తగ్గట్టు కమ్యూనికేషన్ వ్యవస్థను టెండర్స్ బిడ్ చేసే వారే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
మీటర్లతో ప్రయోజనం
స్మార్ట్ మీటర్లు వస్తే విద్యుత్ వృథా, చౌర్యాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. సరఫరాలో లోపాలుంటే డిస్కంలను ప్రశ్నించే హక్కు వినియోగదారులకు లభిస్తుంది. పంపిణీ వ్యవస్థలో లోపాలను సకాలంలో గుర్తించడం వల్ల విద్యుత్ అంతరాయాలను వెంటనే పరిష్కరించే వీలుంటుంది. స్మార్ట్ మీటర్లు ‘టూ వే కమ్యూనికేషన్’ను సపోర్ట్ చేస్తాయి. అంటే వినియోగదారుల మొబైల్‌కు అనుసంధానమై ఉంటాయి. విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి విద్యుత్ ధరలు, బిల్లు గడువు వంటి సందేశాలను ఎప్పటికప్పుడు వినియోగదారుల మొబైల్ ఫోన్లకు పంపుతాయి.
– కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్
Comments
Please login to add a commentAdd a comment