‘స్మార్ట్‌’ మీటర్లకు సై | Full support of farmers for smart meters across the state | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్‌’ మీటర్లకు సై

Published Sat, Nov 25 2023 3:51 AM | Last Updated on Sat, Nov 25 2023 3:35 PM

Full support of farmers for smart meters across the state - Sakshi

వీరంపాలెం గ్రామం నుంచి సాక్షి ప్రతినిధి బోణం గణేష్‌:  అర్ధరాత్రి చేనుకు నీరు పెట్టేందుకు వెళ్లి మోటార్‌ స్విచ్‌ ఆన్‌ చేయగానే విద్యుత్‌ షాక్‌ తగిలి అన్నదాత ప్రాణాలు వదిలేస్తే ఆ కుటుంబం పడే వేదన వర్ణనాతీతం. రైతులకు ఇచ్చే కరెంటులో నాణ్యత లేకపోతే పంట మనుగడ కష్టం. ఎన్ని సర్వీసులకు ఎంత విద్యుత్‌ ఇవ్వాలో తెలియక సాంకేతిక సమస్యలతో సబ్‌ స్టేషన్లపై లోడ్‌ ఎక్కువై ట్రాన్స్‌­ఫార్మర్లు కాలిపోతే విద్యుత్‌ పంపిణీ సంస్థలకు నష్టం.

ఈ సమస్యలను అధిగమించి, పగటి పూట తొమ్మిది గంటల పాటు ఉచితంగా సరఫరా చేస్తున్న విద్యుత్‌ను ఇకపై రైతులకు హక్కు­గా మార్చాలని భావించిన రాష్ట్ర ప్రభు­త్వం వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తూ, మరింత నాణ్య­మైన విద్యుత్‌ను అందిస్తామంటుంటే ఎందుకు కాదంటామని రైతులు ఎదురు ప్రశ్నిస్తు­న్నారు. పొలాల్లో ప్రాణాలు వదిలే పరిస్థితిగానీ, నీళ్లు లేక పంటలు ఎండిపోయే దుస్థితిగానీ రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి రైతులు మద్దతు పలుకుతున్నారు. 

పైలట్‌ ప్రాజెక్టులో 33% విద్యుత్‌ ఆదా
రివాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ స్కీమ్‌ (ఆర్డీఎస్‌ఎస్‌)లో భాగంగా 2025 మార్చి నాటికి దేశం అంతటా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్లు పెట్టాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు 2019లోనే సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్‌ ఇచ్చింది. దాని ప్రకారం రాష్ట్రంలో 18.56 లక్షల వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లు అమర్చాలని 2020లో విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం విద్యుత్‌ వినియోగంలో 18 శాతం నుంచి 20 శాతం వరకు వ్యవసాయ రంగం వాటా ఉంది. దీనిని మరింత కచ్చితంగా లెక్కించడం కష్టమవుతోంది.

ఇది తెలియాలంటే మీటర్లు అమర్చి, విద్యుత్‌ వినియోగాన్ని లెక్కించాలి. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు ముందు శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టింది. ఫలితంగా 33 శాతం విద్యుత్‌ ఆదా కనిపించింది. దీంతో రాష్ట్రం అంతటా స్మార్ట్‌ మీటర్లు పెట్టేందుకు డిస్కంలు సన్నద్ధమయ్యాయి. తొలి విడతగా ఏపీఈపీడీసీఎల్‌లో 32,500, ఏపీసీపీ­డీసీఎల్‌లో 35,000, ఏపీఎస్పీడీసీఎల్‌లో 70,200 చొప్పున స్మార్ట్‌ మీటర్లను అమర్చే ప్రక్రియను మొదలుపెట్టాయి.

నమ్మకంతోనే రైతుల మద్దతు 
స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. ప్రస్తుతం రైతుల పేరిట ఉన్న బ్యాంక్‌ ఖాతాలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కొత్త ఖాతాలు తెరిపిస్తోంది. వినియోగం ఆధారంగా బిల్లు మొత్తం నగదు బదిలీ ద్వారా జమ చేస్తుంది. అది డిస్కంలకు బదిలీ అవుతుంది. దీనివల్ల నాణ్యమైన విద్యుత్‌ను పొందే హక్కు రైతులకు లభిస్తుంది. మీటర్‌ రీడింగ్‌ కోసం మోటారు దగ్గరకు లైన్‌మెన్లు రావడం వల్ల విద్యుత్‌ సమస్య ఏదైనా ఉంటే వారి దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కరించుకోవచ్చు.

రీడింగ్‌ను బట్టి పంపు, మోటారు పనిచేసే విధానాన్ని తెలుసుకుని లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవచ్చు. ఎంత లోడు వాడుతున్నారో కచ్చితంగా తెలియడం వల్ల ఆ మే­రకు విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు పటిష్టం చేసు­కోవచ్చు. అనధికార కనెక్షన్లు ఉండవు. ఇలాంటి ఏ­ర్పా­టుపై నమ్మకం కుదరడంతో స్మార్ట్‌ మీటర్లు పెట్ట­డానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రైతులు అంగీకార పత్రాలను డిస్కంలకు అందించారు.

పనితనానికి, ప్రాణానికి భరోసా
మీటర్‌తో పాటు ఏర్పాటు చేస్తున్న రక్షణ పరికరాలతో అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే కెపాసిటర్, వోల్టేజి హెచ్చు తగ్గులను నివారించి వ్యవసాయ విద్యుత్‌ మోటారు జీవిత కాలాన్ని పెంచడానికి దోహదపడుతుంది. మోటారు పనితనం వృద్ధి చెందుతుంది. మోటారు స్టార్టర్, వైండింగ్, అనుసంధానించిన వైర్లలో వచ్చిన లోపాలతో మోటారు కాలిపోవడం గాని, షార్ట్‌ సర్క్యూట్‌తో ట్రాన్స్‌ఫార్మర్‌ ఫెయిల్‌ అవ్వడం గాని జరగకుండా కాన్ఫిగరేషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (సీసీబీ) కాపాడుతుంది.

వర్షాలకు తడిచినప్పుడు ఇనుప బాక్స్‌ల ద్వారా కలిగే విద్యుత్‌ ప్రమాదాలను షీట్‌ మౌల్డింగ్‌ కాంపౌండ్‌ (ఎస్‌ఎంసీ) బాక్స్‌ నివారిస్తుంది. ఎర్త్‌ వైరు, పైపులను ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం, సరైన పద్ధతిలో అనుసంధానించడం వల్ల రైతులకు మోటారు స్టార్టర్, మీటరు బాక్సు తదితర ఉపకరణాల ద్వారా షాక్‌ తగలదు. వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లదు. 

రైతుపై పైసా భారం పడదు
స్మార్ట్‌ మీటర్ల కోసం రైతులు తమ జేబు నుంచి ఒక్క పైసా చెల్లించనవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క విద్యుత్‌ సర్వీసునూ స్మార్ట్‌ మీటర్లు పెట్టిన తర్వాత తొలగించరు. ఒక వినియోగదారుని పేరిట కొన్ని కనెక్షన్లే ఉండాలనే నిబంధన ఏదీ లేదు. ఎక్కువ కనెక్షన్లు ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు.

ప్రస్తుత యజమాని పేరిట సర్వీసు కనెక్షన్‌ పేరు మార్చుకోవాలన్నా చేసుకోవచ్చు. అనధికార, అదనపు లోడు కనెక్షన్లన్నీ క్రమబద్దీకరిస్తారు. పేర్ల మార్పు ప్రక్రియ కోసం, బ్యాంకు ఖాతాలు తెరవడానికి, రైతు ఎవరి దగ్గరకూ వెళ్లనవసరం లేదు. డిస్కంలు, గ్రామ సచివాలయ సిబ్బందే రైతు వద్దకు వచ్చి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. – కె.విజయానంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ

అనుమానాలేం లేవు
స్మార్ట్‌ మీటర్‌ పెడతామ­న్నప్పుడు మా ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ రామకృష్ణని, లైన్‌మెన్‌ని దాని గురించి అడిగాను. బిల్లు వేస్తార­ని అందరూ అంటున్నారనే సందేహాన్ని వారి వద్ద వ్యక్తం చేశాను. అలాంటిదేమీ లేదని, ఉచిత విద్యుత్‌ ఎన్ని యూనిట్లు వాడుతున్నామనేది తెలుసుకోవడం కోసమే మీటర్లు అని చెప్పడంతో నా అనుమానాలన్నీ తీరిపోయాయి. వెంటనే మీటర్‌ అమర్చడానికి అంగీకరించాను. – అఖిల్‌ రెడ్డి, రైతు, వీరంపాలెం

మాకే మంచిది
స్మార్ట్‌ మీటర్లు కాలిపో­యినా, పనిచేయకపో­యినా, దొంగతనానికి, మరమ్మతులకు గురైనా ఆ ఖర్చులు మొత్తం విద్యుత్‌ కంపెనీలే భరిస్తాయని హామీ ఇచ్చారు. మేం పైసా కట్టకుండా మీటర్‌ పెడతామన్నారు. అంతకంటే ఏం కావాలి? ఇప్పటికే మాకు తొమ్మిది గంటలు పగలు కరెంటు ఇస్తున్నారు. దానివల్ల పంటలు బాగా పండుతున్నాయి. మీటర్లు పెట్టాక ఇంకా మేలు జరుగుతుందంటే మాకే మంచిది కదా! – మాకిరెడ్డి కృష్ణారెడ్డి, రైతు, వీరంపాలెం

రైతులకు మెరుగైన విద్యుత్‌
రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వడంలో ఎక్క­డా రాజీ పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్, నీలాద్రిపురం సెక్షన్‌లోని వీరంపాలెం లో ముందుగా స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తు­న్నాం. రైతులకు మీ­టర్లపై అవగాహన కల్పించడంతో వారంతా సంపూర్ణ మద్దతు­నిస్తున్నారు. ఎక్క­డా ఎ­లాం­టి వ్యతిరే­కత రావడం లేదు.  – పి.సాల్మన్‌రాజు, ఎస్‌ఈ, ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్, ఏపీఈపీడీసీఎల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement