Fact Check: రైతులకు ఉచితంగా ఇస్తే తప్పా రామోజీ? | Eenadu Ramoji rao Fake News On YS Jagan Govt Smart meters | Sakshi
Sakshi News home page

Fact Check: రైతులకు ఉచితంగా ఇస్తే తప్పా రామోజీ?

Published Sun, Jun 11 2023 5:04 AM | Last Updated on Sun, Jun 11 2023 6:49 AM

Eenadu Ramoji rao Fake News On YS Jagan Govt Smart meters - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నది చంద్రబాబు కాదు కాబట్టి.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిలోనూ రామోజీరావుకు చెడే కనిపిస్తుంది. పనిగట్టుకుని ప్రతి పథకాన్ని, ప్రతి పనిని తప్పుపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వాస్తవాలకు మసి పూసి ‘ఈనాడు’లో నిత్యం తప్పుడు కథనాలు వండివార్చుతున్నారు. రైతాంగం కోసం ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, చేపట్టిన కార్యక్రమాలు విప్లవాత్మకమని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతుంటే.. రామోజీకి మాత్రం ‘రామా’ అంటే కూడా బూతు పదంలా వినిపిస్తుండటం దుర్మార్గం.

రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనినీ తప్పుబట్టడమే పనిగా పెట్టుకుంది ‘ఈనాడు’. తాను మోస్తున్న పచ్చ పార్టీ చేయని మంచిని ఈ ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేకపోతోంది. ఎన్నిసార్లు వాస్తవాలను కళ్లకు కట్టినట్టు అధికారులు వెల్లడించినా, వాటన్నిటినీ పెడచెవిన పెట్టి గుడ్డి రాతలు రాస్తోంది. తాజాగా వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు అమర్చనున్న స్మార్ట్‌ మీటర్లపై ‘షిర్డీ సాయికే.. స్మార్ట్‌గా ఇచ్చేశారు’ శీర్షికతో శనివారం మరో తప్పుడు కథనాన్ని అచ్చేసింది.

ఈ మీటర్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, అన్ని నిబంధనలకు అనుగుణంగా సాగిందని విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు స్పష్టం చేశాయి. శాస్త్ర సాంకేతికతపై అవగాహన లేమితో ఈనాడు రాసిన కథనం వెనుక దాగిన అసలు నిజాలను వెల్లడించాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.   


ఆరోపణ: ఒక్కో స్మార్ట్‌ మీటరు వ్యయం రూ.37,072.28    
వాస్తవం: ఇంత కన్నా పచ్చి అబద్ధం మరొకటి లేదు. గతంలో కోవిడ్‌–19 విపత్కర పరిస్థితుల్లో టెండర్ల అంచనాలను రూపొందించారు. ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల ప్రకారం ఆ టెండర్లను రద్దు చేశారు. ఆ తర్వాత హెచ్చు తగ్గులను పరిశీలించి ప్రస్తుత ధరల ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ప్రభుత్వ అనుమతితో గ్లోబల్‌ టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు. దేశంలోని ప్రతి గుత్తేదారు పాల్గొనే అవకాశం కల్పించారు.

ఈ ప్రక్రియలో పాల్గొన్న అందరిలో ఎల్‌–1 గా శ్రీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ నిలిచింది. టెండర్‌ ప్రకారం.. ఒక్కో వ్యవసాయ విద్యుత్‌ సర్వీసుకు అనుబంధ పరికరాలకు రూ.11,188.82 మాత్రమే. పన్నులతో కలిపి రూ.13,334.83 వ్యయంతో మీటరు బాక్స్‌తో పాటు పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్‌ పరికరాలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా 60 శాతం గ్రాంటు రూపంలో డిస్కంలకు సమకూరుతుంది.   

ఆరోపణ : యూపీలో అదాని సంస్థ కోట్‌ చేసింది రూ.10 వేలే
వాస్తవం: ఉత్తరప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థ మధ్యాంచల్‌ విద్యుత్‌ వితరణ్‌ నిగమ్‌ ఒక్కో మీటర్‌కు రూ.10 వేల చొప్పున 75 లక్షల స్మార్ట్‌ మీటర్ల సరఫరా, నిర్వహణకు అదాని సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడం వాస్తవమే. అయితే అవి సింగల్‌ ఫేజ్‌ మీటర్లు. వీటి కంటే త్రీ ఫేజ్‌ మీటర్‌ ధర రూ.3 వేలు నుంచి రూ.4 వేలు ఎక్కువ. పైగా ఇవన్నీ పట్టణ ప్రాంతాల్లోని గృహాలకు ఏర్పాటు చేసేవి. పైగా ఎటువంటి అనుబంధ పరికరాలు లేవక్కడ. ఏపీలో అలా కాదు.

సుదీర్ఘ విస్తరణ కలిగిన వివిధ ప్రదేశాల్లో ఉన్న మొత్తం అన్ని పంపుసెట్లకు దీర్ఘ కాల మన్నికకు త్రీ ఫేజ్‌ స్మార్ట్‌ మీటర్లతో పాటు అనుబంధ పరికరాల (మీటర్‌ బాక్స్, పీవీసీ వైరు, ఎంసీబీ, ఎర్త్‌ స్పైక్, కెపాసిటర్‌)ను కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాంటప్పుడు ఈ రెండు రేట్లను ఒకే విధంగా ఎలా సరి పోల్చి రాస్తారు రామోజీ? మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాల్లో స్మార్ట్‌ మీటర్ల కోసం ఒక్కో మీటరును ఏడున్నరేళ్ల పాటు నెలకు రూ.200.96గా బిడ్‌ ఖరారైంది. వాటిలో 80 శాతం సింగిల్‌ ఫేజ్‌ మీటర్లు. 20 శాతం మాత్రమే త్రీఫేజ్‌ మీటర్లు వున్నాయి. ఏపీలో మొత్తం త్రీ ఫేజ్‌ మీటర్లు. అయినప్పటికీ మన రాష్ట్రంలో 93 నెలల కాల వ్యవధికి నెలకు రూ.194 మాత్రమే చెల్లించనున్నారు.  

ఆరోపణ: అడ్డగోలు వ్యవహారం కాబట్టే సమాచారం బయటకు పొక్కకుండా ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. 
వాస్తవం: ఈనాడు బాబు గురించి కల కంటూ నిద్రలో జోగుతుంటే సమాచారం ఎలా తెలుస్తుంది? వాస్తవానికి టెండర్ల ప్రక్రియలో ఎటువంటి దాపరికం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ అనుమతి తీసుకున్న తర్వాత ఏపీ ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌ ద్వారా టెండర్లను ఆహ్వానించారు. అనుబంధ పరికరాల టెండర్లలో షిరిడీ సాయి, జీవీఎస్, విక్రాన్‌ సంస్థలు పాల్గొనగా షిరిడీ సాయి ఎల్‌–1గా నిలిచింది. అదేవిధంగా స్మార్ట్‌ మీటర్ల టెండర్లలో షిరిడీ సాయి, అదాని సంస్థలు పాల్గొనగా షిరిడీ సాయి ఎల్‌–1 గా నిలిచింది. ఈ వివరాలన్నీ సంబంధిత వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి. లేదా డిస్కంల వద్ద ఎప్పుడైనా దొరుకుతాయి. ఇందులో మీ నిద్రావస్థ తప్ప ప్రభుత్వ దాపరికం ఏముంది రామోజీ?  

ఆరోపణ: అనుబంధ పరికరాలు, నిర్వహణకే ఐదు రెట్లకు మించి వెచ్చిస్తున్నారు.. 
వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో రాష్ట్ర వ్యాప్తంగా వున్న వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ట్‌ మీటరుతో పాటు అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, ఎర్త్‌ స్పైక్, కెపాసిటర్‌ అమర్చడానికి, అవి పాడైపోకుండా ఉండేందుకు వీలుగా మీటరు బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఎంసీబీ ద్వారా ఓవర్‌ లోడ్‌ ప్రొటెక్షన్‌ జరుగుతుంది.

తద్వారా విద్యుత్‌ ప్రమాదాలను తగ్గించడంతోపాటు ట్రాన్స్‌ఫార్మర్‌ ఫెయిల్యూర్స్‌ను కూడా తగ్గించవచ్చు. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని డిస్కంలు భరించాల్సి వస్తోంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన ఓల్టేజ్‌తో రైతులకు విద్యుత్‌ సరఫరా చేయొచ్చు. లోడ్‌ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ భవిష్యత్‌ ప్రణాళికను రూపొందించుకునే సౌలభ్యం ఉంటుంది. రైతులు, డిస్కంల మధ్య పారదర్శకతను పెంపొందించొచ్చు. అలాంటప్పుడు వాటి కోసం ఖర్చు చేయడంలో తప్పేముంది? రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడం మీకు ఇష్టం లేదా రామోజీ? 

ఆరోపణ: ఇదో భారీ కుంభకోణం..ఎలా చూసినా ప్రజలపైనే భారం. విచారణ జరిపిస్తే భాగస్వామ్యులంతా  జైలుకెళ్లాల్సిందే. 
వాస్తవం: మీటర్ల ద్వారా మొదటి రీడింగ్‌ తీసిన తర్వాత కాంట్రాక్టర్‌కు ఒక్కో మీటరుకు కెపెక్స్‌ కింద రూ.1,800 చొప్పున చెల్లించడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన మొత్తంతో పాటు ఆపరేషన్, మెయింటెనెన్స్, రీడింగ్‌ల కోసం అయ్యే మొత్తాన్ని నెలవారీగా 93 నెలల కాంట్రాక్ట్‌ కాల వ్యవధిలో ప్రాజెక్టు వ్యయాన్ని చెల్లిస్తారు. వీటికి నెలకు రూ.194 చొప్పున టెండర్లు దాఖలయ్యాయి. తద్వారా ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకం కింద 22.50 శాతం గ్రాంటు రూపంలో సమకూరుతుంది.

వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లను బిగించడానికి అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకు ప్రభుత్వం బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తుంది. రైతులపై ఎటువంటి భారం మోపడం లేదు. వినియోగదారుల నుంచి ఏ విధమైన ట్రూ అప్‌ చార్జీలు వసూలు చేయాలనుకోవడం లేదు. అలాంటప్పుడు ప్రజలపై భారం ఎలా పడుతుందో, భారీ కుంభకోణం ఎలా అవుతుందో ఈనాడుకే తెలియాలి. పైగా మరోపార్టీ అధికారంలోకి వచ్చి.. నాయకులను, అధికారులను జైలుకు పంపుతుందని చెప్పడం ఎవరిని భయపెట్టడానికి? ఈ ఉడత బెదిరింపులకు ఇక్కడ ఎవరూ బెదరడానికి సిద్ధంగా లేరు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement