ఈ భరోసా ఇంకెక్కడైనా ఉందా?  | Eenadu Ramojirao Fake News On YS Jagan Govt About Farmers | Sakshi
Sakshi News home page

ఈ భరోసా ఇంకెక్కడైనా ఉందా? 

Published Mon, Jul 17 2023 4:48 AM | Last Updated on Mon, Jul 17 2023 4:50 AM

Eenadu Ramojirao Fake News On YS Jagan Govt About Farmers - Sakshi

నిజాలతో పనిలేదు. క్షేత్రస్థాయి వాస్తవాలు పట్టనే పట్టవు. కేవలం బురద జల్లడానికి ఓ కథనం. అధికారంలో ఉన్నది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాబట్టి... ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా దారుణమైన అసత్యాలు రాయటం. నిత్యం ఇదేనా రామోజీ? అసలు తెలంగాణలో  ఉన్న ఓ పథకాన్ని... ఇక్కడ ఆత్మహత్యలకు మాత్రమే వర్తించే పథకంతో ఎలా పోలుస్తారు రామోజీ? కాస్తయినా ఇంగితం ఉండాలి కదా? 

తెలంగాణలో రైతులందరికీ ఏక మొత్తంగా టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను అమలు చేస్తున్నారనుకుందాం... దాన్ని ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్న రైతులకిచ్చే పరిహారంతో పోలుస్తారా? మరి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వేసిన ప్రతి ఎకరాకూ... ప్రతి పంటకూ ఉచితంగా బీమా చేస్తోంది. రైతులపై ఒక్క రూపాయి భారం కూడా లేకుండా ప్రతి ఏటా మొత్తం ప్రీమియాన్ని తనే కడుతోంది. ఇది తెలంగాణలో ఉందా? 

ప్రతి రైతునూ బతికించాలని.. ఒకవేళ వారు గనక పంట నష్టపోతే పరిహారాన్ని ఇప్పించాలనే అత్యున్నత లక్ష్యంతో అమలు చేస్తున్న పథకం తెలంగాణలో లేదని అక్కడ మీ పత్రికలో ఎప్పుడైనా రాశారా? ఎందుకింత దుర్మార్గపు రాతలు? దీన్ని పాత్రికేయమంటారా? ఇన్నేళ్లు వచ్చినా ఇంకా చంద్రబాబు కాకపోతే... అన్న రీతిలోనే కథనాలు రాస్తే ఎలా?  

ఈ రాష్ట్రంలో మాదిరి రైతు భరోసా కేంద్రాలు గానీ, విత్తు నుంచి విక్రయం వరకూ రైతును చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థ కానీ మరే రాష్ట్రంలోనైనా ఉందా? అలాంటివి ఎప్పుడైనా రాశారా? ఇంత నీచపు రాతలతో ఇంకెన్నాళ్లు మీ పత్రికను నడపగలరు? ‘అన్నంపెట్టే రైతులకు ఇదేనా భరోసా?’ అంటూ ‘ఈనాడు’ పత్రిక కక్కిన విషంలో నిజమెంత? ఏది నిజం? 

ఒక వ్యక్తి చనిపోయాక ఇచ్చే నష్టపరిహారం... ఆ వ్యక్తి కుటుంబానికి తప్ప తనకు వ్యక్తిగతంగా ఏమాత్రం ఉపయోగపడదన్నది కాదనలేని వాస్తవం. అందుకే ఏ ప్రభుత్వమైనా మరణించాక ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నాలు చేయటంతో పాటు... తనను బతికించడానికి... వీలైనంత సుఖసంతోషాలతో బతికించడానికి ప్రయత్నించాలి. ఈ రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది అదే. అందుకే వ్యవసాయాన్ని తన ప్రాధాన్యాల్లో ఒకటిగా చేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్‌. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.

విత్తనాలు అందించటం దగ్గర నుంచి పండిన పంటను విక్రయించుకునేంత వరకూ రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. దీనికోసం గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలందుకున్నాయి. అంతేకాదు..ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్, ఆర్బీకే ఛానల్, నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్స్, ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవాకేంద్రాలు, ఆర్బీకే స్థాయిలో కొనుగోలు కేంద్రాలు, పంట చేతికొచ్చాక రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు ఆర్బీకేలకు అనుబంధంగా గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజ్‌లు, ప్యాక్‌ హౌస్‌లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. తెలంగాణలోనే కాదు. ఇవన్నీ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవు.

ఈ విషయాన్ని రాష్ట్రానికి వస్తున్న కేంద్ర మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు పదేపదే చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి అధ్యయనం చేసి తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామంటూ వెళుతున్నారు. కానీ... ‘ఈనాడు’కు ఇవేవీ పట్టవు. దానికి కావాల్సిందల్లా ఇంత బురద... ఇంత విషం. అంతే!. అందుకోసం ఏదో ఒక అంశాన్ని తీసుకుని... నోటికొచ్చిన అంకెలతో కథనాన్ని వండి వారుస్తుంది. ఈ పత్రిక పాఠకులు కూడా ఈ తప్పుడు వార్తలు చదవటానికి అలవాటు పడిపోయారన్నది రామోజీ నమ్మకం.  

ఏపీలో ఆత్మహత్యలు తగ్గాయన్న కేంద్రం 
గడిచిన మూడేళ్లలో ఏపీలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ 2023 ఫిబ్రవరి 7న లోక్‌సభలో చెప్పారు. అది కూడా ఏపీలో రైతుల ఆత్మహత్యలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా!!. రామోజీరావుకు మాత్రం ఇవేవీ కనిపించవు.

చావులతో రాజకీయాలు చేయడం, శవాలపై పేలాలు ఏరుకోవటం రామోజీ, చంద్రబాబు ద్వయానికి చిన్నప్పటి నుంచీ తెలిసిన విద్య. నిజానికి ఎక్కడైనా ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య తక్కువగా ఉందంటే హర్షిస్తారు. కానీ దుష్టచతుష్టయం ఉడికిపోతోంది. రైతు సంక్షేమానికి ప్రతి దశలోనూ చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. అనివార్య కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడితే ఆ రైతు కుటుంబాలకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తోంది.  

గతంలో పరిహారం ఘోరం... ఇప్పుడు 7 లక్షలు 
గతంలో చంద్రబాబు జమానాలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల్ని... అన్నిటికన్నా ముందుగా వారు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులా? కాదా? అన్నది చూసేవారు. అన్నీ ఓకే అయి... తమ పార్టీ నాయకులు గనక సిఫారసు చేస్తే... ఆ రైతులకు పేరుకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చేవారు. కానీ దీన్లో రూ.1.5 లక్షల్ని అప్పులకు జమ చేసుకుని, మిగిలిన 3.5 లక్షలు కూడా విత్‌డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా దాన్ని డిపాజిట్‌ చేసి... దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునే పరిస్థితి కల్పించేవారు. ఎప్పుడో ఐదేళ్లకో.. పదేళ్లకో ఆ డబ్బును విత్‌ డ్రాచేసుకునే అవకాశం ఉండేది.  

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిహారాన్ని రూ.5 లక్షలనుంచి రూ.7 లక్షలకు పెంచడమే కాదు. ఆ మొత్తాన్ని నేరుగా ఆత్మహత్యలకు పాల్బడే రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేస్తోంది. కౌలు రైతు అయినా వ్యవసాయ కారణాలతో చనిపోతే దేశంలో రూ.7 లక్షల పరిహారం ఇస్తున్నది ఒక్క మన రాష్ట్రంలోనే. ఇతర రాష్ట్రాల్లో కౌలు రైతులకు బీమా, ఇతర ఆర్ధిక సహాయం లేనే లేదు. 2019 నుంచి ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న 1197 మంది రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ.83.79 కోట్ల పరిహారం చెల్లించింది.

బాబు జమానాలో 2014–2018 మధ్య ఆత్మహత్య చేసుకున్న 450 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.20.12 కోట్లు అందిస్తే, రాజకీయాలకతీతంగా ఆదుకోవాలన్న సంకల్పంతో బాబు హయంలో చనిపోయిన రైతు ఆత్మహత్యలను పునఃపరిశీలన చేసి... తిరస్కరణకు గురైన మరో 474 మందికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ. 23.70 కోట్ల ఆర్ధికసాయం అందించారు జగన్‌.

ఇలా ఇప్పటి వరకు పాత బకాయిలతో కలిపి 1671 మందికి రూ.107.49 కోట్ల పరిహారం అందిస్తే ‘ఈనాడు’ మాత్రం రూ.47 కోట్లు మాత్రమే ఇచ్చారని తన నోటికి వచ్చిన అంకెను అచ్చేసేసింది. మార్గదర్శిలో ఇలాంటి తప్పుడు లెక్కలు చెప్పీ చెప్పీ ఆరితేరిపోయిన రామోజీకి ఇలాంటివన్నీ కొట్టిన పిండేనని ఇవి చూస్తే అర్థంకాకమానదు. 

పైసా భారం పడకుండా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా  
రైతులపై పైసా భారం పడకుండా 2019 ఖరీఫ్‌ నుంచి ప్రభుత్వమే డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమాను అమలు చేస్తోంది. ఈ– క్రాప్‌లో ప్రతి ఎకరాన్నీ నమోదు చేస్తూ... పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వ బకాయిలతో కలిపి ఈ నాలుగేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.7802 కోట్ల బీమా పరిహారం చెల్లించారంటే... రైతును ఆదుకోవాలన్న ముఖ్యమంత్రి తపన అర్థమవుతుంది. అంతేకాదు. ప్రకృతి వైపరీత్యాలకు పంటలు దెబ్బ తింటే.. ఆ సీజన్‌ ముగియకముందే పరిహారం చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే.

ఇలా గత ప్రభుత్వబకాయిలతో కలిపి 2019–20 నుంచి ఇప్పటి వరకు సంభవించిన వివిధ రకాల వైపరీత్యాలకు సంబంధించి 22.74 లక్షలమంది రైతులకు రూ.1965 కోట్ల పంట పరిహారాన్ని చెల్లించింది సర్కారు. ఇక వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రూ.లక్ష లోపు తీసుకున్న పంట రుణాన్ని సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ నేరుగా వారి పొదుపు ఖాతాలకే జమచేస్తున్నారు. గత ప్రభుత్వ బకాయిలతో కలిపి 2019 నుంచి ఇప్పటి వరకు 73.88 లక్షల రైతులకు రూ.1835 కోట్లు సున్నా వడ్డీ రాయితీని అందించారు. 

హామీకి మించి వైఎస్సార్‌ రైతు భరోసా...
ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లకు రూ.50 వేలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున ఆర్ధిక సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి జగన్‌. వరుసగా ఐదో ఏడాది తొలి విడత సాయంతో కలిపి ఇప్పటి వరకు ప్రతీ రైతుకు రూ.61,500 చొప్పున ఆర్ధిక సాయం అందించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు  చెందిన కౌలు రైతు కుటుంబాలు, దేవాదాయ, అటవీ భూమి సాగుదారులకు ఏటా రూ.13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా రైతు భరోసా సాయం అందిస్తోంది. 2019–20 నుండి ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 52.38 లక్షల రైతు కుటుంబాలకు రూ.30985.30 కోట్ల లబ్ది చేకూర్చింది. మొత్తంగా రైతు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా 1.71 లక్షల కోట్లు ఖర్చు చేసిందంటేనే... ప్రభుత్వ చిత్తశుద్ధి తెలియకమానదు. 

వైఎస్సార్‌ యంత్ర సేవ పథకం... 
సన్న, చిన్నకారు రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ యంత్ర పరికరాలను గ్రామస్థాయిలో అందుబాటులోకి తేవటానికి ‘వైఎస్సార్‌ యంత్ర సేవ పథకం’ తెచ్చింది ప్రభుత్వం. ఇప్పటివరకు రూ.1052.42 కోట్ల విలువైన యంత్ర పరికరాలతో 10,444 ఆర్బీకే, 492 క్లస్టర్‌ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి కోసం రైతు గ్రూపులకు. రూ.366.25 కోట్ల రాయితీని ప్రభుత్వం చెల్లించింది.

ఇక కౌలు రైతులకు రక్షణ కల్పించేందుకు పంట సాగుదారు హక్కుల చట్టం(సీసీఆర్‌ఏ)–2019ను తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా ఏటా సీసీఆర్సీ కార్డులను జారీచేయడం ద్వారా పంట రుణాలు, పంటల బీమా, పంట నష్టపరిహారం, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలను అందిస్తోంది. రైతులకోసం ఇన్ని చేస్తున్నా... ‘ఈనాడు’కు మాత్రం ఏమీ కనపడకపోవటం విచిత్రమే. 

రైతు సంక్షేమానికి పెద్దపీట 
► వ్యవసాయం లాభసాటిగా ఉండాలన్న ధ్యేయంతో రైతు సంక్షేమానికి గ్రామ స్థాయిలో 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేసి... వీటి ద్వారా వ్యవసాయ, అనుబంధ శాఖల సేవలు, సర్టిఫై చేసిన నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలను అందించడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,నూతన వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరవేయడం,, పంటల ఉత్పత్తుల కొనుగోలు చేసే కేంద్రాలుగా ఆర్బీకేలు పని చేస్తున్నాయి. 

► ధాన్యంతో సహా వివిధ రకాల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు పూర్తిగా ఆర్బీకేలు వేదికగా రైతుల కళ్లా్ల నుంచే  జరుగుతున్నాయి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను సాధించేందుకు ‘పొలంబడి’ నిర్వహిస్తున్నారు. 2019–20 నుండి ఇప్పటి వరకు 54,531 పొలంబడులను నిర్వహించి 16.36 లక్షల మంది రైతులను పర్యావరణ అంశాలను అధ్యయనం చేసి సమష్టి నిర్ణయం తీసుకొనేలా శిక్షణ ఇచ్చారు. 

► రోజూ రైతుల నుంచి వచ్చే సమస్యలను పరిష్కరించడానికి, వారి సందేహాలను తీర్చడానికి ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ ఉంది. క్షేత్ర స్థాయిలో పురుగులు, తెగుళ్ల  సందేహాలను కూడా వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా నిపుణులైన శాస్త్రజు్ఞలతో నివృత్తి చేస్తున్నారు.  

► ఆర్బీకే చానల్‌ ద్వారా ఆధునిక టెక్నాలజీని పరిచయం చేయడం, వివిధ పంటల యాజమాన్యం, వివిధ శాఖలలో జరిగే సంక్షేమ కార్యక్రమాల ప్రసారాలను చేస్తున్నారు.  

పగలు 9 గంటలు నిరాటంకంగా ఉచిత విద్యుత్‌ ఇస్తున్నదెక్కడ?
గతంలో 9 గంటలు నిరాటంకంగా విద్యుత్‌ ఇద్దామన్నా... ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1,700 కోట్లతో సబ్‌స్టేషన్లు, ఫీడర్లను ఆధునీకరించి సరఫరాలో నాణ్యత పెంచారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అనంతరం వ్యవసాయానికి పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారు.

వ్యవసాయ విద్యుత్తుపై నాలుగేళ్లలో రూ.40వేల కోట్లు ఖర్చు చేయటమే కాక... వచ్చే 30 ఏళ్ల పాటు రైతన్నలకు ఉచిత వ్యవసాయ విద్యుత్తుకు ఢోకా లేకుండా ఎస్‌ఈసీఐతో ఒప్పందం చేసుకుని 10 వేల మెగావాట్ల సామర్థ్యం గల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆక్వా రైతులకు లబ్ధి కలిగేలా యూనిట్‌ కరెంట్‌ కేవలం రూ.1.50కే సరఫరా చేస్తోంది. వీరికి నాలుగేళ్లలో రూ.2,968 కోట్లు సబ్సిడీగా అందించింది. గత ప్రభుత్వం ఎగ్గొట్టిపోయిన కరెంటు బకాయిలు రూ.8845 కోట్లు కూడా చెల్లించింది.

ధరల స్థిరీకరణ నిధితో భరోసా
గతంలో ఎన్నడూ లేని విధంగా మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి పంటలకు కూడా కనీస మద్దతు ధర ప్రకటించి ఆయా రైతుల్ని ఆదుకున్నది ఈ ప్రభుత్వమే. ప్రతి రైతుకు తాము పండించిన పంటకు కనీస మద్దతు ధర దక్కేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. సీఎం యాప్‌ ద్వారా పంట ఉత్పత్తుల ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ... మార్కెట్‌లో ధరలు పతనమైన ప్రతీసారి జోక్యం చేసుకుని రైతులకు మద్దతునిస్తోంది.

గతంలో మాదిరి దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆర్బీకేల ద్వారా కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేస్తోంది. జీఎల్టీ (గోనె సంచులు, హమాలీ, రవాణా చార్జీలు) రూపేణా క్వింటాకు రూ.300 చొప్పున ఎమ్మెస్పీకి అదనంగా చెల్లిస్తోంది. లంచాలకు తావు లేకుండా 21 రోజుల్లోనే నేరుగా రైతన్నల ఖాతాలకు నేరుగా ధాన్యం డబ్బులు జమ చేస్తోంది.

ఇవన్నీ కన్పించలేదా?
ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో 62.16 లక్షల మంది రైతులకు విత్తనాల సబ్సిడీ కింద రూ. 1055 కోట్లు చెల్లించింది. గత ప్రభుత్వం ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయిన విత్తన బకాయిలు రూ. 384 కోట్లు చెల్లించింది. శనగ రైతులకు బోనస్‌ కింద రూ.300 కోట్లు ఇచ్చింది. మైక్రో ఇరిగేషన్లో పండ్ల తోటలు అభివృద్ధి చేసేలా 4.5 లక్షల మంది రైతులకు మేలు చేస్తూ.. రూ. 2012 కోట్లు ఖర్చు చేసింది. 37 వేల మంది ఆయిల్‌ పామ్‌ రైతులకు సబ్సిడీ కింద రూ. 172 కోట్లు అందజేసింది.

గత ఏడాది రూ.1.69 లక్షల కోట్ల రుణాలు రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా, అంతకు మించి పంపిణీ చేసింది. కౌలు రైతులు సహా, మొత్తం 119.41 లక్షల రైతులకు రూ. 2.26 లక్షల కోట్ల రుణాలు అందించింది. 2019 ఖరీఫ్‌ నుంచి ఈ ఏడాది ఖరీఫ్‌ వరకు 4.46లక్షల మంది రైతులకు రూ. 6.92లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేసింది. ఇదీ... ఈ ప్రభుత్వం ఘనత. రైతులకు ఈ ప్రభుత్వమిస్తున్న భరోసా!!.

చంద్రబాబు హయాంలో ఏం చేశారంటే...
► రైతుల రుణాలు రూ. 87,612 కోట్లు బేషరతుగా మాఫీ చేస్తానని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, దాన్ని అమలు చేయలేదు. ఉచిత కరెంటు పథకాన్ని ప్రకృతికి వదిలేశారు.
► ఉచిత పంటల బీమా కింద ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన ప్రీమియం సకాలంలో కట్టకపోవడంతో, పంటలు నష్టపోయినా రైతులకు పరిహారం అందలేదు.

► ఇంక సున్నా వడ్డీ పంట రుణాల కింద ఇవ్వాల్సిన వడ్డీ రాయితీని ఎగ్గొట్టారు. 2014 నుంచి 2019 వరకు 39 లక్షల మంది రైతులకు వడ్డీ రాయితీ చెల్లించకుండా రూ.1180.66 కోట్లు బకాయి పెట్టిపోతే, ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకు ఆ మొత్తం జమ చేసింది.  

► ధాన్యం సేకరణల విషయంలో రైతులను మిల్లర్లకు, మధ్యవర్తులకు వదిలేశారు. 

► చంద్రబాబు హయాంలో ఏటా 153.95 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయితే, ఈ ప్రభుత్వ హయాంలో ఏటా సగటున 165.39 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది.

► అప్పుడు 5 ఏళ్లలో 1623 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తే, ఈ నాలుగేళ్లలో ఒక్క మండలంలో కూడా కరువు పరిస్థితులు లేవు. 

► చంద్రబాబు హయాంలో రైతులకు రూ. 3,64,624 కోట్ల రుణాలు పంపిణీ చేస్తే, ఈ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలోనే రూ.6,92,402 కోట్ల రుణాలు రైతులు అందజేసింది.

► బాబు పాలనలో రైతు భరోసా కేంద్రాలు లేవు. ఈ–క్రాప్‌ అన్న భావనే లేదు. దాంతో పంటల సాగుపై ఎలాంటి వాస్తవ డేటా ప్రభుత్వం దగ్గర ఉండేది కాదు. అంతా గాల్లో దీపమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement