పల్లె పిల్లలూ ‘స్మార్టే’! | Increased smartphone usage among rural children | Sakshi
Sakshi News home page

పల్లె పిల్లలూ ‘స్మార్టే’!

Feb 5 2025 5:49 AM | Updated on Feb 5 2025 2:03 PM

Increased smartphone usage among rural children

గ్రామీణ ప్రాంత పిల్లల్లో పెరిగిన స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం 

డిజిటల్‌ భద్రతపైనా తగిన అవగాహన  

బాలికల్లోనూ స్మార్ట్‌ ఫోన్‌వినియోగించేవారు ఎక్కువే

యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌లో వెల్లడి  

సాక్షి, అమరావతి: గ్రామీణ భారతంలో పిల్లలు కూడా ‘స్మార్ట్‌’గా తయారవుతున్నారు. స్మార్ట్‌ ఫోన్లు ఉపయోగించడంలో ఆరితేరిపోతున్నారని యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌(ఏఎస్‌ఈఆర్‌) వెల్లడించింది. గ్రామీణ గృహాల సర్వేలో భాగంగా ఇటీవల నిర్వహించిన ఏఎస్‌ఈఆర్‌లో పిల్లలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను గుర్తించారు. దేశంలోని 605 జిల్లాల్లో 17,997 గ్రామాల్లోని 14 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉన్న 6,49,491 మంది నుంచి వివరాలు సేకరించారు. అందుబాటులో స్మార్ట్‌ ఫోన్లు, సొంతంగా స్మార్ట్‌ ఫోను కలిగి ఉండటం, వాటి ఉపయోగం, డిజిటల్‌ పరిజ్ఞానం తదితర అంశాలపై ప్రశ్నావళితో ఈ సర్వే నిర్వహించారు.  

ఏఎస్‌ఈఆర్‌ సర్వేలోని ప్రధాన అంశాలు
» గ్రామీణ ప్రాంతాల్లో 14 నుంచి 16ఏళ్ల వయసులో ఉన్నవారిలో 90 శాతం మందికి స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వారిలో 82 శాతం మందికి స్మార్ట్‌ ఫోన్లను ఎలా వాడాలో పూర్తిగా తెలుసు.  
» ఇక 14ఏళ్ల వయసు వారిలో 27 శాతం మందికి, 16ఏళ్ల వయసు వారిలో 37.8 శాతం మందికి సొంతంగా స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. మిగిలిన వారు తమ కుటుంబ సభ్యుల స్మార్ట్‌ ఫోన్లను ఉపయోగిస్తున్నారు.  
» అమ్మాయిల కంటే అబ్బాయిలకు కాస్త ఎక్కువగా సొంతంగా స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. 36.2 శాతం మంది అబ్బాయిలకు సొంతంగా స్మార్ట్‌ ఫోన్లు ఉండగా... 26.9% అమ్మాయిలకే సొంత స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. 


» సోషల్‌ మీడియా ఖాతాలను ఫాలో కావడానికి 78.8% మంది అబ్బాయిలు, 73.4శాతం మంది అమ్మాయిలు స్మార్ట్‌ఫోన్లను వాడుతున్నారు. 
» విద్యా సంబంధమైన విషయాల కోసం 57 శాతం మంది స్మార్ట్‌ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ విషయంలో కేరళ రాష్ట్రం మెరుగ్గా ఉంది. ఆ రాష్ట్రంలో 90 శాతం మంది సోషల్‌ మీడియా ఖాతాల కోసం 
స్మార్ట్‌ ఫోన్లను వాడుతుండగా... 80 శాతం మంది విద్యా సంబంధమైన విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగిస్తున్నారు. 
»  డిజిటల్‌ భద్రతపై కూడా గ్రామీణ పిల్లలకు సరైన అవగాహన ఉంది. 62 శాతం మంది పిల్లలకు ఖాతాలను బ్లాక్‌ చేయడం, ఫేక్‌ ప్రొఫైల్‌లను రిపోర్ట్‌ కొట్టడం తెలుసు. ఇక 55.2 శాతం మందికి తమ ప్రొఫైల్‌ను ప్రైవేటుగా ఉంచడం గురించి పూర్తి అవగాహన ఉంది. 57.7 శాతం మందికి పాస్‌వర్డ్‌లను మార్చడం తెలుసు. 

» పూర్తి డిజిటల్‌ టాస్‌్కల గురించి కూడా గ్రామీణ విద్యార్థులకు సరైన అవగాహన ఉంది. అలార్మ్‌ సెట్‌ చేయడం, సమాచారం కోసం అన్వేషించడం, యూ ట్యూబ్‌ చానళ్లను లొకేట్‌ చేయడం గురించి 70.2 శాతం మంది అబ్బాయిలకు, 62.2% మంది అమ్మాయిలకు పూర్తి పరిజ్ఞానం ఉంది. 
» స్మార్ట్‌ ఫోన్ల పరిజ్ఞానంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు కాస్త వెనుకబడి ఉన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మాత్రం అబ్బాయిలతో సమానంగా, కొన్ని అంశాల్లో ఎక్కువగానే అమ్మాయిలకు స్మార్ట్‌ ఫోన్ల పరిజ్ఞానం ఉండటం విశేషం. 

గణనీయంగా పెరిగిన చదువుకున్న తల్లిదండ్రులు
» ఏఎస్‌ఈఆర్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 నుంచి 8 ఏళ్ల పిల్లల తల్లిదండ్రులపై చేసిన అధ్యయనంలోనూ పలు ఆసక్తికర అంశాలు గుర్తించారు.  
» చదువుకున్న తల్లిదండ్రుల శాతం పదేళ్లలో గణనీయంగా పెరిగింది.   
» కనీసం ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తల్లుల శాతం 2014లో 43 శాతం ఉండగా... 2024 నాటికి 64 శాతానికి పెరిగింది. ఇక ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తండ్రులు 2014లో 61 శాతం ఉండగా, 2024 నాటికి 72శాతానికి పెరిగింది. 

» గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుశాతం కూడా మెరుగుపడుతోంది. 2018లో విద్యార్థుల హాజరుశాతం 72.4శాతం ఉండగా, 2024 నాటికి 75.9 శాతానికి పెరిగింది.  
» ఉపాధ్యాయుల హాజరు శాతం 2018లో 85.1 శాతం ఉండగా, అది 2024 నాటికి 87.5 శాతానికి పెరిగింది.   

చ‌ద‌వండి: అప్పులే సరి.. సంపద ఎక్కడమరి?

90% గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉన్న పిల్లలు
74% సోషల్‌ మీడియా కోసమే స్మార్ట్‌ ఫోన్లు వాడుతున్నవారు
75% చదువు కోసం స్మార్ట్‌ ఫోన్‌  వాడుతున్నవారు
82% గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం తెలిసిన పిల్లలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement