ఈ నెల 7 నుంచి లవ్ వీక్ సందడి ప్రారంభం
రోజ్ డే తో మొదలై..వాలంటైన్స్ డేతో ముగింపు
వాలెంటైన్ వీక్ సంబరాల్లో మునిగి తేలుతున్న యువతరం
ప్రేమ సాగరంలో విహరిస్తున్న లవ్ బర్డ్స్
మనసు ముసిముసిగా నవ్వితే..ఊహ ఉప్పొంగితే..గుండె ఆనందంతో గంతులేస్తే..ఆ సందడి పేరే ప్రేమ. చిరునవ్వుతో వరమిస్తావా.. చితి నుంచి నడిచొస్తాను.. మరు జన్మకు కరుణిస్తావా.. ఈ క్షణమే మరణిస్తానంటూ ప్రేమికుల మనసు పలికే మాటల్ని ఓ సినీ కవి అద్భుతంగా చెప్పారు. నిజమే.. ప్రేమిస్తే.. ప్రపంచమంతా మనసిచ్చిన మనిషిలోనే కనిపిస్తుంది. ప్రేమిస్తే..నీడ కూడా జంట హృదయం వెన్నంటే ఉంటుంది.
ఎందుకంటే.. అది ప్రేమంట అంటున్నారు ప్రేమికులు. అందుకే.. ప్రేమ పండుగను వారం రోజుల పాటు చేసుకునేలా వాలెంటైన్ వీక్ రానే వచ్చింది. గుప్పెడంత గుండెలో ఉప్పెనంత ఊహల్ని నింపేలా..అనిర్వచనీయమైన మధురానుభూతిగా చెప్పుకునే ప్రేమకు వారాల పండగ చేసుకునేందుకు కొత్తతరం లవ్‌బర్డ్స్ సిద్ధమవుతున్నారు. వారం పాటు ప్రేమానందాల్ని మూటకట్టి నచ్చిన మనసుల ముందు పెడితే..గుండె ఆనందంతో గంతులేస్తుంది..గొంతు సంబరంతో గోల చేస్తుంది.
మనసు ఊహల్లో తేలే మధుమాసపు పండగను తీసుకొచ్చిందని ప్రేమ పక్షులు వలపు గూటికి చేరుకొని ఊసులాడుకుంటున్నాయి. వాలెంటైన్స్ డే రోజునే ప్రేమికులు నిజమైన పండగలా చేసుకుంటారు. కానీ..ఆ పండగనూ వారం రోజుల పాటు విభిన్నతలతో వలపు హృదయాలు విహరించేలా చేసుకోవాలనే తపన ఉన్న వారికీ ఓ వీక్ ఉంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజని అందరికీ తెలుసు. కానీ ఆ అసలైన పండగను వారం రోజుల పాటు జరుపుతారని కొంతమంది ప్రేమికులకే తెలుసు.
ఎదలోతులో ఏ మూలనో దాగి ఉన్న ప్రేమను ఎదుటి వారికి చెప్పేందుకు ఒకటి కాదు.. ఏకంగా వారం పాటు ఒక్కో విధంగా వ్యక్తపరచవచ్చు. కానుకలు, పుష్పగుచ్ఛాలతో ఎదుటి వారి మనసుల్ని కొల్లగొట్టేందుకు ప్రేమికులు ఉవ్విళ్లూరుతుంటారు. ఆ కానుకల్ని ఒక్కో స్పెషల్ రోజున ఒక్కో విధంగా ఇస్తూ వారి ప్రేమను పొందేందుకు వచ్చిందే వాలెంటైన్ వీక్. ప్రేమికుల రోజు ముందు వారం రోజుల పాటు అంటే ఈ నెల 7 నుంచి వాలెంటైన్ వీక్‌ను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాం.
వాలెంటైన్ డే (ఫిబ్రవరి 14)
ఇక చివరి రోజైన వాలెంటైన్ డే గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో కొత్త రకాల ప్లాన్లతో మనసులు ఉరకలేస్తుంటాయి. తన భాగస్వామి ఊహించని రీతిలో బహుమతి అందించాలని, సమ్‌థింగ్ స్పెషల్‌గా ప్రేమను వ్యక్తం చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. నచ్చిన స్టైల్‌లో.. ఎదుటి వారి మనసు దోచేలా ప్రేమను వ్యక్తం చేయండి. ఇందుకోసం విశాఖలో ప్రధాన హోటల్స్ అన్నీ ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీలనూ ప్రకటిస్తున్నాయ్. చుట్టూ గులాబీ పూల మధ్య క్యాండిల్ లైట్ డిన్నర్‌లు, ప్లెజెంట్ మ్యూజిక్‌తో మైమరపించేలా ఏర్పాట్లకు సిద్ధమవుతున్నాయి. హ్యాపీ వాలెంటైన్స్ వీక్!!
రోజ్ డే (ఫిబ్రవరి 7)
ఎదుటి వారికి ప్రేమను వ్యక్తం చెయ్యాలంటే 90 శాతం మంది ఎంచుకునే ప్రధాన మార్గం గులాబీ. ఎర్ర గులాబీని ఇచ్చి కళ్లల్లోకి చూస్తూ ఐ లవ్ యూ చెబితే ఎదుటి వారి మనసు లోతుల్ని తాకుతుందంటారు. అందుకే ఈ వాలెంటైన్ వీక్ తొలి రోజుని రోజ్ డేగా పండగ చేసుకుంటారు. ఈ రోజున మొదటిసారిగా మీకు చాలా ఇష్టమైన వారితో కలవాలన్నా, పలకరించాలన్నా ఈ రోజ్‌డే రోజున మంచి గులాబీ ఇచ్చి ప్రపోజ్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
విశాఖ నగరంలో చాలా మంది యువత బుధవారం రోజ్ డే సంబరాల్ని చేసుకున్నారు. వైజాగ్‌లోని రామాటాకీస్‌లోని ఓ ఫ్లోరిస్ట్ దుకాణంలో రోజుకి 200 నుంచి గులాబీలు అమ్ముడవుతుంటాయి. కానీ.. రోజ్ డే రోజు మాత్రం 1000 వరకూ గులాబీలు అమ్ముడు పోతాయని దుకాణ యజమాని రాజు తెలిపారు. ఇక దేశంలో ప్రతి రోజూ రూ.68.4 కోట్ల గులాబీ వ్యాపారం జరుగుతుంటుంది. వాలెంటైన్స్‌డే, రోజ్‌డే రోజు మాత్రం రూ.100 కోట్లకు చేరుకుంటుంది.
ప్రపోజ్ డే (ఫిబ్రవరి 8)
ప్రేమను వ్యక్తపరచాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేకపోవడం వల్లే చాలా మంది ప్రేమలు మనసు లోతుల నుంచి బయటకు వచ్చి పెదాల వద్దే నిలిచిపోతున్నాయి. ఆ రెండు మాటలు చెప్పేందుకు తటపటాయించే ప్రేమికులకు ఈ ప్రపోజ్ డే కొత్త ఉత్సాహాన్నిస్తుంది. నచ్చిన వ్యక్తిని తనకు నచ్చిన ప్రాంతానికి తీసుకెళ్లి చిన్న బహుమతి ఇచ్చి ప్రేమను వ్యక్తీకరిస్తే చాలు మనసులు పెనవేసుకునే మధుమాసం వచ్చేస్తుంది. అందుకే ఈ రోజుకి చాలా ప్రాముఖ్యమిస్తుంటారు.
చాక్లెట్ డే (ఫిబ్రవరి 9)
చాక్లెట్ అంటే ఇష్టంలేని వారు ఎవరుంటారు. అమ్మాయిలకు చాక్లెట్ ఇస్తే చాలు ప్రపంచాన్ని తమ చేతిలో పెట్టినట్లుగా ఎగిరి గంతేస్తారు. అందుకే చాలా మంది ప్రేమికులు తన ప్రేయసికి ప్రపోజ్ చెయ్యాలంటే ఓ ఎర్రగులాబీతో పాటు చాక్లెట్ ఇస్తుంటారు. అలాంటి వారికోసం ఈ చాక్లెట్ డే.
ప్రేమ ఓకే అయితే ఓ తియ్యని వేడుక చేసుకుందాం.. మన ప్రేమకు ఇదో తీపి గుర్తుగా భావిద్దాం.. అంటూ చిన్న భావుకవితను చెబుతూ చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే సరి.. ఆ సంబరమంతా జీవితాంతం తీపి గురుతుగా ఉండిపోతుంది. సాధారణంగా దేశంలో ప్రతి రోజూ 3.87 లక్షల కిలోల చాక్లెట్లు అమ్ముడుపోతుంటాయి. చాక్లెట్‌డే రోజున మాత్రం 5 లక్షల కిలోల అమ్మకాలు పక్కా అని మార్కెట్‌దారులు అంచనా వేస్తున్నారు.
టెడ్డీ డే (ఫిబ్రవరి 10)
ముద్దు ముద్దుగా ఉండే టెడ్డీ బేర్‌ను చూసి ఇష్టపడని వారంటూ ఉండరు. మనసుకు హత్తుకునేలా ఉండే టెడ్డీలను ఇష్టపడే ప్రేయసి ఉంటే ఈ రోజున ఓ బొమ్మను బహుమతిగా ఇచ్చి ఆనందపరచండి. నచ్చిన రంగుని ఎంపిక చేసి మరీ కొంటే వారు పొందే ఆనందం వెలకట్టలేనిది. అర చేతిలో పట్టే టెడ్డీ నుంచి ఆరడుగులుంటే టెడ్డీ బేర్ వరకూ మార్కెట్లో వివిధ సైజుల్లో లభిస్తున్నాయి.
జగదాంబా సెంటర్‌లోని దావూద్ టెడ్డీబేర్ దుకాణంలో గతేడాది ఇదే రోజున సుమారు 250 బొమ్మలు అమ్ముడు పోయాయంట. ఇక నగరం మొత్తం చూస్తే ఈరోజున ఎన్ని టెడ్డీబేర్‌లు ప్రేమికుల గుండెలపై వాలిపోతాయో అర్థం చేసుకోవచ్చు. దేశంలో సగటున ప్రతి రోజూ సగటున రూ.14.67 కోట్ల సాఫ్ట్‌టాయ్స్ వ్యాపారం జరుగుతుంది. టెడ్డీడే, వాలెంటైన్స్‌డే రోజున మాత్రం ఏకంగా రూ.25 లక్షలకు పైగా విక్రయాలు జరుగుతుంటాయని సాఫ్ట్‌టాయ్స్ కంపెనీలు చెబుతున్నాయి.
ప్రామిస్ డే (ఫిబ్రవరి 11)
రెండు హృదయాల మధ్య చిగురించిన ప్రేమకు నమ్మకం పునాది. చిలిపి ఉదాహరణగా చెప్పుకుంటే రెండు బిస్కెట్లను క్రీమ్ అంటిపెట్టుకొని ఉంటేనే క్రీమ్ బిస్కట్ అన్నట్లుగానే రెండు మనసుల్ని జీవితాంతం కలిపి ఉంచేది నమ్మకమే. అలాంటి నమ్మకాన్ని ఎదుటివారిలో కలిగించడానికి ఈ రోజు గొప్పదనే చెప్పుకోవాలి. నచ్చిన వ్యక్తికి దగ్గర కావడానికి, వారిలో తనపై ఉన్న ప్రేమను కలకాలం ఉంచేందుకు వాగ్దానాలు చేస్తుంటారు. ప్రేయసి మీద మీకున్న ప్రేమను ఈ రోజున వాగ్దానం చేసి తెలిపితే.. ఎదుటి వారు మీకు మరింత చేరువవుతారు.
హగ్ డే (ఫిబ్రవరి 12)
ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు, కష్ట సుఖాలకు చిహ్నం హగ్. ఒక కౌగిలి.. కష్టాల్లో ఉన్న ఎదుటి మనసుకు సాంత్వననిస్తుంది. బాధలను దూరం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించేస్తుంది. అందుకే ఈ కౌగిలింత మంత్రాన్నే యువతరం ప్రేమ మంత్రంగా పాటిస్తున్నారు. చిన్న కౌగిలింతతో వలచిన మనసు పరవశంలో ముంచేస్తూ మెప్పించేస్తున్నారు. ప్రశాంతతను కలిగించేలా ప్రేమికుడికి, ప్రేయసికి ఒక హగ్ ఇస్తే చాలు.. అందులోనే మన ప్రేమలోతుల్ని అన్వేషించగలరు.
10 నిమిషాల పాటు హగ్ చేసుకుంటే హైబీపీ కూడా అదుపులోకి వచ్చేస్తుందంట. ఆనందం కలిగినప్పుడు ఎలానో.. హగ్ చేసుకున్నప్పుడు కూడా ఆక్సిటోసిన్ అనే రసాయనం విడుదలై మనసుకి సంతోషాన్ని కలిగిస్తుంటుంది. ఒక సమస్యలో ఉన్న లవర్‌కు రోజుకు 8 హగ్‌లు ఇస్తే చాలంట. రోజుకు 12 సార్లు హగ్ చేసుకుంటే..లైఫ్ సాఫీగా సాగిపోతుందంటూ అధ్యయనాలు ప్రేమ పాఠాలు చెబుతున్నాయండోయ్. అందుకే..ఈ రోజున ఒక హగ్‌తో మీరెంతగా ప్రేమిస్తున్నారో చెప్పేసుకోవచ్చు.
కిస్ డే (ఫిబ్రవరి 13)
వేయి మాటలు చెప్పలేని ఓ భావాన్ని చిన్న ముద్దు చెబుతుంది. ఎదుటివారి మీద అంతులేని ప్రేమ ఉన్నా చెప్పలేని వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారు ఓ తియ్యని ముద్దుతో తన ప్రేమను వ్యక్తపరిచే రోజు ఇది. అందుకే కిస్ డే రోజున మీ భాగస్వామికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఓ ముద్దు ఇస్తే చాలు.. మీ ప్రేమ అలా.. నిలబడిపోతుంది. అన్నట్లు ముద్దు కూడా ఒక దివ్యౌషధమేనంట.
ముద్దు పెట్టుకోవడం వల్ల మీ శరీరంలో ఎపినెర్ఫిన్ విడుదలై రక్తనాళాలు వెడల్పుగా మారి రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు దోహదపడి మానసిక విశ్రాంతిని అందిస్తుంది. గుండె రేటుని పెంచడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రవాహం సక్రమంగా సాగుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు నచ్చిన వ్యక్తికి ముద్దు పెడితే.. రక్తపోటు తగ్గుతుంది.
ముద్దు వల్ల రెండు మనసుల మధ్య ప్రేమ బదిలీ అవ్వడమే కాదు.. బ్యాక్టీరియా కూడా బదిలీ అవుతుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇద్దరు వ్యక్తులు చుంబించుకునే సమయంలో ఉత్పత్తయ్యే సెరోటోనిన్ డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి సంతోష రసాయనాలు..ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
హ్యాపీ వాలెంటైన్స్ వీక్!!
Comments
Please login to add a commentAdd a comment